Share News

రేవంత్‌ ఒంటరి పోరు!

ABN , Publish Date - Mar 02 , 2025 | 02:03 AM

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మంచి రోజులు వస్తున్నట్టున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా మీనాక్షి నటరాజన్‌ను పార్టీ అధిష్ఠానం...

రేవంత్‌ ఒంటరి పోరు!

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మంచి రోజులు వస్తున్నట్టున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా మీనాక్షి నటరాజన్‌ను పార్టీ అధిష్ఠానం నియమించడమే ఇందుకు నిదర్శనం. గతంలో కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి ఎలా వ్యవహరించారో చూశాం. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇన్‌చార్జిలుగా వ్యవహరించినవారు పార్టీ శ్రేయస్సును పట్టించుకోకుండా స్వప్రయోజనాలనే చూసుకున్నారు. నిన్నటి వరకు ఇన్‌చార్జిగా ఉన్న దీపాదాస్‌ మున్షీ కూడా ఇందుకు భిన్నం కాదు. తమను సంతృప్తిపరచిన వారికి అనుకూలంగా అధిష్ఠానానికి నివేదికలు పంపేవారు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇన్‌చార్జిగా ఉండిన గులాంనబీ అజాద్‌కు భారీగా ముడుపులు అందేవన్నది బహిరంగ రహస్యం. ఇలాంటి వారివల్ల బలమైన నాయకులు తెరమరుగయ్యారు. అంతిమంగా అనేక రాష్ర్టాలలో కాంగ్రెస్‌ పార్టీ బలహీనపడింది. ఇంతకాలానికి కాంగ్రెస్‌ అధిష్ఠానం అసలు సిసలైన గాంధేయవాదాన్ని నమ్ముకొని ఆచరిస్తున్న మీనాక్షి నటరాజన్‌ను తెలంగాణ ఇన్‌చార్జిగా నియమించింది. కాంగ్రెస్‌ పార్టీలో ఇప్పటికి కూడా మీనాక్షి వంటి వారు ఉన్నారని నిన్నటి వరకు మనకు తెలియదు. ఆమె గురించి మీడియాలో వచ్చిన కథనాలు ఆశ్చర్యం కలిగించాయి. చోటా మోటా నాయకులు కూడా రైలు ప్రయాణాలను మరచిపోయిన ఈ రోజుల్లో రాష్ట్ర ఇన్‌చార్జిగా నియమితురాలైన తర్వాత తొలిసారిగా ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ రైలులో ప్రయాణించిన మీనాక్షి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఫైవ్‌ స్టార్‌ హోటళ్లలో మాత్రమే బస చేయడం తెలిసిన గత ఇన్‌చార్జిలకు భిన్నంగా ఆమె ప్రభుత్వ అతిథి గృహంలో రోజుకు 50 రూపాయలు చెల్లించి బసచేస్తున్నారు. సన్మానాలు, బొకేలు, ఫ్లెక్సీల సంస్కృతి కూడా తన ఒంటికి పడదని ఆమె రాష్ట్ర నాయకుల ముఖం మీదే చెప్పారు. దీంతో శుక్రవారం నాడు గాంధీభవన్‌లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగినా హడావిడి, ఆర్భాటం కనిపించలేదు. ఈ నేపథ్యంలో గాడి తప్పుతున్న కాంగ్రెస్‌ పార్టీని మీనాక్షి గాడిలో పెట్టగలరన్న నమ్మకం కలుగుతోంది. పార్టీకి ఉపయోగపడేవారు ఎవరు? పార్టీని ఉపయోగించుకొనేవారు ఎవరు? అన్నది అనతి కాలంలోనే ఆమె గుర్తించగలరని ఆశించవచ్చు. నిరాడంబరంగా ఉండటమే కాకుండా పార్టీ శ్రేయస్సు మాత్రమే మీనాక్షికి ముఖ్యమని స్పష్టమవుతున్నందున క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులను ప్రతిబింబిస్తూ ఆమె అధిష్ఠానానికి నివేదికలు పంపుతారని నమ్మవచ్చు. ప్రస్తుతానికి కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒంటరి పోరు చేస్తున్నారు. పార్టీ నాయకులు తనకు అండగా నిలవడం లేదని రేవంత్‌రెడ్డి తన మనసులోని ఆవేదనను పరోక్షంగా బయటపెట్టారు. మంచి మాటను మైక్‌లో చెప్పాలి, చెడును చెవిలో చెప్పాలి అని గుర్తు చేయడం ద్వారా రాష్ట్ర కాంగ్రెస్‌లో ఏం జరుగుతోందో చెప్పకనే చెప్పారు. ముఖ్యమంత్రిగా తాను అనుకున్నట్టుగా పని చేయలేకపోతున్నానన్న అసంతృప్తి తనకు ఉందని కూడా ఆయన తెలిపారు.

గత పదిహేను మాసాలలో ప్రభుత్వం ఎన్నో చేసినా... వాటి గురించి మాట్లాడకుండా లోపాలను ఎత్తిచూపుతున్నారని కూడా రేవంత్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీలోనే ఈ లోపం ఉంది. అధికారంలో ఉన్నప్పుడు చేసిన వాటి గురించి పార్టీ నాయకులు పెద్దగా ప్రచారం చేసుకోరు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రం ఇందుకు విరుద్ధంగా పార్టీ నాయకులు అందరూ ఆయనను మోశారు. ఫలితంగానే ఆయన రెండో పర్యాయం ముఖ్యమంత్రి అయ్యారు. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్‌ పార్టీ ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకుంది. చట్టాలు చేసింది. ఉపాధి హామీ పథకం, భూ సేకరణ చట్టం, విద్యా హక్కు చట్టాలు యూపీఏ ప్రభుత్వం హయాంలో వచ్చినవే. ఉపాధి హామీ పథకం వల్ల దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రయోజనం పొందుతున్నారు. కానీ, కాంగ్రెస్‌ నాయకులు ఆ పథకం తాము తెచ్చిందే అని ప్రచారం చేసుకోరు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం నాడు గాంధీభవన్‌లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో తన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఏకరువు పెట్టారు. అవన్నీ వింటున్నప్పుడు నిజంగా ఇన్ని నిర్ణయాలు తీసుకున్నారా అని ఆశ్చర్యం వేసింది. అయినా, అనుభవం లేనందున ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి విఫలమవుతున్నారన్న ప్రచారమే పెరిగింది. ఈ ప్రచారమే అంతిమంగా కాంగ్రెస్‌ పార్టీకి కీడు చేస్తుంది. ఇప్పుడు ప్రలోభాలకు లొంగని మీనాక్షి నటరాజన్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా వచ్చినందున పరిస్థితిలో మార్పు రావచ్చు.


మీనాక్షి కర్తవ్యం...

తెలంగాణలో మంత్రుల నుంచి కింది స్థాయి కార్యకర్తల వరకు ఎవరు ఏమిటి? ప్రజల్లో ఎవరికి బలముంది? పార్టీకి ఉపయోగపడేది ఎవరు? పార్టీకి గుదిబండలుగా మారుతున్నది ఎవరు? ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డికి స్వేచ్ఛను ఇవ్వడం అవసరమా? లేదా? వంటి విషయాలను మీనాక్షి ముందుగా అధ్యయనం చేయాలి. రాహుల్‌గాంధీకి ఆమె నమ్మకమైన వ్యక్తి కనుక మీనాక్షి ఇచ్చే నివేదికలకు విలువ ఉండవచ్చు. పనిలో పనిగా ప్రభుత్వంపై ప్రజాభిప్రాయం తెలుసుకోవడానికి నూతన ఇన్‌చార్జి ప్రయత్నించాలి. నిష్పాక్షికంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మార్గదర్శనం చేస్తే పార్టీ పరిస్థితి మెరుగుపడవచ్చు. మంత్రులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పట్టులేదన్న అభిప్రాయం విస్తృతంగా ఉంది. ఈ అభిప్రాయాన్ని పోగొట్టేందుకు ఆమె కృషి చేయాలి. ముఖ్యమంత్రికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినప్పుడే వారు సమర్థులో కాదో స్పష్టమవుతుంది. కొన్ని మంత్రిత్వ శాఖల్లో జోక్యం చేసుకోకూడదని ముఖ్యమంత్రిపై ఆంక్షలు పెట్టడం ఏమిటి? కాంగ్రెస్‌ అధిష్ఠానం చేసిన అతి పెద్ద తప్పు ఇది. ప్రజల్లో, పార్టీ శాసనసభ్యుల్లో ఎవరికి పరపతి ఉంది? ఎవరిని ఎంత వరకు ప్రోత్సహించాలి? అనే విషయమై మీనాక్షి నటరాజన్‌ అవగాహన ఏర్పరుచుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం నాడు తన మనసులోని ఆవేదనను బయటపెట్టుకున్నారు. నిజానికి గత కొంత కాలంగా రేవంత్‌రెడ్డి సంతోషంగా లేరు. కాళ్లూ చేతులూ కట్టేసి ఈదమన్నట్టుగా తన పరిస్థితి ఉందని ఆయన కొంత మంది వద్ద ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని నడపడమే కాదు– ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి పైన ఉంటుంది. ఇందుకోసం ఆయనకు తగినంత స్వేచ్ఛ ఇచ్చి చూడాలి. మీనాక్షి నటరాజన్‌ కార్యకర్త స్థాయి నుంచి వచ్చినందున క్షేత్ర స్థాయి పర్యటనలు జరిపి ప్రజాభిప్రాయంతోపాటు కార్యకర్తల అభిప్రాయాలూ తెలుసుకునే కార్యక్రమానికి వెంటనే శ్రీకారం చుట్టాలి. మీనాక్షి మార్గదర్శకంలో రాష్ట్ర కాంగ్రెస్‌కు కాయకల్ప చికిత్స వెంటనే ప్రారంభమవ్వాలి. ఈ ఏడాది చివరి నాటికి ప్రభుత్వ ప్రతిష్ఠను ఇనుమడింపజేయడానికి కృషి జరగని పక్షంలో ప్రతిపక్షాలు బలపడతాయి. రేవంత్‌రెడ్డి అరమరికలు లేకుండా మీనాక్షి నటరాజన్‌తో చర్చలు జరపాలి. ప్రభుత్వాన్ని మరింత సమర్థంగా నడుపుతూ ప్రజల మన్ననలు చూరగొనడానికి తన వద్ద ఉన్న ప్రణాళికలను ఆమెకు వివరించి, ఆ క్రమంలో తనకు ఏ మేరకు స్వేచ్ఛ అవసరమో చెప్పుకోవాలి. కాంగ్రెస్‌ అధిష్ఠానం వద్ద ఆమెకు పరపతి, విశ్వసనీయత ఉన్నందున ముఖ్యమంత్రికి ఆమె అండగా నిలబడవచ్చు. అదే జరిగితే ఇటు రేవంత్‌రెడ్డికి, అటు కాంగ్రెస్‌ పార్టీకి మంచి రోజులు వస్తాయి. ఏది ఏమైనా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఒక నాయకురాలి గురించి నాలుగు మంచి మాటలు చెప్పుకొనే అవకాశం ఇంత కాలానికి లభించింది. ఇందుకు పార్టీ అధిష్ఠానాన్ని అభినందించాల్సిందే!


‘తమ్ముళ్లూ’... తొందరొద్దు!

ఇప్పుడు ఆంధ్ర రాజకీయాలకు వద్దాం! రాష్ట్ర శ్రేయస్సు, ప్రజాహితాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్డీయే కూటమి ఐక్యంగానే ఉంటుందని, రాష్ర్టాన్ని అభివృద్ధి చేయడానికి కనీసం మరో పదిహేనేళ్లు అధికారంలో కొనసాగుతామని ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ శాసనసభ సాక్షిగా ప్రకటించారు. దగాపడ్డ ప్రజలకోసం తాము కూటమిగా ఏర్పడ్డామని ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా చెప్పారు. రాష్ట్రం హితవు కోరేవారు ఈ ఇరువురి ప్రకటనలను కచ్చితంగా స్వాగతిస్తారు. అయితే, పవన్‌ కల్యాణ్‌ చెబుతున్నట్టుగా పదిహేనేళ్లపాటు ఎన్డీయే కూటమి అధికారంలో కొనసాగాలంటే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేయాలి. 2019లో 151 సీట్ల భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్‌రెడ్డి కూడా తాను 30 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగుతానని ప్రకటించారు. అయితే, ఆ తర్వాత ఆయన పాలన ఎలా సాగిందో చూశాం. 2024 ఎన్నికల్లో ఆయనను 11 సీట్లకు మాత్రమే పరిమితం చేస్తూ 164 సీట్ల అతి భారీ మెజారిటీతో చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి ప్రజలు అధికారం కట్టబెట్టారు. తాము సుదీర్ఘకాలం అధికారంలో కొనసాగాలని నాయకులు సహజంగానే కోరుకుంటారు. అయితే ఎవరిని ఎంతకాలం అధికారంలో కూర్చోబెట్టాలో నిర్ణయించేది మాత్రం ప్రజలే. ఈ వాస్తవాన్ని కూటమి నాయకులు కూడా గుర్తించాలి. 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్‌రెడ్డి ఐదేళ్లు తిరిగేసరికి 11 సీట్లకే ఎందుకు పరిమితం కావలసివచ్చిందో గుర్తించి, అవే తప్పులు చేయకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తే కూటమి ప్రభుత్వం పదిహేనేళ్ల పాటు అధికారంలో కొనసాగవచ్చు కూడా! అలా కాకుండా జగన్‌రెడ్డి పాలన తరహాలోనే కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు వ్యవహరిస్తే ఐదేళ్లు గడిచేసరికి మూటా ముల్లె సర్దుకోవలసి రావచ్చు కూడా! అదే జరిగితే చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. తాము పద్ధతిగా ఉండటమే కాకుండా తమ పార్టీల ఎమ్మెల్యేలు కూడా పద్ధతిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఈ ఇరువురు నాయకులపై ఉంది. జగన్‌రెడ్డి పుణ్యమా అని రాష్ట్రంలో పాలెగాళ్ల సంస్కృతి ప్రవేశించింది. అధికార దుర్వినియోగం, కక్ష సాధింపులు పాలకుల దినచర్యలుగా మారిపోయాయి. ఈ అవలక్షణాల వల్ల రాజకీయ నాయకులే కాదు– వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు కూడా ఇబ్బందుల పాలయ్యారు. ఈ కారణంగానే 60 శాతం ప్రజలు సంఘటితమై కూటమికి బ్రహ్మరథం పట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు దాటింది. ఈ ఎనిమిది నెలలలో ప్రభుత్వం పనితీరును ప్రజలు గమనిస్తున్నారు.


‘సోషల్‌’ రచ్చ...

అధికారం వచ్చిందంటే ప్రజలకు మేలు చేయడానికి కాదు, పగలూ ప్రతీకారాలు తీర్చుకోవడానికి అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు కలుషితమయ్యాయి. అధికార కూటమి ఎమ్మెల్యేలు కొందరు గత ప్రభుత్వ దురాగతాలను ఆదర్శంగా తీసుకోగా, కార్యకర్తలు సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు చేస్తూ ప్రభుత్వం స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోలేని విధంగా ఒత్తిడి తెస్తున్నారు. ముఖ్యమంత్రి ఏం చేయాలో, ఎలా ఉండాలో సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించడమే కాకుండా ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. జగన్‌రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈ పరిస్థితి లేదు. ప్రభుత్వం అరాచకంగా వ్యవహరించినా సోషల్‌ మీడియాలో వైసీపీ అభిమానులు నోరు విప్పేవారు కారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపకపోవడం కూడా తప్పిదమే! అయితే ప్రభుత్వంలో జరుగుతున్న వాటికి సంబంధించి లోతుగా అధ్యయనం చేయకుండానే విమర్శలు చేయడం సరైనది కాదు. జగన్‌రెడ్డితో పాటు అధికారంతో విర్రవీగిన వారందరినీ వెంటనే జైల్లో పెట్టాలని తెలుగు తమ్ముళ్లు కోరుకుంటున్నారు. ప్రభుత్వం అంటే రూల్‌ ఆఫ్‌ లా పాటించాలన్న ప్రాథమిక సూత్రాన్ని విస్మరిస్తున్నారు. జగన్‌ పాలనలో రూల్‌ ఆఫ్‌ లా పాటించడం లేదని, ముందుగా అరెస్టులు చేసి ఆ తర్వాత కేసులు కట్టేవారని గగ్గోలు పెట్టిన వాళ్లు, అప్పుడు బాధితులైన వాళ్లు... ఇప్పుడు జగన్‌ హయాంలో జరిగిన విధంగా కేసులు పెట్టకుండానే జైళ్లలో పెట్టాలని కోరడం ఏమిటి? జగన్‌ ఎందుకు ఓడిపోయారో తెలుసుకోకపోతే ఎలా? పోలీసుల ద్వారా అరెస్టు చేయించడం చిటికెలో పనే కావచ్చు. అయితే ఆ తర్వాత సదరు కేసులు న్యాయ సమీక్షలో నిలబడాలి కదా? ఈ కారణంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు సమయం, సందర్భం కోసం ఎదురుచూస్తున్నారు. ఏకంగా తన సతీమణి భువనేశ్వరినే దారుణంగా అవమానించిన వల్లభనేని వంశీ వంటి వారిపై చర్యలు తీసుకోవడానికి కూడా సందర్భం కోసం వేచిచూశారు. ‘అప్పుడు నా భార్యను అవమానించాడు కాబట్టి ఇప్పుడు జైల్లో పెట్టండి’ అంటే కుదరదు కదా? అందుకే కొంచెం ఆలస్యమైనా వల్లభనేని వంశీ ప్రస్తుతం జైలుకే పరిమితం అయ్యారు. పోసాని కృష్ణ మురళి విషయంలో కూడా ఇదే జరిగింది. ప్రభుత్వం అన్నాక అనేక సాదకబాధకాలు ఉంటాయి. వాటి గురించి తెలుసుకోకుండా విమర్శలు చేయడం సబబు కాదు. ఏ విషయంలోనైనా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆచితూచి నిర్ణయం తీసుకుంటారు. లేడికి లేచిందే పరుగు అన్నట్టుగా... అధికారంలో ఉన్నప్పుడు అరాచకాలు చేశారనుకున్న వారందరినీ కనీస ఆధారాలు సేకరించకుండా జైల్లో పెట్టడం కుదరదు. ఏపీ ఫైబర్‌ నెట్‌ సంస్థ చైర్మన్‌ జీవీ రెడ్డికి, ఆ సంస్థ ఎండీ దినేశ్‌కీ ఏర్పడిన వివాదంపైన కూడా సోషల్‌ మీడియా వేదికగా తెలుగు తమ్ముళ్లు ముఖ్యమంత్రిపై దుమ్మెత్తి పోశారు. జీవీ రెడ్డి విద్యావంతుడు–మంచివాడే! కానీ కించిత్‌ ఆవేశపరుడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నా చెల్లుబాటవుతుంది. అధికారంలోకి వచ్చాకే అందరినీ కలుపుకొనివెళ్లాలి. ఫైబర్‌ నెట్‌ ఎండీ దినేశ్‌ వైశ్య సామాజికవర్గానికి చెందినవారు. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలో కులాలకు ఎంత ప్రాధాన్యం ఉందో అందరికీ తెలిసిందే. ఈ కారణంగానే జీవీ రెడ్డికి ఆవేశపడకుండా సర్దుకుపోవలసిందిగా పార్టీ నాయకత్వం సూచించింది. అయితే ముక్కుసూటిగా వ్యవహరించే జీవీ రెడ్డికి ఇది రుచించినట్టు లేదు. దీంతో ఆయన చైర్మన్‌ పదవికి రాజీనామా చేయడంతో పాటు తెలుగుదేశం పార్టీకి కూడా రాజీనామా చేశారు. ఈ పరిణామంపై సోషల్‌ మీడియాలో రచ్చ జరిగింది. జీవీ రెడ్డి వంటి వారిని వదులుకోకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబుపై తెలుగు తమ్ముళ్లు ఒత్తిడి తెచ్చారు. అంతటితో ఆగకుండా రెండు రోజుల క్రితం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పాలని పోస్టులు పెట్టారు. మొదటికే మోసం వచ్చేలా తెలుగు తమ్ముళ్లు వ్యవహరించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. జగన్‌రెడ్డి పాలనలో ఎదురైన చేదు అనుభవాలను ఇంత త్వరగా ఎలా మరచిపోయారా అని మరింత ఆశ్చర్యం వేస్తోంది. జగన్‌రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తే పరిణామాలు ఎలా ఉంటాయో తెలియదా? తెలుగు తమ్ముళ్ల ఆవేశం చల్లారక ముందే, చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌ను జీవీ రెడ్డి ప్రశంసించడంతో పాటు రాష్ట్రం కోసం 2029లో కూడా చంద్రబాబే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నానని ఎక్స్‌ వేదికగా ప్రకటించారు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ చెబుతున్నట్టుగా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటం రాష్ర్టానికి, ప్రజలకు అవసరం! తెలుగు తమ్ముళ్లు ఈ వాస్తవాన్ని గుర్తించకుండా అతిగా స్పందిస్తూ అలజడి సృష్టిస్తున్నారు. ప్రభుత్వ పరంగా జరుగుతున్న లోపాలతో మంత్రి లోకేశ్‌కు నేరుగా సంబంధం లేకపోయినా ఆయనను కూడా విమర్శిస్తున్నారు.


సొంత శ్రేణులే సమస్యగా మారితే...

వైసీపీ, జనసేన పార్టీలకు కూడా సోషల్‌ మీడియా బలంగా ఉంది. అయితే ఆ పార్టీల మద్దతుదారులు తమ నాయకులపై ఈగ వాలనివ్వరు. తెలుగుదేశం పార్టీలో మాత్రం ఇందుకు భిన్నమైన ధోరణి కనిపిస్తున్నది. ప్రభుత్వం తప్పు చేస్తే జగన్‌ మళ్లీ అధికారంలోకి వస్తారేమోనన్న భయంతో తెలుగు తమ్ముళ్లు అతిగా స్పందిస్తున్నారన్న భావన కూడా ఉంది. కారణం ఏమైనప్పటికీ తెలుగు తమ్ముళ్ల అతి స్పందన ముఖ్యమంత్రి చంద్రబాబుకు తలపోటుగా మారింది. ఒకవైపు ప్రతిపక్షమైన వైసీపీ దుష్ప్రచారాన్ని ఎదుర్కొంటూ, మరో వైపు సొంత పార్టీ కార్యకర్తల నుంచి కూడా విమర్శలు ఎదుర్కోవలసి రావడం చంద్రబాబుకు ఇబ్బందిగా మారిందని చెబుతున్నారు. దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి. వాటన్నింటికీ కూడా సోషల్‌ మీడియా వేదికలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ విషయంలోనే ఇలా ఎందుకు జరుగుతోంది? మిగతా పార్టీల కోసం పని చేస్తున్న సోషల్‌ మీడియా వర్కర్లు తమ పార్టీలపై ఈగను కూడా వాలనివ్వకుండా ఎందుకు కాపాడుకుంటున్నారు? పొరపాట్లను ఎత్తిచూపడం వేరు, ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టడం వేరు. వల్లభనేని వంశీ, పోసాని కృష్ణ మురళి వంటి వారిపై చర్యలు తీసుకోవడంతో జగన్‌ అండ్‌ కో చేస్తున్న దుష్ప్రచారం, పోకడలను గమనిస్తూ కూడా పార్టీకి అండగా నిలబడకుండా గుదిబండగా మారడమేమిటి? ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్న వారంతా నిజంగా తెలుగు తమ్ముళ్లేనా? లేక వారి ముసుగులో వైసీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారా? అన్న సందేహం కూడా కలుగుతోంది. స్వల్ప విషయాలకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అతిగా స్పందిస్తారన్న అపవాదు ఉంది. ఈ నేపథ్యంలో తెలుగు తమ్ముళ్లు సోషల్‌ మీడియా వేదికగా అతిగా స్పందిస్తే దాని ప్రభావం ప్రభుత్వ నిర్ణయాలపై పడే ప్రమాదం లేకపోలేదు. అదే జరిగితే తెలుగుదేశం పార్టీకే కాదు– రాష్ర్టానికి కూడా కీడు చేసిన వాళ్లవుతారు. రాష్ట్ర హితం కోసం పదిహేనేళ్లపాటు అధికారంలో ఉంటామని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ చెబుతున్న మాటలకు విలువ లేదా? జగన్‌రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తే... అని ఇప్పటికీ అనేక మంది భయపడుతున్నారు. ఇలా భయపడుతున్న వారిలో అధికారులు కూడా ఉన్నారు. అందుకే వారు తమ జాగ్రత్తలు తాము తీసుకుంటున్నారు. జగన్‌రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ అధికారంలోకి రారన్న నమ్మకాన్ని ప్రజాబాహుళ్యానికి కల్పించాల్సిన బాధ్యత చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ మీదనే కాదు– తెలుగు తమ్ముళ్ల మీద కూడా ఉంది. చంద్రబాబు వైఖరి వల్ల జగన్‌రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తారన్న భయంతో ఆయనకు పావులుగా ఉపయోగపడుతున్న వాస్తవాన్ని తెలుగు తమ్ముళ్లు మరచిపోతున్నారు.


ఇలా చేయండి...

జగన్‌రెడ్డి తన ఒంటికి సరిపడని అనేక సూక్తులను, నీతి వాక్యాలను ఇప్పుడు అలవోకగా వల్లెవేస్తున్నారు. రెడ్‌ బుక్‌ రాజ్యాంగం, పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలు, రూల్‌ ఆఫ్‌ లా వంటి పదాలు జగన్‌రెడ్డి ఒంటికి సరిపడవు. తాను అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌తో పాటు మరికొన్ని మీడియా సంస్థలను అసెంబ్లీ సమావేశాలు కవర్‌ చేయకుండా ఐదేళ్ల పాటు నిషేధించిన జగన్‌రెడ్డి, ఆ సంస్థల ప్రతినిధులను ముఖ్యమంత్రి నివాసం దరిదాపులకు కూడా రానివ్వలేదు. ఇప్పటికీ తమ పార్టీ ఏర్పాటు చేసే విలేకరుల సమావేశాలకు రానివ్వడం లేదు. అలాంటి జగన్‌ ఇప్పుడు పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగిందని విమర్శించడం విడ్డూరంగా ఉంది. రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలు, రూల్‌ ఆఫ్‌ లా వంటి పదాలకు తన పాలనలో తావుండదని రుజువు చేసిన మనిషి ఇప్పుడు అవే సూక్తులు చెబుతున్నారు. ప్రజల జ్ఞాపకశక్తి తక్కువని అంటారు. వచ్చే ఎన్నికల నాటికి ఐదేళ్ల క్రితం ఏం జరిగిందో ప్రజలు మరచిపోయే ప్రమాదం ఉంది. ఈ కారణంగా తెలుగు తమ్ముళ్లు తమ శక్తియుక్తులను గత దురాగతాలను ప్రజలకు పదేపదే గుర్తు చేయడానికి వినియోగిస్తే మంచిది. రాష్ట్రం మేలు కోసం తాము ఐక్యంగానే ఉంటామని చెబుతున్న పవన్‌ కల్యాణ్‌ క్షేత్ర స్థాయిలో కార్యకర్తల మధ్య కూడా సఖ్యత ఏర్పడేలా చర్యలు తీసుకుంటే మంచిది. అదే సమయంలో కూటమి భాగస్వామ్య పక్షాలు తమ పార్టీ శాసనసభ్యులు కట్టు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ దిశగా కృషి చేస్తే జగన్‌రెడ్డి అనే రాజకీయ భూతాన్ని ప్రజలే అధికారానికి దూరంగా కూర్చోబెడతారు.

ఆర్కే


2-Untitled-1.jpg

యూట్యూబ్‌లో

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి


ఈ వార్తలు కూడా చదవండి...

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 02 , 2025 | 02:03 AM