Share News

సమగ్ర సర్వే పేరుకే సమగ్రమా?

ABN , Publish Date - Jan 09 , 2025 | 02:28 AM

బీసీలకు 42శాతం రిజర్వేషన్‌ అన్న కామారెడ్డి డిక్లరేషన్‌ను ఎన్నికలు ముగియగానే ఆరునెలల్లో అమలు చేస్తామని కాంగ్రెస్‌ వాగ్దానం చేసింది. ఆరునెలల కాలయాపన తర్వాత బీసీ వర్గాల డిమాండ్‌తో...

సమగ్ర సర్వే పేరుకే సమగ్రమా?

బీసీలకు 42శాతం రిజర్వేషన్‌ అన్న కామారెడ్డి డిక్లరేషన్‌ను ఎన్నికలు ముగియగానే ఆరునెలల్లో అమలు చేస్తామని కాంగ్రెస్‌ వాగ్దానం చేసింది. ఆరునెలల కాలయాపన తర్వాత బీసీ వర్గాల డిమాండ్‌తో డెడికేటెడ్‌ బీసీ కమీషన్‌ను నియమించింది. డిసెంబర్ మాసానికే సర్వే పూర్తి చేస్తామని ప్రకటించింది. రూ.150కోట్ల కేటాయింపు జరిగినా, 94 వేల మంది ఎన్యుమరేటర్లు, 9000 మంది సూపర్‌వైజర్లు పని చేస్తున్నా, వంద రోజులు కావొస్తున్నా ఇంకా సర్వే పూర్తి కాలేదు. గ్రామీణ ప్రాంతాల్లో 90 శాతానికి పైగా పూర్తయ్యిందనీ, హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో సగానికి పైగా సర్వే పూర్తి కాలేదనీ అంటున్నారు.


బీసీలు సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో ఏ దశలో ఉన్నారు, ఏయే కులాలు ఎంతగా వెనుకబడి ఉన్నాయి, అలాగే ప్రధానంగా ఎంబీసీలు, సంచార, అర్ధసంచార, విముక్త జాతుల వారి దీనస్థితీ.. ఈ సర్వే ద్వారా వెల్లడవుతాయని బడుగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. సమగ్ర కుటుంబ సర్వే తూతూ మంత్రంగా చేస్తే అది బీసీ సామాజిక వర్గాలకు తీవ్ర నష్టంగా భావించాల్సి వస్తుంది.

అన్ని జిల్లాల్లో ఈ సర్వే పూర్తయ్యిందని డెడికేటెడ్ కమీషన్ ఇంతకు ముందే తెలియజేసింది. హైదరాబాద్ నగరమంటే 1/3 తెలంగాణ. సుమారు కోటి మందికి పైగా హైదరాబాద్ నగరంలో నివసిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో సమగ్ర సర్వే అంటే కొంచెం కష్టంతో కూడుకున్న పనే. రాష్ట్ర ప్రణాళికా శాఖకు కూడా అదొక సవాలు. మా ఇళ్ళకు సర్వేకు ఎవరూ రాలేదని చెబుతున్న వాళ్ళ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ అంశంలో రాష్ట్ర ప్రణాళికా శాఖ చేస్తున్న కృషి కూడా అంతగా కనిపించడం లేదు. మా ఇంటికి రాలేదని చెబుతున్న వారు ఈ విషయంపై ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదంటున్నారు. ఇలా పట్టణాల్లో అసమగ్రంగా సర్వే పూర్తి చేసి ఉంటే అది బీసీలకు తీరని నష్టమే. రాష్ట్ర ప్రణాళికా శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని జీహెచ్‌ఎంసీ పరిధిలో క్షేత్రస్థాయికి వెళ్ళాలి.


చాలామంది బీసీలలో తమ కుటుంబ వివరాలను పూర్తిగా చెప్పేస్తే తమకు ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు, పింఛన్లు, రేషను కార్డులు పోతాయన్న భయం ఉంది. కుటుంబానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సర్వే బృందానికి వెల్లడించటం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు ఏమీ రద్దు కావని ప్రజలకు భరోసా ఇవ్వాలి. ఇందుకు సంబంధించిన విస్తృతమైన అవగాహన కల్పించాలి. కానీ ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా ఉన్నది. మరో పదిరోజుల్లో డెడికేటెడ్ కమిషన్ తన సర్వే నివేదిక ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. సమగ్ర సర్వే అసమగ్రంగా జరిపితే బీసీ జనాభాను తక్కువగా చూపించే ప్రమాదం ఉంది. దీని వల్ల బీసీలకు తీరని నష్టం జరుగుతుంది. బీసీ కుటుంబాల సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు లోతుల్లోకి వెళ్ళి చూస్తామని చెప్పి లెక్కలు చూడకుండా వదిలేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మేము సమాచారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేవారి దగ్గరకు సర్వే బృందం పోలేకపోతున్నదన్న విమర్శలను కూడా జయించాలి.


సర్వేను సమగ్రంగా చేయడానికి గడువును పొడిగించాలి. లేకపోతే ఈ సర్వే తూతూ మంత్రంగానే చేస్తున్నట్లు బీసీలు అనుమానించాల్సి వస్తుంది. గత 77 ఏళ్ళలో బీసీల కోసం నియమించిన అనంతరామన్ కమిషన్ (1970), మురళీధరరావు కమిషన్ (1982), పుట్టస్వామి కమిషన్ (1994–2002), దాళ్వ సుబ్రహ్మణ్యం కమిషన్లు (2004–-2011) బీసీల విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ల వరకు మాత్రమే పరిమితమైన సిఫారసులు చేశాయి. ఇప్పుడు నియమించిన డెడికేటెడ్ కమిషన్ మాత్రమే స్థానిక సంస్థల్లో పొలిటికల్ రిజర్వేషన్లపై నియమించిన తొలి కమిషన్. ఈ సమగ్ర సర్వేకు సంబంధించి కర్ణాటక ప్రభుత్వం తీవ్రంగా కృషి చేసి నివేదికను ఇచ్చింది. ఒక్క బెంగుళూరు మహానగరం పైనే ప్రత్యేక శ్రద్ధతో ఎక్కువ రోజులు విస్తృతంగా తిరిగి నివేదిక తయారు చేశారు. మన ప్రణాళికా శాఖ కూడా ఏ గడప వదలకుండా సమగ్ర సర్వే చేసేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే బీసీలకు తీవ్ర నష్టం జరుగుతుంది.

జూలూరు గౌరీశంకర్

తెలంగాణ రాష్ట్ర తొలి బీసీ కమిషన్ సభ్యులు

Updated Date - Jan 09 , 2025 | 02:28 AM