మన్మోహన్: కాంతులు, కళంకాలు
ABN , Publish Date - Jan 11 , 2025 | 05:20 AM
‘చరిత్ర తీర్పు తనపై చాలా ఉదారంగా ఉంటుందని’ ఇటీవల కీర్తిశేషుడు అయిన డాక్టర్ మన్మోహన్ సింగ్ 2014లో ప్రధానమంత్రిగా తన చివరి పత్రికా గోష్ఠిలో ఉద్ఘాటించారు.
‘చరిత్ర తీర్పు తనపై చాలా ఉదారంగా ఉంటుందని’ ఇటీవల కీర్తిశేషుడు అయిన డాక్టర్ మన్మోహన్ సింగ్ 2014లో ప్రధానమంత్రిగా తన చివరి పత్రికా గోష్ఠిలో ఉద్ఘాటించారు. ఆయన ఆత్మవిశ్వాసపూరిత వ్యాఖ్యను, అప్పట్లో మీడియా తన పట్ల వ్యవహరిస్తున్న తీరుపై ఒక పరోక్ష ఆక్షేపణగా అర్థం చేసుకోవచ్చు. మరి ఇప్పుడు అదే మీడియా మన్మోహన్ కీర్తిగానం బ్రహ్మాండంగా చేస్తోంది. వివిధ పత్రికలు, పలువురు ప్రముఖులు దివంగత ప్రధానమంత్రికి అర్పించిన నివాళులు, చేసిన ప్రశంసలు చరిత్రకారుడు అయిన ఈ వ్యాసకర్తను చకితుడిని చేశాయి. ఆ పొగడ్తలు పూర్తిగా యోగ్యమైనవేనా? వాటిలో సత్యాసత్యాలు ఏమిటి? అన్న ప్రశ్నలను లేవనెత్తాయి. మన్మోహన్ నిజంగానే విజ్ఞుడా? సర్వజ్ఞుడా? ఉత్తమ రాజనీతిజ్ఞుడా?
మన్మోహన్ సింగ్ తన సుదీర్ఘ జీవితాన్ని ఒక విద్వజ్ఞుడుగా, ప్రభుత్వంలో ఒక ఆర్థికవేత్తగా, ఒక రాజకీయవేత్తగా గడిపారు. మరణానంతరం ఆయన గురించి వెల్లువెత్తిన ప్రశంసల్లో అత్యధిక భాగం ప్రభుత్వ ఆర్థికవేత్తగా ఉన్న దశపైనే కేంద్రీకృతమయ్యాయి. ముఖ్యంగా కేంద్ర ఆర్థికమంత్రిగా ఆయన నిరుపమాన సేవల గురించి అవి విపులంగా పేర్కొన్నాయి. నిజమే, లైసెన్స్– పర్మిట్– కోటా రాజ్‌ను కూల్చివేయడంలో మన్మోహన్ కీలకపాత్ర వహించారు. రాజ్యవ్యవస్థ శృంఖలాల నుంచి భారత ఆర్థిక వ్యవస్థను విముక్తం చేశారు దరిమిలా మూడు దశాబ్దాలుగా ఆర్థికాభివృద్ధి సుస్థిరంగా సాగుతోంది; పరిశ్రమల వ్యవస్థాపనా సామర్థ్యం ఇతోధికంగా పెరిగింది; కోట్లాది ప్రజలు పేదరికం కోరల నుంచి బయటపడ్డారు.
ఇది నిజంగా విశేష ప్రగతే. మన్మోహన్ దార్శనికత వల్లే అది సాధ్యమయిందని సరిగానే ఆయన్ను ప్రస్తుతిస్తున్నారు. అయితే మన్మోహన్ సాధించిన ఈ బృహత్ విజయం వెనుక ఆయనకు అప్పటి ప్రధానమంత్రి పీవీ నరసింహారావు అందించిన అచంచల తోడ్పాటు ఉందన్న విషయాన్ని ఎవరూ విస్మరించకూడదు. పార్లమెంటుకు ప్రజలు ఎన్నుకోని ఆర్థికవేత్తను కేబినెట్ మంత్రిగా నియమించిన ఘనత నిస్సందేహంగా పీవీదే. ప్రతిపక్షాల నుంచి, సొంత పార్టీలోని వ్యతిరేకుల నుంచి ఎదురైన కష్టనష్టాలను పీవీ మద్దతుతో మన్మోహన్ అధిగమించారు. మన్మోహన్‌తో కలిసి లేదా ఆయన మార్గదర్శకత్వంలో ప్రతిభావంతులు అయిన కొంతమంది ఆర్థికవేత్తలు, సివిల్ సర్వీస్ అధికారులు మన ఆర్థిక వ్యవస్థలో మౌలిక మార్పులు సాధించారు.
మన్మోహన్ సింగ్ యాదృచ్ఛికంగా ఆర్థికమంత్రి అయ్యారు. 1991లో రాజీవ్ హత్యానంతరం పీవీ ప్రధానమంత్రి అయ్యారు. విదేశీ మారక ద్రవ్య నిల్వలు పూర్తిగా అడుగంటిపోయాయి. ఆ క్లిష్ట పరిస్థితి నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు పీవీ తొలుత రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ ఐ.జి.పటేల్‌ను ఆర్థికమంత్రిగా నియమించేందుకు సంకల్పించారు. అయితే పటేల్ అందుకు నిరాకరించడంతో ఆర్థికమంత్రి అయ్యే అవకాశం మన్మోహన్‌కు లభించింది. విద్వజ్ఞుడుగా మన్మోహన్ ప్రత్యేకతలు పూర్తిగా ఆయన సొంతం. మన్మోహన్ సాధించిన విజయాల ప్రాముఖ్యతను గుర్తించేందుకు కేంబ్రిడ్జిలో ఆయన సమకాలికులు అయిన అమర్త్యసేన్, జగదీష్ భగవతి మేధో విజయాలతో వాటి తారతమ్యాలను చూడాలి. సేన్, భగవతి కులీన విద్వత్ కుటుంబాలలో జన్మించారు. సేన్ కుటుంబం రవీంద్రనాథ్ టాగోర్‌కు సన్నిహితులైన విద్వజ్ఞుల కుటుంబం నుంచి వచ్చారు. సేన్‌కు ‘అమర్త్య’ అని నామకరణం చేసింది కూడా టాగోరే కావడం విశేషం. భగవతి ఒక హైకోర్టు న్యాయమూర్తి కుమారుడు.
కులీన సామాజిక నేపథ్యాల కారణంగా సేన్, భగవతి సహజంగానే తమ ఉన్నత విద్యాభ్యాసానికి కేంబ్రిడ్జి వెళ్లారు. మరి మన్మోహన్ ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. దేశ విభజన పరిణామాలతో ఆయన కుటుంబం బాగా చితికిపోయింది. తీవ్ర ప్రతికూల పరిస్థితులలో ఎంతో కష్టపడి చదువుకున్న మన్మోహన్‌కు ఒక ప్రతిష్ఠాత్మక పాశ్చాత్య విశ్వవిద్యాలయానికి వెళ్లడమనేది ఒక అసాధ్య విషయం. అయితే మన్మోహన్ కేంబ్రిడ్జికి వెళ్లగలిగారు. అక్కడ పట్టభద్రుడైన తరువాత ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో డి.ఫిల్ పట్టా పొందారు.
2009 తొలినాళ్లలో నేను ఒక నెల రోజుల పాటు న్యూఢిల్లీలో ఉన్నాను. ప్రధానమంత్రి మన్మోహన్‌తో సమావేశమయ్యాను. అంతకంటే ముఖ్యంగా ప్రభుత్వంలోను, వెలుపల ఆయనకు సన్నిహితులైన పలువురు అధికారులతో నేను సంభాషించాను. పెద్ద వయస్సు, అందునా, గుండెకు శస్త్ర చికిత్స చేయించుకున్న కారణంగా తదుపరి సార్వత్రక ఎన్నికలలోగానే మన్మోహన్ సింగ్ గౌరవప్రదంగా రాజకీయాల నుంచి నిష్క్రమించడం శ్రేయస్కరమని ఆ అధికారులు అందరూ అభిప్రాయపడ్డారు. ప్రధానమంత్రి పదవిలో కొనసాగుదలుచు కుంటే లోక్‌సభకు పోటీ చేసి గెలిస్తే ఆయన విశ్వసనీయత మరింతగా పెరుగుతుందని మన్మోహన్ అభిమాని ఒకరు పేర్కొన్నారు.
అదే ఏడాది మన్మోహన్ రెండో పర్యాయం ప్రధానమంత్రి అయ్యారు. రాజ్యసభలోనే సభ్యుడుగా ఆయన కొనసాగారు. మొదటి పర్యాయం ప్రధానిగా ఉన్నప్పుడే ఆయన తన పార్టీ అధినేత్రి పట్ల మితిమీరిన రీతిలో వినయ విధేయతలు చూపుతున్నారని నిశిత పరిశీలకులు గమనించారు. రెండోసారి ప్రధాన మంత్రి అయిన తరువాత ఆ విధేయత మరింతగా పెరిగింది. అది ఆయన నిర్వహిస్తున్న అత్యున్నత పదవి గౌరవానికి తగని విధంగా ఉండేది. ఇదిలా ఉండగా మన్మోహన్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు తీవ్రమయ్యాయి.
బహిర్గతమైన వివిధ కుంభకోణాలలో కేంద్ర మంత్రుల పాత్ర ఉన్నట్టు రుజువయింది. వారిపై చర్య తీసుకోవడంలో మన్మోహన్ విఫలమయ్యారు. తనను ధిక్కరిస్తున్న మంత్రులను కూడా ఆయనేమీ చేయలేకపోయారు. మొదటి పర్యాయం ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కొందరు ప్రముఖ విద్యావేత్తలతో నాలెడ్జ్ కమిషన్‌ను నియమించారు. అయితే మానవవనరుల అభివృద్ధి మంత్రి అర్జున్ సింగ్ ఆ కమిషన్‌కు ఎటువంటి అధికారాలు లేకుండా చేసి నీరుకార్చివేశారు. రెండో పర్యాయం ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రణబ్ ముఖర్జీని సుదీర్ఘకాలం ఆర్థికమంత్రిగా కొనసాగించారు. ప్రణబ్ హయాంలో అంతర్జాతీయ మార్కెట్లలో భారత్ ప్రాభవం క్షీణించి పోయింది. ఆర్థిక సంస్కరణల అనంతర కాలంలో మొట్టమొదటి ‘అధ్వాన్న ఆర్థికమంత్రి’ అన్న అప్రతిష్ఠను ప్రణబ్ మూటగట్టుకున్నారు.
వైదుష్యంలో మన్మోహన్‌కు అర్జున్ సింగ్ ఏ మాత్రం సాటి రారు. ఆర్థిక మంత్రిత్వ శాఖను ప్రణబ్ కంటే మన్మోహనే అత్యంత సమర్థతతో నిర్వహించారని మరి చెప్పనవసరం లేదు. అయినప్పటికీ భయపడే స్వభావం కారణంగా, లోక్‌సభకు ఎన్నికైన సహచర మంత్రులు తనను ధిక్కరిస్తున్నప్పటికీ మన్మోహన్ వారిని నియంత్రించలేకపోయారు. బహుశా, పార్టీ అధినేత్రితో సమస్యలు వస్తాయన్న భయంతో ఆయన మిన్నకుండిపోయేవారు. కేబినెట్ తీర్మానం నొకదాన్ని రాహుల్‌గాంధీ బహిరంగంగా చించివేసినప్పటికీ మన్మోహన్ మౌనం వహించారు. రాహుల్‌గాంధీ నాయకత్వంలో పనిచేసేందుకు తాను అమితంగా సంతోషిస్తానని మన్మోహన్ తన రెండో పదవీ కాలం తుదినాళ్లలో ప్రకటించారు. ఇలా బహిరంగంగా విధేయతను ప్రదర్శించడం ద్వారానే పార్టీలోను, ప్రభుత్వంలోను తన స్థానాన్ని పటిష్ఠం చేసుకోగలనని ఆయన భావించారేమో?!
అదొక తప్పుడు నిర్ణయం. అంతేకాదు విషాదకరమైన పొరపాటు కూడా. సోనియాకు మన్మోహన్ ఎంతగా రుణపడి ఉన్నారో సోనియా సైతం ఆయనకు అంతే రుణపడి ఉన్నారని చెప్పి తీరాలి. 2004లో ప్రధానమంత్రి అయ్యేందుకు అవకాశం వచ్చినప్పటికీ ఆమె ఆ అత్యున్నత బాధ్యతను చేపట్టేందుకు నిరాకరించారు. ప్రభుత్వంలో ఏనాడూ పనిచేసిన అనుభవం లేని కారణంగా ప్రధాని పదవికి తాను అర్హురాలును కాననే విషయం ఆమెకు తెలుసు. కేబినెట్ సమావేశాల నిర్వహణ దక్షత తనకు లేదని, విధాన నిర్ణయాలు తీసుకోలేనని, విదేశీ ప్రభుత్వాధినేతలతో సమస్థాయిలో వ్యవహరించగల సామర్థ్యం తనకు లేదని ఆమెకు బాగా తెలుసు.
ప్రధానమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టడం ద్వారా ఎటువంటి ఇబ్బందులకు లోనవకుండా సోనియాను మన్మోహన్ రక్షించారు. అయితే 2009లో యూపీఏ తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత అర్హతలు ఏ మాత్రం లేని తన తనయడిని భావి ప్రధానమంత్రిగా చేసేందుకు సోనియా చేయవల్సినవి సంపూర్ణంగా చేశారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యంత అనుభ వజ్ఞుడు అయిన ప్రభుత్వాధికారి కావడంతో పాటు ప్రధానమంత్రి పదవిలో ఉన్న మన్మోహన్ సింగ్ రాహుల్ విషయంలో సోనియాకు బాసటగా నిలబడ్డారు. ప్రధానమంత్రి అయివుండి కూడా తన అధికారాలను నిర్ణయాత్మకంగా ఉపయోగించలేకపోవడంలో తన నిస్సహాయత్వాన్ని ఆయన బహిరంగంగా కనబరిచారు.
మన్మోహన్ నిస్సహాయత్వం ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్ఠించడంలో నరేంద్ర మోదీకి ఎంతగా సహకరించిందో భావి చరిత్రకారులే నిర్ణయించాలి. ప్రధానమంత్రి ఒక బలహీన నాయకుడుగా కనిపించడంతో చాలా మంది ఓటర్లు దేశానికి శక్తిమంతమైన నాయకత్వాన్ని ఇవ్వగలనని నిశ్చితంగా వక్కాణించిన నరేంద్ర మోదీ వైపు మొగ్గారనడం సత్యదూరం కాదు. సామాజికంగా వెనుకబడిన నేపథ్యం నుంచి ప్రభవించిన నేత నరేంద్ర మోదీ. నెహ్రూ– గాంధీ కుటుంబానికి ప్రథమ ప్రాధాన్యమిచ్చే పార్టీగా కాంగ్రెస్‌ను ప్రజలు భావించారు. ఈ అంశాలు నరేంద్ర మోదీ ఉత్థానానికి విశేషంగా దోహదం చేశాయి.
మన్మోహన్ సింగ్ అర్థశాస్త్ర విద్వత్తు ప్రగాఢమైనది, ఆర్థిక సంస్కర్తగా ఆయన సాఫల్యాలు గణనీయమైనవీ, కలకాలం నిలిచేవీ అనడంలో సందేహం లేదు. అయితే ప్రధానమంత్రిగా ఆయన పాలనా విజయాలు, రాజకీయ వారసత్వం అనిశ్చితమైనవి. ద్వితీయ పర్యాయం ప్రధానమంత్రిగా ఆయన అనుద్దేశపూర్వకంగా ప్రభుత్వంలో నిరంకుశ విధానాలు పెచ్చరిల్లేందుకు; భారతదేశ అతి పురాతన రాజకీయ పార్టీలో విధేయతా సంస్కృతి, కుటుంబ ప్రాధాన్యం తిరుగులేని రీతిలో వర్ధిల్లేందుకు మనఃపూర్వకంగా ఆయన తోడ్పడ్డారు.
రామచంద్ర గుహ
(వ్యాసకర్త చరిత్రకారుడు)