Share News

సామాజిక వైవిధ్యంలో జీవన సౌందర్యం

ABN , Publish Date - Jan 02 , 2025 | 05:32 AM

తబలా మేస్ట్రో జాకిర్‌ హుస్సేన్‌ ఇటీవల మరణించిన తరువాత ఆయనకు సంబంధించిన ఒక పాత విడియో క్లిప్‌ సామాజిక మాధ్యమాలలో మళ్లీ కనిపిస్తోంది. అందులో ఆయన తన తండ్రి, సుప్రసిద్ధ హిందుస్థానీ సంగీతకారుడు అల్లా రఖా చెప్పిన...

సామాజిక వైవిధ్యంలో జీవన సౌందర్యం

తబలా మేస్ట్రో జాకిర్‌ హుస్సేన్‌ ఇటీవల మరణించిన తరువాత ఆయనకు సంబంధించిన ఒక పాత విడియో క్లిప్‌ సామాజిక మాధ్యమాలలో మళ్లీ కనిపిస్తోంది. అందులో ఆయన తన తండ్రి, సుప్రసిద్ధ హిందుస్థానీ సంగీతకారుడు అల్లా రఖా చెప్పిన కొన్ని మాటలను గుర్తు చేసుకున్నారు: ‘నేను చదువుల తల్లి సరస్వతిని, ప్రథమ పూజ్యుడు వినాయకుడిని ఆరాధిస్తుంటాను. వారు నా ఉపాధ్యాయులు’. విశేషంగా ఆకట్టుకునే, అంతకంటే ఆసక్తికరమైన ఈ విలువైన వాక్కులు మతనిష్ఠాపరుడు, దైవ భీతుడు అయిన ఒక ముస్లిం మతస్తుడివి. మన భారతావనిలో శతాబ్దాలుగా హిందువులు, ముస్లింల మధ్య సమున్నత సాంస్కృతిక సమ్మేళనాన్ని సూచిస్తున్న మాటలు అవి. అంతేకాదు, ఒక స్పష్టమైన మనోవైఖరిని అవి వ్యక్తం చేస్తున్నాయి. ‘గంగా–జముని’ తెహ్‌జీబ్‌ (సంప్రదాయం)గా ఆ విశిష్ట మనోవైఖరి మన ప్రజల జీవన రీతుల్లో ప్రతిబింబిస్తోంది.


గంగా–జముని సంప్రదాయం ఒక సంయుక్త లేదా ఉమ్మడి సంస్కృతిని పరివేష్టించి ఉన్న సంప్రదాయమే ‘గంగా–జముని’. మతసహిష్ణుత, ఒక సాంస్కృతిక వారసత్వ భాగస్వామ్యానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సంకీర్ణ సంస్కృతి అది. మన సంగీతం, లలితకళలు, వాస్తురీతులు, వంటకాలలో అది నిండుగా కనిపిస్తుంది. అయితే దేశ విభజన బీభత్సాలు, వాటి చేదు జ్ఞాపకాలు, ఇటీవలి కాలంలో సంకుచితమైపోయిన సామాజిక దృక్పథాల నేపథ్యంలో ‘గంగా–జముని’ సంప్రదాయం గత కాలం గురించి ఒక జ్ఞాపకంగా మాత్రమే మిగిలిపోతోంది! వివిధ చింతనా ధోరణుల సమన్వయాన్ని, మన సంప్రదాయ సహనం, సమైక్యతా స్ఫూర్తిని మనం ఉద్దేశపూర్వకంగానే తిరస్కరిస్తున్నామా? అదే నిజమైన పక్షంలో మన సామాజిక జీవన రీతులలో సువ్యక్తమవుతున్న సంక్లిష్ట మత, సాంస్కృతిక, భాషా పరమైన వైవిధ్యాలను ఎలా సమన్వయం చేసుకోగలుగుతాం?

క్రీ.శ. 712లో సింధ్‌ ప్రాంతంపై అరబ్‌ల దండయాత్రతో ఇస్లాం భారతావనిలోకి ప్రవేశించింది. మొగల్‌ చక్రవర్తుల కాలంలో ఆ కొత్త మతం మన దేశంలో విస్తృతంగా వ్యాపించింది. ఇస్లాంను స్వీకరించిన వారిలో అత్యధికులు కుల వ్యవస్థ అన్యాయాలు, దురాగతాలను తప్పించుకునేందుకై బలవంతంగానో లేదా స్వచ్ఛందంగానో ఆ మతంలో చేరినవారే. క్రైస్తవ భారతీయులు తమ చరిత్ర సెయింట్‌ థామస్‌ కేరళలో అడుగిడిన నాటి నుంచి ప్రారంభమవుతుందని విశ్వసిస్తారు క్రీ.శ 52లో సెయింట్‌ థామస్‌ మలబారు ప్రాంతంలోని యూదులను క్రైస్తవంలో చేరేలా ప్రేరేపించి మన దేశంలో క్రైస్తవం నెలకొనేందుకు, వర్ధిల్లేందుకు దోహదం చేశారని భావిస్తారు. చరిత్ర పరిణామ క్రమంలోని వేర్వేరు దశలలో యూదు, పార్శీ, బహాయీ మతస్తులు మన దేశానికి శరణార్థులుగా వచ్చి, ఆ తరువాత స్వేచ్ఛగా తమ మతాలను విస్తరింప జేసుకుని వర్ధిల్లుతున్నారు.

మన తీరాలకు క్రైస్తవం, ఇస్లాం వచ్చిన శతాబ్దాల తరువాత భారతదేశ జనాభా మతాల వారీగా ఇలా ఉంది: హిందువులు 79.8 శాతం; ముస్లింలు 14.2 శాతం, క్రైస్తవులు 2.3 శాతం. ఇప్పుడు అన్ని మతాల వారిలోను సంతానోత్పత్తి రేట్లు పడిపోతున్నాయి. వాస్తవ పరిస్థితి ఇదయితే కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటించుతున్న కారణంగా హిందూ జనాభా తగ్గిపోతోందని, అదే సమయంలో ఆ పద్ధతులను పాటించని కొన్ని ఇతర మతాల వారి సంఖ్య గణనీయంగా ఎదుగుతుందని, ఇది ఇలాగే కొనసాగిన పక్షంలో హిందువులు తమ జన్మ భూమిలోనే మైనారిటీలు అయిపోతారనే వాదన ఒకటి గట్టిగా విన్పిస్తోంది. ఇది ప్రజలను తప్పుదోవ పట్టించడమే. అంతేకాదు చాలా ప్రమాదకరమైన భయాందోళనలను రగుల్కొల్పే వాదన.

1996లో అమెరికా సామాజిక శాస్త్రవేత్త శామ్యూల్‌ హంటింగ్టన్‌ ‘నాగరికతల సంఘర్షణ’ అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ప్రపంచం భవిష్యత్తులో నాగరికత ప్రాతిపదికన విభజితమైపోతుందని, భావజాలాల మధ్య కాకుండా, మౌలికంగా విభిన్నమైన మతాలు, సంస్కృతుల మధ్య సంఘర్షణలు ప్రజ్వరిల్లుతాయనేది ఆ సిద్ధాంత సారం మరి బహుళ సంస్కృతులు, మతాలు ఉన్న భారతదేశమే హంటింగ్టన్‌ ప్రమాదకర జోస్యం నిజమయ్యేందుకు అత్యధిక అవకాశమున్న నెలవుగా కనిపిస్తోంది.


వైవిధ్యాన్ని ఆదరిస్తూ సహన భావాన్ని పెంపొందించడంలోను, ఆర్థికంగా, సాంస్కృతికంగా పరస్పర సంబంధాలను ప్రోత్సహించడంలోనూ భారత ప్రజాస్వామ్యం ఇంతవరకూ సత్ఫలితాలను సాధించింది. సమస్త భారత పౌరులకూ సాపేక్షంగా శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పేందుకు అవి విశేషంగా దోహదం చేశాయి. మరి హంటింగ్టన్‌ ప్రతిపాదన ప్రకారం అనివార్యమైన హిందూ, ఇస్లామిక్‌ నాగరికతల సంఘర్షణను భారత్‌ అధిగమించగలదా? కాలమే నిర్ణయిస్తుంది. అయితే కొన్ని వాస్తవాలను నిశితంగా పరిశీలిద్దాం.

గత ప్రభుత్వాలు స్వార్థ ప్రయోజనాల కోసం మైనారిటీ మతస్తులను బుజ్జగించాయి. తద్వారా ఎన్నికలలో ప్రయోజనం పొందాయి. అయితే ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. పూర్తిగా విరుద్ధమైన పరిస్థితులు ఉన్నాయి. బుజ్జగింపులు ఏ మాత్రం లేకపోగా మైనారిటీ మతాలవారు తీవ్ర వివక్షకు, బెదిరింపులకు గురవుతున్నారు. వారి ఆరాధనా మందిరాలపై దాడులు జరుగుతున్నాయి. నివాస గృహాలు కూల్చివేయబడుతున్నాయి. అంతే కాకుండా మైనారిటీ వర్గాలవారు ఆర్థికంగా, సామాజికంగా వెలివేతకు గురవుతున్నారు. హంతక ముఠాలు చెలరేగిపోతున్నాయి. ఇవి, మైనారిటీ మతస్తులు నేడు ఎదుర్కొంటున్న కష్టనష్టాల్లో కొన్ని మాత్రమే. కొంతమంది మతాచార్యులు, పాలక వర్గాల పెద్దలు ముస్లింలు, క్రైస్తవుల పట్ల విద్వేషాన్ని పనిగట్టుకుని రెచ్చగొడుతున్నారు. ప్రభుత్వాలు ఉపేక్ష వహిస్తున్నాయి, మీడియా మౌనం పాటిస్తోంది. ఇది చోటుచేసుకుంటున్న విపత్కర పరిణామాలకు మౌన అంగీకారమా?


కుల మతాల ప్రాతిపదికన ప్రజలను విభజించే కుటిల రాజకీయాలు పెచ్చరిల్లుతున్నాయని మన ఎన్నికల చరిత్ర స్పష్టం చేస్తోంది. మరి మతపరమైన విభజనలు మన జాతీయ భద్రతను పటిష్ఠం చేస్తాయా లేక బలహీనపరుస్తాయా? జాతీయ ప్రయోజనాల కంటే ఎన్నికలలో గెలుపే ప్రాధాన్యం పొందనున్నదా? రాజకీయ అధికారం కోసం ఆచరిస్తున్న ఈ నీతిబాహ్య రాజకీయాలు అంతిమంగా మన సామాజిక ఐక్యతను తీవ్రంగా దెబ్బతీసే వినాశనకరమైన ఉద్రికత్తలు, హింసాకాండకు దారితీసే అవకాశం ఎంతైనా ఉన్నది. అటువంటి పరిస్థితి వాటిల్లితే అది జాతి భద్రతపై తప్పక ప్రతికూల ప్రభావం చూపగలదు. దేశ భద్రతకు ‘రెండున్నర ఫ్రంట్‌’ల్లో యుద్ధం చేయవలసివచ్చే అగత్యమేర్పడనున్నదని మన సైనికాధికారులు సూచించడం గమనార్హం. ‘రెండు ఫ్రంట్‌లు మన ఇరుగుపొరుగున ఉన్న శత్రువుల నుంచి యుద్ధ ముప్పు నెదుర్కోవడానికి సంబధించినవన్నది స్పష్టం. నిర్దిష్టంగా తెలియని ‘సగం ఫ్రంట్‌’ సామాజిక సమైక్యత విచ్ఛిన్నమవడం వల్ల వాటిల్లే ముప్పు. ఇది కూడా సరిహద్దుల్లో యుద్ధం వలే ప్రమాదకరమైనది. మత దురభిమానాల కారణంగా తలెత్తే జగడాలు ఇప్పటికే తీవ్రంగా ఉన్న నక్సల్స్‌ తిరుగుబాటు, కశ్మీర్‌లో ఉగ్రవాదం, మణిపూర్‌లో కొనసాగుతున్న హింసాకాండకు తోడైతే జనితమయ్యే మొత్తం ముప్పుతో మన జాతీయ భద్రతకు మున్నెన్నడూ లేని సవాళ్లు ఎదురవుతాయి. చారిత్రకంగా మన దేశం తరచు విదేశీ దురాక్రమణలకు గురికావడానికి ప్రధాన కారణం మన సమాజంలో అంతర్గత ఐక్యత లోపించడమే కాదూ? దీనికి తోడు మన పాలకులు సంకుచిత ప్రయోజనాలను విడనాడి సమైక్యంగా ఆక్రమణకు వచ్చిన పరాయి సైన్యాలను ఎదుర్కోవడంలో విఫలమయ్యారు ప్రపంచంలోని ఇతర దేశాలలో గారిబాల్డి, బిస్మార్క్‌ల నుంచి టిటో, మండేలా దాకా జాతి నిర్మాతలుగా గౌరవాదరాలు పొందుతున్నారు. భిన్న తెగలు, మతాలకు చెందిన ప్రజలను సమైక్యపరిచి వారిని ఒక జాతిగా రూపొందించినందునే ఆ మహానాయకులు ఆ సమున్నత గుర్తింపునకు అర్హులయ్యారు. మన వర్తమాన రాజకీయ నాయకులకు విశేష ప్రజాదరణ ఉన్నది. ఎన్నికలలో తమకు అను కూలంగా తిరుగులేని ప్రజా తీర్పులు పొందుతున్నారు. ‘చారిత్రక దురాగతాల’పై ప్రతీకారం తీర్చుకోవాలన్న అహేతుక వాదనలకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని మలిచే శక్తి సామర్థ్యాలు నేటి రాజకీయ నాయకులకు ఉన్నాయి.


‘వసుధైవ కుటుంబకం’ (ప్రపంచం ఒకే కుటుంబం) అన్న మన ప్రాచీన భావన హిందూ సంస్కృతిలో ప్రగాఢంగా వేళ్లూనుకుని ఉన్నది. ఈ సమున్నత దార్శనిక చింతనే భారత్‌ ఒక ‘విశ్వగురు’ అన్న మన వాదనకు విశ్వసనీయతను కల్పిస్తున్నది. బహుళ మతాలు వర్థిల్లుతున్న భారతీయ సమాజంలో, ఐశ్వర్యాభివృద్ధికి, జీవన భద్రతకు సామాజిక సమైక్యత అత్యంత ముఖ్యమైన ప్రాతిపదిక. జూన్‌ 2022లో నాగపూర్‌లో ఒక సమావేశంలో రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ సర్‌ సంఘ్‌చాలక్ మోహన్‌ భగవత్‌ మాట్లాడుతూ ఒక ఉపయుక్త ప్రశ్న వేశారు: ‘ప్రతి మసీదు లోను ఒక శివలింగం కోసం ఎందుకు అన్వేషిస్తున్నారు?’ ఈ ప్రశ్నకు ఆయనే ఇలా సమాధానమిచ్చారు: ‘మనకు ప్రతి ఒక్కరి పట్ల గౌరవం ఉన్నది. అన్ని విశ్వాసాలను మనం ఆదరిస్తాం’. డిసెంబర్‌ 19, 2024న ఆయన ఇలా అన్నారు: ‘మనం సుదీర్ఘకాలంగా శాంతి సామరస్యాలతో సహ జీవనం చేస్తున్నాం. ఈ సయోధ్యను ప్రపంచమంతటికీ సమకూర్చాలంటే, ఆ ఐక్యతకు ఒక ఆదర్శాన్ని సృష్టించాల్సిన అవసరమున్నది’. ఈ విజ్ఞుని మాటలను మనం అవశ్యంగా లక్ష్య పెట్టాలి.

అడ్మిరల్‌ అరుణ్‌ ప్రకాశ్‌

భారత నావికాదళం మాజీ ప్రధానాధికారి

(ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ సౌజన్యం)

Updated Date - Jan 02 , 2025 | 05:32 AM