E Cigarette Risks: ఇ సిగరెట్స్ కూడా వ్యసనమే
ABN , Publish Date - Apr 22 , 2025 | 01:33 AM
ఇ సిగరెట్స్ ఆరోగ్యానికి ముప్పు కలిగించే మరో రూపమైన నికొటిన్ వ్యసనమే. వేప్ పెన్స్ వాడకం ఊపిరితిత్తులు, గుండె, మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది
నికొటిన్ చేటు
పొగ, దుర్గంధం సమస్య లేకుండా, చూపులకు ఆకర్షణీయంగా ఉంటుందనే ఉద్దేశంతో ఇటీవలి కాలంలో స్మోకింగ్‌కు బదులుగా ‘ఇ సిగరెట్స్’ విపరీతంగా ఊపందుకుంటోంది. అయితే ఈ అలవాటు కూడా ప్రమాదకరమేనని హెచ్చరిస్తున్నారు వైద్యులు.
ధూమపాన వ్యసనపరులకున్న ఆ దురలవాటును మాన్పించడం కోసం ఆవిష్కరించిన ఆధునిక ప్రత్యామ్నాయమే ‘ఇ సిగరెట్స్’! నికొటిన్‌కు అలవాటు పడిన వాళ్లు అకస్మాత్తుగా ధూమపానాన్ని మానుకోవడం వల్ల విత్‌డ్రాయల్ లక్షణాలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ప్రారంభంలో తక్కువ నికొటిన్‌ను కలిగి ఉండే ఇ సిగరెట్స్‌ను వైద్యులు సూచిస్తూ ఉంటారు. ఆ తర్వాత క్రమేపీ ఆ అలవాటును కూడా మాన్పించేస్తూ ఉంటారు. అయితే క్రమేపీ ఇ సిగరెట్స్ కూడా ఒక వ్యసనంగా మారిపోతూ ఉండడంతో ప్రభుత్వం ఇ సిగరెట్స్ పరికరాలను బహిష్కరించింది. అయినప్పటికీ విదేశాల నుంచి వీటిని దిగుమతి చేసుకుని వాడుకుంటున్న వారు లేకపోలేదు.
వేప్ అనర్థాలు ఇవే!
ఇ సిగరెట్స్‌గా పేరు పొందిన వేప్ పెన్స్, వేప్ జ్యూస్ అనే ఈ పరికరాల్లో ప్రొపైలీన్ గ్లైకాల్, ఫ్లేవరింగ్ ఏజెంట్లు, నికొటిన్ పైపూత కలిగిన ద్రవాలు ఉంటాయి. ధూమపానానికి మించి ఇ సిగరెట్స్ పట్ల ఆదరణ పెరగడానికి ప్రధాన కారణం, దీన్నుంచి పొగ వెలువడకపోవడమే! అలాగే మధురమైన వాసన కలిగి ఉండే ఇ సిగరెట్స్ చూపులకు స్టైల్‌గా కనిపిస్తూ ఉంటుంది. దీని వాడకంతో దంతాల రంగు మారే ప్రమాదం కూడా ఉండదు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో, కార్లలో, ఇంట్లో.. ఇలా ఎక్కడైనా ఉపయోగించే వీలు ఉండడంతో ఇ సిగరెట్స్ అన్ని వయసుల వారినీ ఆకట్టుకుంటోంది. అయితే ఇ సిగరెట్స్‌తో మెదడు, గుండె, ఊపిరితిత్తులు, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందనే విషయం గుర్తు పెట్టుకోవాలి.
అపోహలు వీడాలి
ఇ సిగరెట్స్ వాడకంతో ఊపిరితిత్తులు దెబ్బతింటున్న సందర్భాలు పెరుగుతూ ఉండడంతో ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తమవడం మొదలుపెట్టాయి. ఇ సిగరెట్స్ అలవాటు, ధూమపాన వ్యసనాన్ని మించినది. దీన్ని మానుకోవడం చాలా కష్టం. దీన్ని ఉపయోగించడం మొదలుపెట్టిన వాళ్లు నికొటిన్‌కు మరింత అలవాటు పడడమే కాకుండా, తిరిగి ధూమపానానికి మళ్లే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ధూమపానం మానుకోవడం కోసం ఇ సిగరెట్స్ మీద ఆధారపడడం సరి కాదు. ఇ సిగరెట్స్‌తో ధూమపానం కోరిక మరింత పెరుగుతుంది. కాబట్టి ఈ దురలవాటును మానుకోవాలనుకునేవారు వైద్యులను కలిసి థెరపీ తీసుకోవాలి.
ప్యాచ్‌లు, చూయింగ్ గమ్‌లతో...
ఇ సిగరెట్స్ పరికరాలు బ్యాటరీతో పని చేస్తాయి. కాబట్టి దీర్ఘకాలంలో వీటి ప్రభావం శరీరం మీద ఏ మేరకు ఉండబోతున్నది ఎవరికీ తెలియదు. ఇ సిగరెట్స్‌తో ఒరిగే దీర్ఘకాలిక ఆరోగ్య దుష్ప్రభావాల గురించి మరింత లోతుగా అధ్యయనాలు జరగవలసిన అవసరం కూడా ఉంది. ఇ సిగరెట్స్‌తో నికొటిన్ మీద ఆధారపడే స్వభావం పెరుగుతుంది. కాబట్టి మొత్తంగా నికొటిన్ మీద ఆధారపడే స్వభావాన్ని తగ్గించుకోవాలి. దాన్నుంచి పూర్తిగా బయటపడడం కోసం కౌన్సెలింగ్‌ను ఆశ్రయించాలి. అలాగే నికొటిన్ అలవాటును క్రమేపీ తగ్గించుకోవడం కోసం నికొటిన్ ప్యాచ్‌లు, చూయింగ్ గమ్స్ వాడుకోవచ్చు. ధూమపానాన్ని ప్రేరేపించే అంశాలకు దూరంగా ఉండడం ద్వారా ఈ దురలవాటును పూర్తిగా వదులుకోవచ్చు.
-డాక్టర్ ఎ. రఘుకాంత్
సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్,
మెడికవర్ హాస్పిటల్స్, హైదరాబాద్.
ఇవి కూడా చదవండి:
బాత్‌రూమ్‌లో ఉన్నప్పుడు ఇలా చేస్తే డేంజరే..
ఈ టైమ్‌లో స్వీట్స్ తింటే నో టెన్షన్
కిడ్నీ సమస్యలున్న వాళ్లు టమాటాలు ఎందుకు తినొద్దంటే..
మధ్యాహ్నం నిద్రతో ఆరోగ్యానికి చేటు కలుగుతుందా?