Share News

‘తొలి సవరణ’ పై బీజేపీ వక్రభాష్యాలు

ABN , Publish Date - Jan 16 , 2025 | 04:50 AM

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తొలి రాజ్యాంగ సవరణపై ఓ విచిత్ర వాదనను లేవనెత్తింది. దేశ తొలి ప్రధానమంత్రి పండిట్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూ నేతృత్వం లోని కాంగ్రెస్‌ ప్రభుత్వం వాక్‌ స్వాతంత్య్రాన్ని అణచి వేసిందంటూ...

‘తొలి సవరణ’ పై బీజేపీ వక్రభాష్యాలు

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తొలి రాజ్యాంగ సవరణపై ఓ విచిత్ర వాదనను లేవనెత్తింది. దేశ తొలి ప్రధానమంత్రి పండిట్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూ నేతృత్వం లోని కాంగ్రెస్‌ ప్రభుత్వం వాక్‌ స్వాతంత్య్రాన్ని అణచి వేసిందంటూ అదే పనిగా ఆరోపిస్తోంది. నిజానికి బీజేపీ ఎన్నడూ తన పార్టీలో అసమ్మతి గళాలను సహించదన్న, వాటిని నిర్దాక్షిణ్యంగా అణిచివేస్తుందన్న ఆరోపణ ఉండనే ఉంది. నేడు దేశవ్యాప్తంగా జైళ్లన్నీ నేరస్తులతో గాక అధికార బీజేపీ నియంతృత్వపు పోకడలను ప్రశ్నిస్తున్న విద్యార్థులు, ఉద్యమకారులు, జర్నలిస్టులు, ప్రతిపక్ష నేతలు కిక్కిరిసి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి మధ్య– ఆత్మరక్షణలో పడినప్పుడు ఎదురుదాడి చేయడమే ఉత్తమం (అఫెన్స్‌ ఈజ్‌ ద బెస్ట్‌ డిఫెన్స్‌) అనే వూహ్యాన్ని అనుసరిస్తున్నది బీజేపీ. ఆ క్రమం లోనే భారత రాజ్యాంగానికి నెహ్రూ ప్రభుత్వం చేసిన తొలి సవరణపై అనవసరపు రచ్చకు తెర లేపింది.

1951లో దేశంలో ప్రజలకున్న వాక్‌ స్వాతంత్ర్యంపై సహేతుకమైన పరిమితులను ప్రవేశపెట్టాలన్న నిర్ణయాన్ని ప్రధాని నెహ్రూ అనివార్యంగా తీసుకోవాల్సి వచ్చింది. దీనికి తగిన బలమైన నేపథ్యం ఉంది. ఆనాడు న్యాయస్థానాలు కొన్ని తీర్పుల్లో– ఉదాహరణకు, రమేష్‌ థాపర్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ మద్రాస్‌ (1950), అదేవిధంగా బ్రిజ్‌ భూషణ్‌ వర్సెస్‌ ఢిల్లీ స్టేట్‌ (1950) వంటి కేసుల్లో ఆర్టికల్‌ 19(2)లో పేర్కొన్న విధంగా– మతపరమైన హింసను అరికట్టడానికి నిర్దేశించిన చట్టాలు చెల్లుబాటు కావని స్పష్టం చేశాయి. దాంతో, స్వాతంత్ర్యానంతరం ప్రజల మధ్య ఐక్యతను దెబ్బతీయడానికి జరిగిన విద్వేషపూరిత ప్రసంగాలు, మతపరమైన ప్రచారాలను ప్రభుత్వం నిరోధించ లేకపోయింది. ఈ పరిస్థితిని చూసి, భిన్నాభిప్రాయాలను స్వీకరించే ప్రజాస్వామ్య లక్షణం కలిగిన ప్రధానమంత్రి నెహ్రూ వ్యక్తిగత స్వేచ్ఛ, సామూహిక భద్రతల నడుమ సమతుల్యతను సాధించాలని ప్రయత్నించారు. ఫలితంగానే, రాజ్యాంగానికి తొలి సవరణ చేశారు. ఆయన దీనిని తన రాజకీయ లబ్ధి కోసం గానీ, విమర్శకుల నోళ్లు మూయించడానికి గానీ ఒక ఆయుధంగా ఎప్పుడూ ఉపయోగించ లేదు.


ఇందుకు పూర్తి విరుద్ధంగా అసమ్మతి పట్ల బీజేపీ అసహనం తీవ్ర స్థాయిలో ఉంటున్నది. సామాజిక కార్యకర్తలను, ఉద్యమ కారులను ‘ఉపా’ వంటి క్రూరమైన చట్టాల కింద జైళ్లలోకి నెట్టారు. బీజేపీ విధానాలను నిర్మాణాత్మకంగా ఎండగట్టిన పాత్రికేయులు, మీడియా సంస్థలు వేధింపులకు గురయ్యారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను సైతం ఉపేక్షించలేదు. ఆనాడు నెహ్రూ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశపెట్టిన కొన్ని పరిమితులను ఖండిస్తున్న బీజేపీ నేడు ప్రజాస్వామ్యయుతంగా అసమ్మతిని తెలియజేస్తున్న గళాలను నిర్దాక్షిణ్యంగా అణచివేయడానికి ఎటువంటి క్రూర చట్టాలను తెచ్చిందో అందరూ గమనిస్తూనే ఉన్నారు.

ప్రజాస్వామ్యంలో వాక్‌ స్వాతంత్ర్యం ఎంతో ముఖ్యం. అయితే, రాజ్యాంగ తొలి సవరణ దానిని సంబంధించి మాత్రమే చేసింది కాదు. తొలి సవరణ పరిధి వాక్‌ స్వాతంత్ర్య చట్టాలను సవరించడం కంటే మించినది. దేశంలో సమతావాద రాజకీయాలకు అవకాశం కల్పించడానికి దోహదం చేసింది. ప్రధాని నెహ్రూ భూసంస్కరణ చట్టాలు న్యాయవ్యవస్థ ద్వారా చెల్లుబాటు కాకుండా రక్షించడానికి ఆర్టికల్స్‌ 31ఎ, 31బి; అదేవిధంగా 9వ షెడ్యూల్‌ను ప్రవేశపెట్టారు. ఈ నిబంధనలు జమీందారీ వ్యవస్థను కూలదోశాయి. లక్షలాది రైతులకు భూమిని పునఃపంపిణీ చేయడానికి, అదేవిధంగా భూస్వామ్య వ్యవస్థ విచ్ఛిన్నానికి దోహదం చేశాయి.


ఉదాహరణకు, స్వాతంత్ర్యానంతరం జమీందారీ నిర్మూలన చట్టాలపై భూస్వాముల నుంచి గట్టి ప్రతిఘటన ఎదురైంది. ఈ చట్టాలను న్యాయస్థానాలలో వారు సవాలు చేశారు. స్టేట్‌ ఆఫ్‌ బీహార్‌ వర్సెస్‌ కామేశ్వర్‌ సింగ్‌ కేసులో బీహార్‌ భూ సంస్కరణల చట్టం 1950 రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొంటూ, రాజ్యాంగం 3వ విభాగంలో పేర్కొన్న ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లుతుందన్న కారణంగా న్యాయస్థానం దానిని కొట్టివేసింది. ఇందువల్లనే ఆర్టికల్స్‌ 14, 19 కింద ఎదురయ్యే న్యాయపరమైన సవాళ్ల నుంచి వ్యవసాయ సంస్కరణలను పరిరక్షించడానికి ఆర్టికల్‌ 31ఎ ను ప్రభుత్వం తీసుకువచ్చింది. ఆర్టికల్‌ 31బి, 9వ షెడ్యూల్‌ ఇవి రెండూ ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లుతుందనే కారణంగా కొన్ని నిర్దిష్టమైన చట్టాలను కొట్టివేయకుండా రక్షణ కల్పించాయి. అంతేకాకుండా, ఇవి గతంలో ఉన్నవాటికి కూడా రక్షణ కల్పించాయి. ప్రధాని నెహ్రూ చేపట్టిన ఈ చర్యలు భూస్వామ్య వర్గాల ప్రమేయాన్ని తొలగించి రైతులకు, ప్రభుత్వానికి మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని నెలకొల్పాయి.


జమీందారీ వ్యవస్థ రద్దుతో దేశంలో పెద్దఎత్తున భూపునఃపంపిణీకి మార్గం సుగమం అయింది. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రభుత్వ అధీనంలో ఉన్న భూములను, సాగుయోగ్యమైన బంజరు భూములను, ప్రైవేట్‌ అడవులతో సహా భూమిలేని రైతులకు పునఃపంపిణీ చేశారు. బీహార్‌ రాష్ట్రంలో ‘1949 బీహార్‌ భూ సంస్కరణల చట్టం’ కింద ఇటువంటి చర్యలనే చేపట్టారు. సమాజంలో సమానత్వాన్ని సాధించడానికి ఈ భూ సంస్కరణలు చాలావరకు దోహదం చేశాయి. వీటితో పోల్చి చూసినప్పుడు– బీజేపీ ప్రభుత్వం 2020లో తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలపై దేశవ్యాప్తంగా ఎంత వ్యతిరేకత వచ్చిందో, రైతులు ఎలా రోడ్లెక్కి ఉద్యమించారో అందరం చూశాం. కార్పొరేట్‌ ప్రయోజనాల కోసమే ఈ చట్టాలు తెచ్చారన్న విమర్శను ఎదుర్కోలేక చివరకు బీజేపీ వాటిని ఉపసంహరించుకోవాల్సి వచ్చింది.


అలాగే రాజ్యాంగానికి జరిగిన తొలి సవరణ ద్వారా ఆర్టికల్‌ 15(4)ను చేర్చడంతో షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించే వీలు కలిగింది. అంతేకాకుండా, చారిత్రక అసమానతలను పరిష్కరించడానికి ఈ రాజ్యాంగ సవరణ ఉపయోగపడింది. మద్రాస్‌ రాష్ట్రం వర్సెస్‌ చంపకం దొరైరాజన్‌ కేసులో ఒక బ్రాహ్మణ అభ్యర్థి తమిళనాడు ప్రభుత్వం మతపరంగా ఇచ్చిన ప్రభుత్వ జీవోను సవాలు చేశాడు. కులం, మతం ఆధారంగా విద్యా సంస్థల్లో సీట్లను తమిళనాడు ప్రభుత్వం కేటాయించడాన్ని ఆ కేసులో ప్రశ్నించాడు. ఇతర కులాల అభ్యర్థుల కంటే ఎక్కువ మార్కులు ఉన్నప్పటికీ, పిటిషనర్‌కు ప్రవేశం నిరాకరించబడింది. తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన కమ్యూనల్‌ జీవో రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 15(1), 29(2)లను ఉల్లంఘిస్తోందని, ఇది వివక్షకు తావు లేకుండా ప్రభుత్వ సంస్థల్లో సమాన ప్రవేశానికి ఇచ్చే హామీకి విరుద్ధమని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. కాగా, ఆర్టికల్‌ 16(4) వెనుకబడిన తరగతులకు ఉద్యోగాలలో రిజర్వేషన్లను అనుమతిస్తుండగా, విద్యకు సంబంధించి మాత్రం ఆర్టికల్‌ 15 ప్రకారం అటువంటి నిబంధన అమలులో లేదు. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు రాజ్యాంగ రక్షణలో గల అంతరాన్ని ఈ చారిత్రాత్మక తీర్పు ఎత్తిచూపింది. ఫలితంగా, ఇది ఆర్టికల్‌ 15(4)ని చేర్చడానికి దోహదం చేసింది. రిజర్వేషన్లపైనా బీజేపీ వైఖరి ఏమాత్రం సానుకూలంగా లేదు. సామాజిక న్యాయం చేయడానికి విధానాలను సమీక్షించాలని పదేపదే కోరుతున్నప్పటికీ బీజేపీ వాటిని పెడచెవిన పెడుతూ తన సైద్ధాంతిక దివాళాకోరుతనాన్ని ప్రదర్శిస్తోంది.


రాజ్యాంగానికి జరిగిన తొలి సవరణను వివాదాస్పదం చేయడం ద్వారా బీజేపీ చరిత్రను ఉద్దేశపూర్వకంగా వక్రీకరిస్తున్నది. రాజ్యాంగ సవరణ వల్ల వాక్‌ స్వాతంత్ర్యానికి ఏర్పడిన కొన్ని సహేతుకమైన పరిమితుల గురించి మాత్రమే మాట్లాడుతూ ఆ సవరణ వల్ల ఒనగూరిన ప్రయోజనాలను విస్మరించడం బీజేపీ హ్రస్వదృష్టికి నిదర్శనం. నెహ్రూ విధానాలను విమర్శించడం ద్వారా బీజేపీ ఆంక్షలు లేని వాక్‌ స్వాతంత్ర్యాన్ని కోరుకుంటున్నదని భావిస్తే మనం బొక్కబోర్లా పడినట్లే! నెహ్రూ ప్రభుత్వం చేసిన తొలి రాజ్యాంగ సవరణను ఆనాడు దేశంలో రైతులకు, బడుగు బలహీన వర్గాలకు, సామాన్యులకు ఫ్యూడల్‌ శక్తుల నుండి లభించిన విముక్తిగా చూడాలి. బీజేపీ కువిమర్శ చరిత్రను వక్రీకరించడం తప్ప మరొకటి కాదు.

కె. రాజు

నేషనల్‌ కోఆర్డినేటర్‌

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ విభాగాలు – ఏఐసీసీ

Updated Date - Jan 16 , 2025 | 04:50 AM