Share News

కమ్యూనిస్టులకు కొత్త పాఠాలు

ABN , Publish Date - Jan 01 , 2025 | 05:44 AM

మన తెలుగు రాష్ట్రాలలో ప్రజా సమస్యల మీద ఉద్యమించడం, రాజీ లేని పోరాటాలు చేయడం, ఫలితంగా ప్రభుత్వం నుంచి తీవ్ర నిర్బంధాన్ని ఎదుర్కోవడం ఇప్పటివరకు కమ్యూనిస్టుల పేటెంట్‌గా ఉండేది...

కమ్యూనిస్టులకు కొత్త పాఠాలు

మన తెలుగు రాష్ట్రాలలో ప్రజా సమస్యల మీద ఉద్యమించడం, రాజీ లేని పోరాటాలు చేయడం, ఫలితంగా ప్రభుత్వం నుంచి తీవ్ర నిర్బంధాన్ని ఎదుర్కోవడం ఇప్పటివరకు కమ్యూనిస్టుల పేటెంట్‌గా ఉండేది. ఆ నిర్బంధం అక్రమ అరెస్టులు, దేశద్రోహంలాంటి తీవ్రమైన కేసులు; అర్ధరాత్రి, అపరాత్రి లేకుండా ఇళ్ల మీద పడి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌లో చిత్రహింసలు; హత్యలకు, దాడులకు గురికావడం; ఆస్తుల విధ్వంసాన్ని ఎదుర్కోవడం; జీవనోపాధి కోల్పోవడం; నలుగురి ముందు తీవ్ర అవమానాలు ఎదుర్కోవడం లాంటి రూపాలలో ఉండేది (ఇప్పటికీ ఉంది). అయితే 2019–24 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం నుంచి ఈ తరహా నిర్బంధకాండ ఎదుర్కొంది కమ్యూనిస్టులు కాదు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం, దాన్ని బలపరిచిన జనసేన, బీజేపీలోని ఒక వర్గం, వాళ్లకు అనుకూలంగా వ్యవహరించిన ఏబీయన్ ఛానల్, టీవీ 5, ఈనాడు లాంటి టీవీ ఛానళ్లు, కొన్ని యూట్యూబ్ చానళ్లు, దినపత్రికలు కావడం ఆశ్చర్యకరం! కమ్యూనిస్టుల ప్రజాసంఘాలు కూడా కొన్ని పోరాటాలలో కొంత నిర్బంధం చవిచూసినప్పటికీ, ప్రధాన ప్రతిపక్షం ఎదుర్కొన్నంతగా కాదు.


అప్పటి వైసీపీ ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీసిన తెలుగుదేశం పార్టీ నాయకులూ, కార్యకర్తలు, అభిమానులు తీవ్ర నిర్బంధం ఎదుర్కొన్నారు. సీనియర్ ఎమ్మెల్యేలను కూడా నిర్దాక్షిణ్యంగా అరెస్టులు చేసి పోలీస్ మార్క్ ట్రీట్‌మెంట్ చూపించారు. అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు వంటి వారిని అక్రమ అరెస్టులు, దాడులతో వేధించారు. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని అక్రమ కేసులో ఇరికించి అరెస్ట్ చేసి లాకప్‌లో పడేసి గుర్తు తెలియని వ్యక్తులు కుమ్మేసారు. ఆనాటి నిర్బంధ పాలనకు పరాకాష్ఠగా పాలక పార్టీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజును హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి తీసుకెళ్లి, తీవ్రంగా చిత్రహింసల పాలుచేసి, ప్రాణాపాయం కల్పించడం అందరికీ తెలిసిందే! ఈవిధంగా ఆ పాలనా కాలంలో ప్రతిపక్ష పార్టీ క్రియాశీల సభ్యుల నుంచి, బడానాయకులు దాకా పోలీస్ స్టేషన్‌లు, కేసులు, దాడులు ఎదుర్కొనని వారు లేరనడం అతిశయోక్తి కాదు. చివరకు సుదీర్ఘ రాజకీయ జీవితంలో మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడును కూడా ఒక కేసులో ఇరికించి 56 రోజుల పాటు ఊచలు లెక్కించేలా చేశారు. విశేష జనాదరణ గల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ని కూడా అడుగడుగునా నిర్బంధంతో హింసించారు.


పాలక పార్టీ అయినా వైసీపీ జర్మనీలో నాజీల గెస్టపో లాగా ఒక వలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేసుకొని ప్రజల మీద, ప్రతిపక్షాల మీద నిఘా పెట్టింది. ప్రతి యాభై కుటుంబాలకొక వలంటీర్‌ను కాపలా పెట్టి వాళ్ళ ప్రతి కదలికను, రాజకీయ విశ్వాసాలను రికార్డు చేసి సమాచారాన్ని సేకరించింది. అలాగే సోషల్ మీడియా సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు ఇచ్చింది. సోషల్ మీడియాలో జగన్‌కు లేదా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు పోస్టు పెట్టినా తీవ్రమైన అసభ్య పదజాలంతో దూషించడమే పనిగా పెట్టుకుంది. పైగా వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్టులు చేయడం, భౌతిక దాడులకు గురిచేయడం పరిపాటైపోయింది.

ఈ దాడులలో సామాన్య ప్రజానీకం కూడా పెద్ద ఎత్తున బలై పోయింది. గుంటూరులో ఒక మహిళ తన హోటల్‌ను మూసుకుని హైదరాబాద్‌కు వెళ్లిపోవాల్సి వచ్చింది. కరోనా సమయంలో మాస్క్‌లు ఇవ్వడం లేదని ఫిర్యాదు చేసిన డాక్టర్ సుధాకర్‌ను నడివీధుల్లో తన్నుకుంటూ పోలీసులు ఈడ్చుకు పోవడం చూసాం. అతడి మీద పిచ్చివాడని ముద్ర వేయడం, తర్వాత అతను గుండె పోటుతో మరణించడం తెలిసిందే! ఒక జడ్జి స్థాయి వ్యక్తి ఇంటిమీద దాడి చేసి భయోత్పాతం సృష్టించారు. లాకప్‌లలో శిరోముండనాలు, చిత్రహింసలు మామూలై పోయాయి. ఒక ఎమ్మెల్సీ తన కార్ డ్రైవర్‌ను హత్య చేసి కుటుంబానికి డోర్ డెలివరీ చేయడం చూసాం. ఆ ఎమ్మెల్సీ అతి కష్టం మీద అరెస్ట్ అయి అనతికాలం లోనే బెయిల్ మీద వచ్చి ఊరేగడం చూసాం. అదే విధంగా తమకు గిట్టని మీడియా ప్రతినిధుల మీద దేశద్రోహం లాంటి కేసులు పెట్టి వేధించారు. ఒక కుంటి సాకుతో టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసి ధ్వంసం చేశారు. ఇవన్నీ ఒక ఎత్తయితే అమరావతి రైతుల మీద, అందులోను మహిళల మీద సాగించిన దుష్ప్రచారం, భౌతిక దాడుల, కేసులు మరో ఎత్తుగా చెప్పుకోవాలి.


మొత్తంగా చూస్తే తెలుగు రాష్ట్రాలలో తొలిసారిగా కమ్యూనిస్టుల మీద కాకుండా బూర్జువా ప్రతిపక్ష పార్టీల మీద ఇంత పెద్ద నిర్బంధకాండ సాగించడం అనుభవం లోకి వచ్చింది. ఆర్థికంగా, రాజకీయంగా, భౌతికంగా బలమైన వైసీపీని ప్రతిపక్షాలైన టీడీపీ, జనసేనలు ఎలా ఎదుర్కొన్నాయనేది మనకి విలువైన పాఠాలు నేర్పుతుంది. చంద్రబాబు నాయకత్వం లోని టీడీపీ సంఖ్యలో తక్కువైనా అటు అసెంబ్లీ లోను, ఇటు ప్రజాక్షేత్రం లోను నిర్బంధాన్ని లెక్క చేయకుండా వీరోచితంగా పోరాడింది. తీవ్ర దమనకాండను ఎదిరిస్తూనే ప్రజల సమస్యల మీద, ప్రభుత్వ వైఫల్యాల మీద మీడియా ద్వారా, ప్రజా సమావేశాల్లోనూ, రకరకాల మార్గాలలో వివరించింది. తన పార్టీ క్యాడర్‌ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వాళ్ళ మనోస్థైర్యాన్ని నిలబెట్టింది. ఎంతో వ్యూహాత్మకంగా, ప్రణాళికాబద్ధంగా, రాజకీయ చతురత, నైపుణ్యంతో సామాన్య ప్రజలకు చేరువయింది. మరో వైపు పవన్ కళ్యాణ్ కూడా తన సినీ కెరీర్‌ను కూడా పణంగా పెట్టి ప్రజలలోకి చొచ్చుకు పోయాడు. ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు ఉద్యమించడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, తమపై దుష్ప్రచారాలు ఎప్పటికప్పుడు తిప్పికొట్టడం, నిర్బంధాలను అధిగమించడం ఒక ఉద్యమంగా ఐదేళ్ల పాటు కొనసాగించాడు. యువ నాయకుడు లోకేష్ కూడా పరిణతి ప్రదర్శిస్తూ, పాదయాత్ర చేసి ప్రజల్లో కలిసి పోయి తానొక స్థానాన్ని సాధించుకున్నాడు.


ఈ విధంగా 2019–24 మధ్య ఐదేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సాగిన అపూర్వ ప్రజాస్వామిక వెల్లువను అధ్యయనం చేసి గుణపాఠాలు తీసుకోవడం కమ్యూనిస్టులకు ఎంతో ఉపయోగపడుతుంది. సామాన్య ప్రజల నుంచి ఉన్నత స్థాయి ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, మీడియా ప్రతినిధులు మొదలైన వారు ప్రదర్శించిన తెగువ, సాహసాన్ని అర్థం చేసుకోవాలి. మన పిలుపులకు స్పందించడం లేదని, ప్రజలలో చైతన్యం లోపించిందని నీరసం మాటలు చెబుతూ కాలక్షేపం చేసే వామపక్ష సోదరులు పెను నిద్దర నుంచి మేలుకోవాలి. వాస్తవానికి టీడీపీ, జనసేన పోషించిన పాత్రను వామపక్ష పార్టీలు పోషించాలి. అలాకాకుండా లోపాయకారిగా వైసీపీతో అంటకాగారనే అప్రదిష్టను మూట కట్టుకున్నారు. ఒక ప్రాంతీయ పార్టీ ప్రదర్శించిన ఫాసిస్ట్ నిర్బంధాన్ని ఎదుర్కొని గెలవలేని వామపక్ష పార్టీలు, జాతీయ, అంతర్జాతీయ బూర్జువాలు, సామ్రాజ్యవాదుల అండతో బలమైన నిర్మాణం గల బీజేపీ ఫాసిజాన్ని ఓడించగలరని ఎలా నమ్మగలం!? రాబోయే రోజుల్లోనైనా సరైన గుణపాఠాలు తీసుకుని తమ పనితీరును మెరుగుపర్చుకోవాల్సిన బాధ్యత అన్ని కమ్యూనిస్టు పార్టీల మీదా ఉంది.

జనార్దన్. ఎస్

Updated Date - Jan 01 , 2025 | 05:44 AM