Donald Trump: హెచ్-1బీ వీసాలపై రచ్చ!
ABN , Publish Date - Jan 04 , 2025 | 04:39 AM
అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ముంచుకొస్తున్న వేళ హెచ్-1బీ వీసాలపై చర్చ తీవ్రరూపం దాల్చింది.
డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీల్లో భిన్నస్వరాలు
హెచ్-1బీ వీసాలకు మేం అనుకూలమే: ట్రంప్
విదేశీ కార్మికుల నుంచి దోపిడీకే : బెర్నీ
వాషింగ్టన్, జనవరి 3: అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ముంచుకొస్తున్న వేళ హెచ్-1బీ వీసాలపై చర్చ తీవ్రరూపం దాల్చింది. ఈ వ్యవహారం డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీల్లో అంతర్గతంగా మంటలు రేపుతోంది. వివిధ దేశాలకు చెందిన వృత్తి నిపుణుల సేవలను వినియోగించుకోవాలని భావించే అమెరికా సంస్థలు ఈ వీసాలను స్పాన్సర్ చేస్తుంటాయి. ఇందుకోసం ప్రతి ఏడాది 85వేల హెచ్-1బీ వీసాలను అమెరికా జారీ చేస్తుంది. వీటిలో 65 వేలు రెగ్యులర్ క్యాప్ కాగా, మరో 20 వేల వీసాలను తమ దేశంలో అడ్వాన్స్ డిగ్రీలు పూర్తిచేసిన వారికి మాత్రమే ఇస్తుంది. ఈ వీసా ద్వారా లబ్ధి పొందినవారిలో భారతీయులే అధికంగా ఉన్నారు. వీసాల అంశంపై ట్రంప్ ఇటీవల స్పందించారు. తాను ఎల్లప్పుడూ హెచ్-1బీ వీసాలకు అనుకూలమేనని, అందుకే తమ దేశంలో ఆ వీసాలు ఉన్నాయని అమెరికా 47వ అధ్యక్షుడిగా ఈ నెల 20న ప్రమాణ స్వీకారం చేయనున్న ట్రంప్ మద్దతు పలికారు. ‘అమెరికాలో అత్యంత సమర్థులైన వ్యక్తులు ఉండాలని నేను ఎల్లప్పుడూ భావిస్తాను. మనకు సమర్థులు అవసరం. మన దేశంలోకి తెలివైన వ్యక్తులు చాలామంది రావాలి. మునుపెన్నడూ లేని స్థాయిలో మనకు ఉద్యోగాలు రాబోతున్నాయి’ అని కొత్త సంవత్సరం వేడుకల్లో ఆయన మీడియాతో అన్నారు. ఆయన సన్నిహితులైన ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి సైతం ఈ వీసాలకు మద్దతు ప్రకటించారు.
శ్రీరామ్ నియామకంతో మొదలైన వివాదం
ఏఐపై వైట్‌హౌస్ సీనియర్ పాలసీ అడ్వైజర్‌గా శ్రీరామ్ కృష్ణన్‌ను ట్రంప్ ఎంపిక చేశారు. ఆయన నియామకంతో హెచ్-1బీ వీసాలపై వ్యతిరేకత ప్రారంభమైంది. నైపుణ్యం కలిగిన వలసదారుల కోసం గ్రీన్‌కార్డుల విషయంలో ఉన్న పరిమితులను తొలగించాలని గతంలో శ్రీరామ్ పిలుపునిచ్చారు. దీనిపై ట్రంప్ మద్దతుదారుల నుంచి తీవ్ర ప్రతిఘటన వ్యక్తమవుతోంది. ఈ విధానం అమెరికన్ల ఉద్యోగాలను హరిస్తోందని వారు వాదించడంపై మస్క్ మండిపడ్డారు. ‘స్పేస్ ఎక్స్, టెస్లా తరహాలో అమెరికాను బలోపేతం చేసిన వందలాది కంపెనీలను స్థాపించిన నాలాంటి వ్యక్తులు ఇక్కడకు రావడంలో హెచ్1బీ వీసాలదే కీలక పాత్ర. అందుకే ఈ వీసాలపై ఎవరితోనైనా యుద్ధానికి సిద్ధమే’ అని ‘ఎక్స్’లో పేర్కొన్నారు. అలాగే వివేక్ రామస్వామి మాట్లాడుతూ, నైపుణ్యం కలిగిన గ్రాడ్యుయేట్లను అమెరికా తక్కువ స్థాయిలో తయారు చేస్తున్నందున విదేశీ నిపుణులను దేశంలోకి అనుమతించడానికి హెచ్-1బీ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
కార్పొరేట్ల కోసమే ఈ వ్యవస్థ: శాండర్స్
హెచ్-1బీ వీసాల వ్యవహారంలో ట్రంప్ సన్నిహితులు ఇద్దరూ తప్పు చేస్తున్నారని డెమోక్రటిక్ సెనేటర్ బెర్నీ శాండర్స్ గురువారం వ్యాఖ్యానించారు. ‘అత్యంత నైపుణ్యం కలిగిన అమెరికన్ ఇంజనీర్లు, ఇతర టెక్ వర్కర్ల కొరత కారణంగా ఈ ఫెడరల్ ప్రోగ్రాం మన దేశ ఆర్థిక వ్యవస్థకు అత్యంత ముఖ్యమైనదని మస్క్, అనేకమంది ఇతర బిలియనీర్ టెక్ కంపెనీ యజమానులు వాదించారు. దీనికి నేను అంగీకరించను. ఉత్తమమైన, ప్రతిభావంతులను నియమించుకోవడం ప్రస్తుతం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం కాదు. మంచి వేతనంతో కూడిన అమెరికన్ ఉద్యోగాల్లో విదేశాల నుంచి తక్కువ వేతనంతో కూడిన ఒప్పంద సేవకులను నియమించడమే లక్ష్యం. ఎంత చౌకగా కార్మికులను నియమించుకుంటే అంత ఎక్కువ డబ్బును ఈ బిలియనీర్లు ఆదా చేసుకుంటారు’ అని శాండర్స్ పేర్కొన్నారు. కార్పొరేట్లను సుసంపన్నం చేస్తూ, విదేశాల నుంచి వచ్చే కార్మికులను దోపిడీ చేయడానికి ఈ వ్యవస్థను ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. అయితే ఆయన సొంత పార్టీకే చెందిన ఇండో-అమెరికన్ డెమొక్రటిక్ చట్టసభ్యులు రో ఖన్నా, రాజా కృష్ణమూర్తి, శ్రీ థానేదార్ మాత్రం ఈ కార్యక్రమానికి మద్దతు ప్రకటించారు.