జాగృత తెలంగాణ విద్యుత్తేజం
ABN , Publish Date - Jan 01 , 2025 | 05:47 AM
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో వికసించిన అగ్ని పుష్పం ఆరుట్ల కమలాదేవి. నిజాం సంస్థానం క్రింద జాగీర్దారులు, దేశ్‌ముఖ్‌లు, ఇనాందార్లు, బంజరుదార్లు, మఖ్తేదార్లు, అనే వివిధ రకాల ఫ్యూడల్ శక్తులు...
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో వికసించిన అగ్ని పుష్పం ఆరుట్ల కమలాదేవి. నిజాం సంస్థానం క్రింద జాగీర్దారులు, దేశ్‌ముఖ్‌లు, ఇనాందార్లు, బంజరుదార్లు, మఖ్తేదార్లు, అనే వివిధ రకాల ఫ్యూడల్ శక్తులు ప్రజలను పీడించే పరిస్థితుల్లో దొరతనాన్ని బొందపెట్టిన సాయుధ సమరం. భూమి, భుక్తి, విముక్తి కోసం చేసిన పోరాటంలో బందూకు పట్టిన వీరనారి, ప్రజా ఉద్యమాలను ఊపిరిగా మార్చుకున్న విప్లవకారిణి, జీవిత పర్యంతం ప్రజల పక్షాన గళమెత్తిన మహిళ ఆరుట్ల కమలాదేవి. బలిదానాలను తెంచుకొని బందూకు పట్టి అబలలను సబలలుగా తయారు చేసే సేనానిగా మారింది. నిజాం నిరంకుశత్వానికీ, దోపిడీకి వ్యతిరేకంగా ఎగిసిపడ్డ అగ్ని కెరటం ఆరుట్ల కమలాదేవి.
అవిభక్త నల్లగొండ జిల్లా ఆలేరు తాలూకాలోని మంతపూరి గ్రామంలో 1920లో లక్ష్మీనరసమ్మ, పల్లా వెంకటరాం రెడ్డి దంపతుల కుమార్తె. ఆమెకు తల్లిదండ్రులు పెట్టిన పేరు రుక్మిణి. ఆనాడు తెలంగాణ పల్లెలు అన్నిటిలో ఉన్న పరిస్థితే మంతపురి గ్రామంలో ఉంది. పాఠశాల లేదు. కొంత మంది ఇండ్ల ముంగిలిలో ఉపాధ్యాయున్ని నియమించి తమ పిల్లలకు చదువు చెప్పించుకొనేవారు. ఇటువంటి వీధిబడిలోనే రుక్మిణి విద్యాభ్యాసం చేసింది. మేనమామ కొడుకైన ఆరుట్ల రామచంద్రారెడ్డితో, రుక్మిణి పెళ్ళి చేశారు. అప్పటికే అభ్యుదయ భావాలు ఉన్న రామచంద్రారెడ్డి పెండ్లి తర్వాత ఆమెను పైచదువులు చదవడానికి అంగీకరించాలనే నియమాలు విధించాడు వారి పెద్దవాళ్ళతో. ఆ కాలంలో సరోజినీనాయుడు, కమలాదేవి చటోపాధ్యాయ ఉన్నత చదువులు చదివారు. వారి స్ఫూర్తితోనే రామచంద్రారెడ్డి తన భార్య రుక్మిణి పేరును కమలాదేవిగా మార్పించారు. ఆమెను ప్రగతిశీల భావాల వైపు నడిపించారు.
పెళ్ళి తర్వాత ఆమె జీవితంలో ఎన్నెన్నో మార్పులు జరిగాయి. భర్త ప్రోత్సాహంతో ఆమె చదువు మొదలుపెట్టింది. ఆ రోజుల్లో స్త్రీ విద్యకు అంత ప్రాముఖ్యత లేదు. ఆ పరిస్థితుల్లో మాడపాటి హనుమంతరావు బాలికల పాఠశాలలో చేర్చారు. రాజ్‌బహదూర్ వెంకటరామిరెడ్డి వసతి గృహంలో ఉండి చదువుకున్న తొలి మహిళ కూడా కమలాదేవే. హాస్టల్‌లో అధికారుల అనుమతితో కమలాదేవి తన భర్తతో మీటింగ్‌లకు వెళ్ళేవారు. ఆంధ్ర మహాసభలలో రామచంద్రారెడ్డితో పాటు కమలాదేవి కూడా పాల్గొనేవారు. నిజామాబాద్‌లో జరిగిన 6వ ఆంధ్ర మహాసభ మల్కాపురంలో జరిగిన 7వ సభలో కమలాదేవి పాల్గొని, వాలెంటీరుగా పనిచేశారు. ఆంధ్ర మహాసభలకు వెళ్ళిన తర్వాతనే రాజకీయ అవగాహన ఆమెకు ఏర్పడింది. స్కూల్ ఫైనల్ ‘హెచ్.ఎస్.సి’ పాస్ అయిన తర్వాత కమలాదేవి కొలనుపాక వెళ్ళారు.
‘రామానుజ కూటం’ అనే పేరుతో జాగీరు తహశీలుతో 1941, మే 5న అనుమతి తీసుకున్నారు. కమలాదేవి ఆ భవనంలో బాలికల పాఠశాలను 1941, జూన్ 15న ప్రారంభించి, ఉచితంగా బాలికలకు విద్యను నేర్పించారు. అది దినదినాభివృద్ధి చెంది, 60 మంది బాలికలకు విద్య నేర్పించే స్థాయికి చేరుకున్నది. కొంత కాలానికి ఈ విషయం జాగీర్‌దార్లకు తెలిసిపోయింది. ప్రభుత్వం ఈ కేంద్రాన్ని మూసివేయించింది. పాఠశాల ఎక్కడ నడుపాలన్న ప్రశ్న కలిగింది. కొలనుపాక జైన మందిరం అధ్యక్షుడు లక్ష్మీచందు ఉదార స్వభావుడు. ఇతరులకు మేలు చేయాలనే సంకల్పం కలిగినవారు. వారితో సంప్రదించగా జాగీర్‌దార్ల దుర్మార్గాన్ని తెలుసుకున్న జైన మందిరం నిర్వాహకులు తమ దేవాలయంలో స్థలమిచ్చి, రాజబహదూర్ వెంకటరామారెడ్డి ‘కన్యా బాలికల పాఠశాల’ అనే పేరుతో పాఠశాలను ప్రారంభించారు. బాలికల పాఠశాల నడిపినందుకు జీతం ఇస్తానన్నా కూడా కమలాదేవి తీసుకోలేదు. ఉచితంగా బోధించారు. దాదాపు 100 మంది బాలికలు పాఠశాలలో చేరారు. కుట్టుపని, కోలాటం, ఆటలు, పాటలు, అన్నీ నేర్పించింది. మధ్యపాన నిషేధం గురించి ఎక్కువగా ప్రచారం సాగుతున్న రోజులవి. కమలాదేవి గ్రామంలో మధ్యపాన నిషేధం గురించి బాలికలతో ‘కల్లు మానండోయి’ అని పాటలు పాడిస్తూ ప్రచారం చేసారు. బాలికలకు కర్రసాము, చేయిపట్టుకుంటే ఎట్లా విడిపించుకోవాలో, మనిషి దగ్గరకు రాకుండా కర్ర ఏ విధంగా తిప్పాలో నేర్పించారు. అక్కడ ఒక ఏడాదిపాటు పాఠశాలను నడిపి, గ్రామీణులను అక్షరాస్యులుగా మార్చి, చైతన్యపరిచారు.
రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మఖ్దూం మోహియుద్దీన్ మొదలైన అగ్రనాయకులు కమలాదేవి అంకితభావాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. అక్కడి నుండి తిరిగి రాగానే భువనగిరిలో 11వ ఆంధ్ర మహాసభ సన్నాహాలు ప్రారంభమయ్యాయి. కమలాదేవి ఊరూరా తిరిగి ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. భువనగిరి ఆంధ్ర మహాసభ రాజకీయ పోరాట వేదికగా మారింది. వెట్టిచాకిరి, దొరల దౌర్జన్యాలు, భూస్వాముల పీడన, నిర్భంధపు వసూళ్ళకు వ్యతిరేకంగా ఉద్యమించడానికి భువనగిరి మహాసభ పిలుపునిచ్చింది. ఆంధ్రమహాసభ, కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం స్వీకరించిన కమలాదేవి రాజకీయ, సైనిక శిక్షణలు పొంది, తెలంగాణ సాయుధ పోరాటంలో క్రమశిక్షణ గల యోధగా పాల్గొనడం ప్రారంభించారు.
తెలంగాణ సాయుధ సమరంలో గెరిల్లా శిక్షణ పొందిన ఆమె, ఆడబెబ్బులిలా విరుచుకుపడ్డారు. రజాకార్లు దొర గుండాల రాక్షసత్వంపై అలుపెరుగని పోరు చేశారు. మహిళలతోనే గెరిల్లా దళాన్ని ఏర్పాటు చేసి, నిజాం సర్కార్ వెన్నులో వణుకు పుట్టించారు. రహస్య జీవితం, గెరిల్లా పోరాట ఫలితంగా 1948లో కమలాదేవి ఆరోగ్యం దెబ్బతిన్నది. చికిత్స కోసం బయటకు వచ్చిన కమలాదేవిని, ఆమె భర్తను ఆలేరు వద్ద పోలీసులు గుర్తించి అరెస్టు చేసారు. రామచంద్రారెడ్డిని ఖమ్మం క్యాంపుకు, కమలాదేవిని వరంగల్ జైలుకు పంపారు. వరంగల్, ఔరంగాబాద్, సికింద్రాబాద్ జైళ్లల్లో రెండున్నరేళ్లకు పైగా కఠిన కారాగారవాసాన్ని అనుభవించిన కమలాదేవి 1951 చివరలో విడుదలయ్యారు. వెంటనే ఎన్నికల రణరంగంలో దూకారు.
1952 మొదటి ఎన్నికల్లో ఆలేరు నుండి అత్యధిక ఓట్ల మెజారిటీతో శాసనసభకు ఎన్నికయ్యారు. 1952 నుంచి 1971 వరకు ఆలేరు నియోజకవర్గం నుంచి మూడుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. 1962లో శాసనసభలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కమ్యూనిస్టు పార్టీకి పుచ్చలపల్లి సుందరయ్య నాయకుడిగా, ఆరుట్ల కమలాదేవి ఉప నాయకురాలిగా ఎన్నికయ్యారు. 1964లో కమ్యూనిస్టు పార్టీ చీలిక తర్వాత కమలాదేవి శాసనసభలో ప్రతిపక్ష నాయకురాలిగా బాధ్యతలు నిర్వహించారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్ శాసనసభ చరిత్రలో ఏకైక మహిళా ప్రతిపక్ష నాయకురాలు కమలాదేవి అని చరిత్ర స్పష్టం చేసింది. మూర్తీభవించిన మానవత, నిర్మల మూర్తి, అన్యాయాన్ని దహించే అగ్నిశిఖ కమలాదేవి. సాహస వనిత ఉన్నతాశయాలతో, ఉత్తమ వ్యక్తిత్వంతో పరిపూర్ణమైన జీవితాన్ని గడిపిన ఆరుట్ల కమలాదేవి 2001, జనవరి 1న తుదిశ్వాస విడిచారు. నిర్బంధంపై తిరగబడే ప్రతి పిడికిలిలో ధైర్యంలా కమలాదేవి నిలిచే ఉంటారు. బ్రతికినన్ని రోజులు ఒక మహిళగాకాక ఒక వ్యవస్థగా బతికారు.
డా. సోమేశ్వర్ బోనకుర్తి
‘పునాది’ సెంటర్ ఫర్ రిసెర్చ్