Share News

‘గాంధీ’ పేరులేని ఏ నేతను మీరు గౌరవించారు?

ABN , Publish Date - Jan 02 , 2025 | 05:25 AM

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అంతిమయాత్రను మీడియా, సోషల్‌ మీడియాల్లో చూసినవారు కాంగ్రెస్‌ నకిలీ గాంధీలను మాత్రమే గౌరవిస్తుందని, దిగ్గజాలను సైతం అవమానిస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు. మన్మోహన్ సింగ్ ప్రజా నాయకుడేమీ కాదని...

‘గాంధీ’ పేరులేని ఏ నేతను మీరు గౌరవించారు?

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అంతిమయాత్రను మీడియా, సోషల్‌ మీడియాల్లో చూసినవారు కాంగ్రెస్‌ నకిలీ గాంధీలను మాత్రమే గౌరవిస్తుందని, దిగ్గజాలను సైతం అవమానిస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు. మన్మోహన్ సింగ్ ప్రజా నాయకుడేమీ కాదని, గాంధీల కంటే గొప్పవాడు కాదని సంకేతం ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఎవరినీ అంతిమ యాత్ర వాహనం దరిదాపుల్లోకి రానివ్వలేదు. ఒంటరిగా, భారంగా మన్మోహన్‌ సింగ్‌ అంతిమయాత్ర సాగింది. రాహుల్‌గాంధీ తాను యువరాజునన్నట్లుగా అంతిమ యాత్ర వాహనం మీద కూర్చున్నారు. అంతేతప్ప గౌరవసూచకంగా నడుద్దామని కూడా ఆలోచించలేదు. 74 సంవత్సరాల వయస్సులో ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ వాజపేయి అంతిమ యాత్ర ముందు నాలుగు కిలోమీటర్లు నడిచారు. వాజపేయి అంతిమ యాత్ర కొన్ని వేలమంది మధ్య సాగింది. ప్రధాని మోదీతో పాటు బీజేపీ ముఖ్యనేతలంతా అంతిమయాత్రలో నడుస్తూనే పాల్గొన్నారు. బీజేపీ ప్రధాన కార్యాలయం నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలోని రాష్ట్రీ స్మృతి స్థలం వరకూ నడుచుకూంటూనే వెళ్లారు. అది తమ పార్టీకి, దేశానికి నిస్వార్థంగా సేవ చేసిన నాయకుడికి బీజేపీ ఇచ్చిన గౌరవం.


మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం అత్యున్నత గౌరవంతో కూడిన వీడ్కోలును ఇచ్చింది. నిగమ్ బోధ్‌లో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తే కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేసింది. మన్మోహన్ స్మారకం నిర్మించేందుకు స్థలాన్ని కేంద్రం కేటాయించిందన్న విషయాన్ని దాచిపెట్టి తప్పుడు ప్రకటనలు చేసింది. అంతేనా! అంత్యక్రియలు చేసినప్పుడు వీడియోల్లో కాంగ్రెస్ నేతలు కనపడలేదని కూడా పవన్ ఖేరా వంటి వారు ఆరోపించడాన్ని బట్టి మన్మోహన్‌ మరణాన్ని రాజకీయ లబ్ధికి ఎలా వాడుకోవాలో వారు ముందే మేథోమథనం చేసినట్లుగా అర్థం చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్‌ను అవమానించిందని ఏకపక్షంగా ఆరోపించిన రాహుల్‌గాంధీ సంతాప దినాల్లోనూ నూతన సంవత్సర వేడుకలకు వియత్నాం వెళ్లిపోయారు. ఇదా కాంగ్రెస్ పార్టీకి గొప్ప సేవలు చేసిన మన్మోహన్‌కు ఇచ్చే గౌరవం?

మన్మోహన్‌కు గౌరవంపై కాంగ్రెస్ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ దిగ్గజాల్లో ఒకరు అయిన ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ట ముఖర్జీ వ్యక్తం చేసిన అభిప్రాయాలు నకిలీ గాంధీల అసలైన ముఖాలను బయటపెట్టేలా ఉన్నాయి. ప్రణబ్ ముఖర్జీ కోసం ఘాట్ నిర్మాణం చేయాలని అడగలేదేమని ఆమె అడిగిన ప్రశ్నకు సమాధానం లేదు. అలాగే తెలుగు దిగ్గజమైన పీవీ నరసింహారావుకు కాంగ్రెస్ చేసిన అవమానాన్ని అందరూ గుర్తుచేసుకుంటున్నారు. పీవీ నరసింహారావుకు రెండు గజాల స్థలం కేటాయించలేదనీ, గాంధీ కుటుంబానికి కాకుండా కాంగ్రెస్ ఎవరికైనా భారతరత్న ఇచ్చిందా అనీ పీవీ నరసింహారావు సోదరుడు మనోహర్‌రావు సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ నిర్వాకం కారణంగానే దేశ రాజధానిలో ఘాట్ లేని ఏకైక ప్రధానిగా పీవీ నరసింహారావు మిగిలిపోయారు. ఇంతటి అవమానం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? దేశాన్ని ఆర్థికంగా గట్టెక్కించిన పీవీ నరసింహారావుకు భారతరత్న ఇచ్చి గౌరవించింది బీజేపీ. దేశానికి సేవ చేసినవారు ఎవరైనా సరే బీజేపీకి ముఖ్యమేననీ, ఇందులో పార్టీ తేడాలు ఏమీ ఉండవనీ ఎన్నోసార్లు నిరూపించింది. దేశాన్ని ఆర్థికంగా గట్టెక్కించిన నేతగా పీవీ నరసింహారావును అందరూ గౌరవిస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆయన పార్థివ దేహాన్ని ఏఐసీసీ ఆఫీసులోకి కూడా రానివ్వలేదు. అసలు ఢిల్లీలోనే అంత్యక్రియలు జరపకుండా హైదరాబాద్‌కు పంపించివేశారు. పోనీ హైదరాబాద్‌లో అయినా గౌరవంగా చేశారా అంటే అదీ లేదు. భారతరత్న అటల్ బిహారీ వాజపేయి పరమపదించినప్పుడు బీజేపీ ముఖ్యనేత అమిత్ షా స్వయంగా ఆయన అస్థికల్ని పవిత్ర నదుల్లో కలిపారు. నాయకుడు అంటే ఈ రకమైన అభిమానం రాజకీయ పార్టీకి ఉండాలి.


ఉక్కుమనిషిగా దేశాన్ని బలోపేతం చేసిన సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌ను కాంగ్రెస్ ఎప్పుడైనా గుర్తించిందా? ఆయనను స్మరించుకోవడానికి ఏదైనా ఒక స్మారక కట్టడాన్ని కాంగ్రెస్ పార్టీ కట్టించిందా? ప్రధాని అవ్వాల్సిన ఆయనను ఉప ప్రధానిగా ఉంచింది. చనిపోయిన తర్వాత పూర్తిగా ఆయన పేరు ప్రఖ్యాతులను గాంధీ కుటుంబం కోసం మరుగునపడేలా చేసింది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే పటేల్‌కు గుర్తింపు లభించింది. స్టాట్యూ ఆఫ్ యూనిటీని నిర్మించి ఆయన ఉన్నతిని ఆకాశమంత స్థాయిలో నిలబెట్టింది. గాంధీ కుటుంబం నుంచి కాకుండా కాంగ్రెస్ నుంచి ప్రధాని అయిన మరో దిగ్గజ నేత లాల్ బహదూర్ శాస్త్రిని కూడా కాంగ్రెస్ గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేయదు. ఆయన మరణంపై ఉన్న అనుమానాలపై చర్చ జరగకుండా అడ్డుకుంది. రెండుసార్లు పదమూడు రోజులు ప్రధానిగా పని చేసిన గుల్జారీలాల్ నందాను, ఉపప్రధానిగా చేసిన మొరార్జీ దేశాయ్‌ను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ తమ పార్టీ నేతలుగా గుర్తించినట్లుగా కనిపించలేదు. ఇంత ఘోరమైన గత చరిత్రను పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఎవరిపై నిందలు వేయాలని అనుకుంటోంది? కాంగ్రెస్ ఇప్పటికీ పాత చింతకాయ పచ్చడి రాజకీయాలు చేస్తూ ఏదో బావుకుందామని అనుకుంటోంది. కానీ ప్రజలు ఆ నీచ రాజకీయాలను అసహ్యించుకుంటున్నారు.

ఎస్. విష్ణువర్థన్‌రెడ్డి

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు

Updated Date - Jan 02 , 2025 | 05:25 AM