Vice President: భారత రాష్ట్రపతిని నిర్దేశించలేరు.. న్యాయవ్యవస్థపై ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Apr 17 , 2025 | 02:56 PM
భారత న్యాయవ్యవస్థ లక్ష్యంగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి, గవర్నర్లు బిల్లులను ఆమోదించడానికి గడువును నిర్ణయిస్తూ ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు పై ఆయన స్పందించారు.
India Vice President: భారత న్యాయవ్యవస్థ లక్ష్యంగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి, గవర్నర్లు బిల్లులను ఆమోదించడానికి గడువును నిర్ణయిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నాలుగు రోజుల తర్వాత ఉపరాష్ట్రపతి ఈ అంశంపై స్పందించారు. న్యాయవ్యవస్థను ఉద్దేశించి తీవ్ర పదజాలంతో మాట్లాడారు. రాజ్యసభ ఇంటర్న్స్ 6వ బ్యాచ్‌ను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన కోర్టులు రాష్ట్రపతిని నిర్దేశించే పరిస్థితి మనకు ఉండదని అన్నారు. సుప్రీంకోర్టుకు ప్రత్యేక అధికారాలను ఇచ్చే రాజ్యాంగంలోని ఆర్టికల్ 142, "న్యాయవ్యవస్థకు 24/7 అందుబాటులో ఉన్న ప్రజాస్వామ్య శక్తులపై అణ్వాయుధ క్షిపణిగా మారింది" అని కూడా ఆయన అన్నారు.
ఇలా ఉండగా, ఏప్రిల్ 13వ తేదీన రాష్ట్రాల గవర్నర్లు పంపే బిల్లులపై రాష్ట్రపతి తప్పనిసరిగా 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాల్సిందేనని సుప్రీంకోర్టు తొలిసారిగా గడువును నిర్దేశించిన సంగతి తెలిసిందే. ఆర్టికల్ 201 ప్రకారం రాష్ట్రపతి కూడా జ్యుడీషియల్ రివ్యూకు కట్టుబడి ఉండాలని ఆ తీర్పులో స్పష్టం చేసింది. తమిళనాడు అసెంబ్లీలో పాస్ అయిన బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ నెలల తరబడి పెండింగ్‌లో పెట్టడాన్ని తప్పుపడుతూ సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ ఆర్. మహాదేవన్‌తో కూడిన బెంచ్ ఈమేరకు సంచలన తీర్పును వెలువరించింది.
"ఆర్టికల్ 201 ప్రకారం, ఒక బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి గవర్నర్ పంపినట్టయితే.. దానిని రాష్ట్రపతి ఆమోదించాలి, లేదంటే తిరస్కరించాలి. కానీ రాష్ట్రపతి ఎంత కాలంలోపు నిర్ణయం తీసుకోవాలన్నది రాజ్యాంగంలో పేర్కొనలేదు. అంతమాత్రాన రాష్ట్రపతికి ‘పాకెట్ వీటో’ అధికారం ఉందని అనుకోరాదంటూ తీర్పు చెప్పింది.
అయితే, ఏదైనా ఒక బిల్లు విషయంలో రాజ్యాంగబద్ధతపై ప్రశ్నలు ఉత్పన్నమైనప్పుడు మాత్రం కార్యనిర్వాహక వ్యవస్థ కోర్టుల పాత్ర పోషించరాదని.. ఆర్టికల్ 143 ప్రకారం, దానిని సుప్రీంకోర్టుకు రిఫర్ చేయాలని చెప్పింది. కాగా, తమిళనాడు అసెంబ్లీలో పాస్ చేసి పంపిన 10 బిల్లులను గవర్నర్ ఆర్ఎన్ రవి పెండింగ్‌లో పెట్టారు. దీనిపై డీఎంకే సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, అసెంబ్లీ రెండోసారి పంపిన బిల్లులను గవర్నర్ ఆమోదించాల్సిందేనని తీర్పు వెల్లడించింది.
ఇవి కూడా చదవండి
Raj Tarun Parents: హైడ్రామాకు తెర.. ఇంట్లోకి వెళ్లిన రాజ్‌తరుణ్ పేరెంట్స్
Mithun Reddy High Court: ఏపీ హైకోర్టులో మిథున్ రెడ్డి పిటిషన్.. ఎందుకంటే
Read Latest AP News And Telugu News