Indian restaurants: క్షణమొక యుగం!
ABN , Publish Date - Feb 10 , 2025 | 04:45 AM
తాము ఏక్షణంలో పట్టుబడుతామోనని భయాందోళనలో క్షణమొక యుగంగా కాలం వెళ్లదీస్తున్నారు. ఇలా భయపడుతూ పనిచేస్తున్న వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన యువత కూడా ఉండడం గమనార్హం. అమెరికాలో సుమారు 9వేల భారత రెస్టారెంట్లు ఉన్నట్లు అంచనా.

అక్రమ వలసలపై ఉక్కుపాదంతో అమెరికాలో రెస్టారెంట్లలో సిబ్బంది తొలగింపు
అక్కడి భారతీయ రెస్టారెంట్లలో పనిచేస్తున్న తెలుగు యువత ఆందోళన
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)
అమెరికాలోని భారత రెస్టారెంట్ల తలుపులు తడితే చాలు లోపల పని చేస్తున్న వారు వణికిపోతున్నారు. ఎప్పుడు ఏ క్షణాన ఇమ్మిగ్రేషన్ అధికారులు వచ్చి తనఖీ చేస్తారో.. తాము ఏక్షణంలో పట్టుబడుతామోనని భయాందోళనలో క్షణమొక యుగంగా కాలం వెళ్లదీస్తున్నారు. ఇలా భయపడుతూ పనిచేస్తున్న వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన యువత కూడా ఉండడం గమనార్హం. అమెరికాలో సుమారు 9వేల భారత రెస్టారెంట్లు ఉన్నట్లు అంచనా. గత దశాబ్ద కాలంగా దేశంలో పెద్ద సంఖ్యలో తెలుగు ప్రవాసీయులు రెస్టారెంట్లు ఏర్పాటు చేశారు. తెలుగు ప్రవాసీయులు అధికంగా ఉన్న టెక్సాస్ రాష్ట్రంలో తొలుత ఈ వ్యాపారం ప్రారంభమై ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించింది. తెలుగు వారు బృందాలుగా ఏర్పడి ఈ రంగంలో పుంజుకుంటున్నారు. తెలుగువారు స్థాపించిన రెస్టారెంట్లలో తెలుగు యువత ఎక్కువగా ఉపాధి పొందుతోంది. అమెరికాలో చదవడానికి వచ్చె భారతీయ విద్యార్థులను ఈ రెస్టారెంట్లలో నియమించుకుంటున్నారు. అయితే.. వీరిలో ఎక్కువగా సరిహద్దులు దాటి మెక్సికో నుంచి అక్రమంగా వచ్చిన వారే ఎక్కువగా ఉన్నారు. వాస్తవానికి ఇలా నియమించడం చట్టవిరుద్ధం. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు రెస్టారెంట్లు, ఇతర పని ప్రదేశాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. దీంతో అనేక మంది భారతీయ రెస్టారెండ్ల నిర్వాహకులు పార్ట్ టైం పనులు కల్పించేందుకు స్వస్తి పలుకుతున్నారు. దీంతో ఆయా పనులపైనే ఆధారపడిన విద్యార్థుల పరిస్థితి డోలాయమానంలో పడింది. ఇమ్మిగ్రేషన్ అధికారుల తనిఖీల్లో అక్రమ వలసదారులు దొరికితే అది వారితో పాటు తమకు కూడా ఇబ్బందేనని రెస్టారెంట్ నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలు విద్యార్థులకు ప్రాణసంకటంగా మారాయి. మరోవైపు.. తక్కువ వేతనానికి లభించే పనివారు వెళ్లిపోతే రెస్టారెంట్లపై ఆర్థిక భారం పెరుగుతుందని యజమానులు తలలు పట్టుకుంటున్నారు.