Donald Trump: ట్రంప్ సుంకాల కొరడా
ABN , Publish Date - Feb 03 , 2025 | 05:13 AM
ఈ క్రమంలోనే.. అక్రమ వలసలను కట్టడి చేయలేకపోతున్నాయంటూ కెనడా, మెక్సికో దిగుమతులపై 25% సుంకం.. ‘ఫెంటనిల్’ అనే సింథటిక్ డ్రగ్ తయారీకి అవసరమైన ముడిపదార్థాలను సరఫరా చేస్తోందంటూ చైనా దిగుమతులపై 10% మేర అదనపు సుంకం విధిస్తూ శనివారం ఆయన ఉత్తర్వులు జారీ చేశారు.

కెనడా, మెక్సికో దిగుమతులపై 25 శాతం విధింపు
చైనా దిగుమతులపై 10 శాతం అదనపు సుంకం
వలసలు, డ్రగ్స్ కట్టడికి సహకరించట్లేదన్న వైట్‌హౌస్
తామూ 25 శాతం సుంకం విధిస్తామన్న కెనడా
అదేబాటలో నడుస్తామంటూ మెక్సికో హెచ్చరికలు
డబ్ల్యూటీవోలో సవాల్ చేస్తాం: చైనా సర్కారు
వాషింగ్టన్, ఫిబ్రవరి 2: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచార సమయంలో హెచ్చరించినట్టుగానే కెనడా, మెక్సికో, చైనాపై అదనపు సుంకాల కొరడా ఝుళిపించారు. తాను అధికారంలోకి వస్తే దేశంలోకి అక్రమ వలసలను, మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకుంటానని ఆయన హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. అక్రమ వలసలను కట్టడి చేయలేకపోతున్నాయంటూ కెనడా, మెక్సికో దిగుమతులపై 25ు సుంకం.. ‘ఫెంటనిల్’ అనే సింథటిక్ డ్రగ్ తయారీకి అవసరమైన ముడిపదార్థాలను సరఫరా చేస్తోందంటూ చైనా దిగుమతులపై 10ు మేర అదనపు సుంకం విధిస్తూ శనివారం ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. కెనడా నుంచి దిగుమతి చేసుకునే చమురు, సహజవాయువు వంటి ఇంధన వనరులపై మాత్రం 10 శాతం సుంకం ఉంటుందని వెల్లడించారు.
ఈ సుంకాలు విధించేందుకు వీలుగా అమెరికాలో ఆర్థిక ఎమర్జెన్సీని ట్రంప్ ప్రకటించారు. నిషేధిత ఫెంటనిల్ వంటి మాదకద్రవ్యాలు అమెరికాలోకి అక్రమమార్గాల్లో ప్రవేశించడం వల్ల ప్రజారోగ్య సంక్షోభం ఏర్పడుతోందని.. సింథటిక్ డ్రగ్స్ ముడిపదార్థాలను అక్రమంగా తరలిస్తున్న నేరగాళ్ల ముఠాలకు చైనా అడ్డుకట్టవేయలేకపోతోందని.. అందుకే ఆయన ఈ ఉత్తర్వులు జారీ చేశారని వైట్‌హౌస్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. మెక్సికోలో మాదకద్రవ్యాల అక్రమరవాణా ముఠాలకు ప్రభుత్వంతోనే సంబంధాలున్నాయని ఆరోపించింది. డ్రగ్స్ తయారీ, రవాణాకు మెక్సికో సర్కారు సహకరిస్తోందని దుయ్యబట్టింది. తద్వారా ఆ మాదక ద్రవ్యాలన్నీ అమెరికాకు చేరి.. డ్రగ్ ఓవర్‌డోస్ కారణంగా వేలాదిమంది అమెరికన్లు మరణిస్తున్నారని ఆందోళన వెలిబుచ్చింది.
మేమూ విధిస్తాం..
ట్రంప్ విధించిన సుంకాల భారానికి ప్రతిగా.. మెక్సికో, కెనడా కూడా అమెరికాపై ప్రతీకార చర్యలకు దిగాయి. అమెరికా నుంచి తాము దిగుమతి చేసుకునే 155 బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై 25 శాతం సుంకాన్ని విధించనున్నట్టు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించారు. ఇందులో 30 బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై వెంటనే, మరో 125 బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై 21రోజుల తర్వాత నుంచి సుంకాలు విధిస్తామని, ఈలోగా కెనడా కంపెనీలు ఆయా ఉత్పత్తులకు ప్రత్యామ్నాయాలను వెతుక్కో వాలని వెల్లడించారు. ‘‘మెక్సికో ప్రయోజనాల పరిరక్షణ’’ పేరిట ‘ప్లాన్ బి’ని అమలు చేయాలని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా తమ దేశ ఆర్థిక మంత్రికి ఆదేశాలు జారీచేశారు. ‘ప్లాన్ బి’ అంటే.. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై పలు చర్యలు తీసుకోవడం. మెక్సికోలో నేరగాళ్ల ముఠాలతో ప్రభుత్వానికి సంబంధాలున్నాయంటూ అమెరికా చేసిన ఆరోపణలను క్లాడియా తీవ్రస్థాయిలో ఖండించారు. ‘‘సుంకాల విధింపుతో సమస్యలు పరిష్కారం కావు. చర్చలతోనే పరిష్కారమవుతాయి’’ అన్నారు. మరోవైపు అమెరికా తమపై విధించిన 10శాతం అదనపు సుంకాలను ప్రపంచ వాణిజ్య సంస్థలో సవాల్ చేస్తామని చైనా వాణిజ్య శాఖ మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది. ట్రంప్ సర్కారు నిర్ణయం డబ్ల్యూటీవో నిబంధనల తీవ్ర ఉల్లంఘనే అని మండిపడింది. ఇక.. ‘ఫెంటనిల్’ అమెరికా సమస్య అని, దాంతో తమకేం సంబంధమని చైనా విదేశాంగ శాఖ ప్రశ్నించింది.
ఏమిటీ ఫెంటనిల్?
భారతీయులు వంటల్లో వాడే గసగసాల (పాపీ) మొక్క నుంచి తీసే నల్లమందు (ఓపియం)ను రసాయనాలతో శుద్ధి చేస్తే హెరాయిన్ అనే మాదక ద్రవ్యం వస్తుంది. పాపీ మొక్క నుంచి వచ్చే మార్ఫిన్, కోడిన్‌వంటివాటిని ఓపియేట్స్‌గా వ్యవహరిస్తారు. పూర్తిగా పాపీ మొక్క నుంచి కాక.. కొంతమేర సింథటిక్ మాలిక్యూల్స్‌ను ఉపయోగించి తయారుచేసే మాదకద్రవ్యాలను ‘పార్షియల్లీ సింథటిక్ ఓపియాయిడ్స్’ అంటారు. హైడ్రోకోడోన్, ఆక్సీకోడోన్, హైడ్రోమార్ఫోన్ వంటివి ఈ కోవలోకి వస్తాయి. పాపీ మొక్కతో సంబంధం లేకుండా పూర్తిస్థాయిలో దాన్ని అనుసరించే సింథటిక్ మాలిక్యూల్స్‌తో తయారుచేసే మాదకద్రవ్యాలను ‘ఓపియాయిడ్స్’గా వ్యవహరిస్తారు. ఫెంటనిల్, మెథాడోన్, మెపెరిడిన్ వంటి వి ఇందుకు ఉదాహరణ. ఈ ఓపియాయిడ్స్ మొక్కల నుంచి తయారయ్యే హెరాయిన్, ఓపియం, మార్ఫిన్, కోడిన్‌లో 50 నుంచి 100 రెట్లు శక్తిమంతమైనవి. ప్రాణాంతక వ్యాధుల కారణంగా భరించలేనంత నొప్పితో బాధపడేవారికి నొప్పినివారణ మందులుగా వీటిని ఇస్తుంటారు.
ఈ క్రమంలోనే ఫెంటనిల్‌కు అమెరికా ఔషధ, ఆహార నియంత్రణ సంస్థ కూడా ఎనాల్జెసిక్(నొప్పినివారిణి), ఎనెస్థెటిక్ (మత్తు కలిగించే ఔషధం)గా వినియోగించేందుకు అనుమతులు ఇచ్చింది. కానీ తగు మోతాదులోనే అది నొప్పినివారిణిగా పనిచేస్తుంది. డోసు కాస్త ఎక్కువైనా ప్రాణాంతకంగా మారుతుంది. కొందరిలో 2 గ్రాముల డోసు సైతం కోమా, శ్వాసవ్యవస్థ వైఫల్యానికి కారణమై ప్రాణాలు తీస్తుంది. ఈ డ్రగ్‌ను చాలా మంది అమెరికన్లు ఇటీవలికాలంలో మత్తు కోసం అధికమోతాదులో తీసుకుని ప్రాణాలు పోగొట్టుకుంటున్నట్టు అధికారిక గణాంకాలు ధ్రువీకరిస్తున్నాయి. 2021లో ఫెంటనిల్ ఓవర్ డోస్ కారణంగా 1,07,000 మంది, 2022లో రోజుకు సగటున 200మంది ప్రాణాలు కోల్పోయారు. 2023లో 75వేల మంది చనిపోయారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకమైన ఏడు ‘స్వింగ్ రాష్ట్రాల’ ప్రజలు ప్రధానంగా పేర్కొన్న సమస్యల్లో ఫెంటనిల్ డ్రగ్ ఒకటి. ట్రంప్ అధికారంలోకి రాగానే ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఫెంటనిల్ తయారీకి అవసరమైన ముడిపదార్థాల సరఫరాను అడ్డుకోలేకపోతోందంటూ చైనాపై 10ు అదనపు సుంకం విధించారు.
ఇవి కూడా చదవండి..
Sonia Gandhi: సోనియా గాంధీపై కోర్టులో ఫిర్యాదు చేసిన న్యాయవాది.. ఎందుకంటే..
Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాకు భక్తజనం.. ఫిబ్రవరి 1 నాటికి ఎంత మంది వచ్చారంటే..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి