Mind Reading: మనసును చదివే యంత్రం
ABN , Publish Date - Jan 04 , 2025 | 04:51 AM
ఆదిత్య 369’ సినిమాలో హీరో, హీరోయిన్లు భవిష్యత్తులోకి వెళ్లే సీన్ గుర్తుందా?
చైనా శాస్త్రజ్ఞుల సృష్టి
మూర్ఛ వ్యాధి బాధితురాలి ఆలోచనల్ని డీకోడ్ చేసిన యంత్రం
బీజింగ్, జనవరి 3: ‘ఆదిత్య 369’ సినిమాలో హీరో, హీరోయిన్లు భవిష్యత్తులోకి వెళ్లే సీన్ గుర్తుందా? అందులో వారు మనసులో అనుకునే మాటలు బయటకు వినపడిపోతుంటాయి!! మరీ ఆ స్థాయిలో కాదుగానీ.. మన మనసులో ఆలోచనలను న్యూరల్ నెట్‌వర్క్ మోడల్ ద్వారా డీకోడ్ చేసే ‘మైండ్ రీడింగ్ మెషీన్’ను చైనా శాస్త్రజ్ఞులు అభివృద్ధి చేశారు. ‘బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్‌ఫే్‌స(బీసీఐ)’ల అభివృద్ధి దిశగా మరో కీలక ముందడుగు వేశారు. చైనాకు చెందిన న్యూరోయాక్సెస్ అనే స్టార్టప్ తన ప్రయోగాల్లో భాగంగా బీసీఐ పరికరాన్ని.. మెదడుకు గాయమైన ఒక 21 ఏళ్ల మూర్ఛవ్యాధి బాధితురాలికి నిరుడు ఆగస్టులో అమర్చగా.. అది ఆమె ఆలోచనలను 60మిల్లీసెకన్ల వ్యవధిలో డీకోడ్ చేయగలిగింది. డిసెంబరులో నిర్వహించిన మరో పరీక్షలో ఆ పరికరం చైనీస్ మాటలను సైతం 100 మిల్లీసెకన్ల తేడాతో డీకోడ్ చేసింది. ఈ పరికరం సాయంతో పేషెంట్లు తమ ఆలోచనల ద్వారా నే కంప్యూటర్‌లో సాఫ్ట్‌వేర్‌ను, వస్తువులను నియంత్రించగలిగారు. ఏఐ మోడళ్లతో సంభాషించగలిగారు.