కొబ్బరి నీళ్ల కంటే.. మంచి నీళ్లు మేలు.. డాక్టరేంటి ఇలా అన్నాడు..
ABN , Publish Date - Mar 26 , 2025 | 07:29 PM
ఎండకాలం రాగానే కొబ్బరి బోండాల రేటు అమాంతం పెరిగిపోతుంది. ప్రస్తుతం ఒక్కో కొబ్బరి బోండాం ధర 50 నుంచి 80 వరకు ఉంటోంది. పేద, మధ్య తరగతి ప్రజలు కొబ్బరి నీళ్లు తాగాలంటే ఆలోచించాల్సిందే.

ఎండకాలం వచ్చిందంటే చాలు కొబ్బరి నీళ్లకు గిరాకీ విపరీతంగా ఉంటుంది. సాధారణ టైంలో 30 నుంచి 50 వరకు పలికే కొబ్బరి బోండాం ధర.. ఎండాకాలంలో పీక్స్‌కు చేరుతుంది. 50 నుంచి 80 దాకా ఉంటుంది. అది కూడా కాయలు వచ్చే ప్రాంతాన్ని బట్టి.. సైజును బట్టి రేటు మారుతూ ఉంటుంది. కొంతమంది ధరతో సంబంధం లేకుండా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రతి రోజూ కొబ్బరి నీళ్లు తాగుతూ ఉంటారు. మరికొందరు ఎండలో తిరిగినపుడు కొబ్బరి నీళ్లు తాగుతూ ఉంటారు. సీజన్లతో సంబంధం లేకుండా అనారోగ్యంతో బాధపడేవాళ్లకు కొబ్బరి నీళ్లు మంచి ఛాయిస్ అవుతుంటాయి. అందరూ ఇష్టంతో తాగే కొబ్బరి నీళ్లు వేస్ట్ అని ఓ డాక్టర్ అంటున్నాడు.
కొబ్బరి నీళ్లు తాగటం కంటే.. మంచి నీళ్లు తాగటం మేలంటున్నాడు. డాక్టర్ దీపక్ క్రిష్ణమూర్తి తన ట్విటర్ ఖాతాలో బుధవారం ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో .. ‘ ఓవర్ రేటెడ్ డ్రింక్.. మీ ఇంటి దగ్గర కానీ, పొలంలో కానీ, కొబ్బరి చెట్టు ఉంటే.. కొబ్బరి నీళ్లు తాగండి. అదే పనిగా కొబ్బరి కాయ కొని తాగాల్సిన అవసరం లేదు. మంచి నీళ్లు తాగండి’ అని అన్నారు. ఆయన ఇలా అనడానికి ఓ బలమైన కారణం ఉంది. కొన్ని నగరాల్లో కొబ్బరి బోండాల మాఫియా నడుస్తోంది. ఆ మాఫియా అధిక ధరలకు కొబ్బరి బోండాలను విక్రయిస్తోంది. కొద్దిరోజుల క్రితమే ఆ మాఫియా కొబ్బరి బోండాల ధరలను తగ్గించింది. 60 రూపాయలకు అమ్మాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఓ వ్యక్తి తన ట్విటర్ ద్వారా వెల్లడించాడు. ఈ పోస్టును డాక్టర్ దీపక్ రీపోస్టు చేశారు.
కొబ్బరి నీళ్లతో ప్రయోజనాలు
డాక్టర్ దీపక్ ఏదో కోపంలో అలా అన్నాడు కానీ.. కొబ్బరి నీళ్లకు మంచి నీళ్లు సాటి రావు. కొబ్బరి నీళ్ల ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కొబ్బరి నీళ్లు చాలా వేగంగా జీర్ణం అయిపోతాయి. తద్వారా తక్షణ శక్తి లభిస్తుంది. కొబ్బరి నీళ్లలో తక్కువ కాలరీలు ఉంటాయి. బరువు తగ్గటంలో కొబ్బరి నీళ్లు చక్కగా ఉపయోగపడతాయి. రక్త పోటును నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరచటంలోనూ కొబ్బరి నీళ్లు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. కొబ్బరి నీళ్ల వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రోగ నిరోధక శక్తి పుంజుకుంటుంది. చర్మంతో పాటు జట్టు ఆరోగ్యంగా ఉంటాయి. మూత్ర పిండాల పని తీరును మెరుగుపరచటంలోనూ కొబ్బరి నీళ్లు సహకరిస్తాయి.
ఇవి కూడా చదవండి:
Virat Kohli: వెబ్‌సిరీస్‌లో అనుష్క భర్త.. అచ్చం కోహ్లీని పోలి ఉన్న ఈ నటుడిని చూడండి..
Curd Rice:పెరుగన్నం తింటే లాభమా నష్టమా.. ఎందుకు తినాలి