Share News

ఎవరికి వారే ప్రత్యేకం..!

ABN , Publish Date - Jan 08 , 2025 | 12:30 AM

గత నెల 25న అటల్ బిహారీ వాజపేయి శతజయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ఉదయం 8 గంటలకు అనేక మంది నేతలు ఇంకా ప్రవేశించకముందే తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజ్ ఘాట్‌కు...

ఎవరికి వారే ప్రత్యేకం..!

గత నెల 25న అటల్ బిహారీ వాజపేయి శతజయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ఉదయం 8 గంటలకు అనేక మంది నేతలు ఇంకా ప్రవేశించకముందే తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజ్ ఘాట్‌కు చేరుకున్నారు. ఇంకా పొగమంచు ఢిల్లీని వీడలేదు. దట్టమైన చలిలో నేతలు కోట్లు, మఫ్లర్లు ధరించి అక్కడికి చేరుకోగా చంద్రబాబు సాధారణంగా ఎప్పుడూ ధరించే దుస్తులతో కనపడ్డారు. ‘మీరు చలిని అధిగమించినట్లున్నారే, మీనుంచి రాజకీయాలనే కాదు, ఆరోగ్యం గురించి కూడా తెలుసుకోవాలి’ అని కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా నవ్వుతూ ఆయనను ప్రశ్నించారు. చంద్రబాబును చూడగానే బీజేపీ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా, హోంమంత్రి అమిత్ షా ఆయనను తమ మధ్య కూర్చోబెట్టుకున్నారు. అటల్‌కు నివాళుల కార్యక్రమం అయిపోయిన తర్వాత కేంద్రమంత్రులు, బీజేపీ సీనియర్ నేతలు చంద్రబాబును ఒకరి తర్వాత మరొకరు పలకరించారు. ఆ తర్వాత నడ్డా, అమిత్ షా ఆధ్వర్యంలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు అదే రోజు మోదీ, అమిత్ షాతో సహా ఆరుగురు మంత్రులను కలుసుకున్నారు. ఒకరిద్దరు కేంద్రమంత్రులు చంద్రబాబును ఢిల్లీలోని ఆయన నివాసానికే వచ్చి కలుసుకున్నారు. ఉదయం 8 గంటల నుంచీ రాత్రి 9 గంటల వరకు ఖాళీ లేకుండా సమావేశాల్లో పాల్గొని హైదరాబాద్ వెళ్లిన చంద్రబాబు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించారని తెలియగానే మళ్లీ ఢిల్లీ తిరిగి వచ్చారు. ఎక్కడా ఆయన అలిసిపోయినట్లు కానీ, వయసు మీద పడినట్లు కానీ కనిపించలేదు. ‘మన్మోహన్ సింగ్ ఈ దేశంలో సంస్కరణలు ప్రవేశపెట్టిన ఉత్తమ ఆర్థికవేత్తే కాదు. రాజనీతిజ్ఞుడు. వైఎస్ హయాంలో నాకు భద్రతను ఉపసంహరించినా మన్మోహన్ సింగ్ జోక్యం చేసుకుని మళ్లీ భద్రతను కల్పించేలా చూశారు’ అని చంద్రబాబు టీడీపీ ఎంపీలకు చెప్పారు ఈ రెండు రోజులు జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు బలమైన ఉనికిని మరోసారి గుర్తు చేశాయి.


వాజపేయి, మన్మోహన్ సింగ్ ఇద్దరూ రాజకీయాలకు అతీతంగా వ్యవహరించినందువల్లే వారి మరణానంతరం కూడా వివిధ పక్షాల గౌరవాన్ని అందుకున్నారు. వాజపేయితో విభేదించినవారు కూడా ఆయన తమను పలకరించినంత మాత్రాన ఆయన ఆకర్షణకు లోనయ్యేవారు. తాను ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న సోనియాగాంధీతో కూడా ఆయన సత్సంబంధాలు కొనసాగించారు.

గత వారం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసినప్పుడు రాజకీయాల్లో ఇలాంటి విశాల హృదయులు, రాజనీతిజ్ఞులు కొరవడుతున్న విషయంపై చర్చ జరిగింది. ప్రస్తుతం వాజపేయి, మన్మోహన్ సింగ్ లాంటి నేతలు లేకపోవడం, ఒకర్నొకరు రాజకీయంగా అంతం చేసుకునే ప్రయత్నాలు చేయడం గురించి చర్చకు వచ్చింది. నిజానికి సంకీర్ణ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు కూడా అత్యంత కీలకమైన నిర్ణయాలు జరిగాయి. పీవీ నరసింహారావు హయాంలోని సంకీర్ణ ప్రభుత్వమే సంస్కరణలను ప్రవేశపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబు కన్వీనర్‌గా ఉన్న యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో 18 నెలల్లో వడ్డీ రేట్లపై నియంత్రణలు తొలగించడం, పన్నులపై కోత విధించడం వంటి చెప్పుకోదగ్గ సంస్కరణలు జరిగితే, వాజపేయి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో కూడా గ్రామీణ సడక్ యోజన, స్వర్ణ చతుర్భుజితో పాటు అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, సర్వశిక్షాఅభియాన్ లాంటి ప్రయోజనకరమైన పథకాలు అమలు అయ్యాయి. నాయకత్వానికి దూరదృష్టి, స్పష్టతా ఉంటే రాజకీయ అస్థిరతకూ బలమైన నిర్ణయాలు అమలు చేయడానికీ సంబంధం ఉండవలసిన పనిలేదు.


నాయకులు అంతా ఒకే విధంగా వ్యవహరించాలని ఎక్కడా లేదు. పీవీ, మన్మోహన్ వాజపేయిలతో పోలిస్తే నరేంద్రమోదీ అనుసరిస్తున్న తీరు భిన్నమైనది. అందుకు ప్రధాన కారణం ఆయన హయాంలో పార్టీ పూర్తి మెజారిటీ సాధించడం. పార్టీపైన, ప్రభుత్వంపైనే కాదు మొత్తం వ్యవస్థలపై మోదీ పట్టు బిగించారు. మొత్తం ప్రభుత్వ యంత్రాంగం, పార్టీ తన కేంద్రీకృతంగా నడిచేలా చూశారు. బలమైన నిర్ణయాలు తీసుకోవడమే కాదు, మొత్తం నిర్ణయాలు తీసుకునే క్రమంలో ప్రజాస్వామిక వైఖరి అనుసరించడం లేదన్న విమర్శలు ఎదుర్కొన్నారు. ప్రత్యర్థులను అణిచివేసేందుకు ఆయన ఏ మాత్రం వెనుకాడబోరనే అభిప్రాయం కల్పించారు. తన చుట్టూ ఉన్నవారిలో తానంటే భయం, భక్తి కనపడేలా చూసుకున్నారు. తాను తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదమైనా వాటిని వెనక్కు తీసుకునేందుకు ఆయన ఏ మాత్రం ప్రయత్నించలేదు. సంచలన, వివాదాస్పద, భావోద్వేగాలు కల్పించే వ్యాఖ్యలు చేయడంలో ఆయనకు ఆయనే సాటి. నరేంద్రమోదీ లాంటి వ్యక్తులు తమకు అనుకూలంగా, వ్యతిరేకంగా బలమైన శిబిరాలు ఏర్పడేలా చేసుకుంటారు. తద్వారా రెండు శిబిరాల్లోనూ ఆయన పేరే మారుమ్రోగేలా చేసుకుంటారు. ఇద్దరు వ్యక్తులు కలిసి రాజకీయాలు మాట్లాడుకుంటే పదినిమిషాల్లో ఒక్కసారైన నరేంద్రమోదీ పేరు వినిపించక తప్పదు. దేశంలో అనేక మంది నేతలను ఒకే రకమైన దుస్తుల్లో చూడడం ప్రజలకు అలవాటైతే మోదీని రకరకాల దుస్తుల్లో చూడడం కూడా వారికి అలవాటైంది. ఒకసారి తపోముద్రలో కనపడితే మరోసారి నీళ్లలో మునకలు వేస్తూ కనపడడం, మరోసారి నెమళ్లతో ఆడుకుంటూ, ఆవులకు దాణా వేస్తూ దర్శనం ఇవ్వడంలో మోదీకి మోదీయే సాటి. ప్రత్యర్థులపై ఎంత తీవ్రంగా, సైద్దాంతిక పరిభాషలో విరుచుకుపడగలరో, అదే సమయంలో చాలా అల్పమైన వాఖ్యలు చేసి ఈయన దేశ ప్రధానమంత్రేనా అన్న అనుమానాలు రేకెత్తించడం కూడా మోదీకి అలవాటే.


అయినప్పటికీ నరేంద్రమోదీపై ఆయనంటే పార్టీలో అసమ్మతి కానీ రణ గొణ ధ్వనులు కానీ ఏ మాత్రం వినిపించడం లేదు. దీనికి కారణం ఆయన నేతృత్వంలో పార్టీ ఘన విజయాలు చవి చూడడం. గత పదేళ్లలో జాతీయ స్థాయిలోనూ, అంతర్జాతీయ స్థాయిలోనూ బలమైన, గుర్తింపు గల నేతగా మోదీ ఆవిర్భవించారు. భారత రాజకీయాల్లో ఇంతటి ప్రభావశీల నాయకుడు కనిపించడం లేదు. ఈ బలమైన నాయకత్వమే ఆయనకు పార్టీలోనే కాక, ఎన్డీఏలోనూ ఆమోదయోగ్యత పెంచేలా చేసింది. నరేంద్రమోదీ శైలినచ్చనివారు కూడా ఆయనతో కలిసి నడిచేందుకు, ఆయన నాయకత్వాన్ని ఆమోదించేందుకు పూనుకున్నారంటే ప్రత్యామ్నాయం లేకపోవడమే కాదు, తమ తక్షణ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలనుకోవడం కూడా కారణం. తనతో స్నేహం చేసిన వారిని మోదీ విస్మరించబోరన్నది వారి ప్రగాఢ విశ్వాసం. మోదీ ఎలా ఉంటేనేం, ఫలితాలు సాధిస్తున్నారా లేదా అన్నది వారికి ముఖ్యం. లోక్‌సభ ఎన్నికల్లో సీట్లు తగ్గితేనేం. మళ్లీ హరియాణా, మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో నరేంద్రమోదీ బలహీనం అయ్యారన్న అభిప్రాయాలకు తెరపడింది. కార్పొరేట్ శక్తులన్నీ మోదీకి అనుకూలంగా మారడం ఆయనతో చేతులు కలిపేవారందరికీ ఉపయోగకరమని వేరే చెప్పనక్కర్లేదు. అదే సమయంలో మూడోసారి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మోదీ తనతో కలిసి వచ్చే వారిని విస్మరించబోననే సంకేతాలు పంపడం ప్రారంభించారు. తాను తగ్గినా నెగ్గినట్లే కనిపించడం మోదీ స్వభావం.


బలమైన నాయకులంతా ప్రజాస్వామికంగా వ్యవహరించవలసిన అవసరం లేదని, నియంత స్వభావం ఉన్నవారికి కూడా ప్రజలు ఆకర్షితులవుతారని ఇవాళ ప్రపంచ రాజకీయాలు కూడా నిరూపిస్తున్నాయి. లేకపోతే డోనాల్డ్ ట్రంప్. పుతిన్ లాంటి వారికి తిరుగులేకుండా పోవడమేమిటి? ట్రంప్ కూడా రెండు బలమైన అనుకూల, వ్యతిరేక శిబిరాలను ఏర్పర్చుకున్నారు. తాను మాట్లాడే అంశాలను ద్వేషంతోనైనా వినే వర్గాన్ని పెంచుకున్నారు. ఎప్పుడు భావోద్వేగాలు కల్పించాలో, ఎప్పుడు సంచలన వ్యాఖ్యలు చేయాలో ఆయనకు బాగా తెలుసు. అనూహ్యంగా వ్యవహరించడమే ఆయన శైలి. ఏది మాట్లాడినా వినేవారిని (ఆడియన్స్)ను కోల్పోకపోవడమే ఆయన విజయ రహస్యం. దాని వల్లే జార్జి బుష్ తర్వాత అత్యంత జనాదరణ పొంది, 75 మిలియన్ అమెరికన్ల ఓట్లు సంపాదించుకోగలిగారు. పుతిన్ కూడా సుదీర్ఘ కాలం రష్యా అధినేతగా ఉన్న కాలంలో తనను విస్మరించలేని పరిస్థితులను కల్పించుకున్నారు. ప్రజాస్వామ్యం, ప్రతిపక్షం లాంటి వాటిని డిక్షనరీలోంచి తీసేసి బలమైన, ప్రమాదకరమైన నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకంజ వేయకుండా ముందుకు సాగారు.


రాజకీయాల్లో వారసత్వం వల్ల జనం ఆదరిస్తారనే రోజులు పోయాయి. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీలతో ఆ కాలం చెల్లింది. రాహుల్‌గాంధీ గత రెండు దశాబ్దాలుగా తన ఉనికికోసం పోరాడుతూనే ఉన్నారు. నాయకత్వం లభించాలంటే కాలం కలిసి రావాలి. వాతావరణం పరిపక్వంగా మారాలి. సహజ నాయకుడుగా ఉద్భవించే సమయం కోసం వేచి చూడాలి. అప్పుడు వారసత్వం కూడా కలిసి వస్తుంది. సిద్దరామయ్య, రేవంత్‌రెడ్డి ఇద్దరూ కాంగ్రెస్ రాజకీయాల్లో జన్మించకపోయినా కాంగ్రెస్ ముఖ్యమంత్రులుగా నిలదొక్కుకున్నారు. బీజేపీలో హిమంత బిశ్వాస్ శర్మకు దక్కిన అవకాశమే కాంగ్రెస్‌లో వారికి లభించింది. అయినా సిద్దరామయ్య, రేవంత్‌రెడ్డిల శైలి వేరు. కాని ఇద్దరి సమస్యలు ఒక్కటే. కెరటాల్లా ముందుకు వచ్చినట్లే వచ్చి వెనక్కు తగ్గడం వారి తత్వంలా కనిపిస్తోంది. దేశలో అత్యంత సీనియర్ నాయకుడైన చంద్రబాబు కాలానుగుణంగా తనను తాను మార్చుకుంటూ వస్తున్నారు. తన విధానాలను, వ్యవహారశైలిని మార్చుకోవడానికి, చేసిన తప్పులు అంగీకరించడానికి ఆయన వెనుకాడడం లేదు. తనపై వస్తున్న విమర్శలేమిటో ఆయనకు తెలియనిది కాదు. కాని ఆయన ప్రాధాన్యతలు వేరు. ఆరునెలలు పూర్తి చేసుకున్న తర్వాత ఆయన తన చర్యల్లో వేగం పుంజుకునే టేకాఫ్ దశలో ఉన్నట్లు కనిపిస్తున్నారు.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - Jan 08 , 2025 | 12:30 AM