Pahalgam Terrorist Attack: వాళ్లు పాకిస్థానీలే
ABN , Publish Date - Apr 24 , 2025 | 05:36 AM
జమ్మూ కశ్మీర్ పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదుల పనేనని దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. ఈ దాడిలో పాకిస్థానీ ఉగ్రవాదులు పాల్గొన్నారని, అలాగే స్థానికులు సహకరించిన వివరాలు ఇంకా సేకరించాల్సి ఉన్నాయని వెల్లడించాయి.
పహల్గాం దాడి ఉగ్రవాదుల్లో ఐదుగురు ఆ దేశస్థులే.. వారి భాష ఆధారంగా గుర్తింపు
దాడిలో పాల్గొన్నది ఏడుగురు.. అందులో ఇద్దరు స్థానికులు.. మొత్తం 70 రౌండ్ల కాల్పులు
దర్యాప్తు బృందాల వెల్లడి.. ఉగ్రవాదుల ఊహాచిత్రాలను విడుదల చేసిన పోలీసులు
నిఘా వర్గాలు హెచ్చరించినా.. భద్రతా దళాల వైఫల్యం వల్లే ఉగ్ర దాడి?
కశ్మీర్‌లో 56 మంది విదేశీ ఉగ్రవాదులు.. అత్యధికులు లష్కరే ముష్కరులే!
పహల్గాం, ఏప్రిల్ 23: జమ్మూకశ్మీరులోని పహల్గాంలో పర్యాటకులపై దాడి పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదుల పనేనని దర్యాప్తు సంస్థలు తేల్చాయి. దాడి సమయంలో ఉగ్రవాదులు మాట్లాడిన భాష, యాస ఆధారంగా ఈ నిర్ణయానికి వచ్చాయి. ఈ దాడిలో మొత్తం ఏడుగురు ఉగ్రవాదులు పాల్గొనగా వాళ్లల్లో ఐదుగురు పాకిస్థానీలు, ఇద్దరు స్థానికులు(కశ్మీరీలు) ఉన్నట్టు గుర్తించాయి. ఉగ్రదాడి నుంచి తప్పించుకున్న వారు, ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడిన దర్యాప్తు అధికారులు.. ఉగ్రవాదులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించారు. ఈ క్రమంలో దాడి సమయంలో ఉగ్రవాదుల్లో కొందరు మాట్లాడిన భాష, ఉపయోగించిన యాస పాకిస్థాన్‌లో మాత్రమే మాట్లాడేవిగా గుర్తించారు. దీంతో ఉగ్రదాడిలో పాకిస్థానీల పాత్రను నిర్ధారించారు. అయితే, ఉగ్రవాదులకు సహకరించిన స్థానికుల వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల ఫొటో, ఊహాచిత్రాలను దర్యాప్తు సంస్థలు బుధవారం విడుదల చేశాయి. దర్యాప్తు సంస్థలు విడుదల చేసిన ఫొటోలో సాయుధులైన నలుగురు వ్యక్తులు ఉన్నారు. అలాగే, ఆసిఫ్ ఫౌజి, సులేమాన్ షా, అబు తాలా అనే ముగ్గురి ఊహాచిత్రాలను కూడా విడుదల చేశారు. ఈ ముగ్గురి వివరాలను తెలియజేసిన వారికి రూ.20 లక్షల చొప్పున రివార్డు ఇస్తామని ప్రకటించారు. ఉగ్రదాడి నుంచి ప్రాణాలతో బయటపడిన వారు చెప్పిన గుర్తులు ఆధారంగా ఈ ఊహాచిత్రాలు గీయించారు. ఇక, లష్కరే తాయిబా కమాండర్ సైఫుల్లా కసూరీ అలియాస్ ఖలీద్ ఈ దాడికి సూత్రధారి అని దర్యాప్తు సంస్థలు పేర్కొంటున్నాయి. కాగా, ఉగ్రవాదులు కశ్మీరులోకి ఎలా ప్రవేశించారు ? ఎంతకాలంగా కశ్మీరులో ఉన్నారు ? తదితర అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
బాడీ కెమెరాల్లో దాడి రికార్డు !
దాడికి పాల్పడిన ఉగ్రవాదులు బాడీ కెమెరాలు ఉపయోగించి దాడి మొత్తాన్ని రికార్డు చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. శరీరానికి లేదా తుపాకీలకు అమర్చిన కెమెరాల సాయంతో ఉగ్రవాదులు తాము చేసే దాడులను రికార్డు చేయడం ఇటీవల కాలంలో అధికమైందని జమ్మూకశ్మీర్ పోలీసు శాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు. ఆయా వీడియోలను ఉగ్రవాదులు తర్వాత ప్రచారం కోసం వాడుకుంటున్నారని చెప్పారు.
మృతులంతా పురుషులే
భారత నేవీలో లెఫ్టినెంట్‌గా ఉన్న ఓ హరియాణా వాసి, అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న కోల్‌కతా వాసి, విశాఖపట్నంకు చెందిన రిటైర్డు బ్యాంకు ఉద్యోగి, కర్ణాటకకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి, తదితరులు పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి జాబితాలో ఉన్నారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన 26 మంది జాబితాను దర్యాప్తు సంస్థలు విడుదల చేశాయి. మృతుల్లో మహారాష్ట్రకు చెందిన వారు ఆరుగురు, గుజరాత్ వారు ముగ్గురు, కర్ణాటక వారు ముగ్గురు, పశ్చిమ బెంగాల్ వ్యక్తులు ఇద్దరు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, ఒడిసా, మధ్యప్రదేశ్, పంజాబ్, బిహార్, ఉత్తరప్రదేశ్, కేరళ రాష్ట్రాలకు చెందిన వారు ఒక్కొక్కరు ఉన్నారు. వీరు కాక నేపాల్‌కు చెందిన ఓ వ్యక్తి, పహల్గాం స్థానికుడు కూడా మృతుల్లో ఉన్నారు. మృతులంతా పురుషులే కావడం గమనార్హం.
మృతుల జాబితా
