Share News

‘‘ప్రతి ప్రొటాగనిస్ట్‌కీ నన్ను తల్లిలా ఊహించుకుంటాను’’

ABN , Publish Date - Jan 06 , 2025 | 12:23 AM

ఆఖరుగా చదివింది ఆంటన్‌ చెహోవ్‌ కథలు, పెద్ద కథలు, నవలికలు. వాటిల్లో ఎక్కువ ఇష్టపడింది చెహోవ్ నవలిక ‘మై లైఫ్‌’. చెహోవ్‌ రచనలు విడి విడి వ్యక్తుల స్వభావాల కంటే ‘మనిషి తత్వా’న్ని మాట్లా డుతాయి, మానవ మూల తత్త్వాన్ని...

‘‘ప్రతి ప్రొటాగనిస్ట్‌కీ నన్ను తల్లిలా ఊహించుకుంటాను’’

చదువు ముచ్చట

ఆఖరుగా ఏ పుస్తకాన్ని చదివి బాగా ఇష్ట పడ్డారు?

ఆఖరుగా చదివింది ఆంటన్‌ చెహోవ్‌ కథలు, పెద్ద కథలు, నవలికలు. వాటిల్లో ఎక్కువ ఇష్టపడింది చెహోవ్ నవలిక ‘మై లైఫ్‌’. చెహోవ్‌ రచనలు విడి విడి వ్యక్తుల స్వభావాల కంటే ‘మనిషి తత్వా’న్ని మాట్లా డుతాయి, మానవ మూల తత్త్వాన్ని. చెహోవ్‌ దృష్టిలో ఒక మనిషికి మరో మనిషి అర్థం చేసుకోలేని అగాథం. చెహోవ్‌కు మానవ దయనీయత అంటే అమితమైన జాలి, దాచుకోలేని చిరాకు, రెండూను. ఆయన సృష్టిలో మనిషి ఎవరికీ ఏమాత్రం పట్టనివాడు. Fate (God) is indifferent to man.

మొదటిసారి ఏ పుస్తకాన్ని ఇష్టంగా చదవటం గుర్తుంది?

ఎనిమిది తొమ్మిదేళ్ళప్పుడు మొట్టమొదట చదివింది ఆర్‌. కె. నారాయణ్‌ ‘స్వామి అండ్‌ ఫ్రెండ్స్‌’. తర్వాత ఆయనవే మరికొన్నిటితోపాటు, చార్లెస్‌ & మేరీ లాంబ్‌ పుస్తకం ‘టేల్స్‌ ఫ్రమ్‌ షేక్‌స్పియర్‌’. ఇంట్లో ఉండే భారతి పత్రికలు కూడా. అందులోంచి బాగా నవ్వొచ్చి గుర్తు న్నది తిలక్ కవితలో ఒక లైన్, ‘మిత్రమా రుబ్బుడు పొత్రమా!’ ఆయనదే ‘పోస్ట్‌మాన్’ కవిత కూడా. చిన్న ప్పుడు చదివినవాటిల్లో బాగా నచ్చినవి– చార్లెస్ డికెన్స్‌ ‘డేవిడ్‌ కాఫర్‌ ఫీల్డ్‌’, ఎమిలి బ్రాంటీ ‘వుదరింగ్‌ హైట్స్‌’.


ఒకప్పటికీ ఇప్పటికీ మీరు చదివే పద్ధతి ఎలా మారింది?

గత రెండేళ్లుగానే చదివే పద్ధతి మారింది. ఇప్పుడు ఒక రచయితను మొదలు పెడితే వాళ్ళ లభ్య రచనలన్నీ చదువుతున్నాను. అంతకు ముందు వరకూ కూడా ఏది కంట్లో పడితే అది ఒక క్రమ పద్ధతి లేకుండా చదివేదాన్ని. ఎక్కువ చదవటమూ జరగ లేదు. బోర్హెస్‌ కథలు, జేమ్స్‌ జాయ్స్‌ కథలు, తమిళ రచయిత్రి శివశంకరి కథల ఇంగ్లిష్ అనువాదం... ఇలా ఏది దొరికితే అది.


మిమ్మల్ని ఇరిటేట్‌ చేసిన పాత్రలు?

జేన్‌ ఆస్టిన్‌ ‘సెన్స్‌ అండ్‌ సెన్సిబిలిటీ’ నవలలో అన్నా వదినల పాత్రలు నచ్చలేదు. డబ్బు కోసం భార్య మాట విని చెల్లెళ్ళను నిరాధారంగా వదిలేసిన అన్నను, అతన్ని చాకచక్యంగా అందుకు ఒప్పించిన శకుని తెలివితేటల వదినను చూస్తే జుగుప్స కలి గింది. కాఫ్కా ‘మెటమార్ఫసిస్’ కథలో గ్రెగర్‌ చెల్లెలు గ్రెటె పాత్ర కూడా చాలా ఇరిటేట్ చేసింది. పొద్దున్న లేవగానే పురుగుగా మారిపోయిన అన్న దుస్థితి పట్ల మొదట్లో జాలి సానుభూతి కలదానిలా ఉండి, కాలం గడిచేకొద్దీ అతను తన భవిష్యత్తుకు అవరోధం అవుతాడనుకోవడం మటుకే కాదు నాకు ఆమె నచ్చకపోవడానికి కారణం; ఆమె అన్నకు సహాయం చేసే విధంలో తన తండ్రికి లేని దయ, తల్లికి లేని ధైర్యం తనకు మాత్రమే ఉన్నాయనీ, వాటి వల్ల అన్నకు తను మాత్రమే ఉపయోగపడగలుగుతున్నాను అనీ ఒక కనపడని సంతోషం ఆమెలో ఉన్నది. అది నాకు నచ్చలేదు. అన్న స్థితి పట్ల బాధకంటే ఇటువంటి పరిస్థితిని నిర్వహించగల నైపుణ్యం నాకు ఉన్నది అన్నట్టు ఆమె కనిపించడం నాకు నచ్చలేదు.


మీకు తరచుగా గుర్తొచ్చే కవితా పంక్తి?

చార్లెస్‌ బాదిలేర్‌ ‘ద స్వాన్‌’ కవితకు సూరపరాజు రాధాకృష్ణమూర్తి చేసిన తెలుగు అనువాదం లోని ఈ పంక్తులు:

‘‘ఒక నగరం, మనిషి మనసు కంటే

అయ్యో! త్వరగా వేషం మారుస్తుంది. ....

సర్వం నాకిపుడు రూపకాలు,

బండరాయి కన్నా బరువైన ఇష్ట స్మృతి చిహ్నాలు.’’

(పద్మజ సూరపరాజు అనువాదకురాలు, విమర్శకురాలు)

పద్మజ సూరపరాజు


5-Edit.jpg

ఏ గతకాలం రచయితనైనా కలిసి మాట్లాడగలిగితే ఎవరితో, ఏం మాట్లాడతారు?

దాస్తోయెవ్‌స్కీని ఒక ప్రశ్న అడుగుతాను:

నీ రచనల్లోని అంత విషాదం, దాన్ని మోస్తూ ఇంత అద్భుత విశద సృష్టి ఎలా చేశావు? లేక దాన్ని మోయలేక దింపుకుందామని రాసినవా నీ రచనలు?

Updated Date - Jan 06 , 2025 | 12:23 AM