Share News

Trump Policy Blocks: ట్రంప్‌ దూకుడుకు కోర్టుల బ్రేకులు

ABN , Publish Date - Apr 19 , 2025 | 03:48 AM

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చెలాయించిన వలస విధానాన్ని బోస్టన్‌ జిల్లా జడ్జి నిలిపివేశారు. అలాగే, ట్రంప్‌ సర్కారు చేపట్టిన ఫెడరల్‌ సంస్థల రద్దుపై కొలంబియా జిల్లా జడ్జి చెక్‌ పెట్టారు

Trump Policy Blocks: ట్రంప్‌ దూకుడుకు కోర్టుల బ్రేకులు

వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 18: రెండో సారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చూపుతున్న దూకుడుకు అమెరికాలోని కోర్టులు బ్రేకులు వేస్తున్నాయి. వలస వచ్చినవారిని మూకుమ్మడిగా, వేగంగా వారి స్వదేశాలకు తిప్పిపంపేందుకు ట్రంప్‌ అమల్లోకి తెచ్చిన కొత్త పాలసీని నిలిపివేస్తూ అమెరికాలోని బోస్టన్‌ జిల్లా జడ్జి బ్రియాన్‌ మర్ఫీ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సాధారణంగా అమెరికాలోని వలసదారులు తమకు స్వదేశాల్లో ప్రాణహాని ఉందని, తిరిగి వెళితే తీవ్రంగా హింసిస్తారనే ఆందోళన వ్యక్తం చేస్తే.. వెంటనే తిప్పిపంపేయరు. ఈ అంశాన్ని లోతుగా పరిశీలించి, వలసదారులు చెప్పినది సరైనదే అయితే అమెరికాలోనే ఉండనిస్తారు. లేకుంటే తిప్పిపంపుతారు. ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుంది. కానీ ట్రంప్‌ సర్కారు వేగంగా, మూకుమ్మడిగా వలసదారులను తిప్పిపంపేందుకు ఈ ప్రక్రియను పక్కనపెడుతూ కొత్త పాలసీని అమల్లోకి తెచ్చింది. దాని అమలును తాత్కాలికంగా నిలిపివేస్తూ బోస్టన్‌ జిల్లా జడ్జి సుమారు నెల రోజుల క్రితమే ఆదేశాలు ఇచ్చారు.


కోర్టులో వేసిన పిటిషన్లను, వివిధ అంశాలను పరిశీలించి.. కోర్టులో విచారణ ముగిసేవరకు కొత్త పాలసీని నిలిపివేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు ప్రభుత్వ ఖర్చు తగ్గించే క్రమంలో పలు ఫెడరల్‌ సంస్థల రద్దు, ఉద్యోగుల తొలగింపు దిశగా ట్రంప్‌ సర్కారు చేపట్టిన చర్యలకు మరో జిల్లా జడ్జి చెక్‌ పెట్టారు. ‘వినియోగదారుల ఆర్థిక రక్షణ బ్యూరో (సీఎ్‌ఫపీబీ)’ను రద్దు చేసి, అందులోని సుమారు 15 వందల మంది ఉద్యోగులను తొలగించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని కొలంబియా జిల్లా జడ్జి అమీ బెర్మన్‌ జాక్సన్‌ నిలిపివేశారు. ఈ బ్యూరోను కొనసాగించాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ ముగిసి, తీర్పు ఇచ్చేవరకు ఉద్యోగులెవరినీ తొలగించవద్దని ఆదేశించారు.

Updated Date - Apr 19 , 2025 | 03:48 AM