Share News

వీధి నాటకానికి మూలస్తంభం

ABN , Publish Date - Jan 02 , 2025 | 05:30 AM

ఆ రోజు 1989 జనవరి 1. ప్రజలు నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్నారు. ఢిల్లీ సమీపంలోని, జండాపూర్, షాహిబాబాద్ ప్రాంతంలో నాలుగురోడ్ల కూడలిలో ఒక కళాకారుడు తన కళాకారుల బృందంతో ఒక నాటకాన్ని వేయిస్తూ...

వీధి నాటకానికి మూలస్తంభం

ఆ రోజు 1989 జనవరి 1. ప్రజలు నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్నారు. ఢిల్లీ సమీపంలోని, జండాపూర్, షాహిబాబాద్ ప్రాంతంలో నాలుగురోడ్ల కూడలిలో ఒక కళాకారుడు తన కళాకారుల బృందంతో ఒక నాటకాన్ని వేయిస్తూ పర్యవేక్షిస్తున్నాడు. ఆయనే ఆ నాటక రచయిత, దర్శకుడు. అంతలోనే కాగ్రెస్ పార్టీకి చెందిన ఒక నాయకుడు కొంతమంది అనుచరులతో వచ్చి ప్రదర్శనకారులను చుట్టుముట్టి వారిపై దాడికి పూనుకున్నాడు. ఆ కళాకారుడు తన బృందాన్ని వెళ్లిపొమ్మని తాను మాత్రం అక్కడే ఉండి గూండాలను ఎదిరించాడు. గూండాలు ఆయన్ని తీవ్రంగా గాయపరిచి పారిపోయారు. ఆ కళాకారుడు ఢిల్లీలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రెండవ రోజు మరణించాడు.

ఆ కళాకారుడే సఫ్దర్ హష్మి. ఆయన బృందం ప్రదర్శించిన నాటకం ‘హల్లాబోల్’ (‘‘నినదించు’’). అప్పటికి కొద్ది రోజులుగా జరుగుతున్న కార్మికుల సమ్మెకు మద్దతుగా, వారిని ప్రొత్సాహపరుస్తూ జరిగిన ప్రదర్శన అది. ఆ ప్రాంతంలోని కార్మికులు, ఇతరులు చుట్టూ గుమిగూడి నాటకాన్ని చూస్తున్నారు. ఇంతలోనే పై సంఘటన జరిగింది. అప్పటికి కొద్దిరోజుల క్రితమే ఆ బృందం చేతనే ‘చక్కా జాం’ నాటకం ప్రదర్శితమైంది. ‘చక్కా జాం’ అంటే ‘‘ఆగిన చక్రాలు’’. దానికి కొనసాగింపే ఈ ‘హల్లా బోల్’. సఫ్దర్ హష్మీ తన జీవితాన్ని వీధి నాటక ప్రక్రియకి అంకితం చేసిన కళాకారుడు. దోపిడీ రాజకీయ వికృత రూపాన్ని, జన జీవన స్థితిగతులను ప్రతిబింబించే నాటకాల ద్వారా ప్రజలను జాగరూకులను చేస్తున్న అయనను స్వార్థ రాజకీయ శక్తులు కత్తిగట్టి తుదముట్టించాయి.


12 ఏప్రిల్ 1954లో జన్మించిన ఆయన విద్యాభ్యాసం ఢిల్లీలో సాగింది. తరువాత ఆయన స్టీఫెన్స్ కాలేజీ నుండి ఇంగ్లీష్ లిటరేచర్‌లో బీఏ, ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి ఎమ్‌ఏ ఇంగ్లీష్ చేసాడు. ఈ కాలంలోనే ఎస్ఎఫ్ఐ, సాంస్కృతిక శాఖతో సంబంధాలు ఏర్పడ్డాయి. అప్పుడే అతనికి ‘ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్’ (ఇప్టా)తో కూడా సంబంధాలు ఏర్పడి అందులో క్రియాశీలక పాత్ర పోషించాడు. ఇప్టా కోసం కొన్ని నాటకాలు కూడా రాసాడు.

ఎమర్జెన్సీ కాలంలో హష్మీ ఢిల్లీ, కశ్మీర్ విశ్వవిద్యాలయాలలో ఇంగ్లీష్ లెక్చరరుగా ఉద్యోగం చేసాడు. కొంతకాలం ప్రెస్ ట్రస్ట్ అఫ్ ఇండియాకి, ది ఎకనామిక్ టైమ్స్‌కి జర్నలిస్టుగానూ పని చేసాడు. కొంతకాలం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి ఢిల్లీలో, ప్రెస్ ఇన్ఫర్మేషన్ అధికారిగా కూడా పనిచేసాడు. నాటక రచనలతో పాటు పిల్లల కోసం పాటలు, కథలు రాసాడు. దూరదర్శన్ కోసం కొన్ని డాక్యుమెంటరీలు నిర్మించాడు. 1979లో ఆయన మలయశ్రీని వివాహమాడాడు. భార్యతో కలిసి చాలా ప్రదర్శనలు ఇచ్చారు.


1973లో ఆయన ‘జన నాట్య మంచ్’ (జనమ్) అనే నాటక సంస్థను ఏర్పాటు చేశాడు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎన్నికలను రిగ్గింగ్ చేయిస్తే అయన ‘కుర్చీ, కుర్చీ, కుర్చీ’ అనే వ్యంగ్య నాటకాన్ని రాసి ప్రదర్శింపచేసాడు. 1975లో ప్రతిపక్షాలపై నిర్బంధం ఉన్న ఎమర్జెన్సీ సమయంలో ఆయన జనమ్ సంస్థ ద్వారా వీధుల్లోను, మురికి, కార్మిక వాడల్లోను నాలుగువేల పైచిలుకు వీధి నాటక ప్రదర్శనలు ఇచ్చాడు. హంగూ ఆర్భాటం లేకుండా ఉన్నది ఉన్నట్లు ప్రజల్లోకి వెళ్ళడానికి ఏకైక సాధనం వీధి నాటిక అని ఆయన నమ్మకం.

నిజానికి హష్మి మరణంతోనే అయన సృష్టించిన వీధి నాటకం అంతమైపోతుందని అనుకున్నారు. కానీ అందుకు భిన్నంగా జరిగింది. జనమ్, ప్రజానాట్యమండలి లాంటి సంస్థల కార్యకర్తలు వీధి నాటక ప్రక్రియను మరింత సుసంపన్నం, బలోపేతం చేసాయి. హష్మీ హత్య గావింపబడ్డ రెండవ రోజే అయన భార్య మలయశ్రీతో సహా జనమ్ కళాకారులు అదే చోట అదే నాటకాన్ని తిరిగి ప్రదర్శించారు. ఆనాటి ఆ ప్రదర్శనని సుమారు 500 మంది కవులు, కళాకారులూ, రచయితలు, మేధావులు తిలకించారనీ, విధ్వంసం జరిగిన వీధుల్లో మౌన ప్రదర్శన జరిపారని ఆనాటి పత్రికలు రాశాయి. నేడు హాష్మీ లేడు, కానీ ఆయన స్థాపించిన ‘జనమ్’ ఉంది. 2023లో ‘జనమ్’ అర్ధ శతాబ్ది ఉత్సవాలను జరుపుకుంది. వీధి నాటకాన్ని ప్రజల చెంతకు తీసుకు వెళ్లాలనే ఆశయంతో ‘జనమ్’ సంచార నాటకశాలను సమకూర్చుకుని, కొన్ని వేల ప్రదర్శనలు ఇచ్చింది. ‘జనమ్’ 2007లో అమెరికాలోనూ, 2013లో యూకేలోనూ తన ప్రదర్శనలు ఇచ్చింది. నేడు సఫ్దర్ పేరు వీధి నాటకానికి, అభ్యుదయ కళలకి మారు పేరైంది.

ఆయన మరణం తరువాత సఫ్దర్ హష్మీ మెమోరియల్ ట్రస్ట్ (సహ్మత్) ఏర్పడి వివిధ కల్చరల్ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఆయన హత్యకు గురైన చౌరస్తాలో ప్రతి ఏటా ఆయన వర్ధంతిని జనమ్, వామపక్ష సంస్థలు కలిసి నిర్వహిస్తాయి. ఈనాడు ఆ ప్రజా కళాకారుడు భౌతికంగా కనుమరుగైనా అయన సృష్టించిన వీధి నాటకం సజీవంగా మన మధ్యనే ఉంది.

పి. అరవింద కుమారి

(నేడు హష్మి 35వ వర్ధంతి)

Updated Date - Jan 02 , 2025 | 05:30 AM