Share News

GP Chidambaram : విశ్వవిద్యాలయాల జాతీయీకరణ!

ABN , Publish Date - Jan 11 , 2025 | 05:09 AM

అన్ని ప్రభుత్వాలూ వాస్తవంగా గరిష్ఠ అధికారాలను అపేక్షిస్తాయి. తమకు తాము మరిన్ని నియంత్రణాధికారాలను ఇచ్చుకునేందుకు చట్టాలు చేస్తాయి. ప్రభుత్వాలు ఎందుకు ఇలా ఆరాటపడతాయి?

GP Chidambaram : విశ్వవిద్యాలయాల  జాతీయీకరణ!

అన్ని ప్రభుత్వాలూ వాస్తవంగా గరిష్ఠ అధికారాలను అపేక్షిస్తాయి. తమకు తాము మరిన్ని నియంత్రణాధికారాలను ఇచ్చుకునేందుకు చట్టాలు చేస్తాయి. ప్రభుత్వాలు ఎందుకు ఇలా ఆరాటపడతాయి? దేశానికి, ప్రజలకు ఏది మేలు చేస్తుందో తమకు మాత్రమే తెలుసునని విశ్వసించడమే ఆ ఆరాటానికి కారణం.

కొంతమంది వ్యక్తులకు అటువంటి విశ్వాసమే చాలా గాఢంగా ఉంటుంది. దాన్ని ‘రక్షకుడు’ లేదా మెస్సయ్య భావం అంటారు. అదొక మానసిక స్థితి. అటువంటి మనస్తత్వం ఉన్నవారు సమస్యలు అన్నిటినీ తానే పరిష్కరించగలనని, ఫ్రజలను తానే ‘రక్షించ’గలనని విశ్వసిస్తారు. ఇది మితిమీరితే తాము జైవికంగా పుట్టలేదని ‘భగవంతుడే తనను పంపాడు’ అన్న విపరీత ఆలోచన లేదా భ్రాంతికి లోనవుతారు.

అసలు విషయానికి వస్తాను. వైస్‌ ఛాన్సలర్ల నియామకాలకు సంబంధించిన నియమ నిబంధనలను యూజీసీ (యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ – విశ్వవిద్యాలయ నిధుల సంఘం) మార్చివేసింది. వీసీల ఎంపిక ప్రక్రియకు సంబంధించిన కొత్త ముసాయిదా నిబంధనలను కూడా జారీ చేసింది. వాటిపై అభిప్రాయాలు, సలహాలు, సూచనలను ఆహ్వానించింది.

ప్రస్తుతం అనేక చట్టాలు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విశ్వవిద్యాలయాల స్థాపనకు అధికారాల నిస్తున్న అనేక చట్టాలు సంబంధిత రాష్ట్ర గవర్నర్‌ను విశ్వవిద్యాలయ ఛాన్సలర్‌గా చేస్తున్నాయి. కేంద్రీయ విశ్వవిద్యాలయాలను నెలకొల్పిన కొన్ని చట్టాలు రాష్ట్రపతిని విజిటర్‌గా నిర్దేశించాయి. సరే, రాష్ట్ర గవర్నర్‌ క్రియాశీల రాజకీయాల నుంచి నిష్క్రమించిన నాయకుడో లేక ప్రముఖ పౌరుడో అయి ఉండడం కద్దు. గవర్నర్‌ రాజ్యాంగ బద్ధంగా తన విధులు నిర్వర్తించాలి.


వీసీల ఎంపికకు, ప్రస్తుత నిబంధనల ప్రకారం ఒక సెర్చ్‌ కమ్‌ సెలక్షన్‌ కమిటీని నియమిస్తారు. ఈ కమిటీలో గవర్నర్‌, రాష్ట్ర ప్రభుత్వం, విశ్వవిద్యాలయ సెనేట్‌, విశ్వవిద్యాలయ సిండికేట్‌ నామినీ (ప్రతినిధి)లు ఉంటారు. ఈ కమిటీ విస్తృత ప్రాతిపదికన ప్రజాస్వామికంగా ఉంటుంది. అంతిమ ఎంపిక నిర్ణయం ఛాన్సలర్‌ / గవర్నర్‌దే అయినప్పటికీ గతంలో గవర్నర్‌ సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వ ‘సహాయం, సలహా’పై నిర్ణయం తీసుకునేవారు. దురదృష్టవశాత్తు ఈ సదాచరణ గత దశాబ్దంలో అంతరించిపోయింది. గవర్నర్లు తమ వ్యక్తిగత విచక్షణతో వీసీలను నియమించడం ప్రారంభమయింది.

రోజులు మారిపోయాయి –మరింత అధ్వాన్నంగా! ఇప్పుడు గవర్నర్‌ పదవులలో ఆరెస్సెస్‌ / బీజేపీ భావజాల విధేయులు లేదా విశ్వసనీయ విశ్రాంత సివిల్‌ అధికారులు లేదా సైనికాధికారులను మాత్రమే నియమిస్తున్నారు.

ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వ వైస్రాయ్‌గా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేయాలని గవర్నర్‌ను ఆదేశిస్తున్నారు. పర్యవసానంగా రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వం ఉంటోంది: ఎన్నికైన ప్రభుత్వం, ఎన్నిక కాని గవర్నర్‌. రాష్ట్ర గవర్నర్‌ రాష్ట్ర ప్రభుత్వ ‘సహాయం, సలహా’తో నిర్ణయాలు తీసుకోవాలన్న భారత రాజ్యాంగ నిబంధనను గాలికి వదిలివేస్తున్నారు. శాసనసభ సమావేశాల్లో సంప్రదాయం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రసంగాన్ని చదవడానికి నిరాకరిస్తున్న గవర్నర్లను చూడండి. రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా ముఖ్యమంత్రిని బహిరంగంగా విమర్శిస్తున్న గవర్నర్లను చూడండి. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి లేదా పోలీస్‌ చీఫ్‌ను రాజ్‌భవన్‌కు పిలిచి ముఖ్యమంత్రిని ఉపేక్షించి వారికి నేరుగా ఆదేశాలు ఇస్తున్న గవర్నర్లను చూడండి. రాష్ట్ర ప్రభుత్వ సచివాలయానికి తెలియజేయకుండా జిల్లాల్లో పర్యటిస్తూ జిల్లా అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ వారితో చర్చలు జరుపుతున్న గవర్నర్లను చూడండి. ఈ ఉదంతాలు స్పష్టం చేస్తున్నదేమిటి? రాష్ట్రాలలో ముఖ్యంగా ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ద్వంద్వ ప్రభుత్వం తనకుతానే నెలకొంటోందని కాదూ?


‘డిగ్రీ’ అంటే యూజీసీ నిర్దేశించిన డిగ్రీయే అవుతుందని, ఒక చట్టం ద్వారా స్థాపితమైన విశ్వవిద్యాలయం దానిని ప్రదానం చేస్తుందని యూజీసీ చట్టంలోని సెక్షన్‌ 22 పేర్కొంది. కొత్త ముసాయిదా నిబంధనలు సెర్చ్‌ కమ్‌ సెలెక్షన్‌ కమిటీ ఏర్పాటుకు, వీసీల నియామకానికి పద్ధతులను నిర్దేశించింది. ఈ కొత్త పద్ధతి ప్రకారం ఛాన్సలర్‌, యూజీసీ, అపెక్స్‌ బాడీ (విశ్వవిద్యాలయ సెనేట్‌/ సిండికేట్‌/ బోర్డ్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌) నామినీలతో కూడిన ముగ్గురు సభ్యుల సంఘంగా సెర్చ్‌ కమ్‌ సెలక్షన్‌ కమిటీ ఉంటుంది. ఇది 35 పేర్లతో కూడిన ఒక జాబితాను రూపొందిస్తుంది. ఆ జాబితా నుంచి ఒకరిని వీసీగా ఛాన్సలర్‌ నియమిస్తారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన విశ్వవిద్యాలయానికి వ్యతిరేకంగా డిగ్రీ ప్రోగ్రామ్‌లు ఆఫర్‌ చేయకుండా, యూజీసీ కార్యక్రమాలలో పాల్గొనకుండా ఆంక్షలు విధిస్తారు. అసలు యూజీసీ చట్టం కింద విశ్వవిద్యాలయాల జాబితా నుంచి దాన్ని తొలగిస్తారు. ఇతర శిక్షాత్మక చర్యలు కూడా దానికి వ్యతిరేకంగా తీసుకుంటారు.

మరింత స్పష్టంగా చెప్పాలంటే సదరు విద్యాసంస్థ విశ్వవిద్యాలయంగా అస్తిత్వంలో ఉండడం ఆగిపోతుంది. వైస్‌ ఛాన్సలర్‌ ఎంపిక, నియమాకంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి పాత్ర ఉండదన్న వాస్తవాన్ని గమనించారా? వైస్‌ ఛాన్సలర్‌ యూజీసీ వైస్రాయ్‌ అవుతాడు. యూజీసీ చైర్‌పర్సన్‌, ఇతర సభ్యులను కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది వారిని తొలగించే అధికారాలు కూడా దానికే ఉన్నాయి.

ఒక విశ్వవిద్యాలయ పరిపాలనకు ఇద్దరు వైస్రాయ్‌లు ఉంటారు. ఒకరు గవర్నర్‌ / ఛాన్సలర్‌ కాగా మరొకరు వైస్‌–ఛాన్సలర్‌. ముసాయిదా నిబంధనలను నోటిఫై చేసిన పక్షంలో జరిగేదేమిటి? రాష్ట్ర ప్రజల ప్రయోజనార్థం విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పి, సొంత ఆర్థిక వనరుల నుంచి దాని నిర్వహణకు నిధులు కేటాయించే రాష్ట్ర ప్రభుత్వ హక్కులను ఆ నిబంధనలు అపహరిస్తాయి.


మరింత స్పష్టంగా చెప్పాలంటే ముసాయిదా నిబంధనలు విశ్వవిద్యాలయాలను జాతీయీకరణ చేస్తాయి. దేశంలోని సమస్త ఉన్నత విద్యా సంస్థల నిర్వహణను ‘మెస్సయ్య’ తన నియంత్రణలోకి తీసుకుంటాడు. ‘ఒక దేశం–ఒకే ప్రభుత్వం’ అన్న భారతీయ జనతా పార్టీ విధానానికి అనుగుణంగా వ్యవస్థల శీఘ్రతర కేంద్రీకరణకు విశ్వవిద్యాలయాల జాతీయీకరణ మరో ఉదాహరణగా నిలుస్తుంది. సమాఖ్య విధానం, రాష్ట్రాల హక్కులపై ఇది చాలా ఘోరమైన దాడి కాదూ?

ఈ ముసాయిదా నిబంధనలను రాష్ట్రాలు నిర్ద్వంద్వంగా తిరస్కరించాలి. వాటికి వ్యతిరేకంగా పోరాడాలి– రాజకీయంగా, న్యాయమార్గాలలో.. విశ్వవిద్యాలయాల జాతీయీకరణను వమ్ము చేసేందుకు ఉపాధ్యాయులు, విద్యార్థులు ముందుకువచ్చి నిరసనలు తెలపాలి. లక్ష్య పరిపూర్తి దాకా నిరంతర జాగరూకతతో ఉండాలి. ప్రజా పాలన వ్యవస్థలు అన్నిటిలో ద్వంద్వ ప్రభుత్వం అనేది సురక్షితమైతే దాని స్థానంలో రాజరికం లేదా ఒక నియంతృత్వ పాలకుడు ఉద్భవించేందుకు ఎంతో కాలం పట్టదు. కనుక ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి.

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - Jan 11 , 2025 | 05:09 AM