Punjab farm leaders detained: పంజాబ్ సరిహద్దుల్లో రైతు నిరసన శిబిరాల తొలగింపు.. రైతుల అరెస్టు
ABN , Publish Date - Mar 20 , 2025 | 10:05 AM
పంజాబ్ సరిహద్దుల్లోని రైతు నిరసన శిబిరాలను పోలీసులు తొలగించారు. నిరసనల్లో పాల్గొనేందుకు వెళుతున్న కొందరిని మోహాలీ వద్ద అదుపులోకి తీసుకున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: పంజాబ్ సరిహద్దుల్లోని శంభూ, ఖానోరీ ప్రాంతాల్లో రైతుల నిరసన శిబిరాలను పోలీసులు తొలగించారు. కొందరు రైతులను కూడా అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఈ నిరసనల్లో పాల్గొనేందుకు వెళుతున్న ఓ రైతు బృందాన్ని మోహాలీ వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు పోలీసుల తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
అంతకుమునుపు, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బృందంతో రైతులు సమావేశమయ్యారు. అనంతరం,పంజాబ్ - హర్యానా సరిహద్దు వద్ద నిరసనల్లో పాల్గొనేందుకు వెళుతున్న సమయంలో పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. మరోవైపు, సరిహద్దు వద్ద రైతులు ఏర్పాటు చేసుకున్న నిరసన శిబిరాలను కూడా పోలీసులు తొలగించారు. ఈ క్రమంలో మరికొందరు రైతులను అదుపులోకి తీసుకున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చాంటూ ఢిల్లీకి బయలుదేరిన రైతులకు పోలీసులు అనుమతించకపోవడంతో వారు ఇరు రాష్ట్రాల సరిహద్దు వద్ద నిరసనకు దిగిన విషయం తెలిసిందే.
Also Read: 1000 మంది హిందూ భక్తులు మాయం: అఖిలేష్ సంచలన వ్యాఖ్యలు
‘‘రైతులు చాలా కాలం నుంచి అక్కడ నిరసనలు చేపడుతున్నారు. నేడు డ్యూటీ మెజిస్ట్రేట్‌ల సమక్షంలో పోలీసులు రైతులకు చట్టప్రకారం హెచ్చరికలు జారీ చేసి అనంతరం శిబిరాలను తొలగించారు’’ అని పాటియాలాకు చెందిన సీనియర్ పోలీసు అధికారి ఒకరు పేర్కొన్నారు.
‘‘కొందరు స్వచ్ఛందంగా ఆ ప్రాంతాన్ని వీడేందుకు సిద్ధమయ్యారు. వారు బస్సుల్లో వెళ్లిపోయారు. అంతేకాకుండా, అక్కడున్న కొన్ని వాహనాలను, గుడారాలను తొలగించాము. రోడ్డు మొత్తాన్ని క్లియర్ చేసి ట్రాఫిక్ రాకపోకలను అనుమతించాము. హర్యానా పోలీసులు కూడా తమ చర్యలు ప్రారంభించారు. అవతలి వైపు నుంచి అడ్డంకులు తొలగిపోయాక రహదారిపై వాహనాల రాకపోకలు మొదలవుతాయి. రైతులు ఏమీ ప్రతిఘటించలేదు. మాకు సహకరించి తమంతట తాముగా బస్సుల్లో వెళ్లి కూర్చున్నారు’’ అని అధికారి తెలిపారు.
Also Read: భార్య కన్నింగ్ ప్లాన్.. భర్తను చంపి.. అతడి వాట్సాప్ నుంచి..
శంభూ-ఖానౌరీ సరిహద్దులు తెరిచేందుకు తాము ఈ చర్యలు చేపట్టినట్టు పంజాబ్ మంత్రి హర్‌పాల్ సింగ్ చీమా తెలిపారు. ‘‘కేంద్రానికి వ్యతిరేకంగా నిరసనకు దిగిన రైతులు తమ కార్యక్రమాలను ఢిల్లీలో లేదా మరో ప్రాంతంలో చేపట్టాలి. అంతేకాకుండా పంజాబ్‌లో రహదారులను మూసేయకూడదు’’ అని మంత్రి అన్నారు.
ప్రభుత్వ చర్యలపై కాంగ్రెస్ మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పోలీసుల చర్యలను వ్యవసాయ రంగంపై దాడి ని కాంగ్రెస్ ఎంపీ చరణ్‌జీత్ వ్యాఖ్యానించారు. శిరోమణి అకాళీదళ్ నేత దల్జీత్ సింగ్ చీమా కూడా ప్రభుత్వ చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తీరు అప్రజాస్వామికమైన, అసంబద్ధమైనదని, రైతాంగాన్ని మోసం చేయడమేనని అన్నారు. కేంద్ర మంత్రితో మీటింగ్ తరువాత ఏం జరిగిందో, శిబిరాలు తొలగించాలన్న ఆదేశాలు ఎవరిచ్చారో పంజాబ్ ముఖ్యమంత్రి వెల్లడించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం, భగ్‌వంత్ మాన్‌సింగ్ ప్రభుత్వం కుమ్మక్కయ్యాయన్న విషయం స్పష్టమవుతోందని అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి