‘మైసిన్’ మందుల మాంత్రికుడు ‘యల్లాప్రగడ’
ABN , Publish Date - Jan 10 , 2025 | 06:04 AM
బహుళ ప్రజాదరణ పొందిన టెర్రా‘మైసిన్’ మందును కనుగొన్నది మన తెలుగువాడయిన డా. యల్లాప్రగడ సుబ్బారావు. ఈయన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో 1895, జనవరి 12న నిరుపేద...
బహుళ ప్రజాదరణ పొందిన టెర్రా‘మైసిన్’ మందును కనుగొన్నది మన తెలుగువాడయిన డా. యల్లాప్రగడ సుబ్బారావు. ఈయన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో 1895, జనవరి 12న నిరుపేద సనాతన సంప్రదాయ కుటుంబంలో జన్మించారు. బాల్యంలో అనేక కష్టాలను అధిగమించి చదువుకుని, విదేశీ వైద్య పరిశోధనల నిమిత్తం కాకినాడ ‘సత్యలింగం నాయికర్ ట్రస్ట్’ వారి ఉపకార వేతనం పొందారు. అమెరికాలో రాత్రీ పగలు కష్టపడుతూ తన ప్రతిభా పాటవాలతో ‘స్కాలర్‌షిప్’లు సంపాదిస్తూ వైద్య పరిశోధనలు కొనసాగించారు.
1922లో నోబెల్ బహుమతి అందుకున్న సిద్ధాంతాన్ని సుబ్బారావు పరిశోధనాత్మకంగా పరిశీలించి, అర్థవంతంగా లేదని రుజువు చేశారు. ఆ సిద్ధాంతంపైనే మళ్లీ పరిశోధన సాగించి, దిగ్భ్రాంతి గొలిపేలా సరికొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఆ సిద్ధాంతమే ‘డా. ఫిస్కే–సుబ్బారావు మెథడ్’గా నేటి వైద్య కళాశాలల్లో పాఠ్యాంశంగా ఉంది. ఇది ప్రపంచ వైద్య పరిశోధనా రంగంలో ఒక అనూహ్యమైన చారిత్రాత్మక సంఘటన.
‘న్యారోస్పెక్ట్రమ్ యాంటి బయాటిక్స్– పెన్సిలిన్, స్ట్రెప్టోమైసిన్ వంటి మందులు కనుగొన్న వారికి నోబెల్ బహుమతులు లభించాయి. కానీ వాటికన్నా శ్రేష్ఠమైన, ప్రపంచంలో తొలి బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటి బయాటిక్ టెర్రా‘మైసిన్’ మాతృక టెట్రా‘సైక్లిన్’ మందును కనుగొన్న డా. యల్లాప్రగడకు నోబెల్ బహుమతి ఇవ్వకపోవడం శోచనీయం. అయితే నోబెల్ బహుమతిని ఎంపిక చేసే ‘స్టాక్‌హోమ్’ నగరంలోని వారి ప్రధాన కార్యాలయంలో సుబ్బారావు తైలవర్ణ చ్రితం దర్శనమిస్తుంది. బహుశా నోబెల్ బహుమతి ఇవ్వనందుకు ప్రాయశ్చిత్తంగా ఆ చిత్రాన్ని అక్కడ ఉంచారేమో!
గతంలో ప్లేగు మహమ్మారి ప్రపంచ మానవాళిని చుట్టపెట్టినప్పుడు టెర్రామైసిన్ మందు ప్రాణరక్షక ఔషధంగా కాపాడింది. ఇటీవల భూగోళాన్ని భయభ్రాంతులకు గురిచేసిన కరోనా వ్యాధిని డాక్స్‘సైక్లిన్’, అజిత్రో‘మైసిన్’ వంటి మందులు కీలకపాత్ర వహించి ప్రజలను కాపాడాయి. ఈ మందుల సృష్టికర్త డా. యల్లాప్రగడ సుబ్బారావు. ప్రాణాంతక వ్యాధి క్యాన్సర్‌కి కీమోథెరపిలో తొలితరం ఔషధం మెథాట్రాక్సిన్ మందును, క్షయ వ్యాధికి ‘ఐసోనెక్స్’, బోదకాలు, ఇస్నోఫీలియాకు హెట్రజన్ మందును ఆయన కనుగొన్నారు.
ప్రపంచ మానవాళిని గడగడలాడించిన ప్రాణాంతక ఉష్ణమండల–‘స్ప్రూ’ వ్యాధికి దివ్యౌషధం ‘ఫోలిక్ ఆసిడ్’ పోషకాన్ని డా. యల్లాప్రగడ 1945 జూలై 20న కనుగొన్నారు. తద్వారా ఆ వ్యాధి కోరలు ఊడబెరికి భూగోళం నుండి పారద్రోలారు. ఈ స్ప్రూ వ్యాధి ఒకటి ఉన్నదని నేటి తరం వారికి అసలు తెలియనే తెలియదు. తన సోదరుని మరణానికి కారణమైన ఈ వ్యాధికి కనిపెట్టిన ఆనాటి ‘ఫోలిక్ ఆసిడ్– పోషక విటమిన్’ ఈ రోజు గర్భిణులకు సంజీవనిలాగాను, పుట్టబోయే బిడ్డల ఆరోగ్యానికి ‘వెన్ను’ దన్నుగాను పనిచేస్తున్నది. అంతేగాక క్యాన్సర్, గుండెజబ్బులు, మానసిక వ్యాధులు, పక్షవాతం మొదలైన వాటిని నియంత్రించడంలో ‘కల్పతరువులా–యాంటి ఆక్సిడెంట్’గా ఉపయోగపడుతోందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అంటే ఆయన వైద్య పరిశోధనా ఫలితాలు ఎంతటి మహత్తరమైనవో కదా!
కనుగొన్న స్వల్పకాలానికే నిరుపయోగమవుతున్న మందులున్న ఈ రోజుల్లో కూడా డా. యల్లాప్రగడ కనుగొన్న ఆనాటి మందులు బహుళ ప్రయోజన ఔషధాలుగా పనిచేస్తున్నాయి. తాను కనుగొన్న మందుల ద్వారా ప్రపంచ మానవాళికి ఒక ‘శాశ్వత ఆరోగ్యకవచం’ అందించిన క్రాంతదర్శి, అపర ధన్వంతరి డా. యల్లాప్రగడ సుబ్బారావు. మనకు చరిత్ర తెలియక నేటి ఆధునిక విజ్ఞాన శాస్త్ర పరిశోధనలు అన్నీ విదేశీయులు, ఇంగ్లీషు శాస్త్రవేత్తలు కనిపెట్టినవే అనుకుంటున్నాం. ఇప్పుడున్న మందుల షాపుల్లో స్థిరమైన మందులు ఎక్కువగా మన తెలుగువాడు డా. సుబ్బారావు కనిపెట్టినవే!
గతంలో డా. సుబ్బారావు అమెరికా వెళ్లి తిరిగి రాలేదని కొందరు భావించారన్న వార్తలు వినవచ్చాయి. 1948లో అమెరికా నుంచి ఒకసారి స్వదేశం వచ్చిన ఆయన మద్రాస్ మెడికల్ కాలేజీలో ఒక వైద్య సదస్సులో పాల్గొన్నారు. ఆ సభలో తాను గతంలో డా. లక్ష్మీపతి ఆయుర్వేద వైద్య కళాశాలలో ‘అనాటమీ లెక్చరర్’గా పనిచేసి, ఆయుర్వేదంపై అధ్యయనం చేసి, ఆ అనుభవంతో ‘ప్రాచీన ఆయుర్వేదం పునాదిపై ఆధునిక అల్లోపతి వైద్యశాస్త్ర సమన్వయంతో నా వైద్య పరిశోధనలలో సత్ఫలితాలు సాధించాను’ అని తెలియజేశారు. కాబట్టి మన దేశంలో ఆయుర్వేదం, అల్లోపతి–ఆంగ్లవైద్యం సమన్వయంతో ‘ఇంటిగ్రేటెడ్ మెడికల్ కాలేజీ’ ఏర్పాటు చేయాలని, ‘క్యాన్సర్ పరిశోధన హాస్పిటల్’ ఏర్పాటుచేసి ప్రజలకు తన వైద్యసేవలు అందించాలని’ ఆనాటి సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన తెలిపిన కథనం ఉంది.
డా. యల్లాప్రగడ సుబ్బారావు 1948 ఆగస్టు 9న నిద్రలోనే గుండెజబ్బుతో కన్నుమూశారు. ఆయన కనిపెట్టిన అజరామరమైన దివ్యౌషధాలు ప్రపంచ మానవాళి శ్వాసలో శాశ్వతంగా నిలిచిపోతాయి. భావితరాలకు వీరి జీవిత చరిత్రను అందించడానికి ప్రభుత్వం ఒక పరిశోధన కమిటీని ఏర్పాటు చేయాలి.
ఇంతటి సాటిలేని ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త పేరును ఏలూరు ప్రభుత్వ వైద్యకళాశాలకు ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం ఖరారు చేయడం ముదావహం. డా. యల్లాప్రగడ స్మారక అవార్డులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి. ఆయన జీవిత చరిత్రను అన్ని ప్రాంతీయ భాషల విద్యార్థులకు పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలి. తద్వారా విద్యార్థులలో నైతిక విలువలు పెంపొందించాలి.
డా. ఎస్. శ్రీనివాస్
యల్లాప్రగడ శతజయంతి స్మారక పురస్కార గ్రహీత, బాపట్ల
(జనవరి 12: యల్లాప్రగడ సుబ్బారావు 130వ జయంతి)