Share News

‘భారత్‌లో రాయబారం అపురూప గౌరవం’

ABN , Publish Date - Jan 16 , 2025 | 04:47 AM

భారత్‌కు నేను మొట్టమొదట నా కౌమార వయసులో వచ్చాను. ఈ అద్భుత దేశం నా హృదయాన్ని ఎలా చూరగొననున్నదనే విషయమై అప్పుడు నాకు ఎలాంటి భావన లేదు. భారత్‌కు అమెరికా రాయబారిగా నా దౌత్య బాధ్యతలను ముగించనున్న ఈ సమయంలో...

‘భారత్‌లో రాయబారం అపురూప గౌరవం’

భారత్‌కు నేను మొట్టమొదట నా కౌమార వయసులో వచ్చాను. ఈ అద్భుత దేశం నా హృదయాన్ని ఎలా చూరగొననున్నదనే విషయమై అప్పుడు నాకు ఎలాంటి భావన లేదు. భారత్‌కు అమెరికా రాయబారిగా నా దౌత్య బాధ్యతలను ముగించనున్న ఈ సమయంలో నా మనసు ఈ దేశం పట్ల కృతజ్ఞతా భావంతో నిండి ఉన్నది. ఎందుకంటే భారత్‌ నాకు ఎన్నో సమున్నత సత్యాలను నేర్పింది. అంతే కాదు, భారత్‌, అమెరికాలు కలసికట్టుగా ముందుకు సాగితే మన ఉభయ దేశాలకూ, మన ధరిత్రికి సుస్థిర శాంతి, సదా సమృద్ధ ఐశ్వర్యమూ సమకూరుతాయనే ఆశాభావమూ నాకు అపారంగా ఉన్నది.

అమెరికా రాయబారిగా ఈ అపురూప దేశం నాలుగు దిశలా ప్రయాణించాను. నిరంతర సందడితో ఉండే ముంబై వీథుల నుంచి కోల్‌కతా సాంస్కృతిక కేంద్రాల దాకా, హిమాలయ పర్వతాలు మొదలయ్యే ప్రాంతాలు, అరుణాచల్‌ ప్రదేశ్‌ నుంచి దక్షిణాగ్రాన ఉన్న కన్యాకుమారి దాకా నేను పర్యటించాను. ఈ సువిశాల దేశంలో నా పర్యటనలు, సందర్శనలలో ఈ పురానవ జాతి నుంచి ఎంతో నేర్చుకున్నాను. ముఖ్యంగా అమెరికా, భారత్‌ కలసికట్టుగా ముందుకు సాగితే ఉభయ దేశాలూ సమస్త జీవన రంగాలలో మరింత మెరుగ్గా ఉండడమే కాకుండా ఈ ధరాతలంపై ఉన్న సకల సమాజాల జీవన స్థితిగతులను భవ్యంగా మార్చగలగడం సాధ్యమవుతుందనే వాస్తవాన్ని గుర్తించాను. ఆ అవగాహన నాలో ప్రగాఢంగా నెలకొంది. అంకెలు ఈ వాస్తవాన్ని స్పష్టం చేస్తున్నాయి : ఇంచుమించు 20,000 కోట్ల డాలర్ల విలువైన ద్వైపాక్షిక వాణిజ్యంతో అమెరికా భారతదేశ అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉన్నది; అమెరికాలో మూడు లక్షల మందికి పైగా భారతీయ విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్నారు (అమెరికా విశ్వవిద్యాలయాలలోని విదేశీ విద్యార్థులలో భారతీయులే అత్యధికం); వరుసగా రెండో సంవత్సరం భారతీయులకు పది లక్షలకు పైగా వలసేతర వీసాలు జారీ చేయడం జరిగింది; వాతావరణ మార్పు నుంచి మన ధరిత్రిని రక్షించుకోవడానికి దాదాపు 1000 కోట్ల డాలర్ల మేరకు వ్యయపరచడం జరిగింది; ఆరోగ్య భద్రతకు సంబంధించి కలసికట్టుగా 90కి పైగా కొత్త ఔషధాల రూపకల్పన, ఉత్పత్తి ద్వారా ఇంచుమించు ఐదు కోట్ల మంది భారతీయులు లబ్ధి పొందారు. ఈ అంకెలు ఆశ్చర్యకరంగా ఉన్నప్పటికీ మన అసాధారణ స్నేహ సంబంధాల గాథను అవి సంపూర్ణంగా చెప్పేవి ఎంత మాత్రం కావు.


అమెరికా రాయబారిగా భారత్‌కు వచ్చినప్పుడు మన ఉభయ దేశాలు కలసికట్టుగా కృషి చేస్తున్న వివిధ రంగాల విస్తృతి, దాని ప్రాధాన్యం నన్ను అబ్బురపరిచింది. నవీన సాంకేతికతల నుంచి వాణిజ్యం దాకా, మహిళా సాధికారిత నుంచి ఆరోగ్యభద్రత దాకా, ఇండో పసిఫిక్‌ తీరస్థ దేశాల భద్రత, మహా సాగరాల అగాథాలలో అన్వేషణల నుంచి అంతరిక్షంలో పరిశోధనల దాకా .. ఇంకా ఎన్నో రంగాలలో మనం పరస్పరం సహాయ సహకారాలు అందించుకుంటున్నాం. నేను ఊహించిన దాని కంటే అతి విస్తృతంగా భారత్‌–అమెరికా సంయుక్త కృషి జరుగుతోంది. మన సంబంధాలలోని నాలుగు కీలక అంశాల– శాంతి, సంపద సృష్టి, ధరిత్రి శ్రేయస్సు, ప్రజల అభ్యున్నతి– లో సంయుక్త కృషి మరింత మెరుగైన ప్రపంచాన్ని, ఉజ్వల భవిష్యత్తును ఎలా నిర్మిస్తుందో నేను ప్రత్యక్షంగా చూశాను.


భారత్‌లో నేను తొలుత అధికారికంగా పర్యటించిన అహ్మదాబాద్‌లో ఆ విశిష్ట కృషి సాధిస్తున్న సమున్నత ఫలితాలను చూశాను. ఆ నగరంలో మహిళల ఆధ్వర్యంలో నడుస్తున్న ‘సేవ’ అనే స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలు, నాయకురాళ్లను కలుసుకున్నాను. వారి గాథలు వాతావరణ సంక్షోభం నుంచి ప్రపంచాన్ని పరిరక్షించేందుకు తక్షణ, అంతర్జాతీయ కార్యాచరణ అవసరమనే సత్యాన్ని స్పష్టం చేస్తున్నాయి. పూణేలోని సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌లో మలేరియా వ్యాక్సిన్‌ ఉత్పత్తి కార్యకలాపాలను చూశాను, భారతీయ ఔషధ ఉత్పత్తిదారు, అమెరికాలోని జీవ సాంకేతికత కంపెనీ, బ్రిటన్‌ లోని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం సమష్టి కృషి ఫలితంగా ఆ వ్యాక్సిన్‌ ఉత్పత్తి అవుతోంది. మధ్య ఆఫ్రికా దేశం నొక దానికి ఎగుమతి చేయడానికై ఆ వ్యాక్లిన్ల పెట్టెలను ట్రక్కులలో ఎక్కించడాన్ని కూడా నేను చూశాను.

వివిధ సదస్సులలో ఉత్సాహపూరితులైన భారతీయ వ్యాపార, పారిశ్రామికవేత్తల ప్రతినిధి బృందాలను కలుసుకున్నాను. అమెరికాలో వందల కోట్ల డాలర్ల మేరకు పెట్టుబడులు పెట్టేందుకు భారతీయ ప్రతినిధి బృందం ఒకటి అమెరికన్‌ కంపెనీలతో ఒక ఒప్పందానికి రావడం ఎంతైనా ముదావహమైన విషయం. అమెరికా– భారత పౌర విమానయాన రంగ శిఖరాగ్ర సదస్సులో ప్రైవేట్‌ పౌర విమానయాన సంస్థల నిర్వాహకులను కలుసుకున్నాను. హర్యానాలో ఒక విమానయాన కేంద్రాన్ని అభివృద్ధిపరిచేందుకు 15,000 కోట్ల డాలర్ల విలువైన అమెరికా విమానాలకు వారు ఆర్డర్‌ ఇచ్చారు.


భారతదేశ విశిష్ట కళాకృతులు, సంస్కృతీ సంప్రదాయాలు నన్ను చాలాకాలం నుంచీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించేందుకు ఉద్దేశించిన సాంస్కృతిక సంపద ఒప్పందంలో సహ సంతకందారు అయినందుకు నేను అమితంగా గర్విస్తున్నాను. అమెరికాలో క్రికెట్‌ ఆట వర్థిల్లేందుకు, అందునా 2028లో నా సొంత ఊరు అయిన లాస్‌ ఏంజెల్స్‌లో నిర్వహించనున్న ఒలింపిక్స్‌లో ఆ క్రీడను కూడా చేర్చడానికి దోహదం చేసినందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఆలోచనలోను, ఆచరణలోను అమెరికా, భారత్‌ సంయుక్తంగా కృషి చేస్తే మనం తెరవ లేని ద్వారమంటూ ఉండదు, మనం కలుపుకు పోలేని స్నేహితుడు అంటూ ఉండడు. ఎందుకంటే మనం మరింత ప్రపంచ ప్రజల సమష్టి శ్రేయస్సుకు కృషి చేస్తున్నాము. మన ఉభయ దేశాల సంయుక్త కృషి ప్రపంచ పరిస్థితులను తప్పక మెరుగుపరుస్తుంది.


నా జీవితంలో ఒక అపురూప అధ్యాయాన్ని ముగించబోతున్నాను. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నది, మనం కలిసికట్టుగా నిర్మించనున్న భవిష్యత్తును కౌమార వయస్సులోని నా మనసు ఊహించి ఉండదు. భవిష్యత్తుపై కాకుండా మన ముందున్న ప్రతిబంధకాలపై దృష్టిని కేంద్రీకరించేందుకై స్వల్ప అపార అభిప్రాయ భేదాలను తొలగించుకునేందుకు ప్రాధాన్యమివ్వడం సహజమే. మనం స్వతస్సిద్ధంగా సమరీతిలో విశ్వసిస్తున్న విలువలు, పాటిస్తున్న సంప్రదాయాలు మన విభేదాల కంటే ముఖ్యమైనవి కనుక అమెరికా – భారత్‌ స్నేహ సంబంధాల భవిష్యత్తు విషయమై నాకు అపరిమితమైన ఆశాభావం ఉన్నది. మన ముందున్న సవాళ్లు– వాయు కాలుష్య నివారణ, మనలను ఏకం చేసేందుకు, రక్షించేందుకు నవీన సాంకేతికతలను ఉపయోగించుకోవడం, ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో పెచ్చరిల్లుతున్న యుద్ధ ప్రమాదాలు మొదలైన వాటిని ఎవరికి వారుగా కాకుండా సమైక్యంగా కృషి చేసినప్పుడు సులువుగా పరిష్కరించుకోగలుగుతాము. ‘మనం వర్తమానంలో చేసిన పనులపైనే మన భవిష్యత్తు ఆధారడి ఉంటుంది’ అని మహాత్మా గాంధీ అన్న మాటలను మనం సదా గుర్తుంచుకోవాలి. శాంతి, సంపద వృద్ధి, ప్రజల మధ్య మరింత సన్నిహిత సంబంధాలు అనే లక్ష్యాలతో కూడిన ఉమ్మడి దార్శనికత స్ఫూర్తితో మనం కలసికట్టుగా కృషి చేయాలి. ప్రియమైన భారతదేశమా, నీ ఆదర ఔదార్యాలకు, వివేకానికి, అచంచల స్నేహానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ అద్భుత దేశంలో అమెరికా రాయబారిగా ఉండడం నా జీవితానికి దక్కిన సమున్నత గౌరవంగా భావిస్తున్నాను. మన ఉభయ దేశాలు కలసికట్టుగా నిర్మించే అపరూప భవిష్యత్తును చూసేందుకు నేను వేచి ఉండను. భారత్‌, నా హృదయంలో భారత్‌ సదా ఉంటూనే ఉంటుంది నిరంతరం వెలుగులు విరజిమ్ముతూనే ఉంటుంది. అనంత ధన్యవాదాలు. కలసి స్థిరంగా ముందుకు సాగుదాం.

ఎరిక్‌ గార్సెట్టి

అమెరికా రాయబారి

Updated Date - Jan 16 , 2025 | 04:47 AM