MPs Salary Hike: ఎంపీల జీతాల పెంపు.. పూర్తి వివరాలివే
ABN , Publish Date - Mar 25 , 2025 | 02:13 PM
కేంద్ర ప్రభుత్వం ఎంపీల వేతనాలు, అలవెన్సులు, పెన్షన్‌ల మొత్తాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మరి ఈ నిర్ణయంతో ఎంపీల వేతనం ఎంత పెరిగిందంటే..

పార్లమెంటు సభ్యుల జీతభత్యాలు, పెన్షన్లను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంపీల వేతనాన్ని 24 శాతం పెంచుతూ.. పార్లమెంటరీ వ్వవహారాల మంత్రిత్వ శాఖ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ద్రవ్యోల్బణ సూచి ఆధారంగా ఎంపీల జీతాన్ని పెంచింది. ఈ క్రమంలో ఒక్కో ఎంపీ జీతం నెలకు రూ.లక్ష నుంచి రూ.1.24 లక్షలకు పెరిగింది. అలానే సిట్టింగ్ సభ్యుల రోజు వారి భత్యాన్ని కూడా పెంచింది. గతంలో ఇది రోజుకు 2 వేల రూపాయలుగా ఉండగా.. ప్రస్తుతం దీన్ని 2,500 రూపాయలకు పెంచారు. అలానే మాజీ పార్లమెంటు సభ్యులకు అందించే పెన్షన్ మొత్తాన్ని కూడా పెంచారు. గతంలో ఈ పెన్షన్ మొత్తం 25 వేల రూపాయలు ఉండగా.. తాజాగా దీన్ని రూ.31 వేలకు పెంచుతున్నట్లు నోటిఫికేషన్‌లో వెల్లడించారు.
ఎంపీల జీతభత్యాలను ప్రతి 5 సంవత్సాలకు ఒకసారి సమీక్షిస్తామని 2018లో మోదీ ప్రభుత్వం ప్రకటించింది. దాని ప్రకారమే ఇప్పుడు ఎంపీల వేతనాలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దశాబ్దాల క్రితం అనగా 1966లో పార్లమెంటు సభ్యుల నెల జీతం కేవలం 500 రూపాయలు మాత్రమే. అయితే ద్రవ్యోల్బణం పెరిగినకొద్ది.. వారి వేతనాలు కూడా పెరుగుతూ.. ఇప్పడు 1.24 లక్షలకు చేరింది.
ఎంపీల జీతం, అలవెన్స్‌లు
ఎంపీల జీతం రూ.1.24 లక్షలు. అయితే అదనంగా లభించే ప్రయోజనాలు అన్ని కలపుకుని.. నెలకు రూ.2.81 లక్షలు పొందుతారు.
గతంలో ఇది రూ.2.30 లక్షలుగా ఉండేది.
1966 లో ఎంపీల జీతం రూ. 500
ఆఫీసు ఖర్చులకు రూ. 75,000
పార్లమెంట్, కమిటీ సమావేశాలకు హాజరైనందుకు గాను గతంలో రూ.2000 చెల్లిస్తుండగా ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ. 2500 లకు పెంచారు.
ఒకసారి ఫర్నిచర్ అలవెన్స్ కింద రూ. 1.25 లక్షలు పొందుతారు.
నియోజకవర్గ భత్యం కింద నెలకు రూ. 87,000 లభిస్తుంది.
ఎంపీ, వారి కుటుంబ సభ్యులకు కలిపి ఎడాదికి 34 ఉచిత విమాన టిక్కెట్లు పొందే అవకాశం ఉంది.
ఉచిత రైలు పాస్ సౌకర్యం అందుబాటులో ఉంది
50,000 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వినియోగించుకునే అవకాశం ఉంది.
4 లక్షల లీటర్ల ఉచిత నీరు పొందేందుకు అవకాశం ఉంది.
ఎంపీలు ఫోన్, ఇంటర్నెట్ భత్యం కూడా పొందుతారు.
ఫోన్, ఇంటర్నెట్ భత్యం కింద లోక్‌సభ ఎంపీలకు సంవత్సరానికి 1,50,000 ఉచిత కాల్స్,
రాజ్యసభ ఎంపీలకు సంవత్సరానికి 50,000 ఉచిత కాల్స్ చేసుకునే అవకాశ ఉంది
రోడ్డు ప్రయాణ భత్యం కూడా లభిస్తుంది.
మినిస్టర్లకు లభించే మొత్తం..
మినిస్టర్లకు నెలకు జీతం రూ. 1.24 లక్షలు లభిస్తుంది.
ఎన్నికల భత్యంగా రూ. 87,000 పొందుతారు.
నెలవారీ భత్యం 75 వేల రూపాయలు అందుకుంటారు.
జీతం ,అలవెన్సులు కలిపి మినిస్టర్లు నెలకు మొత్తం రూ. 2.86 లక్షలు పొందుతారు. గతంలో ఇది రూ. 2 లక్షల 30 వేలుగా ఉండేది.
ఎంపీల మాదిరిగా మినిస్టర్లకు ఆఫీసు భత్యం చెల్లించరు.
అలానే ఎంపీల మాదిరి.. మంత్రులకు ఫర్నిచర్ అలవెన్స్ కూడా లభించదు.
పెన్షన్ మొత్తం పెంపు..
అలానే మాజీ ఎంపీలకు వచ్చే పెన్షన్ కూడా పెరిగిది. గతంలో వీరికి నెలకు 25 వేల రూపాయల పెన్షన్ లభిస్తుండగా.. తాజాగా ఈ మొత్తాన్ని 31 వేల రూపాయలకు పెంచారు. అంటే ఒక్కసారి ఎంపీగా చేసిన సరే ప్రతి నెలా 31 వేల రూపాయల పెన్షన్ లభిస్తుంది.
ఒక్కసారికి మించి ఎంపీగా పని చేస్తే.. వారికి ఇచ్చే పెన్షన్ ఎడాదికి 2,500 రూపాయల చొప్పున పెంచింది. గతంలో ఇది 2 వేల రూపాయలుగా ఉండేది అంటే ఎవరైనా రెండు సార్లు ఎంపీగా చేసి ఉంటే.. రెండో టర్మ్ ఐదేళ్లకుగాను సంవత్సరానికి 2,500 రూపాయల చొప్పున 12,500వేల రూపాయల పెన్షన్ అదనంగా పొందుతారు.
పెన్షన్‌తో పాటుగా ఎంపీల నియోజకవర్గ భత్యం, కార్యాలయ భత్యం, ఖర్చులను కూడా పెంచారు.
ప్రస్తుతం ఎంపీలకు నెలకు రూ.1.24 లక్షల జీతం లభిస్తుంది.
నియోజకవర్గ భత్యం గతంలో 70 వేల రూపాయలు ఉండగా.. తాజాగా దాన్ని 87 వేల రూపాయలకు పెంచారు.
అలానే గతంలో ఆఫీసు ఖర్చుల నిమిత్తం 60 వేల రూపాయలు ఇస్తుండగా.. ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.75 వేలకు పెంచారు.
2018లో భారీగా పెరిగిన ఎంపీల జీతం..
ఎంపీల జీతం చివరిసారిగా 2018 లో పెంచారు. వేతనాలను రెట్టింపు చేశారు. 2018 ముందు వరకు ఎంపీల జీతం రూ.50,000 ఉండగా.. 2018లో ఆ మొత్తాన్ని రూ.లక్షకు పెంచారు. ఎంపీల జీతభత్యాలను ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి సవరించాలని అదే ఏడాది మోదీ ప్రభుత్వం నియమం ప్రవేశపెట్టింది. అయితే 2020లో కరోనా మహమ్మారి సమయంలో, ప్రభుత్వం ఎంపీలు మరియు మంత్రుల జీతంలో ఒక సంవత్సరం పాటు 30 శాతం కోత విధించింది.