ఇది బీసీ నామ సంవత్సరం!
ABN , Publish Date - Jan 02 , 2025 | 05:24 AM
రాష్ట్ర నూతన ప్రధాన కార్యదర్శిగా విజయానంద్‌ను ప్రభుత్వం నియమించడం హర్షణీయం. రాష్ట్ర పాలనా యంత్రాంగంలో అత్యంత కీలక స్థానంలో బీసీ వ్యక్తిని నియమించి బీసీల పట్ల నిబద్ధతను చాటుకున్నారు...
రాష్ట్ర నూతన ప్రధాన కార్యదర్శిగా విజయానంద్‌ను ప్రభుత్వం నియమించడం హర్షణీయం. రాష్ట్ర పాలనా యంత్రాంగంలో అత్యంత కీలక స్థానంలో బీసీ వ్యక్తిని నియమించి బీసీల పట్ల నిబద్ధతను చాటుకున్నారు ముఖ్యమంత్రి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గానీ, నవ్యాంధ్రలో గానీ ఇప్పటి వరకు బీసీలకు సీఎస్ పోస్టు దక్కలేదు. చంద్రబాబు తొలిసారి బీసీ అధికారికి ఈ అగ్ర పదవిని కల్పించి చరిత్ర సృష్టించారు. ఎంతో కీలకమైన టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన పల్లా శ్రీనివాసరావు యాదవ్‌కు అప్పగించారు. బీసీ నేతగా టీడీపీ సీనియర్ నాయకుడిగా పార్టీకి, ప్రజలకు ఎంతో సేవ చేసిన చింతకాయల అయ్యన్న పాత్రుడికి శాసనసభ స్పీకర్ పదవి ఇచ్చి గౌరవించారు. బీసీలకు పదవులు ఇవ్వాలన్నా, బీసీలకు పెద్దపీట వేసి వెన్నుదన్నుగా నిలవాలన్నా అది టీడీపీతోనే సాధ్యమని దీనితో తేటతెల్లమైంది. కూటమి ప్రభుత్వం బీసీలకు ఇస్తున్న ప్రాధాన్యతను బట్టి 2025ను బీసీ నామ సంవత్సరంగా పిలుచుకోవచ్చునేమో!
జగన్‌రెడ్డి ఏనాడు బీసీలను గౌరవించిన దాఖలాలు లేవు. బీసీ నేతలను తన ముందు చేతులు కట్టుకుని నిలబెట్టిన చరిత్ర జగన్ రెడ్డిదని ఆ పార్టీలో ఉన్న బీసీ నేతలే అంటున్నారు. గత పాలనలో బీసీలు, పేదలపై జరిగిన అరాచకాలు, అకృత్యాలు అన్నీ ఇన్నీ కావు. ప్రతి పదవిలో తన సామాజిక వర్గానికి చెందిన అధికారులను నియమించుకొని ఆడిందే ఆట పాడిందే పాటగా జగన్ పరిపాలించాడు. రాష్ట్రంలో రాక్షస మూక పేదలు, బీసీల రాక్తాన్ని తాగుతున్నా ఉన్నత పదవిలో ఉన్న పోలీసు అధికారులు కిక్కుమనలేదు. ఆ పాపపు ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించిన పేదలు, బీసీలకు న్యాయం చేయడానికి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీసీలు, అణగారిన వర్గాలపై దాడులను అరికట్టడానికి కీలకమైన డీజీపీ పదవిని బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ద్వారకా తిరుమలరావుకు అప్పగించారు.
టీడీపీ పార్టీ బీసీల పార్టీ. బీసీలకు ఉన్న అపారమైన ప్రేమకు నిదర్శనంగా వారికి నామినేటెడ్ పదవుల్లో అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చి గౌరవించారు చంద్రబాబు. సామాజిక న్యాయం అంటే ఏంటో పదవులు ఇచ్చి చూపించారు. కూటమి ప్రభుత్వం రాగానే బీసీ రక్షణ చట్టానికి రూపకల్పన చేసి, బీసీ సంక్షేమానికి రూ.39,007 కోట్లను బడ్జెట్‌లో కేటాయించింది. 26 జిల్లాల్లో బీసీ భవనాలు, 68 కాపు భవనాల నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారు. తొలి నామినేటెడ్ పదవి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ బీసీ ఉన్నతాధికారి పి. కృష్ణయ్యకు ఇచ్చారు.
గత ప్రభుత్వంలో అన్ని కీలక నామినేటెడ్ పదవుల్లో తన సామాజిక వర్గానికి జగన్‌రెడ్డి ప్రాధాన్యత ఇచ్చి బీసీ, పేద వర్గాలను వంచించారు. ఆ వర్గాల ఉన్నతిని ఉక్కు పాదంతో తొక్కిపెట్టారు. పదవులు ఇవ్వకుండా, ప్రభుత్వం నుండి ఫలాలు అందకుండా చేసి వారి సంక్షేమాన్ని సర్వనాశనం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు దశాబ్దాలుగా అనుభవిస్తున్న 34 శాతం రిజర్వేషన్లలో కోత కోసి 16,800 మందికి రాజ్యాంగబద్ధ పదవులను దూరం చేశారు. బీసీల అభ్యున్నతి కోసం ఖర్చు చేయాల్సిన రూ.75,760 కోట్ల సబ్‌ప్లాన్ నిధులను దారి మళ్లించారు. ఎనిమిది వేల ఎకరాల బీసీ అసైన్డ్ భూముల్ని బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు. ఆదరణ పథకాన్ని రద్దు చేసి వృత్తి పనులు చేసుకునేవారి పొట్టకొట్టారు. బీసీ భవనాలను రద్దు చేశారు. విదేశీ విద్య, స్కిల్ డెవలప్మెంట్, స్టడీ సర్కిల్స్ వంటి విద్యా పథకాలు దూరం చేశారు. పారిశ్రామిక రాయితీలను కుదించి ఉపాధి అవకాశాలు దూరం చేశారు. కార్పొరేషన్లను ఉత్సవ విగ్రహాలుగా మార్చి స్వయం ఉపాధిని ప్రశ్నార్థకం చేశారు. 26 మంది బీసీ నేతల్ని అత్యంత కిరాతకంగా హత్య చేశారు. 2540 మందిపై దాడులకు పాల్పడ్డారు. 650 మంది బీసీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి వేధించారు. బీసీ సామాజిక వర్గాన్నంతా అణచివేసి, నలుగురికి పదవులిచ్చి బీసీలందరినీ ఉద్ధరించామని గొప్పలు చెప్పుకున్నారు. అప్పటి బీసీ మంత్రి వేణుగోపాలకృష్ణ నేలపై మోకాళ్లపై కూర్చుని కుర్చీలో కూర్చున్న వై.వి. సుబ్బారెడ్డికి దండం పెట్టే పరిస్థితి కల్పించారు. బీసీ మంత్రి జోగి రమేష్ నా జేబులో ఉన్నారని కొడాలి నాని ప్రకటించారు. ఇదీ నాటి వైసీపీలోని బీసీ మంత్రుల దీనస్థితి. కొద్ది మందికి పదవులు, రాజ్యసభ సీట్లు ఇచ్చి వారి నోరు మూయించి వారి సామాజికవర్గం మొత్తాన్ని జగన్‌రెడ్డి ముఠా నిలువు దోపిడీ చేసింది. జగన్ రెడ్డి చేసిన నిర్వాకాలు ఒక్కొక్కటి బయటకు వస్తుంటే జనం తమకు జరిగిన అన్యాయంపై అవాక్కవుతున్నారు. మరోసారి ఇలాంటి నేతలు అధికారం అంటూ వస్తే ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు.
అనగాని సత్యప్రసాద్
రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ మంత్రి