మరీ ఇంత ఘోరమా.. ప్లాస్టిక్ డబ్బాల్లో మృత శిశువు.. మనుషుల శరీర భాగాలు
ABN , Publish Date - Mar 25 , 2025 | 08:52 PM
ఓ వ్యక్తి మంగళవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో కాలువ పక్కన నడుచుకుంటూ వెళుతున్నాడు. చెత్తలో పడి ఉన్న డబ్బాలో ఏదో వింత ఆకారం కనిపించింది. అతడు కొంచెం దగ్గరగా వెళ్లి చూశాడు. డబ్బాలో ఉన్నది ఏంటో తెలిసి షాక్ అయ్యాడు.

మనుషుల్లో మానవత్వం చచ్చిపోయింది.. మనిషి రాక్షసుడిలా మారిపోతున్నాడు.. అన్న డైలాగులు బాగా పాతబడిపోయాయి. అందుకే ఏలాంటి ఎమోషనల్ డైలాగులు లేకుండా స్టోరీలోకి వెళ్లిపోదాం. మహారాష్ట్రలోని పుణె జిల్లాలో చెత్తలో ఓ మృత శిశువు దేహం వెలుగు చూసింది. అది కూడా ప్లాస్టిక్ డబ్బాలో ఆ మృతదేహం బయటపడింది. మంగళవారం ఉదయం బోరావాకే సిటీలోని జిజామాత నగర్ కాలువ పక్కన ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళుతున్నాడు. అతడికి ఓ ప్లాస్టిక్ డబ్బాలో వింత ఆకారం కనిపించింది. అదేంటా అని పరీక్షగా చూశాడు. మృత శిశువు అని తెలియగానే షాక్ అయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
అక్కడ పడిఉన్న డబ్బాలను వెతికారు. కేవలం మృత శిశువు దేహమే కాదు.. మనుషులకు సంబంధించిన ఇతర శరీర భాగాలు కూడా లభించాయి. వాటన్నింటినీ ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టి చెత్తలో పడేశారు. పోలీసులు ఆ డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై పోలీసు అధికారి మాట్లాడుతూ.. ‘ మంగళవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో మాకు సమాచారం వచ్చింది. మేము అక్కడికి వెళ్లాం. మగ శిశువు బాడీతో పాటు మనుషులకు సంబంధించిన మరికొన్ని శరీరభాగాలు కూడా దొరికాయి. వాటిని వైద్య పరీక్షలకు పంపాము. ఆ శరీర భాగాలు పలు రోగాల కారణంగా బాధపడుతున్న వారివిగా తేలింది. బ్రీస్ట్ క్యాన్సర్ వచ్చిన తర్వాత ఆ భాగాన్ని తీసేసి, ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టి పడేశారు. రోగుల శరీరంనుంచి తీసేసిన భాగాలను డబ్బాల్లో పెట్టి పడేశారు.
శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపాము. శిశువును చంపేశారా? లేదా అది మెడికల్ వేస్టా అన్న కోణంలో ఆరా తీస్తున్నాము. పోస్టు మార్టం రిపోర్టు వచ్చిన తర్వాత శిశువు ఎలా చనిపోయాడో తెలుస్తుంది. దాన్ని బట్టి కేసు దర్యాప్తు చేస్తాం’ అని అన్నారు. ప్రస్తుతం సంఘటనా స్థలానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సంఘటనా స్థలంలో 10 నుంచి 12 వరకు శిశువుల మృతదేహాలు దొరికినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, అది అవాస్తవం అని తేలింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం సంఘటనా స్థలంలో ఒక శిశువు మృతదేహం మాత్రమే దొరికింది. మిగిలినవన్నీ మనుషుల శరీర భాగాలు మాత్రమే.
ఇవి కూడా చదవండి:
Chapati: రాత్రిళ్లు చపాతి తింటున్నారా? అయితే ఇది మీకోసమే..
Kunal Kamra: మరో వీడియో విడుదల చేసిన కునాల్ కామ్రా
ఈ విషయాలు తెలిస్తే.. రాజకీయాలకు దండం పెట్టేస్తారు..