గ్రంథాలయ శాస్త్రంలో అగ్రగణ్యుడు!
ABN , Publish Date - Jan 09 , 2025 | 02:41 AM
ఆరు దశాబ్దాల పాటు భారతదేశ గ్రంథాలయ శాస్త్రంలో అపూర్వ సేవలు అందించిన డాక్టర్ పి.ఎస్.జి. కుమార్ (పోగుల శేషగిరి కుమార్) జనవరి 3, 2025న తుది శ్వాస విడిచారు. లైబ్రరీ సైన్సెస్‌లో ఆయన చేసిన కృషికి...
ఆరు దశాబ్దాల పాటు భారతదేశ గ్రంథాలయ శాస్త్రంలో అపూర్వ సేవలు అందించిన డాక్టర్ పి.ఎస్.జి. కుమార్ (పోగుల శేషగిరి కుమార్) జనవరి 3, 2025న తుది శ్వాస విడిచారు. లైబ్రరీ సైన్సెస్‌లో ఆయన చేసిన కృషికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. అందుకుగాను ఆయనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది.
పి.ఎస్.జి. కుమార్ 1946 జూన్ 9న గుంటూరు జిల్లా బాపట్లలో జన్మించారు. ఆయన తండ్రి సాంబశివరావు, హోమియోపతి వైద్యుడిగా, గ్రంథాలయ నాయకుడిగా సేవలందించారు. తల్లి వెంకటరత్నమ్మ చిన్నవయసులోనే మరణించారు. తరువాత ఆయన అమ్మమ్మ బసవమ్మ, సవితి తల్లి భాగ్యలక్ష్మిల ఆధ్వర్యంలో పెరిగారు. ఆయనకు సోదరుడు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. 1972లో ఉదయశ్రీతో వివాహం జరిగింది. శైలజ, ఫణి భార్గవి ఇద్దరు కూతుర్లు.
పి.ఎస్.జి. కుమార్ ఎనిమిదవ తరగతిలో ఉన్నప్పుడు నాటకాల మీద ఆసక్తితో మిత్రులతో కలిసి ‘ఆంధ్ర థియేటర్’ను స్థాపించారు. 1962లో రాష్ట్ర స్థాయి నాటక పోటీలలో ప్రథమ బహుమతి పొందారు. స్కూల్, కాలేజీ సమయంలో పెయింటింగ్, కథాకళి వంటి కళలలో నైపుణ్యం సాధించారు. 1969లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గ్రంథాలయ శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ తీసుకున్నారు. తరువాత బెనారస్ విశ్వవిద్యాలయం నుండి మాస్టర్ డిగ్రీ, షఫీల్డ్ యూనివర్సిటీ నుండి డిప్లమా కోర్సు, గుల్బర్గా విశ్వవిద్యాలయం నుండి పిహెచ్‌డి పొందారు. 1972లో లక్నో కళాశాలలో ఉపన్యాసకుడిగా వృత్తి జీవితం ప్రారంభించారు. 1973లో నాగపూర్ విశ్వవిద్యాలయంలో ప్రభుత్వ ఉపన్యాసకుడిగా చేరారు. అక్కడ లెక్చరర్, రీడర్, ఆచార్యునిగా 29 సంవత్సరాలు సేవలందించారు. ముఖ్యంగా 24 సంవత్సరాలపాటు గ్రంథాలయ శాస్త్ర విభాగానికి అధిపతిగా వ్యవహరించారు. ఆయన ఆధ్వర్యంలో గ్రంథాలయ శాస్త్ర విభాగం సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు ఘనంగా జరిగాయి.
ఆయన తన వృత్తి జీవితంలో అనేక గౌరవప్రదమైన పదవులను చేపట్టారు. ముఖ్యంగా ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టీచర్స్ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ (IATLIS) అధ్యక్షులుగా సేవలందించారు. ఈ పదవిలో ఆయన గ్రంథాలయ శాస్త్ర ఉపాధ్యాయ సమస్యలపై విశేషమైన కృషి చేశారు, ఆ సమస్యల పరిష్కారాలకు నూతన మార్గాలను సూచించారు. ఇండియన్ లైబ్రరీ అసోసియేషన్ (ILA) అధ్యక్షునిగా 1994–-96 వరకు పనిచేసిన పి.ఎస్.జి. కుమార్ లైబ్రరీ ప్రొఫెషనల్స్ హక్కులను, వారి అభివృద్ధికి అవసరమైన మార్పులను ప్రతిపాదించారు. ఆయన నాయకత్వంలో లైబ్రరీ ప్రొఫెషనల్స్‌కు సంబంధించిన సమర్థవంతమైన విధానాలు, నిబంధనలు రూపొందాయి. ఈ మార్పుల ద్వారా లైబ్రరీ రంగంలో సమానత్వం, అభివృద్ధి, మానవ హక్కుల పరిరక్షణపై ముఖ్యమైన దృష్టికోణాలు వెలుగు చూసాయి.
పి.ఎస్.జి. కుమార్ భారతదేశ, అంతర్జాతీయ స్థాయిలో అనేక ప్రముఖ లైబ్రరీ, సమాచార సంస్థలతో సంబంధాలను కలిగి ఉన్నారు. ఆయన జాయింట్ కౌన్సిల్ ఆఫ్ లైబ్రరీ అసోసియేషన్స్ ఇన్ ఇండియా (JOCLAI), సార్క్ దేశాల లైబ్రరీ అసోసియేషన్ (LASAARC) వంటి సంస్థలలో ఎడ్వైజరీ, నాయకత్వ పాత్రలను నిర్వహించారు. ఈ అన్ని స్థానాలూ ఆయన వృత్తి జ్ఞానాన్ని, లైబ్రరీ శాస్త్రానికి సంబంధించి అనేక అంశాలను అభివృద్ధి చేసేందుకు కీలకంగా పనిచేశాయి.
పి.ఎస్.జి. కుమార్ 70 పుస్తకాలు, 142 పరిశోధన పత్రాలు రచించారు. ‘ఇండియన్ లైబ్రరీ క్రానాలజీ’, ‘ఇండియన్ ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్’, ‘యూనివర్సిటీ గ్రాంట్స్ కరిక్యులం సిరీస్’, ‘లైబ్రరీ ఇన్ ఇండియా సిరీస్’ వంటి పుస్తకాలు ఆయనకు ఎంతో పేరు తెచ్చాయి. ఆయన తన రచనలను అనేక జాతీయ, అంతర్జాతీయ గ్రంథాలయ శాస్త్ర జర్నల్స్‌లో ప్రచురించారు. ‘లైట్ అండ్ షేడ్స్ ఆఫ్ మై లైఫ్’ అనే ఆత్మకథలో పి.ఎస్.జి. కుమార్ తన జీవితంలోని అద్భుత ఘట్టాలను, కష్టాలను, విజయాలను పాఠకులకు తెలియజేశారు. లైబ్రరీ శాస్త్రంలో చేసిన సేవలకు ఆయన ‘లైఫ్-టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు’ను అందుకున్నారు. ‘డా. పి.ఎస్.జి. కుమార్ లైబ్రరీ ఫౌండేషన్’ను కూడా స్థాపించారు.
పి.ఎస్.జి. కుమార్ స్థాపించిన ఫౌండేషన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా లైబ్రరీ శాస్త్రం అభివృద్ధికి సహకరించే అనేక కార్యక్రమాలు, సేవలు కొనసాగించబడుతున్నాయి. ఈ ఫౌండేషన్ ఆయన ఆశయాలను ప్రతిబింబిస్తూ, లైబ్రరీ శాస్త్రంలో కొత్త దిశలో పరిశోధనలను ప్రోత్సహించడంలో, మరింత అవగాహన కల్పించడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నది. భారతదేశ లైబ్రరీ శాస్త్రంలో ఒక తెలుగువాడిగా ఆయన విజయాలు మనందరికీ గర్వకారణం. ఆయన వేసిన దారిలో భారతదేశంలోనే గాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న లైబ్రరీ శాస్త్రవేత్తలు, విద్యార్థులు కృషి చేస్తూనే ఉంటారు.
డా. రవికుమార్ చేగోని
ప్రధాన కార్యదర్శి, తెలంగాణ గ్రంథాలయ సంఘం