శాంతియత్నాల్లో ట్రంప్!
ABN , Publish Date - Mar 20 , 2025 | 01:34 AM
మూడేళ్ళకు పైగా సాగుతున్న రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ట్రంప్ గట్టిగానే కష్టపడుతున్నారు. ఆయన సహనం చూస్తుంటే ముచ్చటేస్తున్నది కూడా...

మూడేళ్ళకు పైగా సాగుతున్న రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ట్రంప్ గట్టిగానే కష్టపడుతున్నారు. ఆయన సహనం చూస్తుంటే ముచ్చటేస్తున్నది కూడా. మంగళవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మాట్లాడటానికి ప్రయత్నిస్తే, ఆయన ఎంతకూ అందుబాటులోకి రాలేదని, ఏకంగా గంటపాటు ట్రంప్ చేతిలో ఫోన్‌పట్టుకొని నిరీక్షించాల్సివచ్చిందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అమెరికా అధ్యక్షుడు ఏ సమయంలో ఫోన్‌చేస్తారో తమ అధ్యక్షుడికి తెలియనందువల్ల ఈ సమస్య ఉత్పన్నమైందని రష్యా ఆ తరువాత చిన్నపాటి వివరణ ఇచ్చింది. ఏదో అవగాహన లేక తప్ప ఇది ఎంతమాత్రం తమ అధ్యక్షులవారి అహంకారం కాదని చెప్పడం ఈ వివరణ ఉద్దేశం కావచ్చు. ఆ సమయంలో పుతిన్ పారిశ్రామికవేత్తల సమావేశంలో ఉన్నారట. ఉంటే ఉన్నారు కానీ, అమెరికా అధ్యక్షులంతటివారు ఫోన్ చేస్తే, ఉన్న పళంగా లేచి పరుగున వచ్చి ఫోన్ అందుకోవాలిగానీ, ఇదేమిటి, కచ్చితంగా ఇది ఉద్దేశపూర్వకంగానే జరిగింది అని కొందరు అంటారు. నిజానిజాలు రష్యా అధ్యక్షుడికే ఎరుక. కానీ, ఈ ఘటన అసలే అవమానంతో రగలిపోతున్న ఉక్రెయిన్ అధ్యక్షుడిని సహజంగానే వేడెక్కించింది. పుతిన్‌తో మాట్లాడటానికి ట్రంప్‌కు ఎంత సమయమైనా చిక్కుతుందని, ఎక్కడలేని సహనమూ వస్తుందన్న రీతిలో వ్యాఖ్యానించి కసితీర్చుకున్నాడాయన. పుతిన్‌తో ట్రంప్ మాట్లాడుతున్న సమయంలో ఐరోపా సమాఖ్య నేతలతో జెలెన్‌స్కీ చర్చల్లో ఉన్నారని కీవ్ ప్రకటించడం వెనుక, మూడేళ్లపాటు ఆయుధాలు అందించిన ఉక్రెయిన్‌కు ముందుగా ఫోన్ పోలేదని మిగతా ప్రపంచం ఎక్కడ అనుకుంటుందోనన్న బాధ ఉండవచ్చు. మొత్తానికి, ఒక రోజు ఆలస్యంగానైనా జెలెన్‌స్కీతో కూడా ట్రంప్ మాట్లాడేశారు.
వ్యవహారం సజావుగా సాగుతోందన్న రీతిలో ఓ నాలుగు మంచిమాటలు కూడా అన్నారు. గత నెలలో, ఓవల్ ఆఫీస్‌లో తీవ్రవాగ్యుద్ధం అనంతరం, దాదాపు గెంటివేసినంత పనిచేశాక, జెలెన్‌స్కీతో ట్రంప్ మాట్లాడింది మళ్ళీ ఇప్పుడే. ముందుగా షెడ్యూల్ చేసుకున్న ప్రకారమే వైట్‌హౌస్‌నుంచి క్రెమ్లిన్‌కు ఫోన్ వెళ్ళిందని, పుతిన్‌కు సమాచారం చేరినా కూడా ఆయన పట్టించుకోకుండా ‘ఆయనకు ఇదే పని’ అంటూ కొన్ని వ్యాఖ్యలు చేసి, ఉద్దేశపూర్వకంగానే ఉండిపోయారనడానికి నిదర్శనంగా పారిశ్రామికవేత్తల సదస్సులో జరిగిన ఓ సంభాషణ మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమైంది. మొత్తానికి, జెలెన్‌స్కీని పక్కనపెట్టేసి, ట్రంప్ పుతిన్ కలసి కథ నడిపిస్తున్నారన్నది నిజం. యుద్ధానికి సంబంధించి పుతిన్–ట్రంప్ చర్చలు ఓ రెండు గంటలు ఆలస్యమైనా, సుదీర్ఘంగా సాగాయని, ఉక్రెయిన్ ఇంధన, మౌలిక సదుపాయాలమీద నెలరోజులు దాడులు నిలిపివేసేలా చూడాలని ఇద్దరూ నిర్ణయించారని వైట్‌హౌస్ ప్రకటించింది. ట్రంప్ కూడా తన సోషల్ మీడియా ఖాతాలో యుద్ధఖైదీల అప్పగింత సహా పుతిన్ చెప్పిన మరికొన్ని విషయాలను పోస్టుచేశారు. ట్రంప్ ప్రతిపాదించిన ముప్పైరోజుల కాల్పుల విరమణకు పుతిన్ సరేనంటూనే చాలా నిబంధనలు పెట్టినట్టుగా వార్తలు వచ్చాయి. అలాగే, యుద్ధం మూలకారణాలమాటేమిటని అడిగారని, నాటో పాత్ర, విస్తరణల సంగతి తేల్చమన్నారని వార్తలు వస్తున్నాయి. ఉక్రెయిన్‌కు సమస్త సహాయాలూ ఆగిపోయినపక్షంలోనే ఈ తాత్కాలిక, స్వల్పకాలిక యుద్ధవిరామం నిలబడుతుందని కూడా పుతిన్ స్పష్టంగా తేల్చేశారట. అంటే, ఉక్రెయిన్‌కు అమెరికానుంచి ఆర్థిక, ఆయుధ సహాయాలు ఆగిపోయి, నిఘా సమాచారం నిలిచిపోతేనే యుద్ధం ఆగుతుందన్నది సారాంశం.
ఆదివారం సౌదీ అరేబియాలో జరగబోయే చర్చల్లో ఈ విషయాలన్నీ తేల్చేస్తామని అమెరికా అంటోంది. యుద్ధానికి తాత్కాలిక విరామం ఇస్తానని ట్రంప్‌కు హామీ ఇచ్చిన పుతిన్, క్షణం కూడా యుద్ధాన్ని ఆపకుండా ఏకంగా ఉక్రెయిన్ ఇంధన స్థావరాలమీదా, వ్యవస్థలమీదా బాంబులు కురిపించారని జెలెన్‌స్కీ ఆరోపిస్తున్నారు. బుధవారం రష్యా క్షిపణులు ఉక్రెయిన్ రైల్వేలకు విద్యుత్ సరఫరా చేసే వ్యవస్థను తీవ్రంగా దెబ్బకొట్టాయి. ఆదివారం చర్చల్లోగా ఉక్రెయిన్‌ను బాగా దెబ్బతీసి, మరింత ఒత్తిడిపెంచాలనీ, భీకరమైన యుద్ధంతో జెలెన్‌స్కీని వంచాలనీ పుతిన్ ఉద్దేశం. తనకు ట్రంప్ ఏం చెప్పారన్నకంటే, పుతిన్‌తో ట్రంప్ ఏం మాట్లాడారన్నది జెలెన్‌స్కీకి ఎక్కువ ఆందోళన కలిగిస్తున్న అంశం. శాంతియత్నాలను రష్యా అడ్డుకుంటోందని జెలెన్‌స్కీ అంటున్నారు కానీ, ఆయన ప్రమేయం లేకుండా ట్రంప్ తాను చేయదల్చుకున్నది చేసుకుపోతున్నారు.