Madras High Court: కులాల పేరుతో సంఘాల రిజిస్ట్రేషన్ వద్దు
ABN , Publish Date - Apr 17 , 2025 | 04:35 AM
మద్రాస్ హైకోర్టు, కులాల పేరుతో సంఘాల రిజిస్ట్రేషన్ చేయరాదంటూ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీకి సర్క్యులర్ జారీ చేయాలని ఆదేశించింది. విద్యాసంస్థల నేమ్‌బోర్డుల్లో ఉన్న కులాల పేర్లను నాలుగు వారాల్లో తొలగించాలని ఆదేశించింది.
విద్యాలయాల నేమ్ బోర్డుల్లోనూ కులాల పేర్లు తొలగించాల్సిందే: మద్రాస్ హైకోర్టు ఆదేశం
చెన్నై, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): కులాల పేరుతో సంఘాల రిజిస్ట్రేషన్ చేయరాదంటూ తమిళనాడులోని అన్ని రిజిస్ట్రార్ కార్యాలయాలకు సర్క్యులర్ జారీ చేయాలని రిజిస్ట్రేషన్ శాఖ ఐజీని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. దక్షిణభారత సెంగుంద మహాజన సంఘం నిర్వహణ కోసం ప్రత్యేక అధికారిని నియమించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై బుధవారం మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భరతచక్రవర్తి నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది. కులాలను పోత్సహించే సంఘాలను రిజిస్ట్రేషన్ చట్టం కింద నమోదు చేయవచ్చా, అదేవిధంగా విద్యాసంస్థల పేర్లలో ఉన్న కులాల పేర్లను తొలగించడం సాధ్యమా? అనే అంశాలను పరిశీలించి నివేదిక సమర్పించాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. కులాల పేరుతో సంఘాల రిజిస్ట్రేషన్లు చేయరాదంటూ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సర్క్యులర్లు జారీచేయాల్సిందిగా ఆ శాఖ ఐజీని ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా కులసంఘాలు నిర్వహిస్తున్న పాఠశాలలు, కళాశాలల నేమ్‌బోర్డుల్లో ఉన్న కులాలను నాలుగు వారాల్లోపు తొలగించాలని స్పష్టం చేసింది. లేని పక్షంలో సంబంధిత విద్యాసంస్థల లైసెన్సును రద్దు చేయాలని విద్యాశాఖను ఆదేశించింది. అంతేకాకుండా ప్రభుత్వం నిర్వహిస్తున్న కల్లర్, ఆదిద్రావిడుల సంక్షేమ పాఠశాలల పేర్లను కూడా తొలగించాలని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి...