చట్టబద్ధ మద్దతు ధర ఎండమావేనా?
ABN , Publish Date - Jan 10 , 2025 | 06:09 AM
వ్యవసాయ ఉత్పత్తులకు చట్టబద్ధమైన కనీస మద్దతు ధర అన్న భావనను అమలుపరచాల్సిన సమయమాసన్నమవలేదా? చట్టబద్ధ ఎమ్‌ఎస్‌పీకై పంజాబ్ రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ దల్లేవాల్ గత...
వ్యవసాయ ఉత్పత్తులకు చట్టబద్ధమైన కనీస మద్దతు ధర అన్న భావనను అమలుపరచాల్సిన సమయమాసన్నమవలేదా? చట్టబద్ధ ఎమ్‌ఎస్‌పీకై పంజాబ్ రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ దల్లేవాల్ గత నవంబర్ 26 నుంచి చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష ఇంకా కొనసాగుతూనే ఉన్నది. రైతుల ఉద్యమం మళ్లీ ప్రారంభమైన తరువాత వ్యవసాయం, ఆహార ప్రాసెసింగ్, పశు పోషణపై పార్లమెంటరీ స్థాయీ సంఘం ఒకటి ‘చట్టబద్ధంగా కట్టుబడి ఉండే’ కనీస మద్దతు ధరను రైతులకు సమకూర్చాలని సిఫారసు చేసింది. కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధమైన మద్దతు ధరకు హామీ ఇవ్వాలనే డిమాండ్‌ను పరిశీలించేందుకు సైతం నిర్ద్వంద్వంగా నిరాకరిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదే పదే ‘ఎమ్‌ఎస్‌పి హై ఔర్ రహేగా’ అంటున్నప్పటికీ ఆందోళన చేస్తున్న రైతులతో చర్చలు ప్రారంభించేందుకు ఏ మాత్రం శ్రద్ధ చూపడం లేదు. రైతులకు కొత్త సంవత్సర కానుకగా పంటల బీమా కొనసాగింపు, ఎరువులపై రాయితీని ప్రధానమంత్రి ప్రకటించారు. కనీస మద్దతు ధరను పూర్తిగా ఉపేక్షించారు.
ఎమ్‌ఎస్‌పి డిమాండ్‌పై నెలకొన్న ప్రతిష్టంభన కొనసాగుతుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రాజస్థాన్‌లో పెసర ఒక ప్రధాన ఖరీఫ్ పంట. దానికి అధికారికంగా ప్రకటించిన ఎమ్‌ఎస్‌పి క్వింటాల్‌కు రూ.8,682. అయితే ఆ రాష్ట్రంలోని ప్రధాన వ్యవసాయ మార్కెట్ అయిన మెర్టాలో గత డిసెంబర్‌లో దానికి లభించిన ధర రూ.6,467 మాత్రమే. రైతు తాము పండించిన పెసలను క్వింటాల్‌కు రూ.2,215 నష్టానికి విక్రయించుకోవల్సి వచ్చింది. తత్ఫలితంగా ఆ ఒక్క మార్కెట్‌లో ఒక్క నెలలో ఒక్క పంట విషయంలో రైతులు కోల్పోయిన మొత్తం ఆదాయం రూ.10 కోట్లకు పైగా ఉంటుంది. మహారాష్ట్రలోని జాల్నా మార్కెట్‌లో గత డిసెంబర్‌లో క్వింటాల్ జొన్నలకు లభించిన సగటు ధర రూ.2,456. అయితే ఆ పంట అధికారిక ఎమ్‌ఎస్‌పి రూ.3,371. అంటే రైతులు క్వింటాల్‌కు రూ.915 చొప్పున నష్టపోయారు. మొక్కజొన్నకు అధికారిక ఎమ్‌ఎస్‌పి రూ.2,225 కాగా మధ్యప్రదేశ్ మార్కెట్లలో ఆ పంటకు లభించిన ధర కేవలం రూ.1980 మాత్రమే. సోయాబీన్‌కు ప్రకటించిన ఎమ్‌ఎస్‌పి రూ.4,892 కాగా అక్టోబర్, డిసెంబర్‌ల మధ్య మహారాష్ట్రలో ఆ పంటకు లభించిన మార్కెట్ ధర రూ.4,076 కాగా మధ్యప్రదేశ్‌లో రూ.4,892 మాత్రమే.
కేంద్ర ప్రభుత్వం ఏటా 23 పంటలకు చాలా ఆర్భాటంగా కనీస మద్దతు ధర ప్రకటిస్తుంది. రైతులకు ప్రభుత్వం చాలా మేలు చేస్తుందని ప్రజలు విశ్వసించేలా పాలకులు వ్యవహరిస్తారు. అయితే వాస్తవంగా రైతులకు ఆ కనీస మద్దతు ధర సమకూరేందుకు ప్రభుత్వం కనీస మాత్రంగానైనా చేస్తుంది ఏమీ లేదు! సంబంధిత పంటలకు మార్కెట్‌లో లభిస్తున్న ధర ప్రకటిత ఎమ్‌ఎస్‌పి కంటే తక్కువగా ఉన్నప్పుడు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదు. మార్కెట్ ధరలు కనీస మద్దతు ధర కంటే తక్కువగా ఉంటే ‘కనీస’, ‘మద్దతు’ అనే మాటలు అర్థరహితమైనవే. కచ్చితంగా లభిస్తుందనే హామీ లేని ఎమ్‌ఎస్‌పి అసలు ఎమ్‌ఎస్‌పినే కాదు. ప్రభుత్వం తన వాగ్దానాన్ని నెరవేర్చుకోవాలని రైతులు గట్టిగా కోరుతున్నారు. కనీస మద్దతు ధర విషయమై రైతుల డిమాండ్ చర్చకు వచ్చినప్పుడల్లా ప్రధాన స్రవంతి మీడియాలో ఆ విషయమై తీవ్ర వాదోపవాదాలు జరగడం పరిపాటి అయింది. ఎమ్‌ఎస్‌పి అనేది ఒక హేతు విరుద్ధ డిమాండ్ అనీ, అది ఆచరణ సాధ్యం కానిదని, ద్రవ్య సంక్షోభానికి అది దారితీస్తుందని ఎమ్‌ఎస్‌పి వ్యతిరేకులు గట్టిగా వాదిస్తున్నారు. వాస్తవమేమిటి? చట్టబద్ధంగా కట్టుబడి ఉండే కనీస మద్దతు ధర తార్కికంగా సుసంగతమైనది, ఆచరణ సాధ్యమైనది. అదెలా సాధ్యమో విపులంగా చూద్దాం.
ఇంతకూ చట్టబద్ధంగా కట్టుబడి ఉండే కనీస మద్దతు ధర అంటే ఏమిటి? ప్రభుత్వం అన్ని పంటల సమస్త దిగుబడులను విధిగా కొనుగోలు చేసి తీరాలని, లేదూ, అధికారిక ఎమ్‌ఎస్‌పి కంటే తక్కువ ధరకు విక్రయమవుతున్న పంటల దిగుబడులను కొనుగోలు చేసి తీరాలన్న నిబంధనగా అర్థం చేసుకోకూడదు. అలా కొనుగోలు చేయడం సాధ్యమూ కాదు, అదసలు తప్పనిసరి కూడా కాదు. చట్టబద్ధంగా కట్టుబడిన ఎమ్‌ఎస్‌పి మౌలిక సూత్రం చాలా సరళమైనది. కనీస మద్దతు ధర అనేది రైతుల హక్కు.. అది రైతులకు లభించేలా చూడడమనేది ప్రభుత్వ శాసన విహిత బాధ్యత.
ఈ మౌలిక సూత్రంలోని ప్రధాన విషయమేమిటంటే రైతులు తమ దిగుబడులకు చట్ట బద్ధమైన ధర పొందేలా ప్రభత్వం పూచీ వహించడం. రైతుల ఉత్పత్తులను తప్పనిసరిగా కొనుగోలు చేయడం కాదు. అదేవిధంగా పంట దిగుబడులను ఎవరు కొనుగోలు చేస్తున్నారనే దానితో నిమిత్తం లేకుండా చట్టబద్ధమైన కనీస మద్దతు ధరను రైతులు పొందాలి, పొంది తీరాలి.
ఈ మౌలిక సూత్రాన్ని మూడు పద్ధతుల ద్వారా అమలుపరచవచ్చు: విస్తృత సేకరణ, ప్రభావశీల మార్కెట్ జోక్యం, లోటు చెల్లింపులకు హామీ. ప్రస్తుత ధాన్య సేకరణ పద్ధతులను విస్తరింప పరచాలి. వాటిలోని లోటుపాట్లను సరిదిద్దాలి. చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనె గింజలను భారీ స్థాయిలో సేకరించాలి. ఆహార భద్రతా పథకాలలో వాటిని భాగం చేయాలి. దీనివల్ల ధాన్య సేకరణలో ప్రస్తుత అసమతౌల్యతను తొలగించేందుకు తోడ్పడుతుంది. రెండో పద్ధతి మార్కెట్ జోక్యాలు. ఇవి వివిధ రూపాలలో ఉండవచ్చు. ధరలు ఎమ్‌ఎస్‌పి కంటే తక్కువకు పడిపోతున్నప్పుడు పరిమిత స్థాయిలో కొనుగోలు చేయడం, మార్కెటింగ్ కేంద్రాలలో ఎమ్‌ఎస్‌పికి నిర్వహించే వేలం పాటల్లో కనిష్ఠ ధర నిర్ణయించడం, అంతర్జాతీయ వాణిజ్య విధానంలో మార్పులు చేర్పులు చేయడం గోదాంలను మెరుగుపరచడం, సన్నకారు చిన్నకారు రైతులు తమ దిగుబడులకు మంచి ధర లభించేంతవరకు వాటిని నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకునేందుకుగాను రైతుల ఉత్పత్తిదారు సంఘాలను పటిష్ఠపరచడం మొదలైన చర్యలు అవశ్యం చేపట్టాలి. ఈ పద్దతులేవీ మార్కెట్ ధరను కనీస మద్దతు ధరకు సమానస్థాయిలోను లేదా అంతకంటే హెచ్చు స్థాయిలోను ఉంచడంలో విఫలమయిన పక్షంలో ప్రభుత్వం ఎమ్‌ఎస్‌పికి, సగటు మార్కెట్ ధరకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని విధిగా చెల్లించి తీరాలి. ఈ ‘లోటు ధర చెల్లింపు’ అనేది రైతుల ఎమ్‌ఎస్‌పి హక్కును చట్టబద్ధమైన హక్కుగా చేస్తుంది.
చట్టబద్ధమైన కనీస మద్దతు ధరను అమలుపరిచేందుకు అవసరమైన ఆర్థిక వనరులు ప్రభుత్వానికి ఉన్నాయా? రైతులకు శాసన విహితంగా మద్దతు ధరను సమకూర్చేందుకు రూ.14 లక్షల కోట్లు అవసరమవుతాయని ఎమ్‌ఎస్‌పిని వ్యతిరేకిస్తున్న వాణిజ్య వర్గాలు లెక్కలు కడుతున్నాయి. ఇంత ఆర్థిక భారం దృష్ట్యా చట్టబద్ధ ఎమ్‌ఎస్‌పి ఒక హాస్యాస్పద, అసాధ్య డిమాండ్ అని ఆ వర్గాలు ఘోషిస్తున్నాయి. ఇది ప్రజలను ఉద్దేశప్వూకంగా తప్పుదోవపట్టించే ప్రయత్నమే, సందేహం లేదు. ఎమ్‌ఎస్‌పి వర్తించే ప్రతి పంట దిగుబడుల్లో ప్రతి క్వింటాల్‌ను ప్రభుత్వం కొనుగోలు చేయవలసిన అవసరముందని భావించి వేసిన అంచనాలవి. మనం ముందే చూసినట్టు ప్రతి పంట దిగుబడిని ఎటువంటి మినహాయింపు లేకుండా కొనుగోలు చేసి తీరాలన్నది రైతుల డిమాండ్‌లో భాగం కానేకాదు. అంతేకాక మరో వాస్తవాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి: ప్రభుత్వం పంట దిగుబడులను కొనుగోలుకు ఇచ్చిన నిర్దిష్ట ధర, కొన్న పంటను విక్రయించిన ధరకు మధ్య ఉన్న వ్యత్యాసం ఎంత ఉన్నదనేదే ఎమ్‌ఎస్‌పిని అమలు పరిచేందుకు ప్రభుత్వానికి వాస్తవంగా అయ్యే వ్యయంగా పరిగణించాలి. అన్ని వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో సహాయక జోక్యం అవసరం ఉండదు; మార్కెట్ ధర ఎమ్‌ఎస్‌పి కంటే తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే రైతుకు న్యాయం చేసేందుకు ప్రభుత్వ జోక్యం అవసరమవుతుంది. నిజానికి అది తప్పనిసరి కూడా.
15 ప్రధాన పంటలకు (ఎమ్‌ఎస్‌పిని ప్రకటించిన పంటల మొత్తం విలువలో వీటి వాటా 95 శాతానికి పైగా ఉంటుంది) 2022–23 మార్కెటింగ్ సంవత్సరంలో చట్టబద్ధమైన కనీస మద్దతు ధరను సమకూర్చేందుకు అయ్యే వ్యయాన్ని మేము లెక్కకట్టాము: ప్రకటిత ఎమ్‌ఎస్‌పి కంటే తక్కువ ధరకు విక్రయమైన అన్ని పంటలకు సంబంధించిన మొత్తం లోటు రూ. 26,469 కోట్లు. ఇది, పాక్షిక వ్యయం భావన ప్రాతిపదికన ప్రభుత్వం ప్రకటించిన ఎమ్‌ఎస్‌పి రేట్ల ప్రకారం నిర్ధారిత మైన లోటు. రైతులు డిమాండ్ చేస్తున్న ఎమ్‌ఎస్‌పి (లేదా స్వామినాథన్ సిఫారసు చేసిన ఎమ్‌ఎస్‌పి)ని కూడా పరిగణనలోకి తీసుకుని కూడా లెక్కలు కట్టాం. సమగ్ర వ్యయం ప్రాతిపదికన కట్టిన లెక్కల ప్రకారం ఈ లోటు రూ. 2,00,710 కోట్లుగా ఉన్నది. సకాలంలో మార్కెట్ జోక్యంతో పాటు పైన ప్రస్తావిత ఇతర చర్యలు అన్నీ తీసుకున్న పక్షంలో మార్కెట్ ధరలు వాటికవే కనీస మద్దతు ధరకు దగ్గరగా ఉంటాయి. తద్వారా ప్రస్తావిత లోట్లు గణనీయంగా తక్కువ స్థాయిలో ఉండేందుకు అవకాశమున్నది.
ప్రస్తుత ధరల ప్రకారం చట్టబద్ధంగా వాగ్దానం చేసిన కనీస మద్దతు ధరను సమకూర్చేందుకు అయ్యే వ్యయం కేంద్ర బడ్జెట్‌లో 0.5 శాతంగా ఉంటుంది. రైతులు డిమాండ్ చేసే అధిక ధరలు పరిగణనలోకి తీసుకున్నా సంబంధిత మొత్తం వ్యయం కేంద్ర బడ్జెట్‌లో 4.2 శాతంగా, స్థూల దేశియోత్పత్తిలో 0.6 శాతంగా ఉండగలదు. దేశ వ్యాప్తంగా వ్యవసాయ కుటుంబాలకు ఈ ఆర్థిక సహాయాన్ని అందించినప్పుడు వారి కొనుగోలు సామర్థ్యం మరింతగా పెరుగుతుంది. ఈ అదనపు కొనుగోలు సామర్థ్యం ఆర్థిక వ్యవస్థ పెరుగుదలకు విశేషంగా దోహదం చేస్తుంది. ఈ దృష్ట్యా చట్టబద్ధ కనీస మద్దతు ధర సమకూర్చేందుకు అయ్యే వ్యయం పూర్తిగా సమర్థనీయమైనది. పైగా న్యాయసమ్మతమైనది. మరి రైతులోకానికి అటువంటి ఆర్థిక చేయూత నివ్వాలి. ఇందుకు రాజకీయ సంకల్పం అవసరం. మన దేశ పాలకులలో అది కొరవడిందని మరి చెప్పనవసరం లేదు.
యోగేంద్ర యాదవ్
(వ్యాసకర్త ‘స్వరాజ్ ఇండియా’ అధ్యక్షుడు)
(కవితా కురుగంటి,
విస్సా కిరణ్‌కుమార్ సహకారంతో)