వారి వాదన న్యాయసమ్మతం కాదు
ABN , Publish Date - Jan 02 , 2025 | 05:28 AM
ఆంధ్రజ్యోతి దినపత్రికలో డిసెంబర్ 17న 30 మంది మాల మేధావులు కలిసి ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణపై రాసిన వ్యాసం ప్రచురితమైంది. ఈ మేధావులు వర్గీకరణ కోసం...
ఆంధ్రజ్యోతి దినపత్రికలో డిసెంబర్ 17న 30 మంది మాల మేధావులు కలిసి ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణపై రాసిన వ్యాసం ప్రచురితమైంది. ఈ మేధావులు వర్గీకరణ కోసం ఏర్పడిన ఏకసభ్య కమిషన్‌కు సమర్పించిన నివేదిక సంక్షిప్త పాఠంగా ఈ వ్యాసాన్ని పేర్కొన్నారు. వర్గీకరణ మీద ఇప్పటికైనా మౌనం వీడినందుకు మాల మేధావులను అభినందించకుండా ఉండలేకపోతున్నాం. మౌనం కంటే అభ్యంతరకరమైన వ్యక్తీకరణే మేలని పెద్దలు అంటారు. కానీ, అంతకు మించిన అన్యాయాన్ని వీరు ఆశ్రయించారు.
1. ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ మౌలిక స్వభావానికి విరుద్ధమని 341 ఆర్టికల్ స్ఫూర్తికి భిన్నంగా ఉందని మాల మేధావులు రాసారు. షెడ్యూల్డ్ కులాలకి సంబంధించిన మార్పులు పార్లమెంట్ వేదికగా జరగాలని అంబేడ్కర్ అన్నట్లు చెప్పారు. కానీ, అంబేడ్కర్ చాలా సందర్భాలలో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ ఫలాలను పొందటం ప్రాథమిక హక్కని వివరించారు. ఈ ఏడాది ఆగస్టు ఒకటిన సుప్రీం కోర్టు రాజ్యాంగ మౌలిక స్వభావమైన రాజ్యాంగ పీఠికను ప్రస్తావిస్తూ ఆర్టికల్ 14, 15, 16లను దృష్టిలో ఉంచుకొని ఈ తీర్పును వెలువరించింది. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ రాజ్యాంగ స్ఫూర్తిని మరింతగా పెంచుతుందనీ, సామాజిక న్యాయ భావనకు ఆలంబనగా ఉంటుందనీ న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. ఆర్టికల్ 341 షెడ్యూల్డ్ కులాల జాబితాలో ఒక కొత్త కులాన్ని చేర్చాలన్నా, అప్పటికే ఉన్న ఒక కులాన్ని తొలగించాలన్నా జరగవలసిన పార్లమెంటరీ విధివిధానాల గురించి మాట్లాడిందే తప్ప, వర్గీకరణ అంశాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. లేని విషయాన్ని మాల మేధావులు ఉన్నట్లుగా మాట్లాడుతూ, రాస్తూ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. కనుక వర్గీకరణ అనే విషయం 341 ఆర్టికల్ స్ఫూర్తికి భిన్నంగా కాకుండా, ప్రజాస్వామికంగా ఉందని ఈ మేధావులు గుర్తించాలి.
2. మాల మేధావులు ఎస్సీ కులాలకు సంబంధించిన రిజర్వేషన్లను ‘ఈక్విటీ’ తాత్వికత పునాదిగా వర్గీకరణ చేయాలని పేర్కొన్నారు. సమాజాన్ని సరైన మార్గంలో నడిపించాల్సిన మేధావులు ఇంత గందరగోళంలో ఉండటం ఒక సామాజిక సమూహానికే నష్టం చేస్తుందని వారు గుర్తిస్తే బాగుంటుంది. మొదటి అభిప్రాయంలో వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని చెబుతూ, రెండో అభిప్రాయానికి వచ్చేసరికి వర్గీకరణ జరగాలని రాయటం... రెండు వైరుధ్యాంశాల చుట్టూ వారి గందరగోళ ఆలోచన కేంద్రీకృతమైందని తెలుపుతోంది.
3. వర్గీకరణను సూత్ర రీత్యా అంగీకరించని మాల మేధావులు, వర్గీకరణ చేయడానికి కావలసిన సూచనలను ప్రభుత్వానికి ఇస్తున్నట్లు పేర్కొనటం హాస్యాస్పదంగా ఉంది. సుప్రీంకోర్టే స్వయంగా ‘ఎంపిరికల్’ డేటా ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ రిజర్వేషన్‌ను వర్గీకరించుకోవచ్చని స్పష్టంగా తీర్పును ఇచ్చింది. కానీ, ఈ మేధావులు ఏదో కొత్త విషయాన్ని చెబుతున్నట్లుగా, ఆయా సామాజిక వర్గాల పురోగతి, వెనుకబాటు తనాన్ని అంచనా వేయాలని తమ వ్యాసంలో ప్రస్తావించారు.
4. గడిచిన 75 సంవత్సరాలలో రాజ్యాంగ ఫలాలను ఏయే కులాలు ఎంత మేరకు పొందాయో గుర్తించాలని ఈ మాల మేధావులు రాసారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాలలోని నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగా ఎస్సీ రిజర్వేషన్‌ను వర్గీకరించుకోవచ్చని సూచించింది. రాష్ట్ర స్థాయిలో జరగాల్సిన ఈ ప్రాసెస్‌కు లేని అడ్డంకులు సృష్టించి, వర్గీకరణ జరగకుండా చూడాలనే దురుద్దేశంతో దేశవ్యాప్త గణన జరగాలని తమ వ్యాసంలో రాసారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా కులాలను రాజ్యాంగబద్ధంగా అభివృద్ధిపరిచే విధివిధానాలను రూపొందించుకోవచ్చని రాజ్యాంగంలోని ఫెడరల్ స్ఫూర్తి పేర్కొంటుంది. దీనికి అనుగుణంగానే వర్గీకరణ అంశంపై రాష్ట్రాల నిర్ణయాధికారానికి సుప్రీంకోర్టు అవకాశం కల్పించింది.
5. మాల మేధావులు వర్గీకరణ కోసం చేసిన మరో ప్రతిపాదనను చూస్తే వారి స్వార్థపూరిత ఆలోచనా విధానం స్పష్టమవుతుంది. మాల, మాదిగ ఉప కులాలను A గ్రూప్‌లో పెట్టి మాల, మాదిగలను B గ్రూప్‌లో ఉంచాలని ప్రతిపాదించారు. గత 30 ఏళ్లుగా వర్గీకరణ ఉద్యమం నడుస్తున్నది మెజారిటీ జనాభా కలిగిన మాదిగలకు విద్య, ఉపాధి, రాజకీయ అవకాశాల్లో అన్యాయం జరిగిందనే. రిజర్వేషన్లు కల్పించిన అవకాశాలలో 75 ఏళ్లలో మాలలు 70 శాతం ఉపయోగించుకున్నారని రామచంద్రరాజు, ఉషామెహ్రా కమిషన్ల నివేదికలు స్పష్టం చేసాయి. ఈ వాస్తవాన్ని పక్కన పెట్టి దోపిడి చేసినవారే మరింత దోపిడి చేయడానికి మాదిగలని తమతో పాటు ఉంచుకోవాలని కుట్ర పూరిత ఆలోచనలను చేస్తున్నారు. మాల, మాదిగలను ఒకే గ్రూప్‌లో పెట్టడం వల్ల తిరిగి మాలలే ఎక్కువ అవకాశాలను పొందడానికి ప్రాతిపాదికను సిద్ధం చేసుకున్నట్లు అవుతుంది. మాల, మాదిగల ఉపకులాలను మరో గ్రూప్‌లో పెట్టడం వల్ల ఇప్పటికే ఎదిగిన మాల ఉపకులాలు, మాదిగ ఉపకులాల అవకాశాలను కొల్లగొట్టే అవకాశం ఉంది. కనుక ఈ ప్రతిపాదన అశాస్త్రీయమైనది.
ఇన్ని భిన్నమైన వైరుధ్యాల నడుమ దళితుల మధ్య ఐక్యత సాధించాలంటే ఉన్న అవకాశాలను సమానంగా పంచుకోవటం ద్వారానే సాధ్యమవుతుంది. ఒకటి రెండు కులాలు, ఉన్న అవకాశాలను ఎప్పటికీ పొందుతూ పోతుంటే, విస్మరణకు గురైన కులాలలో అసంతృప్తి పెరుగుతుంది. ఈ అసంతృప్తే ఐక్యతకు అడ్డుగోడగా నిలబడింది. వర్గీకరణకు 30 ఏళ్లుగా కొందరు స్వార్థపర మాలలు అడ్డుపడటం వల్ల తెలుగు నేలమీద ఉజ్వలమైన పోరాటాలు చేసిన మాల, మాదిగల మధ్య మానసిక దూరం పెరిగింది. ఇప్పటికైనా వర్గీకరణను సూత్రప్రాయంగా అంగీకరిస్తూ కారంచేడు, చుండూరు లాంటి ఐక్య ఉద్యమాలను నిర్మాణం చేయాలని కాలం కోరుతోంది. దళితులకు భూమి, సంపద మీద హక్కు, రాజ్యాధికారం ఇప్పటికీ కలగానే మిగిలిపోయాయి. వీటిని సాధించాలంటే మన మధ్య ఉన్న అడ్డుగోడలను కూల్చవలసిన చారిత్రక సందర్భం ఇది.
ప్రొఫెసర్లు ఇటిక్యాల పురుషోత్తం, కె.కుమార్, గోవర్ధన్, కాశీం, ముత్తయ్య, డప్పు కనకయ్య, కృష్ణ, మల్లేశం, డైసీ, సూరేపల్లి సుజాత, విద్యాసాగర్; డా. ఆరెపల్లి రాజేందర్, డా. మధు, డా. రాజ్‌కుమార్, డా. సబితా, డా. పసునూరి రవీందర్, డా. చీమ శ్రీనివాస్, డా. పరంజ్యోతి, డా. తిప్పర్తి యాదయ్య, డా. సిద్దెంకి యాదగిరి, డా. జిలుకర శ్రీనివాస్, డా. గోగు శ్యామల, డా. కదిరే కృష్ణ, డా. బాబురావు, డా. ప్రతాప్, డా. మేడి శ్రీనివాస్, డా. కొరెముల శ్రీనివాస్; బొజ్జ భిక్షమయ్య, పల్లెర్ల వీరస్వామి, జూపాక సుభద్ర, గుడిపల్లి నిరంజన్, కృపాకర్ మాదిగ, జాజుల గౌరి, మేరీ మాదిగ, దేవేందర్ ప్రసాద్, మేడి రమేశ్, డప్పొళ్ల రమేశ్ తదితరులు.