Donald Trump: తల్లిదండ్రులు, బిడ్డలను వేరు చేసిన ట్రంప్.. 35 ఏళ్ల తర్వాత
ABN , Publish Date - Mar 26 , 2025 | 01:36 PM
అక్రమ వలసదారుల పట్ల ట్రంప్ సర్కార్ కఠినంగా వ్యవహరిస్తుంది. వారిని దేశం నుంచి బహిష్కరించడమే కాక.. అరెస్ట్ చేసి.. జైల్లో ఉంచుతుంది. ఆ తర్వాత వారిని స్వదేశాలకు పంపించి వేస్తుంది. ఈ క్రమంలో ఓ జంటను ఇలానే అమెరికా నుంచి బహిష్కరించి.. దేశం నుంచి పంపించివేసింది ట్రంప్ సర్కార్. ఆ వివరాలు..

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్.. వలసదారులపై ఉక్కుపాదం మొపుతున్నాడు. సరైన పత్రాలు లేకుండా అక్రమంగా అమెరికాకు వచ్చి ఉంటున్న వారిని.. తిరిగి స్వదేశానికి పంపించివేస్తున్నాడు. ట్రంప్ సర్కార్ చర్యల వల్ల వందల మంది భారతీయులు ఇండియా తిరిగి వచ్చారు. ఇదిలా ఉండగా తాజాగా ఓ హృదయవిదారక సంఘటన చోటు చేసుకుంది. సుమారు 35 ఏళ్లుగా అమెరికాలో నివాసం ఉంటున్న దంపతులను ట్రంప్ సర్కార్.. అరెస్ట్ చేసింది. తిరిగి వారిని వారి స్వదేశానికి సాగనంపింది. ట్రంప్ సర్కార్ చర్యల వల్ల తల్లిదండ్రులు, పిల్లలు వేరు కావాల్సి వచ్చింది. ఆ వివరాలు..
కొలంబియాకు చెందిన గ్లాడిస్ గొంజాలెస్(55), నెల్సన్ గొంజాలెస్(59) అనే దంపతులు సుమారు 35 ఏళ్ల క్రితం.. బతుకుతెరువు కోసం అమెరికాకు వచ్చారు. నెమ్మదిగా అక్కడి పరిస్థితులకు అలవాటుపడి.. అగ్రరాజ్యంలోని కాలిఫోర్నియాలో స్థిర నివాసం ఏర్పర్చుకున్నారు. అమెరికా వచ్చిన తర్వాత ఈ దంపతులు ముగ్గురు కుమార్తెలకు జన్మనిచ్చారు. వారంతా అమెరికాలోనే పెరిగి పెద్దయ్యారు. ప్రస్తుతం వారిలో ఒకరికి వివాహం కాగా.. మిగతా ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు. జీవితం సంతోషంగా సాఫీగా సాగుతుందనుకున్న తరుణంలో ఆ కుటుంబానికి ఊహించని షాక్ తగిలింది.
అక్రమ వలసదారులపై కన్నెర్రజేసిన ట్రంప్.. వారి ఎరివేత కార్యక్రమ మొదలు పెట్టాడు. దీనిలో భాగంగా తాజాగా అమెరికా ఇమ్మిగ్రేషన్ కస్టమ్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఫిబ్రవరి 21, 2025న గ్లాడిస్ దంపతుల ఇంటికి వచ్చి చెక్ చేశారు. వారి వద్ద సరైన పత్రాలు లేకపోవడంతో దేశం నుంచి బహిష్కరించారు. ఆ తర్వాత వారిని మూడున్నర వారాల పాటు జైలులో ఉంచారు. చివరకు మార్చి 18న వారిని స్వదేశానికి పంపించి వేశారు.
గ్లాడిస్ దంపతులకు ఎలాంటి నేర చరిత్ర లేదు. వారి ముగ్గురు కుమార్తెలను ఇక్కడే పెంచి పెద్ద చేశారు. తమ తుది శ్వాస విడిచివరకు అమెరికాలోనే ఉంటామని భావించిన వారి ఆశలను ట్రంప్ సర్కార్ కూల్చి వేసింది. ఏమాత్రం జాలి, దయ లేకుండా వారిని స్వదేశానికి తిరిగి పంపించి వేశారు. ట్రంప్ సర్కార్ నిర్ణయం వల్ల తల్లిదండ్రులు, బిడ్డలు వేరయ్యారు. తమ కుటుంబం చీలిపోయిందంటూ వారి కుమార్తెలు కన్నీటి పర్యంతం అయ్యారు.
అమెరికాకు వచ్చిన తర్వాత తమ తల్లిదండ్రులు ఈ దేశాన్ని తమ జన్మభూమిగా భావించారని.. ఇరుగుపొరుగువారితో చాలా చక్కగా కలిసిపోయారని, ఎవరికి ఏ సాయం కావాలన్నా ముందుండేవారని.. పైగా వారికి ఎలాంటి నేర చరిత్ర లేదని గ్లాడిస్ దంపతుల కుమార్తెలు స్పష్టం చేశారు. ఎంతో సౌమ్యులైన తమ తల్లిదండ్రుల పట్ల ట్రంప్ సర్కార్ ఎంతో నిర్దయగా వ్యవహరించిందని.. వారిని నేరస్తులుగా చూడటమే కాక జైల్లో కూడా పెట్టారని ఆరోపించారు.
ఈ సందర్భంగా ఓ ఐసీఈ అధికారి మాట్లాడుతూ.. "ఆ దంపతులకు ఎలాంటి నేర చరిత్ర లేదు. వారు 1989లో ఎలాంటి అనుమతి లేకుండా అమెరికా, కాలిఫోర్నియా వచ్చారు. 2000 సంవత్సరంలోనే వారు దేశం విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశాలు వచ్చాయి. కానీ వారు దేశం విడిచి వెళ్లలేదు. 2018లో మరోసారి ఆదేశాలు జారీ చేశారు. కానీ వారు పట్టించుకోలేదు. ఇప్పుడు ట్రంప్ సర్కార్ అక్రమ వలసదారుల అంశంలో కఠినంగా వ్యవహరిస్తుంది. దానిలో భాగంగానే వారిని అమెరికా నుంచి బహిష్కరించి.. స్వదేశానికి తిరిగి పంపించివేసింది" అని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
మన కంటే ఇండియా చాలా బెటర్ : డోనాల్డ్ ట్రంప్
బస్సు వెనుక విద్యార్థిని పరుగులు.. డ్రైవర్ సస్పెన్షన్