Share News

Social Justice : వర్గీకరణ అమలుకై మేధావుల సభ

ABN , Publish Date - Jan 11 , 2025 | 04:51 AM

మన దేశంలో రాజ్యాంగం అమలైన 75 ఏళ్ల కాలంలో ప్రభుత్వాలకు ముందుచూపు లేకపోవడం వల్ల ఎస్సీ రిజర్వేషన్‌ ఫలాల పంపిణీలో అసమానతలు ఏర్పడ్డాయి.

Social Justice : వర్గీకరణ అమలుకై మేధావుల సభ

మన దేశంలో రాజ్యాంగం అమలైన 75 ఏళ్ల కాలంలో ప్రభుత్వాలకు ముందుచూపు లేకపోవడం వల్ల ఎస్సీ రిజర్వేషన్‌ ఫలాల పంపిణీలో అసమానతలు ఏర్పడ్డాయి. దేశంలో ఉన్న ఎస్సీలలో కొన్ని కులాలే ప్రతి రాష్ట్రంలో రిజర్వేషన్‌ ఫలాలు సింహభాగం పొందుతూ వస్తున్నాయి. ప్రధాన స్రవంతికి దూరంగా ఉంటున్న ఆశ్రిత కులాలు ఎస్సీ రిజర్వేషన్లు పొందలేకపోయాయి. ఇటీవల సుప్రీంకోర్టు రాజ్యాంగ విస్తృత ధర్మాసనం తమ తీర్పులో ఎస్సీ రిజర్వేషన్‌ను వర్గీకరించి, అందరికీ సమన్యాయం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉందని చెప్పింది. ఆర్టికల్‌ 341ని విస్తృతంగా పరిశీలించిన సుప్రీంకోర్టు, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ రిజర్వేషన్‌ను వర్గీకరించడానికి ఎలాంటి అడ్డంకులూ లేవని స్పష్టం చేసింది. వర్గీకరణ ద్వారానే ఆర్టికల్‌ 14, 15, 16ల ఉద్దేశం నెరవేరుతుందని కోర్టు అభిప్రాయపడింది. ఈ మూడు దశాబ్దాల కాలంలో ఎంఆర్‌పీఎస్‌ చేస్తున్న సామాజిక న్యాయసాధన పోరాటానికి దేశంలో ఉన్న మేధావివర్గం తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ వచ్చింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంతీర్పును వెంటనే అమలు చేయాలని చెప్పడానికి మేధావుల జోక్యం ఎంతైనా అవసరం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిండు అసెంబ్లీలో ఎస్సీ రిజర్వేషన్‌ వర్గీకరణ అమలు చేస్తానని చేసిన ప్రకటనకు కట్టుబడి ఉండడడానికి పౌరసమాజం ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో అన్ని సామాజిక సమూహాల కలయికతో మేధావుల సభ నేడు ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌ ఉస్మానియా యూనివర్శిటీలోని ఠాగూరు ఆడిటోరియంలో జరుగుతుంది. ప్రొ. హరగోపాల్‌, దేశపతి శ్రీనివాస్‌, కె. రామచంద్రమూర్తి, విమలక్క, ప్రొ. భంగ్యా భూక్యా, కన్నెగంటి రవి, జస్టిస్‌ చంద్రకుమార్‌, ప్రొ. కె. నాగేశ్వర్‌, నందిని సిధారెడ్డి, వి. సంధ్య, బూరం అభినవ్‌, కోదండరాం, తీన్మార్‌ మల్లన్న, పాశం యాదగిరి, సూరేపల్లి సుజాత, గజవెల్లి ఈశ్వర్‌, డా. జయప్రకాశ్‌ నారాయణ, కె. శ్రీనివాస్‌, జయధీర్‌ తిరుమలరావు, ఈసం నారాయణ, డా. ఆరెపల్లి రాజేందర్‌, మంద దేవేంద్ర ప్రసాద్‌, చింతికింది కాశీం, ప్రొ. జి. మల్లేశం, తదితరులు పాల్గొంటారు.

–మాదిగ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌, తెలంగాణ

Updated Date - Jan 11 , 2025 | 04:51 AM