కాంగ్రెస్ దిగజారుడు రాజకీయం!
ABN , Publish Date - Jan 08 , 2025 | 12:25 AM
ఓఎన్‌జీసీ డ్రిల్లింగ్ చేసినప్పుడు కొన్ని బావుల్లో విపరీతమైన ఒత్తిడితో సహజవాయువు వెలువడుతూ ఉంటుంది. విపరీతమైన శబ్దంతో మంటలు ఎగజిమ్ముతూ ఉంటాయి. ఈ మంటలను ఆర్పటానికి...
ఓఎన్‌జీసీ డ్రిల్లింగ్ చేసినప్పుడు కొన్ని బావుల్లో విపరీతమైన ఒత్తిడితో సహజవాయువు వెలువడుతూ ఉంటుంది. విపరీతమైన శబ్దంతో మంటలు ఎగజిమ్ముతూ ఉంటాయి. ఈ మంటలను ఆర్పటానికి వారు అనుసరించే ఉపాయం– ఆ బావి చుట్టూ రంధ్రాలు పెట్టి దాని ద్వారా ఆ ఒత్తిడిని తగ్గించి మంటలు ఆర్పటానికి ప్రయత్నించటం. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తమపై ఎగసిపడుతున్న ప్రజా వ్యతిరేకత నుంచి తప్పించుకోవటానికి అరెస్టులను సాధనంగా ఎంచుకొని.. తద్వారా ప్రజాభిప్రాయాన్ని... మీడియా ప్రాధమ్యాలను మళ్లించటానికి ప్రయత్నిస్తున్నది. తాజాగా రామ్ అన్నపై కేసులు పెట్టడం.. అరెస్టుకు ప్రయత్నాలు చేస్తూ ఉండటం దీనిలో భాగమే! తెలంగాణ ప్రజలు ఈ డైవర్షన్ పాలిటిక్స్‌ను గ్రహించలేనంత అమాయకులు కారు. అసలు రేవంత్ ప్రభుత్వం ఈ తరహా వ్యూహాలు ఎందుకు పన్నుతోంది? అని కొందరికి అనుమానం రావచ్చు. ‘ఇందిర ఆత్మీయ భరోసా’లోని వైఫల్యాలు ప్రజలు గమనించకుండా వారి దృష్టిని వేరే అంశాలపైకి మళ్లించటానికి చేసే ప్రయత్నమే ఇది. ఈ తరహా దగా రాజకీయాలు అనుసరించటం కాంగ్రెస్ పార్టీకి కొత్తేం కాదు. ఎందుకంటే దగా అనేది ఆ పార్టీ రాజకీయ డీఎన్‌ఏలోనే మనకు కనిపిస్తుంది. దీని గురించి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది.
‘ముందు దగా.. వెనక దగా.. కుడి ఎడమలు దగాదగా..’ మహాకవి శ్రీశ్రీ ఈ కవితాపంక్తులు వేరే సందర్భంలో చెప్పి ఉండచ్చు. కానీ, ఇవి ప్రస్తుత కాంగ్రెస్ పాలనకు అద్దంపడతాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో ఎక్కడా రైతులు సంతోషంగా ఉన్నట్లు దాఖలాలు లేవు. సాగునీరు, విత్తనాలు, ఎరువులు, మార్కెట్ అవకాశాలను అభివృద్ధి చేయటం– ఇలా అన్ని విషయాలలోను ఈ పార్టీ రైతులను మోసం చేస్తూనే వస్తోంది. ఎన్నికల సమయంలో అలవికాని హామీలు ఇవ్వటం.. వాటిని అమలు చేయలేక చేతులెత్తేయడం మన రాష్ట్రంలో అధికార పార్టీకి సర్వసామాన్యమయిపోయింది. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కే మోసకారితనం రైతు భరోసా పంపిణీ కార్యక్రమంలో మరోసారి బయటపడింది. ఈ కార్యక్రమాన్ని కేసీఆర్ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టింది. ఇది దేశవ్యాప్తంగా ఒక రోల్ మోడల్‌గా నిలిచింది. రేవంత్‌రెడ్డి సర్కారు– దీని పేరును ‘ఇందిర ఆత్మీయ భరోసా’గా మార్చింది. ఏడాదికి 10 వేలు కాకుండా 15 వేలు ఇస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలందరూ ప్రజల దగ్గరకు వెళ్లి పదే పదే చెప్పారు. వరంగల్‌లో జరిపిన భారీ బహిరంగ సభలో రైతు డిక్లరేషన్ పేరిట 15 వేలు ఇస్తామని రాహుల్‌గాంధీ, రేవంత్ రెడ్డిలు ప్రకటించారు. కేవలం రాహుల్‌గాంధీ మాత్రమే కాదు.. ప్రియాంకగాంధీ, మల్లికార్జున ఖర్గే వంటి వారు కూడా పాల్గొన్న ప్రతి సభలో 15 వేలు ఇస్తామని చెబుతూనే వచ్చారు. ఇక ప్రగల్భాల రేవంత్‌రెడ్డి అయితే– ‘కేసీఆర్ ఇచ్చే ముష్టి పదివేలు ఎందుకు? మా ప్రభుత్వం రాగానే ఎకరాకు 15 వేలు ఇస్తామని’ ఊరూరా తిరిగారు. రాహుల్‌గాంధీ సహా కాంగ్రెస్ అగ్రనేతలందరూ చెబుతున్నారు కాబట్టి అమలు చేస్తారని ప్రజలు అమాయకంగా వీరి మాటలు నమ్మారు. దగా చేయటం కాంగ్రెస్ డీఎన్‌ఏలో ఉందనే విషయాన్ని తెలంగాణ రైతాంగం మర్చిపోయింది.
ఎన్నికలు అయిన తర్వాత వాయిదాల పర్వం ప్రారంభమయింది. సోనియాగాంధీ పుట్టిన రోజుకు కానుకగా ఇస్తామన్నారు. రాష్ట్రానికి అప్పులు ఉన్నాయి కాబట్టి తర్వాత ఇస్తామన్నారు. వాయిదాలు వేసి వేసి– ఇప్పుడు 15 వేలు కాదు.. 12 వేలు మాత్రమే ఇస్తామని రేవంత్ రెడ్డి సర్కారు నిసిగ్గుగా ప్రకటించింది. అది కూడా వ్యవసాయయోగ్యమైన భూములకు అని కొందరు మంత్రులు బహిరంగంగా చెబుతున్నారు. కానీ వ్యవసాయయోగ్యమైన భూములంటే ఏమిటో చెప్పటం లేదు. అంతే కాదు– సాధారణంగా రైతులకు వానకాలం నాట్లకు పెట్టుబడులు అవసరమవుతాయి. ఆ సమయంలో ప్రభుత్వం భరోసా ఇవ్వకుండా 11 వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టింది. ఇప్పుడు యాసంగిలో షరతులతో కూడిన పంపిణీ చేస్తానంటోంది.
ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ప్రజలకు తెలియాలి. ఈ మధ్య జరిగిన ఒక మంత్రివర్గ సమావేశంలో చాలా మంది మంత్రులు – హామీలు అమలుపరచకపోవటంపై తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశారట. ‘రైతుల్లో తీవ్రమైన అసంతృప్తి ఉంది. రోజు రోజుకు పెరుగుతోంది. ఇదే కొనసాగితే నియోజకవర్గాల్లో మేం తిరగలేం.. వచ్చే స్థానిక ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తాయి’ అని స్పష్టంగా కూడా చెప్పారట. అయితే రైతులకు హామీలిచ్చిన మన ముఖ్యమంత్రి– నేనేం చేయలేనని చేతులెత్తేశారట! 15 వేల నుంచి 12 వేలకు తగ్గిస్తున్నట్లు చెబితే సమస్యలు ఎదురవుతాయని– మంత్రివర్గ సమావేశం తర్వాత జరిగే విలేకరుల సమావేశంలో ఈ విషయం చెప్పటానికి ఎవరూ ముందుకు రాలేదట. దీనితో ముఖ్యమంత్రే స్వయంగా విలేకరులకు చెప్పాల్సి వచ్చింది. ఈ ఒక్క వ్యవహారం చాలు.. మంత్రివర్గంలో ఉన్న అసంతృప్తి.. అభిప్రాయభేదాలు.. రేవంత్‌రెడ్డిపై ఉన్న అసంతృప్తి తెలియజేయటానికి!
గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్– ‘అభయ హస్తం’ పేరిట ఒక మేనిఫెస్టో విడుదల చేసింది. దీనిలో ప్రతి రైతుకు.. వారు కౌలురైతు అయినా సరే– ఎకరానికి 15 వేల రూపాయలు ఇస్తామని.. రైతు కూలీలకు 12 వేల రూపాయలు ఇస్తామని ప్రకటించింది. ఆ సమయంలో ఈ అభయహస్తమే తమ పాలిట భస్మాసుర హస్తమవుతుందని రైతులు ఊహించలేదు. రేవంత్‌రెడ్డి ప్రకటనలో మరో తిరకాసు కూడా ఉంది. ఇప్పటి దాకా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఎంత మంది రైతులకు ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’లో స్థానం కల్పిస్తారు.. వారిలో ఎంత మంది కౌలురైతులు.. ఎంత మంది వ్యవసాయ కూలీలనే విషయాన్ని చెప్పటం లేదు. లబ్ధిదారుల విషయంలో ప్రభుత్వం భారీగా కోత పెడుతుందనే వార్తలూ వస్తున్నాయి. ఇదే నిజమైతే లక్షలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోతారు. ఈ వార్తలు నిజమవుతాయనుకోవటానికి కూడా ఒక కారణముంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ విషయంలో కోతలు పెట్టింది. 46 లక్షల మందికి కల్పించాల్సిన రుణమాఫీని 22లక్షల మందికే పరిమితం చేసింది. అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి తర్వాత మాట మార్చింది. కేవలం సన్నవడ్లకే బోనస్ ఇస్తానంటోంది. ఇలా రైతులకు కోతల పేరిట ఈ ప్రభుత్వం వాతలు పెడుతోంది.
ఈ దగా కాంగ్రెస్ ప్రభుత్వం– అధికారంలోకి రాకముందు– వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రకటించింది. మహలక్ష్మీ పథకం కింద మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామంది. ఆడబిడ్డలకు తులం బంగారం, స్కూటీ ఇస్తామంది. ఇప్పుడు ఆ ఊసే లేదు. వృద్ధులకు, వితంతువులకు రూ. నాలుగువేలు పెన్షన్ ఇస్తామంది. విద్యార్థులకు ఐదు లక్షల రూపాయల భరోసా కార్డు ఇస్తామంది. నిరుద్యోగులకు రెండు లక్షల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామంది.. రెండు లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయని భరోసా ఇచ్చింది. పేదలందరికీ ఇళ్ల స్థలాలతో పాటుగా ఇళ్లు కట్టుకునేందుకు ఐదు లక్షల రూపాయలు సాయం కూడా చేస్తామంది. ఈ వాగ్దానాలన్నీ ఇప్పుడు ఏ గాలికి కొట్టుకుపోయాయో తెలియదు. వీటి గురించి మాట్లాడటానికి ఇటు మంత్రులు కానీ అటు రేవంత్‌రెడ్డి కానీ సిద్ధంగా లేరు. ఇలా తాము ఆచరణలో పెట్టలేని వాగ్దానాలను కాంగ్రెస్ ఎందుకు చేసిందని మీలో కొందరికి అనుమానం రావచ్చు. ఎందుకంటే– దగా చేయటమనేది కాంగ్రెస్ డీఎన్‌ఏలో ఉంది కాబట్టి.. ప్రజలను దగా చేయటం కాంగ్రెస్‌కు వెన్నతో పెట్టిన విద్య కాబట్టి! ఇకపైనైనా ప్రజలు ఇలాంటి దగా కోరులతో జాగ్రత్తగా ఉండాలి.. అంతే కాకుండా తమ వద్దకు వచ్చినప్పుడు– వాగ్దానాలు ఏమయ్యాయని నిలదీయాలి.. అక్రమ అరెస్టులను వ్యతిరేకించాలి. ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి.. దానిలో భాగస్వాములకు బుద్ధి చెప్పాలి.
కల్వకుంట్ల కవిత
ఎమ్మెల్సీ