Share News

Poetic Insight : అలిశెట్టి కవిత పలికిన నగరజీవి వేదన

ABN , Publish Date - Jan 11 , 2025 | 04:59 AM

హైదరాబాద్ నగరాన్ని తమకు కనబడిన కోణంలో, అర్థమైన మేరకు ఎందరో కవులు రచనల్లో ప్రకటించారు. ఇక్కడి నేలకు సొంతమైన భాష, సంస్కృతులు తమ గుండెకు హత్తుకున్న తీరును...

Poetic Insight : అలిశెట్టి కవిత పలికిన నగరజీవి వేదన

హైదరాబాద్ నగరాన్ని తమకు కనబడిన కోణంలో, అర్థమైన మేరకు ఎందరో కవులు రచనల్లో ప్రకటించారు. ఇక్కడి నేలకు సొంతమైన భాష, సంస్కృతులు తమ గుండెకు హత్తుకున్న తీరును హృద్యంగా వర్ణించిన వారున్నారు. అయితే నగరంలోని పేదరికం, శ్రమదోపిడి, చేతిలో పైసా లేనివాని పరిస్థితిని తనదైన రీతిలో అలిశెట్టి ప్రభాకర్ వెల్లడించాడు. నమ్మకమైన ఆదాయం లేకుండానే కుటుంబంతో సహా నగరంలో కాలుబెట్టిన అలిశెట్టికి అంతా తనలాంటి భరోసాలేని బతుకులే కంటబడ్డాయి. ఆయన పదేళ్ల నగర జీవితంలో చెప్పినదంతా సామాన్యుడి వెతలే. 19వ ఏట చిట్టి పొట్టి కవితలు రాయడం మొదలుపెట్టిన ప్రభాకర్ పుట్టి పెరిగిన జగిత్యాలలో ఆగకుండా కరీంనగర్ మీదుగా 1983లో హైదరాబాద్‌కు మారాడు. ఆయన చివరి పదేళ్ల జీవితం నగరంలోనే గడిచింది.

అలిశెట్టి ప్రభాకర్ నగరంలో అడుగు పెట్టక ముందే, దాని లక్షణాలను సరిగ్గానే గమనించి, తొలినాళ్ళ కవిత్వంలో వివరించాడు: ‘ప్లాస్టిక్ సర్జరీ’ అనే కవితలో, ‘‘నగరంలో/ కొన్ని నెమళ్ళుంటాయి/ కంటిలో కాదు సూటిగా/ గుండెల్లో పొడుస్తాయి/ మరెన్నో/ తోడేళ్లుంటాయి/ ఇవి మనిషినేం చేయవు/ కేవలం శ్రమను మాత్రమే/ తోడేస్తాయి/ నగరం.../ అర్థం కాని రసాయనశాల/ అందమైన శ్మశానవాటిక/ నగరం.../ చిక్కువిడని పద్మవ్యూహం,/ చెక్కుచెదరని మయసభ’’ అని అంతా తెలిసినట్లే రాశాడు.

1981–82 కాలంలో కరీంనగర్ నుంచి తన కవితా చిత్రాలు వెంటేసుకొని నెలకు ఒకటీ రెండుసార్లు నగరానికి వచ్చి వాటి ప్రదర్శనలు కాలేజీల్లో ఏర్పాటు చేస్తున్నప్పుడు ఆయనకు నగరం కొత్తగా, వింతగా కనబడింది. తన కళా సృష్టికి తగిన రంగస్థలం ఇదేనని అనిపించింది.


అప్పటికే క్షయతో బాధపడుతున్న తాను ఇక్కడెలా బతుకుతాను అనే ముందూ వెనుకా ఆలోచనా లేకుండా అన్నీ సర్దుకొని నగరంలో కాలుపెట్టాడు. ఈతరానివాడు నీళ్లలో దూకినట్లుంది. అయినా కవిత్వమే తప్ప జీవన కష్టాల గురించి పట్టించుకోని ప్రభాకర్ ఆ పదేళ్లు ఇక్కడ తుఫానులో చిక్కుకున్నట్లు బతికాడు. కుటుంబం పడరాని పాట్లు పడింది. అంతా బాగున్న సొంతూరును వదిలిపెట్టి ఇక్కడికి ఎందుకు, వెనక్కి పోదాం అని ఇంటామె వేడుకున్నా వినలేదు.ఈ విషయాల ప్రస్తావన ఆయన చివరి రోజుల్లో రాసుకున్న ‘మరణం నా చివరి చరణం కాదు’ ముందుమాటలో చూడవచ్చు: ‘‘7 x 14 అడుగుల స్టూడియో గదికి అయిదొందలు, భార్య ఇద్దరు పిల్లలతో ఒంటరి గదికి నూటా ఎనబై పోగా మిగిలేది అబిడ్స్‌లో సెకండ్ హ్యాండ్ పుస్తకం’’ అనే ఆర్థిక బాధను ఒక చోట, ‘‘పుట్టిన గడ్డ నుండి ఇక్కడికి రావడమే పొరపాటయిపోయింది’’ అనే పశ్చాత్తాపాన్ని మరోచోట రాసుకున్నాడు. నగరంలో కష్టాలను వివరిస్తూ ‘‘పగలు రాత్రి ఆస్బెస్టాస్ రేకుల కింద పడి ఎంత వేడెక్కినా, మాడిపోకుండా ఉండగలిగిన మానవాతీతుణ్ణి’’ అని రాసుకున్నాడు. అయినా అన్ని కష్టాల్లోనూ ‘‘నరకప్రాయమైన నగర నాగరికతను నర నరానా జీర్ణించుకున్నవాణ్ణి, రోజుకో రెండు కవితా వాక్యాలు రాయలేనా’’ అని తన ధీరత్వాన్ని ప్రకటించుకున్నాడు.

అలా నగరం ఆయనకు కొత్త కవితా వస్తువైంది. 1986లో ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రభాకర్ డైలీ పోయెమ్ శీర్షిక ‘సిటీ లైఫ్’ మొదలైంది. రోజుకొక్క కవిత రాయడమంటే మామూలు విషయం కాదు. అయినా దాన్ని ప్రభాకర్ ఛాలెంజ్‌గా తీసుకున్నాడు. అలిశెట్టి చివరి రోజు వరకు ఆ శీర్షిక కొనసాగింది. ఆదాయం కొడికట్టినవేళ ఆ పత్రిక రోజుకి ఇచ్చే ముప్పై రూపాయల పారితోషికమే అన్నం పెట్టింది. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య పీడనలో కవిత్వమే ఆయనకు ఆసరా అయింది.


ఆంధ్రజ్యోతిలో సిటీ లైఫ్ ఆయన కవిత్వానికి పాఠక విస్తృతిని పెంచింది. రోజు పత్రికను చూసేవారు ఆయన కవితను వదిలిపెట్టేవారు కాదు. ఆయన తీసుకొనే నిత్యజీవన అంశం; రాతలో సరళత, స్పష్టత, సూటిదనం, వ్యంగ్యం అందరిని ఆకట్టుకునేవి. అలా లక్షలాది మందికి ‘అలిశెట్టి ప్రభాకర్’ పేరు దగ్గరయింది.

సిటీలైఫ్‌ కవితల్లో ఒక కవితలో– నగరంలో రోజూ ఏదో ఒక దారిలో కనిపించే ఊరేగింపును ‘‘సమిష్టి బాధల/ సుదీర్ఘ శ్వాసే/ ఊరేగింపు’’ అన్నాడు. ‘‘నగరంలో రోడ్డుకిరువైపులా/ వేశ్యల్లా ముస్తాబై నిలుచున్న దుకాణాలు/ కన్నుగొట్టి రమ్మన్నా గుండె బిగపట్టుక/ సాగిపోయేవాడు సామాన్యుడు’’ అన్నాడు. నగరంలో రోడ్లను తన కోణంలో చెబుతూ– ‘‘నగరంలో రోడ్లు/ అడపా దడపా/ బాధల బాటసారులను మింగేసే కొండచిలువలా’’ ఉన్నాయంటాడు. ‘‘హైదరాబాదంతా పిండితే చిక్కని పాలు/ బంజారాహిల్స్’’ అని శ్రమదోపిడి రూపాన్ని బయటపెట్టాడు. ‘‘కాచిగూడా/ కాచి వడబోస్తే/ నువ్వొక నీళ్ల టీ/ నారాయణగూడా/ నీ మీంచి నడిచిపోతే/ నువ్వొక దాల్ రోటీ!/ బతకొచ్చిన కష్టజీవీ/ పట్నంలో/ నీకు నీవే పోటాపోటీ...!’’ అని కష్టజీవి కడుపు నింపేవేమిటో వివరిస్తాడు. ‘‘హైదరాబాదనే/ మహావృక్షమ్మీద/ ఎవరికి వారే/ ఏకాకి’’ అని నగర జీవనం తీరును ఎండగడతాడు. కవిత్వం కోసం కష్టాలొచ్చినా, నష్టాలొచ్చినా వెరవలేదు. అందుకే అలిశెట్టి పట్టిందల్లా ‘కవిత్వం’ అయింది. ఆయన నడిచిన దారుల్లో వేసిన కవిత్వ పాదముద్రలు ఎన్నటికీ మాసిపోవు.

--బద్రి నర్సన్

(రేపు అలిశెట్టి ప్రభాకర్ జయంతి, వర్ధంతి)

Updated Date - Jan 11 , 2025 | 04:59 AM