భావోద్వేగాల్ని అనువదించటం ముఖ్యం
ABN , Publish Date - Jan 06 , 2025 | 12:37 AM
దాసుకృష్ణమూర్తి వాక్యానికి వృద్ధాప్యం లేదు. 98 ఏళ్ల వయసులోనూ ఆయన రాస్తూ, అనువాదాలు చేస్తున్నారంటే నమ్మలేం. ముఖ్యంగా తెలుగు కథ అనువాదానికి ఆయన ఎనలేని కృషి చేస్తున్నారు. ఇటీవల ఆయన కూతురు తామ్రపర్ణితో కలసి తెలుగు నుంచి ఇంగ్లీషులోకి...
దాసుకృష్ణమూర్తి వాక్యానికి వృద్ధాప్యం లేదు. 98 ఏళ్ల వయసులోనూ ఆయన రాస్తూ, అనువాదాలు చేస్తున్నారంటే నమ్మలేం. ముఖ్యంగా తెలుగు కథ అనువాదానికి ఆయన ఎనలేని కృషి చేస్తున్నారు. ఇటీవల ఆయన కూతురు తామ్రపర్ణితో కలసి తెలుగు నుంచి ఇంగ్లీషులోకి అనువాదం చేసిన కథల పుస్తకాన్ని ప్రసిద్ధ పుస్తక ప్రచురణ సంస్థ అలేఫ్ బుక్ కంపెనీ ‘ద గ్రేటెస్ట్ తెలుగు స్టోరీస్ ఎవర్ టోల్డ్’ -పేరుతో ప్రచురించింది. ఇందులో 21 మంది తెలుగు రచయితల కథలు ఉన్నాయి. అంతకుముందు 2010లో మరికొంతమంది తెలుగు కథకుల రచనలను ‘1947 సంతోషా బాద్ పాసెంజర్ అండ్ అదర్ స్టోరీస్’ పేరుతో అనువాదం చేశారు (రూపా పబ్లికేషన్స్ ప్రచురణ). ప్రస్తుతం న్యూజెర్సీలో ఉంటున్న దాసు కృష్ణమూర్తి ఇంగ్లీషులో స్వతంత్ర రచనలూ చేశారు. కథలు రాసి ‘ద సీసైడ్ బ్రైడ్ అండ్ అదర్ స్టోరీస్’ (2019) పేరుతో ప్రచురించారు. అనువాదాలు అనేకం వస్తున్న ప్పటికీ నాణ్యత ఉండటం లేదని ఇంగ్లీషులో వస్తున్న తెలుగు అనువాదాల్లో నాణ్యత పెంచడమే తన లక్ష్యమని చెబుతున్న దాసు కృష్ణమూర్తితో సంభాషణ.
ఇంటర్వ్యూ : వేంపల్లె షరీఫ్
ఈ వయసులోనూ అనువాద ప్రక్రియ మీద మీకెందుకు ఇంత పట్టుదల కలిగింది? మీ ప్రేరణ ఏమిటి?
నా కూతురు తామ్రపర్ణి అమెరికాలో ఉంటోంది. నేను, నా భార్య తరచూ ఇక్కడికి వచ్చేవాళ్లం. ఇక్కడున్న తెలుగువాళ్లకు తెలుగు సాహిత్యం, రచయితల గురించి పెద్దగా తెలియదని అర్థమైంది. అప్పుడే ఏదైనా చేయా లనుకున్నాం. నా భార్య చనిపో యాక పూర్తిగా ఒంటివాణ్ణి అయిపోయాను. అమెరికా లోనే కూతురు, అల్లుడి దగ్గర ఉండాల్సి వస్తోంది. ఇక నన్ను నేను ఎంగేజ్ చేసుకోవడానికి అనువాదాలు మొదలుపెట్టాను.
2006లో నేను, నా కుమార్తె తెలుగులో వస్తున్న కల్పనా సాహిత్యాన్ని ఇంగ్లీషులోకి అనువదించి ప్రచురించాలని గట్టిగా ప్రయత్నం మొదలుపెట్టాం. తెలుగులో ఉన్న అద్భుతమైన సాహిత్యం, రచయితల గురించి అమెరికాలో ఉన్న వారికి తెలియాలని ‘లిటరరీ వాయిస్ ఆఫ్ ఇండియా’ పేరుతో వెబ్ సైట్‌ని ప్రారంభించాం. ఇందులో ముఖ్యంగా భారతదేశంలో ఉన్న విభిన్న సంస్కృతులకు, పెద్దగా వెలుగులోకి రాని జీవితా లకు ప్రాధాన్యత ఇచ్చి వారి సాహిత్యాన్నే ప్రచురించాం.
ఇక వయసు అంటారా– క్రియేటివిటీ అనేది మనసుకు సంబంధించింది. మనసుకు వయసు లేనట్టే సృజనకు కూడా లేదు. అనువాదాల మీద నాకున్న గాఢమైన ఇష్టమూ, నా కూతురూ అల్లుడి సహకారాలే నన్ను నడుపుతున్నాయి.
తెలుగు రచనలు ఇంగ్లీషు అనువాదానికి సులువుగా ఇమడవు అంటారు, ఎంత వరకు వాస్తవం?
కరెక్టు కాదు అనుకుంటాను. ఎందుకంటే కొన్నిసార్లు ఒకే భాషలో కూడా ఒకే సాంస్కృతిక పదాలు ఉండవు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలే అందుకు కచ్చితమైన నిదర్శనాలు. అయితే భాషలు వేరైనా, సంస్కృతులు వేరైనా మనుషులకు అనుభవాలు ఎక్కడైనా ఇంచుమించు ఒకేలా ఉంటాయి. ఆ అనుభవాలే సాహి త్యంలో మనుషులను సహానుభూతి పొందేలా చేస్తాయి. అది గుర్తించిన ప్పుడు కథను, భావోద్వేగాన్ని ఒక భాష నుంచి మరో భాషలోకి తీసుకెళ్లడం సులువు అవుతుంది.
ఇన్నేళ్ల అనువాద కృషిలో మీరు గమనించిన అంశాలు?
భాషలు సంస్కృతులకు పుట్టిన పాపలు. ఇంగ్లీషులో ‘mouse’ (ఒక కంప్యూటర్ భాగం)ని తెలుగులోకి ఎలా అనువదించడం. అలాగే ‘Fox-trot’, ఇంకా ‘Halloween’ లాంటివన్నీ ఎలా అనువదించగలం. రెండు సాంస్కృతిక నేపథ్యాలు వేరుగా ఉన్నప్పుడు వాటి మధ్య ఆమోదయోగ్య మైన పదాన్ని నిర్మించడం సవాలుతో కూడుకున్న పనేకానీ అసాధ్యమైతే కాదు. ఇది నేను గమనించింది.
అనువాదంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు?
ప్రధాన సమస్య ఏంటంటే మూలంలో ఉన్న భావాన్ని ఉన్నదున్నట్టు అనువాదం చేయడమా లేక కొంత మెరుగు పర్చడమా అన్నది. అయితే మెరుగుపరిచే ఉద్దేశ్యంతో ఎట్టి పరిస్థితిల్లోనూ మూల రచయిత అసలు ఉద్దేశ్యాన్ని చెడగొట్ట కూడదు కదా. అతని చూపుని, దృష్టి కోణాన్ని కూడా అను వాదంలో చెడకుండా చూసుకోవాలి. ఈ పరిమితులకు లోబడి వీలైనంతవరకు మూల భాషలోని అర్థానికి అనువాద భాషలో ఉన్న సరైన పదాలనే వాడటానికి ప్రయత్నిస్తాను.
అనువాదానికి ఎలాంటి రచనలు ఎంచుకుంటారు?
చాలావరకు బలమైన పాత్రలు, సంఘటనలు, సామాజిక అంశాలున్న కథలను ఎంచుకుంటాం. వేంపల్లె షరీఫ్ రాసిన ‘పర్దా’ (ది కర్టెన్) కథనే తీసుకుందాం. తన కొడుకు నిర్బంధ సామాజిక నిబంధనలను ధిక్కరించే ఒక వృద్ధ మహిళ కథ అది. అలాగే అద్దేపల్లి ప్రభు రాసిన ‘అతడు మనిషి’ (ఏన్ ఐడియల్ మేన్) కథలోనూ పైన చెప్పిన మూడు లక్షణాలు ఉన్నాయి.
మంచి అనువాదాలు పెరగాలంటే ఏం చేయాలి?
రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సాహిత్య అనువాదాలను ప్రోత్స హించాలి. ఉదాహరణకు తమిళనాడు ప్రభుత్వం అనువాదా లను విపరీతంగా ప్రోత్సహిస్తోంది. అనువాదం అంటే కేవలం మన సాహిత్యం ఇతర భాషల్లోకి వెళ్లడం కాదు, ఇతర భాషల సాహిత్యాన్ని మన భాషలోకి తెచ్చుకోవడం కూడా. అలాగే ప్రచురణ సంస్థలు సైతం జాతీయ స్థాయిలో అనువాదాల కోసం ఎంతో కృషి చేస్తున్నాయి. తాజాగా అలెఫ్ (Aleph) బుక్ కంపెనీ వారు తెస్తున్న ‘ది గ్రేటెస్ట్ స్టోరీస్ ఎవర్ టోల్డ్ సిరీస్’కి విపరీతంగా గుర్తింపు ఉంది. భారతీయ భాషలన్నింటి లోంచి వారు కథలను అనువదించి ఇంగ్లీషులో పుస్తకాలు వేస్తున్నారు.
మీ అనువాదాలకు వచ్చిన పెద్ద ప్రశంస ఏది?
అలెఫ్ బుక్ కంపెనీ ప్రచురించిన మా పుస్తకం ‘ది గ్రేటెస్ట్ తెలుగు స్టోరీస్ ఎవర్ టోల్డ్’ దేశవ్యాప్తంగా బాగా అమ్ముడవు తోంది. అనువాదం బావుందని చాలామంది మెసేజులు పంపారు. మా మరో పుస్తకాన్ని ప్రచురించిన రూపా పబ్లికే షన్స్ మమ్మల్ని మంచి అనువాదకులుగా పేర్కొంది. తెలుగులో ప్రముఖ రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి ‘‘దాసు కృష్ణమూర్తి నా కథను అనువదించడానికి అంగీకరించడం గౌరవంగా భావిస్తున్నాను’’ అన్నారు. కవన శర్మ ‘‘మీ ప్రయత్నాలు తెలుగు కథకు, రచయితలకు ఎంతో మేలు చేస్తాయి’’ అన్నారు. అనువాదం విలువ అందరికీ తెలియకపోవచ్చు కానీ ఇలాంటి రచయితలకైతే తప్పక తెలుసని నా నమ్మకం.
ప్రస్తుతం మీరు ఏమి రచనలు చేస్తున్నారు?
ఇప్పుడు నేను నా భార్యకు సంబంధించిన పుస్తకంపై పనిచేస్తున్నాను. మా సంకలనాలను చూడ్డానికి ఆమె లేదు. నేను బతికిన్నాళ్లు నాకు ఆమె ఒక శక్తి కింద పని చేసింది. అయితే ఆమె దూరమై 23 సంవత్సరాలు అవుతున్నా ఆమె స్ఫూర్తి నన్ను నడిపిస్తూనే ఉంది.
దాసు కృష్ణమూర్తి
2006లో నేను, నా కుమార్తె తెలుగులో వస్తున్న కల్పనా సాహిత్యాన్ని ఇంగ్లీషులోకి అనువదించి ప్రచురించాలని గట్టిగా ప్రయత్నం మొదలుపెట్టాం. తెలుగులో ఉన్న అద్భుతమైన సాహిత్యం, రచయితల గురించి అమెరికాలో ఉన్నవారికి తెలియాలని ‘లిటరరీ వాయిస్ ఆఫ్ ఇండియా’ పేరుతో వెబ్‌సైట్‌ని ప్రారంభించాం.