Varalaxmi Sarathkumar: వరలక్ష్మి షాకింగ్ కామెంట్స్.. ఆరుగురు వ్యక్తులు నన్ను వేధించారు
ABN , Publish Date - Mar 28 , 2025 | 12:36 PM
తన తల్లిదండ్రులు సెలబ్రిటీలు అయినప్పటికీ.. తనకు కూడా వేధింపులు తప్పలేదని చెప్పుకొచ్చారు వరలక్ష్మి శరత్ కుమార్. బాల్యంలో తాను ఎదుర్కొన్న భయానక అనుభవం గురించి చెబుతూ.. కన్నీటి పర్యంతం అయ్యారు. ఆరుగురు వ్యక్తులు తనను లైంగికంగా వేధించారని గుర్తు చేసుకున్నారు వరలక్ష్మి.

ఆడవాళ్లను చూస్తే చాలు కొందరి మగాళ్ల పుర్రెలో పురుగు తిరగుతుంది. వయసుతో సంబధం లేకుండా వేధింపులకు గురి చేస్తారు. ఆడపిల్లకు ఇంట్లోనే భద్రత లేకపోతే.. ఇక సమాజం గురించి ఏం మాట్లాడతాం. లైంగిక వేధింపుల జాబితాలో సామాన్యులు మొదలు సెలబ్రిటీలు కూడా ఉంటున్నారు. కామాంధులు ఎవరిని వదలడం లేదు. వేధింపులు ఎదుర్కొన్నప్పటికి కొందరు భయపడి బయటకు చెప్పుకోలేరు. మరి కొందరు మాత్రం తాము ఎదుర్కొన్న భయానక అనుభవాల గురించి చెప్పుకొస్తారు. తాజాగా ఈ జాబితాలో తమిళ్, తెలుగు నటి వరలక్ష్మి శరత్ కుమార్ కూడా చేరారు. తనను కూడా బాల్యంలో కొందరు వ్యక్తులు లైంగికంగా వేధించారని చెబుతూ.. కన్నీటిపర్యంతం అయ్యారు. ఆ వివరాలు..
వరలక్ష్మి శరత్ కుమార్.. తమిళ్, తెలుగు అనే తేడా లేకుండా దక్షిణాదిలో బిజీ యాక్ట్రెస్‌గా మారారు. విభిన్నమైన పాత్రలు సెలక్ట్ చేసుకుంటూ.. కెరీర్‌లో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్నారు. ఇక వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. గతేడాది ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకుని.. వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు వరలక్ష్మి. ప్రస్తుతం సినిమాలు మాత్రమే కాక డ్యాన్స్ రియాలిటీ షోకు జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో భాగంగా.. తన బాల్యంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను గుర్తు చేసుకుని.. కన్నీటి పర్యంతం అయ్యారు వరలక్ష్మి.
ఒక తమిళ్ టీవీ ఛానల్‌లో ప్రసారం అవుతోన్న డ్యాన్స్ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు వరలక్ష్మి శరత్ కుమార్. ఈ క్రమంలో కెమి అనే కంటెస్టెంట్.. కుటుంబ సభ్యులు తనను ఎలా చిన్న చూపు చూశారో.. ఎంత దారుణంగా లైంగిక వేధింపులకు గురి చేశారో గుర్తు చేసుకుని స్టేజీ మీదే కన్నీరు పెట్టుకున్నారు. కెమి మాటలు విన్న వరలక్ష్మి శరత్‌కుమార్ భావోద్వేగానికి గురయ్యారు.
ఈ సందర్భంగా వరలక్ష్మి మాట్లాడుతూ.. "కెమికి ఎదురైన పరిస్థితులే నాకు కూడా ఎదురయ్యాయి. నేను కూడా కెమిలానే లైంగిక వేధింపులకు గురయ్యాను. నా తల్లిదండ్రులు వారి పనులతో బిజీగా ఉండేవారు. నన్ను చూసుకోవడానికి మనుషుల్ని పెట్టి వారు షూటింగ్‌కు వెళ్లేవారు. అలా నేను చిన్న పిల్లగా ఉన్నప్పుడు ఐదారుగురు వ్యక్తులు నన్ను లైంగికంగా వేధించారు. నీ కథ.. నా కథలానే ఉంది. నాకు పిల్లలు లేరు. కానీ తల్లిదండ్రులకు నేను చెప్పేది ఒక్కటే.. మీ పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చెప్పండి. ఎవరైనా వారితో తప్పుగా ప్రవర్తిస్తే ఆ విషయం మీకు చెప్పమనండి. పిల్లలకు మేమున్నామనే భరోసా కల్పించండి" అని చెప్పుకొచ్చింది.
అంతేకాక కెమరా ముందు ఏడ్వటం తనకు ఇష్టం లేదని.. కానీ భావోద్వేగం ఆపుకోలేకపోయానని.. అందుకు తనను క్షమించమని కోరింది వరలక్ష్మి. గతంలో కూడా అనేక సందర్భాల్లో వరలక్ష్మి తాను ఎదుర్కొన్న వేధింపులు గురించి చెప్పుకొచ్చింది.