Share News

వికేంద్రీకరణతో సమ అభివృద్ధి

ABN , Publish Date - Jan 08 , 2025 | 12:28 AM

భారత్‌కు విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి; భారతీయ యువజనులేమో మెరుగైన విద్యకు విదేశాలకు వెళ్లుతున్నారు! ఆ విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత అక్కడే ఉపాధి...

వికేంద్రీకరణతో సమ అభివృద్ధి

భారత్‌కు విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి; భారతీయ యువజనులేమో మెరుగైన విద్యకు విదేశాలకు వెళ్లుతున్నారు! ఆ విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత అక్కడే ఉపాధి అవకాశాలు అన్వేషించుకుని స్ధిరపడుతున్నారు. ఈ రెండు వాస్తవాలు వర్తమాన భారతీయ సమాజ విచిత్ర వైరుధ్యాలు కావూ?

ప్రభవిస్తున్న నవ భారతంలో వాణిజ్య, పారిశ్రామిక, సేవా రంగాలలో భారీ పెట్టుబడులతో విదేశీ సంస్ధలు ప్రవేశిస్తుండగా, సరైన ఉపాధి, విద్యావకాశాలు లేక భారతీయ యువత విదేశాలకు వెళ్లుతోంది. నెలకు సగటున 450 కోట్ల డాలర్ల విదేశీ పెట్టుబడులు వస్తున్నాయి. ఇది, నిస్సందేహాంగా భారత్‌ శీఘ్ర పురోగతికి ఒక సూచిక. అయితే నెలకు సగటున రెండు లక్షల మంది ఉపాధి ఆవకాశాలను వెతుక్కుంటూ విదేశాలకు వెళ్లవలసి రావడం తిరోగమనానికి సంకేతమనేది అవిస్మరణీయం.

విదేశీ పెట్టుబడులను అత్యధికంగా సాధించే రాష్ట్రం గుజరాత్. అయితే అక్రమ మార్గాల్లో అమెరికాకు వెళ్లుతున్న వారిలో అత్యధికంగా ఉంటున్నవారు గుజరాతీ యువజనులే అన్నది ఒక కఠోర వాస్తవం. అత్యధిక విదేశీ పెట్టుబడులను పొందే దేశం చైనా. చైనా పౌరులు ఎవరూ ఉపాధి వలసలకు స్వదేశ సరిహద్దులు దాటి వెళ్లరు మరి.


మౌలిక సదుపాయాల వసతులతో పాటు పరిశ్రమలో పని చేయడానికి అవసరమైన మానవ వనరులు కూడ చాలా అవసరమనే విషయాన్ని భారతీయ పాలకులు విస్మరిస్తున్నారు. తమ యువతకు సాఫ్ట్‌వేర్ శిక్షణ ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలు అంతర్జాతీయ సాఫ్ట్‌వేర్ సంస్ధలు తమ వద్దకు వచ్చే విధంగా చేసుకోవడంలో సఫలమయ్యాయి. ఈ సాఫల్యతను ఇతర రంగాలలోనూ మరింతగా సాధించవలసిన అవశ్యకత ఉంది.


విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో దక్షిణాదిలో ప్రథమ స్థానం తమిళనాడుదే అని మరి చెప్పనవసరం లేదు. ఐటితో పాటు ఇతర రంగాలను ఆ రాష్ట్రం వ్యూహాత్మకంగా అభివృద్ధి చేస్తోంది. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ ఉత్పాదక రంగంలో విదేశీ పెట్టుబడులు సింహభాగం ఆ రాష్ట్రానికే వెళతాయి. ఈ రంగాలకు అవసరమైన నైపుణ్యతతో కూడిన మానవ వనరులను అభివృద్ధిపరచి విదేశీ సంస్థలకు అందుబాటులో ఉంచుతుంది. ఈ కారణాన శాంసంగ్‌తో సహా అనేక విదేశీ సంస్ధలు తమిళనాడును ఎంచుకుంటున్నాయి. దేశంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ వాహనాలలో దాదాపు సగం వరకు ఒక్క తమిళనాడు నుంచే వస్తున్నాయి. విద్యుత్ వాహనాల ఉత్పత్తిలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వియత్నాం కంపెనీ విన్ ఫాస్ట్ రూ. 16 వేల కోట్ల రూపాయల పెట్టుబడికి తమిళనాడునే ఎంచుకున్నది. ఈ ఒక్క పరిశ్రమతో 20 వేల మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడ్డాయి. పైగా తమిళనాడులోని విభిన్న ప్రాంతాలలో క్లస్టర్ల ఏర్పాటుతో సమ అభివృద్ధికి ఆస్కారమేర్పడుతుంది.


ఐటి నైపుణ్యత అభివృద్ధి ద్వారా అటు పెట్టుబడులు ఇటు ఉపాధి అవకాశాలను పెంపొందించిన అనుభవంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు చమురు రంగంలో పెట్టుబడులతో పాటు పెట్రో కెమికల్స్ విశ్వవిద్యాలయంపై దృష్టి పెట్టారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే అంతగా అనుకూల పరిస్ధితులు లేకున్నా ఉత్తరప్రదేశ్‌కు సైతం విదేశీ పెట్టుబడులు భారీగా రావడం గమనార్హం. తెలంగాణ సైతం విదేశీ పెట్టుబడుల విషయంలో ప్రశంసనీయమైన రీతిలో ముందుకు వెళ్లుతోంది. ఖాళీ ఖజానాతో తాము అధికార బాధ్యతలు స్వీకరించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరుచు ప్రస్తావిస్తుంటారు. ఇది, స్ధానిక రాజకీయ కోణంలో అనుకూలిస్తున్నా పెట్టుబడుల దృక్పథంతో పరిశీలిస్తే ప్రతికూలంగా మారే పరిస్ధితులు ఉన్నాయి. అయినప్పటికీ తెలంగాణకు విదేశీ పెట్టుబడులు వస్తుండడం హర్షణీయం. గత ప్రభుత్వం తరహా కార్పొరేటీకరణ, ప్రచార అర్భాటం లేకుండా రేవంత్ సర్కార్‌ ఈ దిశగా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో తెలంగాణలో అదానీ పెట్టుబడులను ఒక వ్యాపారాత్మక దృష్టితో చూడాలి కానీ రాజకీయ కోణంతో కాదు. కేరళలో వామపక్ష ప్రభుత్వం కూడా అదానీ పెట్టుబడులను స్వాగతించిందనే విషయాన్ని విస్మరించకూడదు.


అధికార బాధ్యతలు స్వీకరించిన కొద్ది వారాలకే రేవంత్‌రెడ్డి ప్రపంచ పెట్టుబడుల సదస్సులో పాల్గొనడానికి స్విట్జర్లాండ్ వెళ్లారు. గత ప్రభుత్వ హయాంతో పోల్చితే ఈ సారి 33 శాతం అదనంగా పెట్టుబడులను తెలంగాణ సాధించినట్లుగా కేంద్రం విడుదల చేసిన గణంకాలు వెల్లడించాయి. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో తెలంగాణకు వచ్చిన రూ. 12,864 కోట్లు హైదరాబాద్, దాని పరిసర ప్రాంతాలకు రావడం జరిగింది. పెట్టుబడులకు తోడుగా రేవంత్‌రెడ్డి సర్కార్ స్కిల్‌ యూనివర్శిటీని కూడా శరవేగంగా అభివృద్ధి చేస్తోంది. పెట్టుబడులతో రాష్ట్రానికి వచ్చే పారిశ్రామికవేత్తల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యత కల్గిన యువతను అందించే ఈ విశ్వవిద్యాలయం మదుపుదారులకు అదనపు ఆకర్షణగా ఉంటుందనడంలో సందేహం లేదు, పెట్టుబడులతో పాటు ఈ విశ్వవిద్యాలయ ప్రాంగణాలను హైద్రాబాద్‌ను దాటి ఇతర ప్రాంతాలలోను విస్తరింప చేసే దిశగా అలోచించాలి.

పెట్టుబడులను ఆకర్షించడంలో దేశీయంగా తమిళనాడు, అంతర్జాతీయంగా చైనా, సౌదీ అరేబియాలు అనుసరించే విధానాలను ఆదర్శంగా తీసుకోవలిసిన అవసరమున్నది. విదేశీ పెట్టుబడుల ద్వారా తెలంగాణలో ఉత్పన్నమయ్యే అభివృద్ధి, ఉపాధి అవకాశాలను సమరీతిలో వికేంద్రీకరిస్తే ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టినట్లవుతుంది.

మొహమ్మద్ ఇర్ఫాన్

(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)

Updated Date - Jan 08 , 2025 | 12:28 AM