యాగంటి వచనాల్లో అచ్చతెలుగు ‘అధివాస్తవికత’!
ABN , Publish Date - Jan 06 , 2025 | 12:30 AM
తెలుగు పాట తొలినాళ్ళ రూపాలలో ‘ఏల’ ఒకటి. ‘ఏల’ అనే మాటకు ‘శృంగారపు పాట’ అని శబ్దరత్నాకరం అర్థం చెప్పింది. ‘‘ఏలలు పెట్టి పాడడం’’ అని పాల్కురికి సోమనాథుడు బసవ పురాణంలో చెప్పిన మాట ఒకటి ఉంది. ‘‘రెండేసి పాదములకో...
తెలుగు పాట తొలినాళ్ళ రూపాలలో ‘ఏల’ ఒకటి. ‘ఏల’ అనే మాటకు ‘శృంగారపు పాట’ అని శబ్దరత్నాకరం అర్థం చెప్పింది. ‘‘ఏలలు పెట్టి పాడడం’’ అని పాల్కురికి సోమనాథుడు బసవ పురాణంలో చెప్పిన మాట ఒకటి ఉంది. ‘‘రెండేసి పాదములకో, మూడేసి పాదములకో ఒకసారి ఏదో ఒక దేవుని పేరు రాగ క్రమమున ఉచ్ఛరిస్తూ చదవడం యేలలుపెట్టి చదవడము’’ అని దానికి వివరణ. ‘ఏలలు’ పాడుకోవడానికి ఉద్దేశించినవే కాబట్టి, ఈ వివరణలోని ‘చదువుట’ అనే మాటను ‘పాడుట’ గానే అర్థం చేసుకోవచ్చు.
కానరాని యడవిలోన
వానలేని మడుగు నిండె,
వానలేని మడుగుమీదనూ, యాగంటిలింగా,
మానరాని అగ్ని పొడమెరా.
ఆకులేని యడవిలోన
తోకలేని మృగముపుట్టె
తోకలేని మృగము కడుపునా, యాగంటిలింగా,
ఈకలేని పక్షిపుట్టెరా.
‘యాగంటి వారి ఏల’ల లోనివి ఈ రెండు ఏల పదాలు. పాడుకోవడానికే ఉద్దేశించినవని చెప్పకనే తెలిసిపోతుంది. మాట లతో వర్ణించి చెప్పలేని ఒక అధి వాస్తవ మార్మికత ఈ ఏలలలో ఉన్నదని కూడా చెప్పకనే తెలిసి పోతుంది. ‘యాగంటిలింగా’ అన్నది మూడవ పాదాంతంలో తప్పనిసరిగా ఇవ్వబడిన విశ్రాంతి. ఈ ఏల పదాన్ని పాడుకోవ డంలో మాటలకందని ఒక ఉప శమనం ఉంది. అలసిపోయిన మనసుకు ఇందులోని ఉపశ మనం ఎంతో హాయినిచ్చేదిగా ఉంటుందని అర్థమవుతుంది. మార్మికత స్థాయిని మరికాస్త ముందుకు తీసుకు వెళితే అధి వాస్తవిక మార్మికతగా రూపాంతరం చెందుతుందని పై ఏల లోని మాటలతో అర్థమౌతుంది. ఒక్కొక సమయంలో మనిషి పాడుకుని ఉపశమనాన్ని పొందడానికి, అర్థవంతమైన మాటల కంటే, మార్మికార్థం దాగి ఉన్నదిగా అనిపించే ఎవో కొన్ని మాటలతో ఒక పాట అవసరమౌతుందని, ఆలోచించే అవస రాన్ని మనిషి బుద్ధి ఆ సమయంలో కోరుకోదని, అందువలన లయబద్ధమైన అర్థంలేని మాటలు పాటగా ఉంటే చాలు మనిషి పాడుకుని తృప్తిపడతాడని ఊహించిన వ్యక్తి ఈ పాటల సృష్టికి కారకుడు. ఆ వ్యక్తి పేరు గార్లపాటి లక్ష్మణయ్య. ఈయన ఎప్పటివాడు అనే విషయంపై అభిప్రాయ బేధాలున్నప్పటికీ, కనీసం నాలుగైదు వందల సంవత్సరాలకు పూర్వుడని మాత్రం అందరూ ఒప్పుకు న్నారు. జానపద సాహిత్యంలో ఇలా అధివాస్తవిక మార్మికత కలిగిన మాటల కూర్పుతో యాగంటి ఏలలను, వచనాలను సృష్టించిన ఈయన కర్నూలు జిల్లాలోని యాగంటి క్షేత్రంలో ఉన్న యాగంటి నంజేశ్వరుడికి అంకితంగా ఈ యాగంటి పదాలను చెప్పాడు. ఈయన ఇంటి పేరైన గార్లపాడు ఈయన నివాస స్థలం అనుకుంటే, అది కూడా కర్నూలు జిల్లాలోనే ఉంది. సంప్రదాయ సాహిత్యంలోని కావ్యాలలోలా, పైన చూపిన యాగంటి ఏలలోని భాష, అందులోని అంతః సూత్రం మరేదో భాషలోని రచనకు అనువాదమో, అనుకరణో కావడానికి ఎంతమాత్రమూ అవకాశం లేదు. ఇది అచ్చమైన తెలుగు ఊహ అన్నది సందేహం లేని మాట.
మామూలు మాటల్లో వివరించి చెప్పలేనంత అందాన్ని, కొన్ని సందర్భాలలో, మాటలకు మార్మికత అలంకరించి చూపిస్తుంది. మాటలకు అలా వచ్చే సాధారణ మార్మికతకు మించిన మార్మికతను, అధివాస్తవికతలో ఆ మార్మికపు మాటలను ముంచి లయబద్ధం చేయడం వలన సాధించవచ్చునని, అలా సాధించడం వలన తయారైన రచన అధివాస్తవ మార్మికత (Surreal–mysticism) అనదగిన ఒక అధిలౌకిక స్థితితో కూడినదై మరింత ఆశ్చర్యాన్ని, మైమరపును కలగజేస్తుందని తెలిపే ఉదాహరణలు యాగంటివారి కొన్ని వచనాల్లో కనపడ తాయి. పాశ్చాత్య దేశాలలో అధివాస్తవిక ఆలోచనా ధోరణి ఒక సాహిత్యోద్యమ రూపంలో 20వ శతాబ్దం పూర్వార్థంలో ఫ్రాన్స్‌లో వెలుగు చూసింది. యాగంటి ఏలలకు, వచనాలకు 15వ శతాబ్దం ప్రాంతంలోనే రూపకల్పన జరిగింది కాబట్టి, సాహిత్యంలో అధివాస్తవిక ఆలోచనా ధొరణి తెలుగు నేలపై ఆనాటికే మొదలైందని గట్టిగానే చెప్పవచ్చు.
ఓయక్క ఒక కప్ప అయిదు పాముల మింగె,
తెల్సుకోరె
వినుడి జనులార, ఇనుము వంటక మాయె,
తెల్సుకోరె
అమ్ములపొదిలోన కొమ్ముటేనుగు బుట్టె,
తెల్సుకోరె
అ కొమ్ముటేనుగు మీద కొదమ బాలుడు బుట్టె,
తెల్సుకోరె
చింతమానూ నొక్క బంతిపూవూ బుట్టె,
తెల్సుకోరె
దాని చెంతనున్న కోడి పులిపిల్లాయెనూ,
తెల్సుకోరె
గుడి మీద ఒక నక్క కూతలు బెట్టెను,
తెల్సుకోరె
దాని మెడనున్న గంటలూ మేఘాలు మేసేను,
తెల్సుకోరె
పుడిసెడు నీళ్ళనూ భూమెల్ల తడిసెనూ,
తెల్సుకోరె
దాని వొడినున్న నిప్పులు వనితలు జల్లెనూ,
తెల్సుకోరె
యెరిగిన వారు యాడాది గడియిస్తె,
తెల్సుకోరె
దీనియిరవెల్ల క్రమముతో యాగంటి గురుడెరుగు,
తెల్సుకోరె!
పై గేయంలోని చివరి పాదంలో మాటలనుబట్టి ఇది యాగంటి గురుడైన గార్లపాటి లక్ష్మణయ్య రచనగా తెలుస్తుంది. గేయం మొదలైన దగ్గర నుండి ఒక్కొక్క పాదంలో ఒక్కొక అధివాస్తవిక చిత్రం కళ్ళముందు ప్రత్యక్షమౌతుంది. ముందు పాదంలోని అక్షర చిత్రం పూర్తిగా ఆకళింపుకు వచ్చి, అది కలిగించిన అబ్బురం అంతమవక ముందే, తరువాతి పాదంలో ఒక కొత్త చిత్రం కళ్ళముందు ప్రత్యక్షమై పాఠకుడి ఊహను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అర్థం గురించి ఆలోచించే ప్రయత్నం చేసే లోపే, అర్థం గురించి ఆలోచించడం అంత అవసరమా? అనే ఆలోచన ఈ గేయంలోని పాదాలను చదువుతున్నప్పుడు ప్రతి పాదంలోనూ కలుగుతుంది. మొత్తం మీద ఈ గేయంలో ఉన్నది అనన్య సామాన్యమైన అధివాస్తవిక అందం!
సాల్వడార్ డాలి సర్రియల్ చిత్రాలకు మించినవిగా భావించదగిన అధివాస్తవిక అక్షర చిత్రాలు తెలుగు సాహిత్యంలోని యాగంటి వచనాలలో ఉన్నాయి. అధివాస్తవిక ధోరణిని అంతఃసూత్రంగా చేసుకుని కుంచెలతో బొమ్మలు వేసి డాలి ప్రపంచం వేపు వింతగా చూసి మెరిపిస్తే, మాటలతో అంతకు మించిన వింతలను అక్షర చిత్రాలుగా 15వ శతాబ్దం ప్రాంతాలకే తెలుగు జానపద సాహిత్యంలోని పై రచనలలో మలిచి చూపించడం జరిగింది. కానీ ఇవి కనీసం ఒక పుస్తకంగా కూడా ముద్రణ పొందక, చెన్నై లోని ప్రభుత్వ ప్రాచ్య లిఖిత పుస్తక భాండాగారంలో వ్రాతప్రతులుగా మూలన పడి ఉన్నాయి!
భట్టు వెంకటరావు