Share News

Trump - Zelensky Call: వైట్‌ హౌస్ వాగ్వివాదం తరువాత తొలిసారిగా ట్రంప్-జెలెన్‌స్కీ చర్చలు

ABN , Publish Date - Mar 20 , 2025 | 11:03 AM

రష్యా అధ్యక్షుడితో ఫోన్ కాల్ అనంతరం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉక్రెయిన్ అధినేత జెలెన్‌స్కీతో కూడా ఫోన్‌లో చర్చించారు. ఈ సంభాషణ సానుకూలంగా సాగిందని తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్‌లో వెల్లడించారు.

Trump - Zelensky Call: వైట్‌ హౌస్ వాగ్వివాదం తరువాత తొలిసారిగా ట్రంప్-జెలెన్‌స్కీ చర్చలు

ఇంటర్నెట్ డెస్క్: రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి స్థాపన దిశగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కాల్పుల విరమణకు సంబంధించి చర్చలు జరుపుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడి జెలెన్‌స్కీతో కూడా ఫోన్‌లో మాట్లాడారు. దాదాపు గంట పాటు ఇరు దేశాధినేతల మధ్య ఫోన్ సంభాషణ సాగింది. శ్వేతసౌధంలో ఇరు దేశాధినేతలు బహిరంగంగా వాగ్వాదానికి దిగిన తరువాత మళ్లీ ఇన్నాళ్లకు వారి మధ్య చర్చలు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ చర్చలు సానుకూల ధోరణిలో జరిగాయని జెలెన్‌స్కీ పేర్కొన్నారు. అమెరికా నేతృత్వం, ట్రంప్ సహకారంతో సుస్థిర శాంతి స్థాపన సాధ్యమని ఆయన అన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ విరమణకు తొలి అడుగుగా పౌర, ఇంధన స్థావరాలు, మౌలిక వసతులపై దాడులు ఆగాల్సిన అవసరం ఉందని జెలెన్‌స్కీ అభిప్రాయపడ్డారు. జావెలిన్ మిసైల్స్‌తో పాటు ఇతర అంశాల్లో సైనిక సహకారం అందించిన అమెరికాకు ధన్యవాదాలు తెలిపారు.


Also Read: మంటల్లో టెస్లా కార్లు.. ఎలాన్ మస్క్ తీవ్ర ఆగ్రహం

రష్యా ఆధీనంలోని జాపోరిజియా పవర్ ప్లాంట్‌ను అమెరికా పరిధిలోకి తీసుకొచ్చి దాడులకు అడ్డుకట్ట వేయొచ్చని ట్రంప్ ఈ సందర్భంగా జెలెన్‌స్కీకి సూచించారు. ‘‘తనను, తన మిత్రులను రక్షించుకునే చరిత్ర కలిగిన దేశంలో ఆర్థిక ఒప్పందం చేసుకోవడం ఉక్రెయిన్‌కు కొంత లాభిస్తుందని కూడా అన్నారు. ఖనిజాలకు సంబంధించి అమెరికా, ఉక్రెయిన్‌కు మధ్య డీల్‌ కూడా చర్చకు వచ్చిందని శ్వేత సౌధం ప్రెస్ సెక్రెటరీ తెలిపారు. అయితే, ప్రస్తుతం తమ దృష్టి అంతా శాంతి స్థాపనపైనే ఉందని అన్నారు. యుద్ధం కారణంగా అదృశ్యమైన చిన్నారుల గురించి కూడా ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడిని ఆరా తీసినట్టు తెలిపారు. వారి ఆచూకీ తెలుసుకునేందుకు ఇరు వర్గాలతో కలిసి కృషి చేస్తానని ట్రంప్ పేర్కొన్నట్టు తెలిపారు.


Also Read: నా ఆఫర్‌ను తిరస్కరించారు.. సునీత రిటర్న్ జర్నీపై మస్క్ కీలక వ్యాఖ్యలు

మరోవైపు, ఈ చర్చలపై ట్రంప్ కూడా తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్ ద్వారా స్పందించారు. చర్చలు సానుకూలంగా సాగాయని అన్నారు. పుతిన్‌తో ఫోన్ కాల్‌ గురించే అధిక భాగం తాము చర్చించామని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో అమెరికా, ఉక్రెయిన్ అధికారులు సౌదీ అరేబియాలో సమావేశమై రెండో దశ చర్చలు జరుపుతారని తెలిపారు. ఇక ట్రంప్‌తో ఫోన్ కాల్‌ సందర్భంగా తక్షణ కాల్పుల విరమణ ప్రతిపాదనను పుతిన్ తోసిపుచ్చారు. అయితే, ఉక్రెయిన్‌కు చెందిన ఇంధన రంగ మౌలిక వసతులపై దాడులను 30 రోజుల పాటు నిలిపివేసేందుకు మాత్రం అంగీకరించారు.

Read Latest and International News

Updated Date - Mar 20 , 2025 | 11:08 AM