Waqf Act Amendment: వక్ఫ్పై వాట్సాప్ వర్సిటీ పరిజ్ఞానం
ABN , Publish Date - Apr 24 , 2025 | 12:11 AM
వక్ఫ్ సవరణలపై బూర నర్సయ్య గౌడ్ చేసిన వ్యాఖ్యలలో వాస్తవాలు లేవని, తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లో వ్యాపింపజేస్తున్నారని సలీమ్ పాష ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవాలను బలంగా ప్రతిపాదిస్తూ, వక్ఫ్ చట్ట సవరణలు ముస్లింల హక్కులను తగ్గించేందుకే ఉద్దేశించినవని అభిప్రాయపడ్డారు.
మాజీ ఎంపీ, ప్రస్తుత బీజేపీ నాయకులు బూర నర్సయ్య గౌడ్ ఏప్రిల్ 9న ఆంధ్రజ్యోతిలో ‘ముస్లిం సంక్షేమానికే వక్ఫ్ సవరణలు’ పేరుతో వ్యాసం రాశారు. ఈ వ్యాసంలోని విషయాలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయి. వాట్సాప్ యూనివర్సిటీలో మోదీ భక్తులు చేసే ప్రచారాలతో ప్రభావితమై రాసినట్టు ఉంది. భారతదేశంలో రక్షణ రంగం, రైల్వేల తర్వాత అత్యధిక ఆస్తులు వక్ఫ్ సంపదే అని రాశారు. ఇది అవాస్తవం. తమిళనాడు, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ నాలుగు రాష్ట్రాలలోనే 14 లక్షల ఎకరాల ఎండోమెంట్ భూములు ఉంటే దేశవ్యాప్తంగా ఎన్ని లక్షల ఎకరాలు ఉండొచ్చు? రాజ్యసభ సభ్యులు కపిల్ సిబల్ ఇదే విషయాన్ని సభలో ప్రస్తావించిన విషయం మనం చూశాం. వాస్తవాలు ఇలా ఉంటే మోదీ అనుకూల మీడియాలో సాగుతున్న తప్పుడు ప్రచారాన్నే నర్సయ్య గౌడ్ కూడా కొనసాగించారు. 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం వక్ఫ్ చట్టానికి సవరణ చేసి సెక్షన్ 40 తీసుకువచ్చిందని, ఈ సెక్షన్ ప్రకారం ఏ భూమినైనా వక్ఫ్ ఆస్తిగా ప్రకటించే అవకాశం ఉందని, ఇలా దేశవ్యాప్తంగా 36 లక్షల ఎకరాల భూమిని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించారని బూర నర్సయ్య గౌడ్ అన్నారు. ఏ కోర్టుకు కూడా ఈ చర్యలను సమీక్షించే అవకాశం లేదన్నారు.
ఇది కూడా వాట్సాప్ యూనివర్సిటీ చేసే అబద్ధ ప్రచారమే. ప్రస్తుతం దేశంలోని వక్ఫ్ బోర్డుల పరిధిలో 9 లక్షల ఎకరాల భూమి ఉందని కేంద్ర ప్రభుత్వం బిల్లుపై చర్చలో ప్రకటించింది. మరి ఈ 36 లక్షల ఎకరాల భూమి ఎక్కడి నుండి వచ్చింది? ఇక వక్ఫ్ చట్టం 1995 సెక్షన్ 40 గురించి వాస్తవం చూద్దాం. ఈ సెక్షన్ ప్రకారం ఏదేని ఆస్తి వక్ఫ్‌దా కాదా? అన్న వివాదం వచ్చినప్పుడు విచారణ జరిపి నిర్ణయం తీసుకునే అధికారం వక్ఫ్ బోర్డుకు ఉంటుంది. బోర్డు నిర్ణయంపై ఎవరికైనా అభ్యంతరం ఉంటే వక్ఫ్ ట్రిబ్యునల్‌ని ఆశ్రయించవచ్చు. ట్రిబ్యునల్ తీర్పుపై కూడా అభ్యంతరం ఉంటే హైకోర్టును, ఆ తర్వాత సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించవచ్చు. అంటే, ఏదైనా ఆస్తిని వక్ఫ్ బోర్డు తనదని క్లెయిమ్ చేసుకుంటే, దానిని న్యాయస్థానాలలో సవాలు చేయవచ్చు. కానీ ఆ అవకాశం లేదంటూ తీవ్ర దుష్ప్రచారం చేసి ప్రస్తుత సవరణ చట్టంలో సెక్షన్ 40ని తొలగించారు. వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టకముందే, తనదైన శైలిలో బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా వక్ఫ్ ఆస్తులపై, వక్ఫ్ బోర్డులపై తీవ్రమైన దుష్ప్రచారం చేసింది. జనబాహుళ్యంలో వక్ఫ్ బోర్డు అంటే ఒక భూ మాఫియా సంస్థగా, హిందువుల ఆస్తులను, దేశ ఆస్తులను కబళించే ఒక సంస్థగా చిత్రీకరించింది. నూతన సవరణ చట్టం ప్రకారం వక్ఫ్ బోర్డులో ముస్లింలలోని షియా, ఆఘఖాని, బోరా, ఇస్మాయిలి వర్గాలకు ప్రాతినిధ్యం లభిస్తుందని నర్సయ్య గౌడ్ అన్నారు. కానీ వాస్తవం ఏంటంటే ప్రస్తుతం ఉన్న వక్ఫ్ బోర్డులను విభజించి ‘ఆగాఖాని వక్ఫ్ బోర్డు’, ‘జొహారా’ల కొరకు ప్రత్యేక వక్ఫ్ బోర్డులను ఏర్పాటు చేయడం అన్నది ముస్లిం సమాజంలో చీలిక తేవడానికి ఉద్దేశించినది.
ఇది ‘విభజించి పాలించు’ సూత్రానికి పరాకాష్ఠ. 1995 వక్ఫ్ చట్టం 14 ప్రకారం ప్రభుత్వం ఒక సున్నీ, ఒక షియా, ఒక ముస్లిం మహిళను రాష్ట్ర వక్ఫ్ బోర్డుకు నామినేట్ చేస్తుంది. నూతన సవరణలతో కేంద్ర ప్రభుత్వం కొత్తగా ముస్లింలలోని వర్గాలకు చేసే న్యాయం ఏమిటో నర్సయ్య గౌడ్‌కే తెలియాలి. ఒక్క ముస్లిం వ్యక్తికి కూడా అసెంబ్లీకి గాని, పార్లమెంటుకు గాని టికెట్ ఇవ్వని, ప్రతీ అంశంలో హిందూ ముస్లింల మధ్య విభజన తేవడానికి ప్రయత్నించే బీజేపీ.. ఈ వక్ఫ్ సవరణలతో ముస్లింలలోని వెనుకబడిన వర్గాలకు న్యాయం చేస్తామని ప్రకటించినంత మాత్రాన ముస్లింలు ఎలా నమ్ముతారో నర్సయ్య గౌడ్ చెప్పాలి. వెనుకబడిన ముస్లింలకు బోర్డులో ప్రాతినిధ్యం లభించడం ఏమో కానీ, ప్రస్తుత సవరణతో ఇద్దరు ముస్లిమేతరులను ప్రభుత్వం వక్ఫ్ బోర్డుకి నామినేట్ చేస్తోంది. ముస్లిం ధార్మిక సంస్థలో ఇతర మతస్తుల ప్రవేశం దేనిని సూచిస్తుంది? హిందూ ఎండోమెంట్ సంస్థలలో ముస్లింలకు ఇలా అవకాశం కల్పిస్తారా? హిందూ దేవాలయాల్లో స్వీపర్ పోస్టులో కూడా అన్యమతస్తులు ఉండకూడదని వాదించే బీజేపీకి చెందిన దీనికి బూర నర్సయ్య దీనిని ఎలా సమర్థించుకుంటారు? ప్రస్తుతం 75శాతం వక్ఫ్ భూములు కబ్జా అయ్యాయని, సవరణ చట్టంతో ఈ కబ్జాలను అరికడతామని ఆయన అన్నారు.
కానీ ప్రస్తుత సవరణ చట్టం ద్వారా 1995 వక్ఫ్ చట్టంలోని సెక్షన్ 107, 108, 108Aలు తొలగించడం వలన వక్ఫ్ ఆస్తుల ఆక్రమణదారులు లిమిటేషన్ యాక్ట్ 1963 ప్రకారం తమ కబ్జాలను శాశ్వతపరచుకొని, తద్వారా వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతం కావడానికి పూర్తి అవకాశం కలుగుతుంది. సెక్షన్ 108Bను సవరించి వక్ఫ్ రూల్స్ తయారు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాల నుండి కేంద్రం గుంజుకోవడం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం. నూతన చట్టంతో వక్ఫ్ ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచి, పేద ముస్లింల సంక్షేమానికి మోదీ ప్రభుత్వం కృషి చేస్తుందని బూర నర్సయ్య అంటున్నారు. అదే నిజమైతే వక్ఫ్ బోర్డుకు వచ్చే కమర్షియల్ లీజ్ రెంటును 7 శాతం నుండి 5 శాతానికి ఎందుకు తగ్గించారు? కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వచ్చిన సచార్ కమిటీ తన నివేదికలో పేర్కొన్న వక్ఫ్ నిర్వహణకు సంబంధించిన విషయాలను కేంద్ర మైనారిటీ శాఖ మంత్రితో పాటు నర్సయ్యగౌడ్ వంటి నేతలు పదేపదే ప్రస్తావిస్తున్నారు. మరి, గత పదకొండేళ్ల మోదీ పాలనలో ఒక్కసారైనా సచార్ కమిటీ నివేదికను పరిశీలించారా, ఒక్క సూచననైనా అమలు చేశారా, కబ్జాకు గురైన ఒక్క ఎకరం వక్ఫ్ భూమినైనా స్వాధీనం చేసుకొని వక్ఫ్ బోర్డుకి అప్పగించారా? మచ్చుకైనా లేదు. మరి సచార్ కమిటీ గురించి వల్లె వేయడం రాజకీయాలలో భాగం కాదా? ‘పేద ముస్లింల సంక్షేమం’ అన్న అందమైన ముసుగు తొడిగిన ఈ నూతన సవరణ చట్టం వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో ముస్లింల పాత్రను తగ్గిస్తుంది. ముస్లిమేతరులు ముఖ్యంగా ప్రభుత్వ తాబేదార్ల ప్రమేయాన్ని పెంచి, లక్షల ఎకరాల వక్ఫ్ భూములను బడా వ్యాపారవేత్తలకు కట్టబెట్టడానికి మార్గం సుగమం చేశారు. దేశహితాన్ని, మత ఐక్యతను కోరేవారు ఎవరూ కూడా ఈ చట్టంలోని ఏ ఒక్క సవరణనూ అంగీకరించడం లేదు.
సలీమ్ పాష కన్వీనర్, తెలంగాణ ముస్లిం ఆర్గనైజేషన్స్ జేఏసీ