Share News

మండే అక్షరాలు ఆయన కవితలు!

ABN , Publish Date - Jan 10 , 2025 | 06:01 AM

పల్లెల్లో జనం మాట్లాడే మాటలను కవిత్వం చేసి బయటకు విసిరిన విలుకాడు మద్దూరి. ఏ కవిత్వం రాసినా తన అలగాజనం కోసమే. అక్షరాలు పల్లె జనం తినే గొడ్డుకారపు ముద్దలా భగభగ మండుతుంటాయి. తెలుగు సాహిత్యం....

మండే అక్షరాలు ఆయన కవితలు!

పల్లెల్లో జనం మాట్లాడే మాటలను కవిత్వం చేసి బయటకు విసిరిన విలుకాడు మద్దూరి. ఏ కవిత్వం రాసినా తన అలగాజనం కోసమే. అక్షరాలు పల్లె జనం తినే గొడ్డుకారపు ముద్దలా భగభగ మండుతుంటాయి. తెలుగు సాహిత్యం ఒక్కసారిగా మద్దూరి వైపు చూడటానికి కారణం ఆయన కవిత్వం సూటిగా, వాడిగా ఉండటమే. కవిత్వంలో తన జాతి బతుకులను కళ్ళకు కట్టి చూపెట్టిన కవి నగేష్ బాబు. అందుకే మద్దూరి నగేష్ కవిత్వం ఇంకా ప్రజల్లో చిరస్థాయిగా ఉంది. అతను రాసిన ప్రతి కవిత దళితుల బతుకులను చూపెడుతూ, వెలివేయబడిన జనాల గుండెలోతుల్లో కసుక్కున దిగబడుతుంది, కుల వ్యవస్థను సమర్ధించే వారి గుండెల్లో గునపంలా దిగబడుతుంది. నగేష్ కవిత్వం రాసిన తరువాత తెలుగు సాహిత్యంలో దళిత సానుభూతి కవులు బయటకొచ్చారు. మిరేవూట్లు, వెలివాడ, రచ్చబండ, నరలోక ప్రార్థన, గోదావరి, లోయ, పట్ట కవితా సంపుటాలు మద్దూరి నగేష్ బాబు కలం నుంచి లావాలా బయటకు వచ్చాయి.


మద్దూరి కథలు కూడా సంచలనంగా ఉంటాయి. తక్కువ వయస్సులో చనిపోయినా, తన తరంలో ఒక స్ఫూర్తి నింపి, రాబోయే తరాలకు తన కవిత్వం ద్వారా దిక్సూచిలా మారాడు మద్దూరి నగేష్ బాబు. ఆయన తన కవిత్వంతో నిత్యం పొద్దు పొడిచే సూర్యుడులా వెలుగొందుతున్నాడు. తన దళిత జనాల కవిత్వం నల్లజెండా ఎగరేసిన మద్దూరి నగేష్ బాబు 1964 ఆగస్టు 15న జన్మించాడు.

తంగిరాల సోని

(నేడు మద్దూరి నగేష్‌బాబు 20వ వర్ధంతి)

Updated Date - Jan 10 , 2025 | 06:01 AM