Share News

Tallavajhala Patanjali Shastri : పుస్తకం చూసి నాలిక కరుచుకున్నాను!

ABN , Publish Date - Jan 13 , 2025 | 05:19 AM

నిజానికి నేను అచ్చులో చూసుకున్న నా మొదటి పుస్తకం ఒక నాటిక. 1973–80 మధ్య లెక్కలేనన్ని ప్రదర్శనలు, పురస్కారాల తరువాత జాతీయ నాటకంగా 14 భాషల్లో ఆకాశవాణిలో లెక్కలేనన్నిసార్లు ప్రసారం అయింది.

Tallavajhala Patanjali Shastri : పుస్తకం చూసి నాలిక కరుచుకున్నాను!

  • తల్లావజ్ఝల పతంజలిశాస్ర్తి

చేరాతలు సంచలనం కలిగిస్తున్నప్పుడు మిత్రులు చేకూరి రామారావు గారు, స్నేహభావంతో అనుకుంటాను ‘గుండె గోదావరి’ మీద ఒక వారం రాశారు. తరవాత ఎప్పుడో ఒకాయన అందులో కొన్ని కవితలను ఇంగ్లీషులోకి అనువదించారు. నాకు నచ్చక ముందుకి వెళ్లనివ్వలేదు. నాకు అప్పటికే నా పుస్తకం మీద ఆసక్తి పోయింది. కొంచె అటూ ఇటూగా నా కవితల పుస్తకం బారిస్టరు పార్వతీశం టోపీలా తయారైంది.

నిజానికి నేను అచ్చులో చూసుకున్న నా మొదటి పుస్తకం ఒక నాటిక. 1973–80 మధ్య లెక్కలేనన్ని ప్రదర్శనలు, పురస్కారాల తరువాత జాతీయ నాటకంగా 14 భాషల్లో ఆకాశవాణిలో లెక్కలేనన్నిసార్లు ప్రసారం అయింది. నా బాల్యమిత్రుడు, నటుడు వి.ఎస్‌. రామేశ్వరరావు కథ చెప్పగా, కూర్పు చేసి నాటకీకరించాను. అది టీవీ నాటకం అయిన తరువాత ఎవరో సినిమాగా తీశారు. నేను చూడలేదు. నాకు ఇప్పటికీ ఆ నాటిక చేసిన హడావుడి అర్థం కాలేదు.

వచన రచయితలు చాలామందికి కవిత్వం అంటే ఇష్టం. 1963 ప్రాంతంలో నేను ‘గాలిబ్‌ గీతాల’ కిక్కులో కొన్ని డజన్లు రాశాను. కానీ అప్పుడే నా కవిత ఏదో ఒక పత్రికలో వచ్చింది. 1971 నుంచీ చాలా కవిత్వం రాశాను. నేను కవిని కాదనే గ్రహింపు ఉండేది అప్పటికే. ఇప్పటికీ కథలు రాస్తున్నప్పుడు మధ్యలో, మార్జిన్లో గిలుకుతుంటాను. 2015లో అనుకుంటాను– ఉగాది కవి సమ్మేళనానికి నన్ను ఆహ్వానించ డానికి ప్రభుత్వ అధికారి ఒకాయన ప్రయత్నించాడు. ధన్యవాదాలు చెప్పి నేను కవిని కాదు గనక రాలేనని చెప్పుకున్నాను. ఆయన సంతోషించి ‘‘పది నిముషాల కవిత్వం చదవ డానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్‌ అధికారుల చేత ఒత్తిడి చేయిస్తారు’’ అన్నాడు.


1990లో ‘గుండె గోదావరి’ పేరుతో నా కవితా సంకలనం అచ్చయింది. అవన్నీ అంతకుముందు ఎప్పుడో రాసుకున్నవి. ఆ కాయితాలు దొరికిన ప్పుడు ఒక పుస్తకంలో తిరగ రాసుకు న్నాను. అప్పట్లోనే ‘మూగిదాని మానభంగం’ అని వలసల మీద దీర్ఘ కవిత రాశాను. ఆ రోజుల్లో నెలలో సగం పైగా హైదరాబాద్‌లో ఉండేవాడ్ని. ప్రసాద్‌ అనే బేంక్‌ మిత్రుడు ఒకసారి కవితల పుస్తకం చూసి ‘‘గురు గారూ, పుస్తకంగా వెయ్యండి సార్‌,’’ అన్నాడు. ఆ విషబీజం వేరూని నాలుగైదు రోజుల తరవాత అచ్చుకి పంపించాను. అందులో అక్షర దోషాలు వగైరాలున్నాయి. తరువాత దిద్దుబాట్లు చేసుకోవచ్చనుకున్నాను. నేను హైదరాబాద్‌కు వచ్చేశాను. అప్పటికి సుల్తాన్‌పూర్‌ పారిశ్రామిక కాలుష్య సమస్యలో పీకల దాకా మునిగి ఉన్నాం. ఢిల్లీ వెళ్లి PIL వేసే పనిలో ఉన్నాం. పుస్తకం తయారైందని తెలిసింది. మోహన్‌గారిని కలిసినప్పుడు ముఖచిత్రం గీసి ఇమ్మని అడిగేను. అతను నాలుగైదు రోజుల్లో బొమ్మ గీసి నేనుండే బంజారాహిల్స్‌కి శివాజీతో సహా తీసుకొచ్చాడు.

పుస్తకం అచ్చుకాకముందు తీసుకోవలసిన జాగ్రత్తలలో ఒక్కటి కూడా పట్టించుకోలేదు, ఎందుకో తెలీదు. అచ్చు అయిన దగ్గర్నుంచీ సుల్తాన్‌పూరు గొడవల్లో మునిగిపోయాను.


రాజమండ్రి వచ్చి పుస్తకం చూశాను. లోపల కొన్ని చదివి నాలిక బలంగా కరుచుకున్నాను. తెలుగు యూనివర్సిటీలో సాహిత్య సభలు జరిగేయి. మా అందరికీ మంచి కాలక్షేపంగా ఉండేది. పుస్తకం సభల సందర్భంగా ఆవిష్కరించాలనుకున్నాం. ఆచార్య జీవీ సుబ్రహ్మణ్యం గారు ప్రసంగించారు. మిత్రులు రామబ్రహ్మంగారు నడిపించారు. చాలామంది వచ్చేరు. యూనివర్సిటీ పని మీద వచ్చి సభని అలంకరించారు.

చేరాతలు సంచలనం కలిగిస్తున్నప్పుడు మిత్రులు చేకూరి రామారావు గారు, స్నేహభావంతో అనుకుంటాను, ‘గుండె గోదావరి’ మీద ఒక వారం రాశారు. తరవాత ఎప్పుడో ఒకాయన అందులో కొన్ని కవితలను ఇంగ్లీషులోకి అనువదించారు. నాకు నచ్చక ముందుకి వెళ్లనివ్వలేదు. నాకు అప్పటికే నా పుస్తకం మీద ఆసక్తి పోయింది. మరుసటి ఏడాది ‘వడ్ల చిలకలు’ కథా సంపుటి వేశాను. కొంచె అటూ ఇటూగా నా కవితల పుస్తకం బారిస్టరు పార్వతీశం టోపీలా తయారైంది.

-ఫోన్: 94407 03440

Updated Date - Jan 13 , 2025 | 05:31 AM