Share News

శేషం

ABN , Publish Date - Jan 06 , 2025 | 12:27 AM

సీతాకోక చిలక చివరి క్షణాల్లో ఆడంబరంగా అంజలి ఘటిస్తుంటావు నువ్వు, చీమనై దాని రెక్కల్ని తుంచుకుపోయి – వాటి మాసే రంగుల్లో పొర్లాడి మాయమౌతాను నేను...

శేషం

సాహిత్య వేదిక

బొమ్మలు: అక్బర్

సీతాకోక చిలక చివరి క్షణాల్లో

ఆడంబరంగా అంజలి ఘటిస్తుంటావు నువ్వు,

చీమనై దాని రెక్కల్ని తుంచుకుపోయి – వాటి

మాసే రంగుల్లో పొర్లాడి మాయమౌతాను నేను.

వేకువకు నేలరాలే రేరాణి పూల గంధాలతో లిప్తకాలాల శాశ్వత బంధాలను శ్వాసిస్తూ నేను,

చిన్న చిన్న సంతోషాలతో చెలిమి చేతకాక పంచేంద్రియాలూ పాడైన స్వనీతి ఆత్మని మోస్తూ నువ్వు.

అబద్ధ ప్రమాణాల వెలుగులో నిన్ను నువ్వు

ఆనందరాగాలాపనకి సిద్ధం చేసుకొనే వేళలో,

దక్కిన మధుపాత్రను చుంబిస్తూ చేదుగుళిక లన్నిట్ని చప్పరించి ఉమ్మేస్తుంటాను నేను.

నిన్ను మెప్పించేలా అనురాగాలను అరువిచ్చే నీలాంటి ఆత్మీయులే చుట్టూ దాపురించిన దారిద్ర్యం నీది,

నాలాగా – తమకోసమే తాము కళలై మెరిసే ఒకరో, ఇద్దరో సుదూర అదృశ్య ప్రియులున్న ఐశ్వర్యం నాది.


ఇహపర పారవశ్యాల్ని నటించడంలో జీవించే తేజో నక్షత్రానివి నువ్వు,

ఎదలో ‘‘ప్రవక్త’’ స్వరానికై ఎడారి దాహాలతో శిలువను మోసే బడుగుని నేను.

కానుకలూ, శుభాకాంక్షలూ, కొవ్వొత్తి నవ్వులు, ప్రేమ సందేశాలు, పాతదేహానికి కొత్త కొత్త అలంకరణలూ, లోకమంతా నువ్వు..

నీకర్థం కాని,

నిన్నటి ప్రేయసికీ, రేపటి ఊర్వశికి అంతే చిక్కని

యోగమేదో సిద్ధింపచేసుకొంటూ

కొండల్లో ప్రవహించే సెలయేరునై.. నేను.

సొలోమోన్ విజయ్ కుమార్

83413 36828

Updated Date - Jan 06 , 2025 | 12:32 AM