Share News

మేధో విరాణ్మూర్తి మన్మోహన్‌

ABN , Publish Date - Jan 10 , 2025 | 06:06 AM

మా సాహచర్యం విచిత్రమైనది, విశేషమైనది కూడా. ఇటీవల కీర్తిశేషుడు అయిన భారతదేశ ఆర్థిక సంస్కరణల పథనిర్దేశకుడు, ప్రధానమంత్రి డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ మార్కెట్‌ శక్తులకు ప్రాధాన్యమిచ్చే...

మేధో విరాణ్మూర్తి మన్మోహన్‌

మా సాహచర్యం విచిత్రమైనది, విశేషమైనది కూడా. ఇటీవల కీర్తిశేషుడు అయిన భారతదేశ ఆర్థిక సంస్కరణల పథనిర్దేశకుడు, ప్రధానమంత్రి డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ మార్కెట్‌ శక్తులకు ప్రాధాన్యమిచ్చే అర్థశాస్త్ర విద్వత్తుతో ప్రభవించిన నవపథగామి. నిరుపమాన పర్యావరణవాది అనీల్‌ అగర్వాల్‌. పర్యావరణ భద్రతే ఆయన తొలి, మలి, తుది, ఏకైక లక్ష్యం. 1991లో మన్మోహన్‌ సింగ్‌ సరళీకృత ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టి, భారత్‌ను స్వేచ్ఛా విపణిగా రూపొందించినప్పుడు నిస్సంకోచంగా హర్షించిన వారిలో అనీల్‌ గానీ, నేను గానీ లేనేలేము. కొత్త ఆర్థిక పథం పర్యావరణ భద్రతకు భరోసానివ్వగలదా? అన్నదే మా ప్రశ్న. జాతి ఆర్థిక కార్యకలాపాలను క్రమబద్ధీకరించే సంస్థలు ప్రభావశీలంగా లేనప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థలతో అనుసంధానం చేయడం మన పర్యావరణ వ్యవస్థలకు మేలు చేస్తుందా?


ఆర్థికమంత్రి మన్మోహన్‌ సింగ్‌కు ఇవి ఇబ్బందికరమైన ప్రశ్నలే. అయితే ఆయన మా ప్రశ్నలను కొట్టివేయలేదు. ఈ విశాల దృక్పథం, నిష్పాక్షిక వైఖరే ఆయన్ను మిగతా రాజకీయ నాయకుల నుంచి విభిన్నంగా, సమున్నతంగా నిలబెట్టింది. పర్యావరణ సంబంధిత అంశాలపై మాతో ఆయన సమాలోచనలు జరిపారు. అంతమాత్రాన మా అభిప్రాయాలు, సూచనలను ఆయన అంగీకరించారని నేను చెప్పబోవడం లేదు. ఆర్థికాభివృద్ధి వ్యవహారాలను పర్యావరణ దృక్కోణం నుంచి చూడవలసిన అవసరాన్ని ఆయన అర్థం చేసుకున్నారు. మరింత విపులంగా తెలుసుకోవడానికి ప్రయత్నించారు. పర్యావరణ వ్యవస్థలను పటిష్ఠపరిచి, వాటి సమతౌల్యతను నిలబెట్టేందుకు చేయవలసిందేమిటో ఆయన సమాలోచించారు.

2004లో మన్మోహన్‌ సింగ్‌ ప్రధానమంత్రి అయిన సందర్భంలో అనీల్‌ అగర్వాల్‌ ఒక రోడ్డు ప్రమాదంలో మరణించారు ‘సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌’ నిర్వహణ బాధ్యతలు నేను చేపట్టాను. అప్పటికి పర్యావరణ అధ్యయనాలు, పరిశోధనలలో నాకు పెద్దగా అనుభవం లేదు. అయితే నేను ఆ బాధ్యతల నిర్వహణకు సరిపోని వ్యక్తిననే భావాన్ని మన్మోహన్‌ సింగ్‌ ఎప్పుడూ నాకు కలిగించలేదు. ప్రధానమంత్రి కార్యాలయానికి వెళ్లి ఆయనతో మాట్లాడే అవకాశాన్ని నాకు కల్పించారు. జలవనరుల సంరక్షణ నుంచి వాతావరణ మార్పు దాకా వివిధ పర్యావరణ అంశాలపై నేను చెప్పే విషయాలను మన్మోహన్‌ సావధానంగా వినేవారు. వినడమేకాదు, వివిధ సమస్యలకు పరిష్కారాలను సూచించమని కూడా నన్ను ప్రోత్సహించేవారు. ‘ఏమి చేయాలి?’ అన్నదానిపైనే ఆయన దృష్టి సదా ఉండేది.


పులుల సంరక్షణ విషయమై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక కమిటీకి సారథ్యం వహించమని 2005లో మన్మోహన్‌ నన్ను కోరారు. అంగీకరించాను. ఆ కమిటీలోని ఇతర సభ్యులు వన్య ప్రాణుల, ముఖ్యంగా పులుల సంరక్షణ వ్యవహారాలలో బాగా పలుకుబడి ఉన్న అనుభవజ్ఞులు. ఆ కమిటీకి నేతృత్వం వహించడమనేది ఒక క్లిష్ట బాధ్యత. పైగా పలు విధాల అదొక కష్ట కాలం. సరిస్కా టైగర్‌ రిజర్వ్‌లోని పెద్దపులులు అంతరించిపోయాయి. పులుల సంరక్షణ ఎజెండాను ఎలా రూపొందించాలి? అదే సమయంలో అటవీ హక్కుల చట్టంపై పార్లమెంటు లోపలా బయటా పెద్ద చర్చ నడుస్తోంది. ఆదివాసీలకు చారిత్రకంగా జరిగిన, ఇంకా జరుగుతున్న అన్యాయాలను అరికట్టి అటవీ భూములపై వారికి హక్కులు కల్పించాలన్న డిమాండ్‌పై తీవ్ర తర్జనభర్జనలు సాగుతున్నాయి. ఆదివాసీలు నివశిస్తున్న అటవీ భూముల పరిధిలో జాతీయ ఉద్యానవనాలు, వన్య ప్రాణుల సంరక్షణ కేంద్రాలు సైతం ఉన్నాయి. పులులతో సహా వన్య ప్రాణుల సంరక్షణకు ప్రాధాన్యమివ్వాలా లేక ఆదివాసీల జీవన భద్రత, జీవనాధారాల పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాలా? ఇదొక సంఘర్షణాత్మక ఎజెండా. ఎందుకంటే రెండూ ముఖ్యమే. పులులు సంరక్షణకు ప్రాధాన్యమిస్తున్న వారితో పాటు ఆదివాసీలకు ప్రాధాన్యమివ్వాలనే వారి వాదానలనూ మన్మోహన్‌ శ్రద్ధగా వినేవారు. ఆ వాద ప్రతివాదాల మధ్య ఒక సమతౌల్యం సాధించేందుకు ఆయన ప్రయత్నించారు.


మా కమిటీ నివేదికలోని అంశాలపై మన్మోహన్‌తో నేను విపులంగా చర్చించాను. ముఖ్యంగా సమ్మిళిత సంరక్షణ నమూనాను అనుసరించాల్సిన ఆవశ్యకత గురించి ఆయనకు చెప్పాను. ఆ ఎజెండా అమలులో ఎదురయ్యే సమస్యల గురించి ఆయన ప్రశ్నించారు. వన్యప్రాణుల సంరక్షణ వ్యవహారాలతో సంబంధమున్న వారందరూ సహకరిస్తారా అని ఆయన అడిగారు. అది కష్టమేగానీ అసాధ్యం కాబోదని వివరించాను. మా నివేదిక ‘జాయినింగ్‌ ది డాట్స్‌’ ప్రజలకు నివేదించి పులుల సంరక్షణ ఆవశ్యకతపై వారికొక స్పష్టమైన అవగాహన కల్పించాల్సిన అవసరమున్నదని చెప్పాను. సంబంధిత విధానాలలో మార్పులకు ఇది దోహదం చేయగలదని స్పష్టం చేశాను. మా నివేదికకు, సాధారణంగా ప్రభుత్వ కమిటీల నివేదికలకు పట్టే గతే పడుతుందని భయపడ్డాను. నా భయం నిరాధారమైనదని నాకు త్వరలోనే తెలిసివచ్చింది. మా కమిటీ సిఫారసులను మన్మోహన్ ఆమోదించారు. వాటి అమలుకై సత్వర చర్యలకు ఆదేశించారు. దేశంలో పులుల సంఖ్య పెరిగింది. ముఖ్యంగా పులుల జనాభా గణన పద్ధతులు బాగా మెరుగుపడ్డాయి. ఇప్పుడు చాలవరకు కాలి జాడల ఆధారంగా కాకుండా, ప్రత్యక్ష పరిశీలన ద్వారా పులుల సంఖ్యను లెక్కిస్తున్నారు.


డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ విలక్షణమైన వ్యక్తి, విభిన్నమైన రాజకీయవేత్త. విశిష్ట ప్రజాస్వామికవాది. వర్తమాన ప్రపంచంలో అటువంటి విశాల దృక్పథమున్న వ్యక్తులు, నాయకులు అరుదు. తాను ఏకీభవించని వారిని సైతం ప్రోత్సహించే ఉదారుడు మన్మోహన్‌. విద్వజ్ఞుడు అయిన మన్మోహన్‌కు వివిధ అంశాలపై పాఠ్యగ్రంథాలు, స్వీయ అనుభవాల ప్రాతిపదికన ఏర్పరచుకున్న భావాలు, అభిప్రాయాలు ఉండేవి. అయితే ఆయనలో మేధో నిజాయితీ ఉండేది. కొత్త భావాలను ఆహ్వానించేవారు. వాటి వెలుగులో తన భావాలు పరిశీలించుకుని అవసరమైతే మార్చుకునేవారు. ఇతరులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు సమంజసమైనవి అయితే వాటిని అంగీకరించేందుకు సంకోచించేవారు కాదు. ఆయన మృదు స్వభావి. మూర్తీభవించిన మేధో నిజాయితీ. తన అధికారాలను పూర్తిగా ప్రజల శ్రేయస్సుకే వినియోగించిన మంచి మనిషి మన్మోహన్‌ సింగ్‌.

సునీతా నారాయణ్

(‘సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌’ డైరెక్టర్‌ జనరల్‌,

‘డౌన్‌ టు ఎర్త్‌’ సంపాదకురాలు)

Updated Date - Jan 10 , 2025 | 06:06 AM