Share News

కొన్ని ప్రశ్నలతో కొత్త ఏడాదిలోకి..!

ABN , Publish Date - Jan 01 , 2025 | 05:50 AM

‘ఈ దేశం ఎటు పోతుందో అని భయమేస్తోంది. ఎవర్నీ నమ్మడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరూ అవినీతికి పాల్పడుతున్నారు. మనుషులకు డబ్బే ప్రధానమైంది. ఎవరి గురించి ఏ ఆరోపణ వస్తుందో చెప్పలేకుండా ఉన్నాం. చాలా బాధ...

కొన్ని ప్రశ్నలతో కొత్త ఏడాదిలోకి..!

‘ఈ దేశం ఎటు పోతుందో అని భయమేస్తోంది. ఎవర్నీ నమ్మడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరూ అవినీతికి పాల్పడుతున్నారు. మనుషులకు డబ్బే ప్రధానమైంది. ఎవరి గురించి ఏ ఆరోపణ వస్తుందో చెప్పలేకుండా ఉన్నాం. చాలా బాధ కలుగుతోంది. ఈ దుస్థితి చూసి నాకు మనశ్శాంతి కరువైంది. మా పిల్లలైతే ఈ వయస్సులో విశ్రాంతి తీసుకొమ్మని కోరుతున్నారు’ అని 2013 మే 8న అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నిర్వేదం వ్యక్తపరిచారు. మాజీ ఎంపీ, అంతకు ముందు రాజ్యసభలో తనకు సహచరుడుగా ఉన్న యలమంచిలి శివాజీ తనను పార్లమెంట్‌లో కలుసుకున్నప్పుడు మన్మోహన్ తన ఆవేదన వెళ్లగక్కారు. బొగ్గు బ్లాకుల కేటాయింపులు, 2జీపై జేపీసీ ముసాయిదా నివేదిక, తెలంగాణ తదితర అంశాలపై పార్లమెంట్ అట్టుడికి పోతున్న రోజులవి. ‘మీరు విశ్రాంతి తీసుకుంటే మీకంటే నిజాయితీ గల నాయకుడు దేశానికి మరెవరు దొరుకుతారు?’ శివాజీ ఆయనతో అన్నారు. ‘మనం నిజాయితీగా ఉన్నామన్నా నమ్మేదెవరు?’ అని మన్మోహన్ వ్యాఖ్యానించారు. ‘కార్పొరేట్ సంస్థలే అన్నీ నిర్ణయిస్తున్నాయి’ అని ఆయన వాపోయారు. యూపీఏ ప్రభుత్వం పదవీకాలం మరో ఏడాది ఉందనగా మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలవి. దేశంలో ఏడాది తర్వాత జరిగే పరిణామాలను మన్మోహన్ అప్పటికే ఊహించారనడానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనం. మన్మోహన్‌తో మాట్లాడి వచ్చిన తర్వాత శివాజీ సెంట్రల్ హాలులో ఆంధ్రజ్యోతి ప్రతినిధికి ప్రధానితో తన సంభాషణను పంచుకున్నారు. మరునాడు ‘దేశం ఎటుపోతోంది?’ అన్న శీర్షికతో ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో వార్త వచ్చింది. ఇది సంచలనం సృష్టించడంతో ప్రధానమంత్రి కార్యాలయం ఆంధ్రజ్యోతి ప్రతులను తెప్పించుకున్నది. నిజానికి అప్పుడున్న పరిస్థితుల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించేవే. కాని మన్మోహన్ సింగ్ కానీ, ఆయన కార్యాలయం కానీ ఈ వార్తను ఖండించలేదు. మన్మోహన్ సింగ్ ప్రజాస్వామిక దృక్పథానికి, ఆయనలో కూడా పీవీ మాదిరి ‘లోపలి మనిషి’ ఉన్నాడని చెప్పేందుకు ఇది నిదర్శనం.


‘కాంగ్రెస్ పార్టీలో రెండు అధికార కేంద్రాలు ఉండడానికి వీలు లేదు. నేను ఒక ప్రభుత్వాధినేతగా పార్టీకి అనుగుణంగా నడుచుకోవాలి’ అని భావించిన మన్మోహన్ సింగ్ ప్రధానిగా తనకిష్టం లేని పనులు ఎన్ని జరిగినా పెదవి విప్పలేదు. పార్టీ విస్తృత ప్రయోజనాల కోసం ఆయన మౌనం పాటించేవారు. అయితే అదే సమయంలో తనను ఆర్థిక మంత్రిగా నియమించిన తన రాజకీయ గురువు పీవీ నరసింహారావును ఆయన తరుచూ కలుసుకునేవారు. పీవీ లేకపోతే తాను రాజకీయాల్లోకి వచ్చే వాడిని కానని ఆయన పలు సందర్భాల్లో అంగీకరించారు. పీవీ మరణానంతరం ఏపీ భవన్‌లో ప్రతి ఏడాది నిర్వహించే సంస్మరణ సభకు ఎవరు హాజరు కాకపోయినా ఆయన మాత్రం వచ్చి వెళ్లేవారు. తన హయాంలో కేంద్రమంత్రిగా ఉన్న జైపాల్ రెడ్డితో ఆయన సత్సంబంధాలు కొనసాగించేవారు. మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు 1993లో జరిగిన స్టాక్ మార్కెట్ కుంభకోణంపై నియమించిన జేపీసీలో తనపై వ్యాఖ్యలు చేసేందుకు జైపాల్ కారకుడని తెలిసినప్పటికీ ఆయన జైపాల్‌తో సన్నిహితంగా కొనసాగుతూ తన ఆలోచనలు పంచుకునేవారు. రాంనివాస్ మీర్ధా చైర్మన్‌గా ఉన్న ఈ జేపీసీ మన్మోహన్ సింగ్‌కు క్లీన్‌చిట్ ఇచ్చినప్పటికీ స్టాక్ మార్కెట్‌లో ఉత్థాన పతనాలను పట్టించుకోకుండా ఆర్థిక మంత్రి మొద్దు నిద్రలో ఉండడం సరైంది కాదనే వ్యాఖ్యను జైపాల్ చేర్చారు. జైపాల్ వాడిన ‘స్లంబర్’ (మొద్దు నిద్ర) అనే పదం మన్మోహన్ సింగ్‌కు బాధ కలిగించడంతో తన పదవికి రాజీనామా చేశారు. కాని పీవీ ఆయనకు నచ్చచెప్పి రాజీనామాను తిరస్కరించారు. అదే మన్మోహన్ సింగ్ కాంగ్రెస్‌పై కార్పొరేట్ సంస్థల ఒత్తిడి రీత్యా జైపాల్ రెడ్డిని పెట్రోలియం మంత్రిత్వ శాఖ నుంచి శాస్త్ర్ సాంకేతిక మంత్రిత్వ శాఖకు మార్చినప్పుడు స్వయంగా జైపాల్‌తో మాట్లాడి మనస్తాపం చెందవద్దని కోరారు. యూపీఏ ప్రభుత్వం గద్దె దిగిన తర్వాత జైపాల్ రచించిన ‘టెన్ ఐడియాలజీస్’ పుస్తకాన్ని మన్మోహన్ సింగ్ ఢిల్లీలో ఆవిష్కరించారు. సైద్ధాంతిక చర్చలు నిరంతరం జరుగుతున్నప్పుడే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని ఆయన చెప్పారు. ఈ పుస్తకం చదువుతుంటే తనకు కేంబ్రిడ్జిలో రోజులు గుర్తుకు వస్తున్నాయని, వృత్తిపరంగా రాజకీయ నాయకుడు అయినప్పటికీ ప్రస్తుత సంక్షోభాలకు కొత్త పరిష్కారాలను అన్వేషించిన మేధావిగా జైపాల్ గుర్తింపు పొందారని మన్మోహన్ సింగ్ అన్నారు.


పాత సంవత్సరం గడిచి కొత్త సంవత్సరం ప్రవేశిస్తున్న వేళ కొత్త ఏడాదిలో మన్మోహన్ సింగ్ లాంటి వ్యక్తులు లేరన్న విషయం గుర్తుకు వచ్చి ఎంతో బాధ కలుగుతుంది. ప్రతి ఏడాదీ వ్యక్తులనే కాదు, చరిత్రల్నీ, సంప్రదాయాల్నీ, విలువల్నీ కూడా తుడిచిపెడుతుంటుంది. మన్మోహన్ సింగ్ ఏనాడూ మీడియాతో మాట్లాడేందుకు వెనుకాడేవారు కాదు. ఆయనతో రెండు మూడు సార్లు విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు ఆయన ప్రత్యేక విమానంలో ప్రతి ఒక్కరినీ పేరుపేరునా పరిచయం చేసుకుని పలకరించడమే కాదు. అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇచ్చిన సందర్భాలు మరిచిపోలేనివి.

ఆధునిక భారతదేశ నిర్మాణంలో మన్మోహన్ సింగ్ పాత్ర విస్మరించలేనిది. కాంగ్రెస్‌లో తన కంటే సీనియర్ లైన పీవీ నరసింహారావు, ప్రణబ్ ముఖర్జీ, చిదంబరం, ఎకె ఆంటోనీ లాంటి మేధావులు ఎందరో ఉన్నప్పటికీ మన్మోహన్ సింగ్ ఆ పార్టీలో ప్రవేశించిన కొద్ది రోజులకే వారితో పాటు ఇమిడిపోయారు. జైపాల్ మాదిరే ఆయన కాంగ్రెస్ మేధావిగా గుర్తింపు పొందారు. మన్మోహన్ సింగ్ మరణించిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే కాదు, దేశంలోనే భావదారిద్ర్యం ఏర్పడిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. మేధావులను, ఆలోచనాపరులను ప్రోత్సహించి వారి ద్వారా ఎంతో కొంత ప్రయోజనం పొందే సంస్కృతిని పార్టీలు కోల్పోతున్నాయి. వారికి బదులు వేల కోట్ల డబ్బులు ఖర్చులు పెట్టి ఎమ్మెల్యేలను గెలిపించే నేతలు, వ్యూహకర్తలు ఉంటే సరిపోతుందన్న భావన ఇప్పుడు పెరిగిపోతోంది. రాజకీయ పార్టీలు ఇప్పుడు సిద్ధాంతాల ఆధారంగా ప్రజల ముందుకు వెళ్లనప్పుడు, కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు, ధనబలం ప్రధానమైనప్పుడు, పార్టీలకు మేధావులు, సిద్ధాంతకర్తల అవసరం ఏముంటుంది?


దేశ రాజకీయాలకు సంబంధించినంత వరకు 2024 ఒక చారిత్రక ఘట్టం. రాజకీయాలకు సంబంధించి మలుపుగా భావించవచ్చు. అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగి శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరగడంతో ప్రారంభమైన ఈ సంవత్సరం భారతీయ జనతా పార్టీకి సంబంధించి అత్యంత కీలకమైనది. రామమందిర నిర్మాణం జరిగిన వెంటనే మోదీ ఎన్నికలకు వెళ్లి ఉంటే ఏమి జరిగేదో కాని, ఆయన ఉన్నట్లుండి వ్యూహం మార్చి పూర్తిగా మోదీ పేరుతోనే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దేశమంతటా మోదీ అనే వ్యక్తి ఆధారంగానే బీజేపీ ఎన్నికల బరిలోకి దిగింది. తన పేరు చెబితే దేశం దేశం ఏకమై ఉవ్వెత్తున జనం ముందుకు వచ్చి ఓటు వేస్తారని ఊహించుకున్న మోదీ 400 సీట్లు సాధిస్తామని చెప్పుకున్నారు. కాని ఈ ప్రయోగం అంతగా సఫలీకృతం కాకపోవడంతో బీజేపీ కేవలం 240 సీట్లకే పరిమితమయింది. ఈ విఘాతాన్ని అధిగమించాలంటే హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం తప్పదని మోదీ గ్రహించారు. అందుకే అన్నిశక్తులూ ఒడ్డి, అన్ని రకాల వ్యూహాలు పన్ని ఈ రెండు రాష్టాల్లో బీజేపీ గెలుపొందేలా చేయడంతో దేశ రాజకీయ చిత్రపటంపై తనకు మించిన బలమైన నేత ఎవరూ లేరని నిరూపించుకున్నారు. ఈ క్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తెర వెనుక బలమైన శక్తిగా పనిచేసిందనడంలో సందేహం లేదు. తమకు ఆర్‌ఎస్ఎస్ అవసరం లేదని, బీజేపీ తన పార్టీ వ్యవహారాలు తానే నిర్ణయించుకోగలదని లోక్‌సభ ఎన్నికలకు ముందు పార్టీ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా చేసిన వ్యాఖ్యల పరిణామాలు ఎన్నికల ఫలితాలలో ప్రతిఫలించాయి. ఆ తర్వాత హరియాణా, మహారాష్ట్రలో గెలుపుకు సంఘ్‌పై బీజేపీ పూర్తిగా ఆధారపడవలిసి వచ్చింది. 2024లోనే వందో సంవత్సరంలో అడుగుపెట్టిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గత పదేళ్లలో అన్ని వ్యవస్థల్లోనూ చొచ్చుకుపోయింది. అనేక మంత్రిత్వశాఖల్లో, ప్రభుత్వ సంస్థల్లో సంఘ్ ప్రతినిధులు కీలక బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. ఒక దేవాలయం నిర్మించో, కొన్ని పదవులు కట్టబెట్టో సంఘ్‌ను సంతృప్తిపరిచి తమ పని తాము చేసుకోవచ్చనుకునే రోజులు పోయాయి.


ఎన్నికలు జరుగుతున్న తీరుపై, అబద్ధాలు ప్రచారం చేయడంపై, మణిపూర్‌లో జరుగుతున్న హింసాకాండపై ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భాగవత్ ప్రకటనలు చేసిన తర్వాత అంతా బీజేపీ ఇష్టారాజ్య ప్రకారం సాగదనే అభిప్రాయం క్రమంగా ఏర్పడుతోంది. ఈ క్రమంలో 2025 ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీకి సంబంధించి కీలక సంవత్సరం. రాజ్యాంగం, కులగణన, అదానీ కుంభకోణం వంటి అంశాలను లేవనెత్తుతున్న కాంగ్రెస్‌ను ఎదుర్కోవడం కూడా అంత సులభం కాదు. పార్లమెంట్ చర్చలకు వేదిక కాకుండా కుమ్ములాటలకు రంగస్థలం కావడంపై ప్రతిపక్షాల కంటే మోదీయే జవాబుదారీ కావల్సి ఉంటుంది.

2024లో దేశంలో దాదాపు పది సంవత్సరాల తర్వాత జాతీయ స్థాయిలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడడం, ఈ ప్రభుత్వంలో తెలుగుదేశం వంటి దక్షిణాది పార్టీ ప్రధాన భాగస్వామి కావడం, ప్రధాన రాజకీయ పార్టీలు రెండు ప్రధాన కూటములుగా ఏర్పడడం మరో ముఖ్యమైన పరిణామం అని చెప్పక తప్పదు. బీజేపీ, కాంగ్రెస్ కూటములకు చెందని ప్రాంతీయ పార్టీలు అస్తిత్వ పరీక్షను ఎదుర్కొంటున్నాయి. బీఆర్‌ఎస్, బీజేడి, వైసీపీ, ఆమ్ ఆద్మీ పార్టీ మనుగడకోసం కష్టిస్తున్నాయి. 2025 ఈ విషయంలో మరింత స్పష్టత నిస్తుందనడంలో సందేహం లేదు. 2025 కూడా ముగిసేలోపు కాలం మరెందరి అధ్యాయాలకు తెర వెస్తుందో చెప్పలేము.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - Jan 01 , 2025 | 05:50 AM