Share News

రైతాంగానికి భూభారతి భరోసా

ABN , Publish Date - Jan 02 , 2025 | 05:20 AM

2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రైతన్న సమస్యలను అర్థం చేసుకొని, తప్పల తడకగా ఉన్న ధరణిని రద్దు చేస్తామని ప్రకటించింది. తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా...

రైతాంగానికి భూభారతి భరోసా

2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రైతన్న సమస్యలను అర్థం చేసుకొని, తప్పల తడకగా ఉన్న ధరణిని రద్దు చేస్తామని ప్రకటించింది. తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా దాన్ని పొందుపరిచి ప్రజల సమక్షంలో ధరణిని బంగాళాఖాతంలో పడేస్తామని కాంగ్రెస్‌ పెద్దలు మాట్లాడినప్పుడు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. ఫలితంగా ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం కొలువుదీరింది. ప్రజలకు ఇచ్చిన ఒక్కొక్క వాగ్దానం నెరవేర్చే క్రమంలో భాగంగా డిసెంబర్‌ 18న అసెంబ్లీలో ధరణిని రద్దుచేస్తూ, దాని స్థానంలో నూతన ఆర్‌ఓఆర్‌–2024 భూమాత బిల్లును తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రవేశపెట్టారు. అసెంబ్లీలో దీని విధి విధానాలపై చర్చ జరిగింది. ధరణి కన్నా భూమాత మరింత మెరుగైనదని వివరించిన తర్వాత ఈ బిల్లు ఆమోదం పొందింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ మొత్తానికి భూసర్వే చేయించాలనే అంశం చాలా ఆలోచింపజేసింది.


తెలంగాణ విస్తీర్ణం 1,12,000 చదరపు కిలోమీటర్లు... అంటే దాదాపు 2 కోట్ల 75 లక్షల ఎకరాల భూమి. దీనిలో కోటీ 60 లక్షల ఎకరాలు వ్యవసాయ భూమి, 66 లక్షల ఎకరాలు అటవీ భూమి, మిగిలినవి గ్రామకంఠాలు, పట్టణాలు, దేవాలయ మాన్యాలు, వక్ఫ్‌, ఇనాం, శిఖం కింద ఉన్నాయి. ఈ లెక్కలన్నీ కూడా ఉజ్జాయింపు లెక్కలే కానీ, వాస్తవమైన రుజువులు చేయగలిగే స్పష్టమైన లెక్కలు లేవు. దీని కోసం ఎంత కష్టమైనా పొజిషన్‌ ప్రకారం సమగ్ర భూసర్వే చేసి తీరతాం, అనేక సమస్యలు పరిష్కారిస్తామన్న మంత్రి మాటలు భవిష్యత్తుపై నమ్మకం కలిగించాయి. అన్యాక్రాంతం, కబ్జా అయిన ప్రభుత్వ భూముల రక్షణ కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, దాని కోసం సీసీఎల్‌ఏను పటిష్ఠంగా ఏర్పాటుచేస్తున్నామని చెప్పి మంత్రి మరింత విశ్వాసాన్ని పెంచారు.


గత ధరణి పోర్టల్‌లో రహస్యానికి చోటు ఉండేది. నిజానికి తెలంగాణ భూ సమాచారం విషయంలో దాపరికాలు చారిత్రకంగా ఏమీ ఉండవు. ఏ ఊరిలోకి వెళ్లినా, ఈ భూమి ఎవరిది అని అడిగినా... పూర్తి సమాచారాన్ని ప్రజలు నోటితో చెప్పేస్తారు. అటువంటి తెలంగాణలో భూ విషయంలో రహస్యం చేయడం వెనక ఉన్న మతలబు ఎవరికీ అర్థం కాలేదు. నేడు భూమాతలో ప్రతి విషయాన్ని నిర్భయంగా, నిర్దిష్టంగా తెలుసుకునే అవకాశం కల్పించారు. రానున్న మూడు నెలల్లో మరిన్ని అంశాలను పొందుపరుస్తూ, నిపుణుల నుండి మరికొన్ని సూచనలు, సలహాలు తీసుకొని తెలంగాణ రైతాంగ సమస్యలను తీర్చేందుకు, సులువైన మార్గాలను పొందుపరిచేందుకు ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించి, ప్రజల ఆశలను చిగురింపజేశారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా భూమాత పనిచేస్తే రైతులకు గొప్ప భరోసా కల్పించినట్లే అవుతుంది.

నేడు రైతు భరోసా సాయం మీద కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వం పాస్‌ పుస్తకం ఉన్న ప్రతి మనిషికి రైతుబంధు ఇచ్చింది. కొండలు, గుట్టలు, ఫామ్‌హౌస్‌లు, కంచెలకు కూడా డబ్బులిచ్చింది. నేటి ప్రజాప్రభుత్వం కేవలం వ్యవసాయానికి మాత్రమే సాయం అందించాలనే దృఢమైన లక్ష్యంతో ఉన్నది. ప్రతి గ్రామంలోని విలేజ్‌ అగ్రికల్చరల్‌ ఆఫీసర్‌, శాటిలైట్‌ సహాయంతో పంట పొలాలను గుర్తించి నిజమైన రైతులకు సాయం అందించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఎకరానికి 7500 చొప్పున సంవత్సరానికి రెండుసార్లు ఈ సాయం అందించనున్నారు. ఇకపోతే 13 శాతం మంది రైతులు 10 ఎకరాలకు మించిన భూమున్నవారు ఉన్నారు. వారి విషయంలో కూడా ప్రభుత్వం సద్భావంతో ఉన్నది. ఇలా స్పష్టమైన, పటిష్ఠమైన అవగాహనతో పునర్నిర్మాణం అవుతున్న తెలంగాణ గ్రామీణ వ్యవసాయ రంగం, స్వర్ణయుగం వైపు ప్రయాణాన్ని కొనసాగిస్తుంది.

సర్దార్‌ వినోద్ కుమార్‌, రీసెర్చి స్కాలర్‌

Updated Date - Jan 02 , 2025 | 05:20 AM