Share News

Indus Water Treaty: పాక్‌కు నీటిని ఆపడం సాధ్యమేనా

ABN , Publish Date - Apr 28 , 2025 | 04:08 AM

భారత్‌ సింధుజలాల ఒప్పందాన్ని నిలిపివేసి, పాకిస్థాన్‌కు నీటిని మళ్లించడాన్ని అడ్డుకునే నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల పాకిస్థాన్‌కు నీటి నిల్వలు, వ్యవసాయం, పరిశ్రమలకు తీవ్ర నష్టం కలగవచ్చు. ఇక భారత్‌ కొన్ని ప్రాజెక్టులు వేగంగా నిర్మించగలిగితే, సింధు నదులపై పూర్తి నియంత్రణ సాధించవచ్చు.

Indus Water Treaty: పాక్‌కు నీటిని ఆపడం సాధ్యమేనా

(సెంట్రల్‌ డెస్క్‌)

సింధుజలాల ఒప్పందాన్ని నిలిపివేసిన భారత్‌.. దాయాది దేశం పాకిస్థాన్‌కు పూర్తిస్థాయిలో జలాలు వెళ్లకుండా అడ్డుకోగలదా? ఆ నీటిని భారత్‌లోని ఇతర ప్రాంతాలకు మళ్లించగలదా? సింధు, దాని ఉపనదుల్లో 5,295.91 టీఎంసీల నీరు ఉంటుందని అంచనా. అంత మొత్తంలో నీటిని నిల్వ చేసుకోగలిగే డ్యాములను అనతికాలంలో నిర్మించడం సాధ్యమవుతుందా? అదే జరిగితే.. ముంపునకు గురయ్యే ప్రాంతాలు లక్ష చదరపు కిలోమీటర్లుగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితిని భారత్‌ ఎదుర్కోగలదా? సింధుజలాల అంశంపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం..

వేసవిలో నీటి ప్రవాహం

సాధారణంగా వేసవి కాలంలో నదుల్లో నీటి నిల్వలు తగ్గుతాయి. కానీ, సింధు, దాని ఉపనదుల్లో మాత్రం ఎగువన మంచు కరగడం వల్ల జలకళ ఉట్టిపడుతుంది. 1960లో జరిగిన సింధుజలాల ఒప్పందం మేరకు.. సింధు, జీలం, చీనాబ్‌ నదుల నీటిలో సింహభాగం(80ు -- 3496.64 టీఎంసీలు) పాకిస్థాన్‌కు.. మిగతా 20ు భారత్‌కు దక్కుతాయి. రావి, బియాస్‌, సట్లెజ్‌ నదుల జలాలు(1,448.15 టీఎంసీలు) పూర్తిగా భారత్‌కు చెందుతాయి. ఈ ఒప్పందం ప్రకారం భారత్‌ నిర్మించే డ్యామ్‌లను పరిశీలించే అధికారం పాకిస్థాన్‌కు సింధు కమిషన్‌ దఖలుపరిచింది. ఇప్పటి వరకు సింధు, జీలం, చీనాబ్‌ నదులపై భారత్‌ జలవిద్యుత్తు ప్రాజెక్టులను నిర్మించినా.. వాటిని ‘రన్‌-ఆ్‌ఫ-ద రివర్‌’ కేటగిరీలో చూపించింది. అంటే.. ప్రాజెక్టులు ఉన్నంత మాత్రాన పాకిస్థాన్‌కు నీటి సరఫరా నిలిచిపోదు. అలాగని, ఈ ప్రాజెక్టుల కోసం నీటిని నిల్వ చేసుకునే వెసులుబాటు ఉండదు.

fh'.jpg

ఇప్పుడు ఒప్పందాన్ని రద్దుచేసుకోవడం వల్ల.. ఇకపై భారత్‌ ఈ నదులపై నీటి నిల్వల కోసం ప్రాజెక్టులను చేపట్టే అవకాశాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు ఈ ఒప్పందం రద్దుతో పాకిస్థాన్‌పై ప్రభావం పడకున్నా.. దీర్ఘకాలంలో ఇబ్బందులు తప్పవని వివరిస్తున్నారు. ప్రస్తుతం సింధు, జీలం, చీనాబ్‌పై భారత జలవిద్యుత్తు ప్రాజెక్టులున్నాయి.


చీనాబ్‌పై బాగిల్‌హార్‌, దుల్‌హస్తి, సలాల్‌ డ్యాములు, జీలం ఉపనది అయిన కృష్ణగంగపై కృష్ణగంగ డ్యామ్‌, లద్ధాఖ్‌లో సింధూనదిపై నిమూబజ్గో డ్యామ్‌ ఉన్నాయి. రావి నదిపై 1979 నుంచి పెండింగ్‌లో ఉన్న ఆనకట్ట ప్రతిపాదన బాలారిష్టాలను దాటుకుని, 2001లో రంజిత్‌ సాగర్‌ డ్యామ్‌ పూర్తయింది. రాజస్థాన్‌-పంజాబ్‌ల మధ్య సయోధ్య కుదరక షాపుర్‌కంది బ్యారేజీ నిర్మాణం మాత్రం నిలిచిపోయింది. 2018లో కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిత్వం వహించి, నిర్మాణాన్ని పూర్తిచేసింది. ఆదివారం నుంచి ఈ డ్యామ్‌ ద్వారా దిగువకు(సింధుకు) నీటి విడుదలను ఆపివేస్తారని సమాచారం. ఈ నీటిని జమ్మూకశ్మీర్‌లోని కఠువా, సాంబా జిల్లాలకు మళ్లించి, 32వేల హెక్టార్లకు సాగునీరందిస్తారని తెలుస్తోంది. నిజానికి భారత్‌ సింధూ, దాని ఉపనదుల ద్వారా 18,653 మెగావాట్ల మేర విద్యుత్తును ఉత్పత్తి చేయగలిగే ప్రాజెక్టులను నిర్మించవచ్చు. ప్రస్తుతం 3,034 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతుండగా.. మరో 2,526 మెగావాట్ల సామర్థ్యమున్న ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. మరో 5,846 మెగావాట్ల ప్రతిపాదిత ప్రాజెక్టులు ప్రణాళిక దశలో ఉన్నాయి. సింధు ఒప్పందం నిలిపివేతతో.. ఇప్పుడు ఈ ప్రాజెక్టులను భారత్‌ వేగంగా నిర్మించే అవకాశాలుంటాయి.

100% నీటిని ఆపడం అసాధ్యమే

ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రాజెక్టుల ద్వారా పాకిస్థాన్‌కు వెళ్లే నీటిని 10-15ు వరకు నిలువరించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే.. దీర్ఘకాలంలో ప్రాజెక్టులను నిర్మిస్తే.. సింధు, దాని ఉపనదుల జలాలను పూర్తిగా భారత్‌లోకే మళ్లించే అవకాశాలున్నాయంటున్నారు. ఈ క్రమంలో కేవలం ఆనకట్టలను నిర్మిస్తే సరిపోదని, నదులను మళ్లించేందుకు భారీ సొరంగాలను తవ్వాల్సి ఉంటుందని గుర్తుచేస్తున్నారు. లద్దాఖ్‌ లాంటి ప్రాంతాల్లో పర్వతాలు, లోయలతో కఠినమైన వాతావరణం ఉంటుందని, ఈ ప్రాంతాల్లో సొరంగాల తవ్వకం ఖర్చుతో కూడినదే కాకుండా, నిర్మాణానికి చాలా సమయం తీసుకునే అవకాశం ఉంటుందని వివరిస్తున్నారు. పైగా ఈప్రాంతం భూకంప జోన్‌-5లో ఉందని, భారీ భూకంపాలకు ఆస్కారం ఉంటుందని చెబుతున్నారు. మే-సెప్టెంబరు మధ్యకాలంలో హిమాలయాల్లో మంచు కరిగి, చీనాబ్‌, జీలం నదుల్లో వేల కోట్ల క్యూబిక్‌ మీటర్ల నీరు ప్రవహిస్తుందని, ఈప్రవాహాన్ని ఆపడం అంత సులభం కాదని అంటున్నారు. భారీ ఆనకట్టలను నిర్మిస్తే.. సుమారు లక్ష చదరపు కిలోమీటర్ల భూమి ముంపునకు గురవుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లో ఉన్న తిహ్రీ డ్యామ్‌ మాదిరి 30 దాకా భారీ ఆనకట్టలను నిర్మించాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇందుకు 10 ఏళ్ల సమయం పట్టవచ్చంటున్నారు.


పాకిస్థాన్‌కు భారీ నష్టం

పాకిస్థాన్‌లో ఉన్న ఆనకట్టల్లో భారీ నీటి నిల్వలకు అవకాశాల్లేవు. భారత్‌ వదిలే నీటి ద్వారానే అక్కడి(పశ్చిమ పంజాబ్‌, సింధ్‌ ప్రావిన్సులు) వ్యవసాయం సాగుతోంది. పాకిస్థాన్‌లో ఉత్పత్తి అయ్యే ఆహార ధాన్యాల్లో ఈ రెండు ప్రావిన్సుల వాటా 80ు ఉంటుందని అంచనా. పాకిస్థాన్‌ జీడీపీలో ఈ ప్రావిన్సుల వాటా 25శాతంగా ఉంటుంది. ఈ రెండు ప్రావిన్సుల్లోని 16 లక్షల హెక్టార్ల సాగుభూమికి సింఽధునది జీవనాడి వంటిది. ఈ ప్రాంతంలోని పరిశ్రమలు, జలవిద్యుదుత్పత్తిని కలుపుకొంటే.. పాక్‌ జీడీపీలో వాటా 35ు ఉంటుందని అంచనా. రెండేళ్ల క్రితం వరదలతో ఈ ప్రాంతంలో పంటలు దెబ్బతినగా.. ఆ దేశంలో గోధుమ పిండి కోసం ప్రజలు ఘర్షణలు పడ్డ విషయం తెలిసిందే..! భారత్‌ ఇప్పుడు నీటిని నిలిపివేస్తే పాకిస్థాన్‌కు కోలుకోలేని దెబ్బ తగులుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


సుసాధ్యం చేయొచ్చు?

ప్రస్తుతం భారతీయ సైన్యానికి చెందిన ఇంజనీరింగ్‌ విభాగం అధునాతన సాంకేతికతను కలిగి ఉంది. కొవిడ్‌-19 కాలంలో ఢిల్లీలో తాత్కాలికంగా వెయ్యి పడకల భారీ ఆస్పత్రిని 12 రోజుల వ్యవధిలో నిర్మించింది. డీఆర్‌డీవో వంటి సంస్థలు, ఆర్మీ ఇంజనీరింగ్‌ సంయుక్తంగా సరిహద్దుల్లో అతి తక్కువ సమయంలో వనరుల కల్పన విషయంలో ఇప్పటికే ఎన్నో అసాధ్యాలను సుసాధ్యం చేసి చూపించాయి. హిమాలయ రాష్ట్రాల్లో భారీ టన్నెల్స్‌ను నిర్మించి.. రహదారులను మెరుగుపరిచాయి. అటల్‌ టన్నెల్‌ ఇందుకు గొప్ప ఉదాహరణ. సింధు, దాని ఉపనదుల వద్ద మట్టి పరీక్షలు నిర్వహించి, వెనువెంటనే సంప్రదాయ పద్ధతులతోపాటు.. ప్రీకా్‌స్ట/ప్రీఫ్యాబ్రికేటెడ్‌ పద్ధతుల్లో డ్యామ్‌లను నిర్మించడం.. పర్వతాల మధ్య లోయ ప్రాంతాల్లో నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేయడం సాధ్యమేనని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న డ్యామ్‌లను నీటిని నిల్వకు అనుగుణంగా అభివృద్ధి చేయడం పెద్ద కష్టమైన పని కాదని, దీన్ని తక్కువ సమయంలో పూర్తిచేయవచ్చని అభిప్రాయపడుతున్నారు.

జల విధ్వంసంపై పాక్‌కు భయం!

ఇప్పటికిప్పుడు నదీజలాలను భారత్‌ ఒడిసిపట్టలేకున్నా.. డ్యామ్‌లను ఒక్కసారిగా తెరిచి, జల విధ్వంసానికి ప్రయత్నించే ప్రమాదముందని పాకిస్థాన్‌ పర్యావరణ నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే శనివారం చీనాబ్‌ నది నుంచి ఎలాంటి హెచ్చరికల్లేకుండా నీటిని వదిలారని, దాంతో ముజఫరాబాద్‌లో నీటి ఎమర్జెన్సీని ప్రకటించాల్సి వచ్చిందని పాకిస్థానీ పత్రిక ‘డాన్‌’ తన వెబ్‌సైట్‌లో ఓ కథనాన్ని ప్రచురించింది. నదీ పరీవాహకంలో ఉన్న ప్రజలు ఆందోళనకు గురయ్యారని పేర్కొంటూ.. వరద వీడియోలను షేర్‌ చేసింది. సింధు, జీలం నదుల విషయంలోనూ ఇలాంటి సంఘటనలు జరగవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. 1960 నాటి ఒప్పందం ప్రకారం వరద విషయంలో పాకిస్థాన్‌కు ముందస్తు హెచ్చరికలు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ ఒప్పందం రద్దుకావడంతో భారత్‌కు హెచ్చరికలు చేయాల్సిన బాధ్యత ఉండదని పేర్కొంది.


ఇవి కూడా చదవండి:

Pakistan Citizens: భారత్ విడిచి వెళ్లని పాకిస్తానీలకు మూడేళ్ల జైలు శిక్ష, రూ.3 లక్షల జరిమానా


Accident: ఆలయ దర్శనం కోసం వెళ్తుండగా ప్రమాదం..11 మంది మృతి, ముగ్గురికి గాయాలు


Akshay Tritiya: అక్షయ తృతీయకు గోల్డ్ కొనలా..వెయిట్ చేయాలా


Bank Holidays: మే 2025లో 12 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి లిస్ట్ ఇదే

Pahalgam Attack: ఎప్పటి నుంచి ప్లాన్ చేశార్రా.. ఉగ్రదాడి కోసం 22 గంటలు నడిచారా..

NaBFIDలో అనలిస్టు పోస్టులకు నోటిఫికేషన్.. రూ.14 లక్షల జీతంతో మంచి ఛాన్స్

TRAI: సిగ్నల్, నెట్ లేకపోతే సైలెంట్ కాదు..ఫిర్యాదు చేయడం మరింత ఈజీ తెలుసా..

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 28 , 2025 | 04:10 AM