USCIRF: రాపై ఆంక్షలు విధించండి
ABN , Publish Date - Mar 27 , 2025 | 05:00 AM
అమెరికా అంతర్జాతీయ మత స్వేచ్ఛ కమిషన్ (USCIRF) భారత గూఢచార సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (RAW) పై ఆంక్షలు విధించాలని సిఫారసు చేసింది. మైనారిటీలపై దాడులు, వివక్ష పెరుగుతున్నాయని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తోందని నివేదికలో పేర్కొంది.

సిక్కు వేర్పాటువాదుల హత్య కుట్రలో ‘రా’ పాత్ర
అమెరికా ప్రభుత్వానికి మత స్వేచ్ఛ కమిషన్ సిఫారసు
భారత్‌లో మత స్వేచ్ఛ క్షీణించిందంటూ నివేదిక
ఆందోళనకర దేశంగా ప్రకటించాలని ప్రతిపాదన
యూఎ్‌ససీఐఆర్‌ఎఫ్ సిఫారసుపై భారత్ మండిపాటు
వాషింగ్టన్/న్యూఢిల్లీ, మార్చి 26: భారత గూఢచార సంస్థ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా)పై ఆంక్షలు విధించాలని అంతర్జాతీయ మత స్వేచ్ఛపై అమెరికా కమిషన్ (యూఎ్‌ససీఐఆర్‌ఎఫ్) సిఫారసు చేసింది. సిక్కు వేర్పాటువాదులను అంతమొందించే కుట్రలో భాగస్వామిగా రా ఉందన్న ఆరోపణల నేపథ్యంలో అమెరికా ప్రభుత్వానికి ఆ సంస్థ ఆంక్షల ప్రతిపాదనలు చేసిందని ఆంగ్ల పత్రిక రాయిటర్ తన కథనంలో పేర్కొంది. కమిషన్ నివేదికలోని పలు అంశాలను ఆ కథనంలో ప్రస్తావించింది. భారతదేశంలోని మైనారిటీలు దారుణ పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు ఆ కమిషన్ మంగళవారం విడుదల చేసిన వార్షిక నివేదికలో పేర్కొంది. మత స్వేచ్ఛ ఉల్లంఘన విషయంలో ఆందోళనకర దేశంగా భారత్‌ను గుర్తించాలని ప్రతిపాదించింది. ఆయుధాలను అమ్మే విషయంలో పునరాలోచన చేయాలని సూచించింది. వియత్నాం కూడా మత స్వేచ్ఛను నియంత్రిస్తోందని, ఆ దేశాన్ని కూడా ఆందోళనకర దేశంగా ప్రకటించాలని కోరింది. 2024లో భారత్‌లో మత స్వేచ్ఛ దిగజారిపోయిందని పేర్కొంది.
ఆ ఏడాది బీజేపీ నేతలు, ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో ముస్లింలు, ఇతర మైనారిటీ మతాలపై ద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని తెలిపింది. అయితే ప్రస్తుతం ఉన్న స్నేహ సంబంధాల నేపథ్యంలో రాపై ట్రంప్ ప్రభుత్వం ఆంక్షలు విధించే పరిస్థితి ఉండబోదని రాయిటర్ విశ్లేషించింది. యూఎ్‌ససీఐఆర్‌ఎఫ్ నివేదికపై భారత ప్రభుత్వం మండిపడింది. భారత్‌లోని వైవిధ్యమైన సమాజానికి కళంకం తెచ్చేందుకు నిరంతరాయంగా చేస్తున్న ప్రయత్నం ఇది అంటూ ధ్వజమెత్తింది. మత స్వేచ్ఛపై నిజాయితీ లేకుండా ఉద్దేశపూర్వకంగా విమర్శలు చేసేందుకే ఆ నివేదిక ఇచ్చారంటూ తప్పుబట్టింది. యూఎ్‌ససీఐఆర్‌ఎఫ్ నివేదికపై విదేశీ వ్యవహారాల ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ బుధవారం మీడియాతో మాట్లాడారు. అదో పక్షపాతధోరణితో రూపొందించిన నివేదిక అంటూ విమర్శించారు. అన్ని మతాలను అనుసరించే 140 కోట్ల మందికి పైగా భారత్‌లో నివసిస్తున్నారని, ఇంత వైవిధ్యంలోనూ సామరస్య జీవనాన్ని సీఐఆర్‌ఎఫ్ అర్థం చేసుకోలేదన్నారు. ఆ సంస్థపై తమకు ఎలాంటి అంచనాలు కూడా లేవన్నారు.
ఇవి కూడా చదవండి:
Yogi Adityanath: యోగి విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
కొబ్బరి నీళ్ల కంటే.. మంచి నీళ్లు మేలు.. డాక్టరేంటి ఇలా అన్నాడు..